స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

2వ అధ్యాయము

లోమశుడు పలికెనుః ఒకప్పుడు దక్షుడు ఒక గొప్పయజ్ఞమును ప్రారంభించెను. దీక్ష యందుండిన ఆ తపస్విచే అందరూ ఆయజ్ఞానికి ఆహ్వానింపబడిరి.  వశిష్ఠుడు, అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు,భృగువు, దధీచి, భగవాన్ వ్యాసుడు, భరద్వాజుడు, గౌతముడు మరియు ఇతర ఋషులు యజ్ఞమునకు వచ్చిరి.  అలాగే సురగణాలు, లోకపాలకులు, విద్యాధరులు, గంధర్వులు, కిన్నరులు, అప్పరసలు వచ్చిరి.  సత్యలోకమునుండి బ్రహ్మ, వైకుంఠము నుండి విష్ణువు యజ్ఞమునకు పిలువబడిరి.

చక్కని కాంతిగల దేవేంద్రుడు ఇంద్రాణితో, చంద్రుడు రోహిణితో, వరుణుడు ప్రియతో యజ్ఞమునకు వచ్చిరి. కుబేరుడు పుష్పకముపై, మారుతుడు మృగముపై, అగ్ని అజముపై, నిర్ఋతీ ప్రేతముపై దక్షుని యజ్ఞవాటికకు ఏతెంచిరి. దురాత్ముడైన దక్షుడు వారందరినీ సత్కరించెను. కాంతివంతములు, దివ్యములు అయిన గొప్పభవనములను త్వష్టచే నిర్మితములైన వానిని వారి వారి ఆనందామసారము వారు చేరిరి.

కనఖలమను తీర్థము వద్ద మహాయజ్ఞము నిర్వహించబడుచుండగా, దక్షుని చేత భృగువు మొదలైన తపోధనులు ఋత్విక్కులుగా గ్రహింపబడిరి. అపుడు, దీక్షాయుక్తుడైన దక్షుడు దీక్షాసంబద్ధమైన మంగళాదులను ఆచరించి భార్యతో కలిసి విప్రుల 'స్వస్తి' వాక్కులను గ్రహించెను. ఆపుడు, మిత్రులతో కూడుకున్న దక్షుడు గొప్పగా ప్రకాశించెను - అంతలో, దధీచి ఇట్లు పలికెను.

దధీచి పలికెనుః ఈ సురేంద్రుడు, గొప్ప ఋషులు, లోకపాలకులు నీవద్దకు ఏతెంచిరి. అయిననూ, పినాకపాణియగు ఆ మహాత్ముడు లేక ఈ యజ్ఞము అంతగా శోభించుట లేదు. ఎవరివల్ల ఆన్నీ శుభములుగా అవుతాయని గొప్పవిద్వాంసులు అంటారో, అట్టి వృషద్వజుడు, నీలకంఠుడు, కపర్దియైన పురాణపురుషుడు ఇచ్చట కనిపించుటలేదు. దక్షా! శివుని వలన అమంగళాలు మంగళాలుగా, మంగళాలు అమంగళాలుగా అవుతాయి.  కనుక, నీవు, శివుని ఆహ్వానించవలెను. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు అందరూత్వరగా మహేశ్వరుడున్న చోటికి వెళ్ళవలెను.  దాక్షాయణితో కలిసివున్న అతనిని త్వరగా కొనిరండు; యోగియగు శివునిచే సర్వమూ పవిత్రమగును. ఎవరి స్మరణముచేత, నామ పఠనము చేత సమగ్రపుణ్యము లభించునో అట్టి వృషద్వజుడైన శివుని ఎలాగైనా తీసుకొనిరావలెను. 

దధీచి మాటలను విని దుష్ట బుద్దియగు దక్షుడు పరిహసించుచున్నట్లుగా (ఇట్లనెన)ః 'సనాతన ధర్మమునకు నెలవైన విష్ణువే దేవతలకు మూలము. ఎవరియందు ఈ వేదాలు, యజ్ఞాలు, వీవీధకర్మలు అన్నీ ప్రతిష్ఠితమై వున్నాయో అట్టి విష్ణువు ఇక్కడకేతెంచెను. వేదములు, ఉపనిషత్తులు, వివిధ ఆగమములతో సహా పితామహుడైన బ్రహ్మ సత్యలోకమునుండి వచ్చెను. స్వయముగా ఇంద్రుడు సురగణములతో వచ్చినాడు. ఇక నిర్మలులైన మీ ఋషులంతా విచ్చేసితిరి. ఎవరెవరైతే యజ్ఞమునందు మనసుంచెదరో, వేదవేదార్థతత్యమును తెలిసిన వారో, దృడప్రతులో, శాంతచిత్తులో వారంతా విచ్చేసిరి. (ఎవరెవరైతే యజ్ఞమునందు మనసుంచెదరో, శాంతచిత్తులో వారంతా విచ్చేసిరి. మీరంతా వేదవేదార్థతత్యమును తెలిసిన వారు, దృఢవ్రతులు)

ఇక ఇక్కడ మనకు శివునివల్ల ప్రయోజనమేమి? బ్రహ్మ ప్రేరేపించుటవల్లనే నేను శివునకు కన్యనోసగితిని. ఓ విప్రులారా! ఈ శివుడు మంచి వంశమున పుట్టినవాడుకాదు. చెడుపు కలిగినవాడు. ప్రియురాలు నశించినవాడు (ప్రియమైన వానివి నశింపజేయువాడు) భూత, ప్రేత, పిశాచముల ప్రభువు, జయింపవీలులేనివాడు. తనను తాను గొప్పగా భావించువాడు,మూర్ఖుడు, స్థాణువు, మౌనముగా నుండువాడు. మత్సరముగలవాడు. అందుకే నేను ఈ యజ్ఞకర్మయందు. అయోగ్యుడైన శివుని పిలువలేదు. కనుక ఓ బ్రాహ్మణుడా! నీవు ఇలాంటి మాటలు మళ్ళీ పలుకరాదు. వాఈ గొప్ప యజ్ఞమును మీరంతా పఫలము చేయుడు. దక్షుని ఈ మాటలను విని దధీచి పలికెను.

ఆ మహాత్ముడగు శివుడు లేనందుచే అందరు ఋషి శ్రేష్ఠులకు, గొప్ప దేవతలకు పెద్ద ఆశుభము కలిగినది. ఇక్కడున్న వారందరికీ వెంటనే మహా వినాశముకలుగగలదు. అని పలికి దధీచి ఒక్కడే దక్షుని యజ్ఞవాటిక నుండి బయల్వెడలి త్వరగా తన ఆశ్రమమునకు. వెడలెను దధీచి ముని వెడలిపోగా దక్షుడు పరిహసించునట్లు ఇట్లు పలికెను.

శివ ప్రియుడు,వీరుడు,దధీచి వెళ్ళిపోయినాడు. ఆవేశపరులు, మూర్ఖులు, మిద్యావాదమునందు ఆసక్తిగలవారు, దుర్జనులు, వేదవిధానమును వదలినవారు, చెడు ఆచారమును గలవారు ఈయజ్ఞమునందు విడవదగినవారు. ఓ విప్రులారా! వేదవాదమునందాసక్తి గలవారు, విష్ణువును ముందుంచుకొను (కర్మలనాచరించువారు) వారయిన మీరంతా త్వరగా నా యజ్ఞమును సఫలము చేయుడు. (అని దక్షుడు పలుకగా) మహర్షులంతా దేవయజ్ఞాన్ని ఆచరించారు. 

 ఇదే సమయంలో అక్కడ గంధమాదన పర్వతంపై స్నానగృహంలో తన సఖులతో కూడిన దక్షసుత క్రీడావిమాన మధ్యనుండి కందుకము మొదలైన వివిధ క్రీడలు వేలకొద్దీ ఆడినది. క్రీడయందు మనసుంచిన ఆ దేవి, రోహిణితో కలిసి (దక్ష) యజ్ఞమునకు వెళ్ళుచున్న చంద్రుని గాంచినది. విజయా! ఈ చంద్రుడు ఎక్కడకు వెళ్ళుచున్నాడో త్వరగా ఆడుగుము? అని (సతి)అనగా విజయ యథోచితముగా చంద్రుని ప్రశ్నించినది. చంద్రుడు దక్షుని యజ్ఞము మొదలైన వాని గూర్చి చెప్పెను. అదివిని విజయ మిక్కిలి సంభ్రమమునొంది, చంద్రునిచే చెప్పబడినదంతా (సతికి) చెప్పెను. 

 (మమ్ములను) ఎందుకు ఆహ్వానించలేదు? అని కారణమును దేవి విమర్శించుకొనినది. దక్షుడు నాతండ్రి, నా తల్లి కూడా ఎందుకు నన్ను మరచినది? నిశ్చయముగా నేడు శంకరుని (దీని) కారణమునడిగెదను. అని సతి తన సఖులనుఅక్కడే వుంచి శంకరుని వద్దకు వచ్చెను. సభామధ్యలో చండ, ముండమొదలైన గణములచే పరివృతుడైన త్రిలోచనుని గాంచెను. బాణుడు, భృంగి, శైలాదుడు మహాతపస్సంపన్నుడైన నంది, మహాకాలుడు, మహాచండుడు, మహాముండుడు, మహా శిరుడు ధూమాక్షుడు, ధూమకేతువు, ధూమపాదుడు ఇంకా ఇతరులు పెక్కుమంది రుద్రుని అనుసరించు గణములు.

కొందరు భయంకరమైన రూపమును కలిగినారు. ఇంకా కొందరు కేవలము మొండెమును కలిగినారు. కొందరు కళ్ళులేనివారు, కొందరు వక్షస్థలమేలేని వారు  ఆ విధంగా వందలకొలది శివుని అనుచరులు జటలను ధరించిన వారు, రుద్రాక్షలను ధరించినవారు ఇంద్రియములను జయించినవారు, వైరాగ్యసంపన్నులు, విషయములకు దూరముగా నుండు వారు. వీరందరిచే పరివృతుడైన, లోకములకు శుభము చేకూర్చుశివుని గొప్ప సింహాసనముపై కూర్చుని వుండగా సతీదేవి చూచినది.  మనస్సులాగగా, ఒక్క మారుగా శివుని చేరినది. శివుడు సతీదేవిని ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకొనెను. ఎంతో ఆదరముతో, ప్రేమతో శివుడు 'నీరాకకు కారణమేమి? సుమధ్యమా! త్వరగా తెలియజేయుమనిన సతీదేవి ఇట్లుపలికినది.

సతీదేవి పలికెను. 'ఓ దేవదేవేశ! నాతండ్రి చేయు యజ్ఞమునకు వెళ్ళుట నీకెందుకు ఇష్టముకాకున్నది? చెప్పుము  మిత్రుల ప్రీతిని పెంపొందించునట్లు వారితో కలిసివుండుట మిత్రుల ధర్మము. కనుక ప్రభూ! ఆహ్వానింపబడకపోయిననూ నీవు నామాట పై నాతండ్రి యజ్ఞవాటికకు ఏదో విధంగా వెళ్ళుము.

సతీదేవి పలికిన పలుకులనాలకించి (శివుడు) సత్యమైన వాక్కును పలికెను. 'ఓ కల్యాణీ! దక్షుని యజ్ఞమునకు నీవు వెళ్ళరాదు.  దక్షునికి ఎవరు గౌరవనీయులో (పూజ్యులో) అట్టి సుర, అసుర, కిన్నరులంతా నిస్సందేహముగా నీ తండ్రి యజ్ఞమునకు ఏతెంచినారు. కానీ ఓ సుభ్రు! ఆహ్వానింపబడకనే ఇతరుల గృహమునకు వెళ్ళువారు మరణము కంటినూ అధికమైన అవమానమును పొందెదరు.  ఇతరుల గృహమునకు వెళ్ళు ఇంద్రుడైననూ అల్పత్వమును పొందును. కనుక ఓ కల్యాణీ! దక్షుని యజ్ఞమునకు నీవు వెళ్ళకూడదు.

                  మహాత్ముడైన శివుడిట్లు పలుకగా వాక్యజ్ఞానులలో శ్రేష్ఠురాలగు సతీదేవి రోషముతో కూడిన వాక్యమును పలికెను.

            ఓ దేవతాప్రభూ! సత్యముగా ఈ లోకములో నీవే యజ్ఞమై వున్నావు. అట్టి నీవు దుష్టముగా చరించు నా తండ్రిచే ఆహ్వానించబడలేదు. దురాత్ముడైన అతని భావమునంతా తెలిసి కొనగోరుచున్నాను.  కావున నా తండ్రి యజ్ఞవాటికకు నేడే వెళ్ళేదను. ఓ నాథా! జగత్పతీ! నాకనుమతినిమ్ము 

అని సతీదేవి పలుకగా భగవంతుడగు రుద్రుడు, అన్ని జ్ఞానములను తెలిసినవాడు,ప్రాణులను సృజించి, పోషించువాడు,  సతీదేవిని ఉద్దేశించి సర్వ సిద్దులనొసగు మహేశుడిట్లుపలికెను. ఓదేవీ! వెళ్ళాలను త్వరగల నీవు వెళ్ళుము. కాని నామాటచే నానావిధములైన ఈ గణముల వెంటనిడుకొని ఈ నంది నధిరోహించి (వెళ్ళుము)  రుద్రునికి చెందిన అరవయి వేల గణములు శివుని ఆజ్ఞచే కదలినవి. ఆ గణములచేకూడిన సతీదేవి తండ్రి గృహమునకు వెడలేను. ఆ బలగమునంతా చూసి మహాబలుడు మిగుల విస్మయమునొందెను  వారి వెంటనే ఆకులతలేని మహాదేవుడు అమూల్యమైన భూషణములను దేవికై పంపించెను. సతీదేవి తన తండ్రి గృహమునకు వెళ్ళగా, భగవంతుడైన మహేశుడు అంతా విచారించి, తండ్రిచే అవమానింపబడిన సతీదేవి వెళ్ళదని తన పురమునకు మరల వెళ్ళెను.

శ్రీ స్కాంద పురాణములోని మహేశ్వర ఖండమునందలి కేదారఖండమునందు 'దక్షయజ్ఞమునకు సతీదేవి వచ్చుట' అను రెండవ అధ్యాయము సమాప్తము.