స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
1వ అధ్యాయము
వ్యాసుడు పలికెనుః ఎవరి ఆజ్ఞచే బ్రహ్మ జగత్తును సృజించునో, విష్ణువు పాలించునో, కాలరుద్రుడనువాడు సంహరించునో అట్టి పినాకి (పరమశివుని) కి నమస్కారము. తీర్థములన్నింటిలో ఉత్తమమైన తీర్థము, క్షేత్రములలో ఉత్తమక్షేత్రము అగు నైమిషారణ్యము నందు కర్మయందాసక్తిగలవారు, యజ్ఞముల చేయువారు, తపోధనులూ అగు శౌనకాది మహామునులు దీర్ఘకాలము చేయబడు యజ్ఞమును చేయుచూవుండిరి. వారిని సందర్శించదలిచి వ్యాసశిష్యుడు, గొప్పతపస్సంపన్నుడు, మేధావీ ఆగు లోమశుడు అక్కడికేతెంచెను.అక్కడికేతెంచిన లోమశుని, దీర్ఘసత్రులైన మునులుచూచి, పూజా ద్రవ్యమును గ్రహించి ఉత్సుకతతో ఒక్కమారుగా లేచి నిలుచుండిరి. నిర్మలులైన ఆ మునులు లోమశుని అర్ఘ్య పాద్యాదులచే సత్కరించి శివధర్మమును సవిస్తరముగా చెప్పుమని అడిగిరి.
ఋషులు పలికిరి -ఓ మహాప్రాజ్ఞ! శూలముధరించు ఆ దేవదేవుని మహిమను ధ్యాన, ఆర్చన సహితముగా తెలుపుము. సమ్మార్జనము వలన, ముగ్గులు పోయుట వలన, దర్పణము చూపుటవలన, చామరము వీచుట వలన ఏ ఫలముకలుగును? మేల్కట్టు (చందున) నొసగుట చేత, ధారాగృహము (స్నానగృహము) చేత, దీపమునొసగుటచేత, పూజనొనరించుట చేత, ఏ ఫలము కలుగును? శివపూజయందలి పుణ్యములేవో తెలియజేయుము. ఇతిహాస, పురాణముల మరియు వేదముల అధ్యయనమును శివుని ఎదుట జరుపు వారికి లేదా జరిపించు జనులకు ఏ ఫలము లభించునో విస్తరముగా తెలియజేయుము. ఓ మునీ! ఈ లోకములో శివుని కథలు చెప్పగలవాడు (శివాఖ్యాన పరుడు) నీవు తప్ప వేరెవ్వరూ లేరు. పుణ్యాత్ములైన ఆ మునుల మాటలను విని వ్యాసశిష్యుడగు లోమశుడు ఉత్తమమైన శివమాహాత్మ్యమును తెలిపెను.
లోమశుడు పలికెనుః అష్టాదశ పురాణములలో పరమశివుడు కీర్తించబడుచున్నాడు కావున శివుని మాహాత్మ్యాన్ని తెలుపుట ఎవరి వల్లనూ సాధ్యం కాదు. ఏజనులు 'శివ' అను రెండక్షరాల పేరును పలికెదరో వారు స్వర్గమును మరియు మోక్షమును పొందెదరు. వేరే విధముగా కాదు. దేవతలపతియగు ఈశ్వరుడు మహాదేవుడు, ఉదారుడు, అంతా ఇచ్చివేసినందున సర్వ అని పిలువబడుచున్నాడు. ఎల్లప్పుడూ శివుని భజించువారు ధన్యులు, మహాత్ములు సదాశివుని వదలి సంసారమును దాటగోరువాడు నిశ్చయముగా మూడుడు, మహాపాపి, శివద్వేషి సదాశివుడే గరళమును భక్షించెను. దక్షయజ్ఞమునునాశనముచేసెను కాలుని దహనము చేసెను. రాజును ముక్తుడిని చేసెను.
ఋషులు పలికిరిః సదాశివుడు విషమునెట్లు భక్షించెనో, దక్షుని యజ్ఞము ఎట్లు నాశనం చేయబడెనో తెలుపుము మాకు. మిక్కిలి కుతూహలము గలదు.
సూతుడు పలికెనుః ఓ విప్రులారా! పూర్వము పరమేష్ఠియగు బ్రహ్మయొక్క మాటవల్ల దక్షుడు మహాత్ముడైన శంకరునకు తనపుత్రికను (దాక్షాయణిని) ఇచ్చెను. ఒకనాడు ఆ దక్షుడు యదృచ్ఛావశమున నైమిషారణ్యమునకు వచ్చెను. ఋషులచే పూజింపబడెను. ఆలాగే సురాసురులందరిచే స్తుతులచే, నమస్కారములచే పూజింపబడెను. అక్కడే వున్న మహాదేవుడు దక్షునకు లేచి నిలుచుండుట, అభివాదము చేయుట చేయలేదు. అందుకు కోపించిన దక్షుడు ఇట్లు పలికెను. అన్నిచోట్ల (అన్ని ప్రదేశములలో) సురాసురులు, బ్రాహ్మణోత్తము లందరూ ఉత్సుకతతో నన్ను (బాగుగా) నమస్కరిస్తారు. ఈ మహాత్ముడేట్లు దుర్జనునీవలె భూతములు, ప్రేతములు, పిశాచములతో కలిసియుండి, శ్మశానములో నివసించువాడై, సిగలేక నాకు ఇప్పుడు నమస్కారము చేయుటలేదు? పాఖండులు, దుర్జనులు, పాపస్వభావులు, విప్రుని చూచి గర్వితులు, మదమునొందిన వారు - వీరు వధింపయోగ్యులు. సజ్జనులు ఇలాంటివారిని వదిలివేయవలెను. కనుక ఇతనిని శపించుటకు ఉద్యుక్తుడనై యున్నాను.
ఈ విధముగా పలికి ఆ గొప్ప తపస్సంపన్నుడగు దక్షుడు రోషముతో రుద్రుని ఉద్దేశించి ఇట్లు పలికెను. 'ఓ విప్రశ్రేష్ఠులారా! నా మాటను వినుడు. మీరు ఇట్లు చేయదగినవారు, ఈ రుద్రుడు వర్ణముల కతీతుడు, వర్ణములకు పరము అయినందున యజ్ఞములకు అనుమతించరాదని నానిశ్చయము. శిలాదపుత్రుడైన నంది ఆమాటను విని రోషపూరితుడాయెను. వెంటనే, శివునికి శాపమొసంగిన ఆ గొప్పకాంతి సంపన్నుడగు దక్షుడిని ఉద్దేశించి ఇట్లు పలికెను.
నంది పలికెనుః ఎవరిస్మరణమాత్రముచే ఈ యజ్ఞములు ఫలవంతములో ఆట్టి నాస్వామి మహేశుడు యజ బాహ్యుడెట్లు చేయబడెను? ఎవరి నామము చేతనే యజ్ఞము, దానము, తపస్సు మరియు వివిధ తీర్థములు పవిత్రములో అట్టి శివుడెట్లు శపింపబడెను? చెడుబుద్ధిగల దక్షా! నీ బ్రహ్మచాపల్యము వలన ఈ శివుడు అనవసరముగా శపింపబడెను. ఈ విశ్వమంతా ఎవరిచే పాలింపబడుచున్నదో అట్టి సర్వుడగు మహత్ముడు, రుద్రుడు ఓ బ్రాహ్మణాధమా! ఎట్లు శపింపబడెను?
ఈ విధముగా నందిచే నిందింపబడిన ప్రజాపతి దక్షుడు రోషముతో నందిని కూడా శపించెను. మీరంతా రుద్రుని వరించినవారు, పూర్తిగా వేదబాహ్యులుకూడా. వేదమార్గములచే శపింపబడినారు. అలాగే మహర్షుల చేత విడిచి వేయబడినారు. మీరు పాషండవాదులు, శిష్టాచారముల నుండి బహిష్కృతులు. కపాలముల ధరించువారు, పానమునందాసక్తి కలవారు ఆలాగే కాలముఖులు. ఆవిధంగా అపుడు శివకింకరులు దక్షునిచే శపింపబడినారు. అపుడు బాగా కోపించిన నంది దక్షుడిని శపించుటకు పూనుకొనెను.
ఓ వివుడా! సాధువులు, శివకింకరులునగు మేము అనవసరముగా (నీ) బ్రహ్మచాపల్యముచే శపింపబడినాము. నీకు శాపమిచ్చెదను. మీరు వేదవాదములందు ఆసక్తి చూపు వారు, ఇంకేదియూ లేదని వాదించువారు. కామస్వరూపులు, స్వర్గమే పరమమనెడి వారు, లోభమోహములతో కూడుకున్నవారు బ్రాహ్మణులు వైదికమును ముందుంచుకొని శూద్రులను పూజించువారు, దరిద్రులు, ఎల్లప్పుడూ గ్రహించుటయందు ఆసక్తిగల వారుగా కాగలరు దక్షా! కొంతమంది బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులు కాగలరు. అనగా రోమశుడు పలికెను. ఇట్లు విప్రులు బాగా కోపించిన నందిచే శపింపబడినారు - అపుడు నందివాక్యమును విన్న సదాశివుడు నవ్వుచూ మధురమైనది, జ్ఞానముతో కూడినది అగు వాక్యమును పలికెను.
మహాదేవుడు పలికేనుః బ్రాహ్మణుల పట్ల కోపించుట నీకెప్పటికీ తగదు. వేదవాదములందు ఆసక్తిగల ఈ బ్రాహ్మణులు ఎప్పటికీ గురువులే. వేదము సాక్షాత్తుగా మంత్రమయము. అలాగే పూర్తిగా సూక్తములుకలది. జీవులందరి మంచివాక్కునందు ఆత్మనెలకొనివున్నది, కనుక ఆత్మజ్ఞానముకల ఈ బ్రాహ్మణులు నిందింపబడరాదు - ఆత్మయన నేనే, వేరుకాదు. ఇతను ఎవరు? నీ వెవరు? నేనెక్కడ? ఎందుకని ఈ బ్రాహ్మణులు శపింపబడినారు? ఓ గొప్పబుద్ది కలవాడా! ప్రపంచ రచనను వదిలి జ్ఞానివి కమ్ము, తత్యజ్ఞానముచే వెనుదిరిగి నీ యందు వుండుము (స్వస్థ) క్రోధము మొదలైన వానిని విడిచివేయుము.
ఈ విధంగా పరమేష్టియగు శివునిచే ప్రబోధితుడైన తపస్వియగు నంది వివేకమును పొంది శివునితో కలిసి పరమానందమున తేలియాడెను. ఇక దక్షుడు రోషముతో ఋషుల వేంటనిడుకొని తన స్థానాన్ని చేరి రోషముతో అందు ప్రవేశించెను. పరమశ్రద్దను విడిచి, ఆ దక్షుడు శివపూజకుల నిందించు నరాధముడాయెను. అందరు మహరులతో కలిసి అక్కడ శివుని నిందించెను. ఎప్పటికీ శాస్రుడు కాకపోయెను.
స్కాందపురాణమందలి మాహేశ్వర ఖండములోని కేదారఖండములో పురాణ ప్రస్తావ దక్షవృత్రాస్తమను మొదటి అధ్యాయము సమాప్తము.
