వామన మహా పురాణము
అధ్యాయము 26
మహామునీ! స్థాణుతీర్థమహిమ సమగ్రంగా వినగోరెదను. అచట సర్వపాపాలు పోగొట్టే సిద్ధిని ఎవరు పొందారు?
ఓ మార్కండేయ మహర్షీ! అత్యుత్తమమైననీస్థాణుతీర్థమహిమ సాకల్యంగా వినవలసినది. దీనిని వినిన నరుడు సకలపాపవిముక్తుడౌతాడు. మహాప్రళయ సమయాన ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతానశించిపోగా అవ్యక్తజన్ముడైన ఆ విష్ణమూర్తి బొడ్డునుండి కమలం పుట్టింది. దాని నుండి సర్వలోక పితామహుడగు బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన నుండి మరీచి జనించగా ఆయన కమారుడుగా కశ్యపుడు పుట్టాడు. కశ్యపునకు సూర్యడుకలగగా ఆయనకు మనువు జన్మించాడు. ఆ మనువు తుమ్మగా ఆయన ముఖం నుంచి ఉద్భవించిన పుత్రుడు చతురంత భూమండలానికంతకూ రాజైనాడు. మృత్యుముఖాన్నించి కాలుని కుమార్తెగా జనించి భయాన్ని కల్గించే "భయా" అనునామె ఆ రాజు భార్య అయినది. ఆమెకు దుష్టుడు వేదదూషకుడైనవేనుడు పుట్టాడు. ఆ దుష్టుని ముఖంచూచినంతనే కోపంతో తండ్రి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కఠోర తపస్సుచేసి ధర్మంతో భూమ్యాకాశాలను నింపి పునరావృత్తిలేని బ్రహ్మ సదనానికి వెళ్ళిపోయాడు. కాలుని దౌహిత్రుడైన వేనుడు భూమికంతా పాలకుడై తన మాతామహదోషం వల్ల వేదనిందకుడై రాజ్యంలో యిలా చాటింపచేశాడు. "నా రాజ్యంలో ఎవరూ దానాలు యజ్ఞయాగాలు చేయరాదు. ఆహుతులు వ్రేల్చరాదు. నేనొక్కడినే వందనీయుడను. నన్నుమాత్రమే అందరూ పూజించాలి. ఇలా చేసినా రాజ్యంలోని మీరంతా సుఖించగలరు. నా కంటె వేరైన దేవుడెవడూ లేడు." అతని వాక్యాలకు చింతించి ఋషులంతా కలిసివెళ్ళి యిలా హితంపలికారు. రాజా! వేదాలు ధర్మానికి మూలమైన ప్రమాణాలు. అవి యజ్ఞ కర్మను విధించినవి. యజ్ఞాలుచేయకపోతే దేవతలు సంతోషించి పైరులకు అవసరమైన వర్షాలు గురిపించరు. ఆ విధంగా ఈ సృష్టి అంతా దేవతలు యజ్ఞాలమీద ఆధారపడి యున్నది.
ఋషుల మాటలువిని కోపంతో పిచ్చివాడై దురాత్మడగు వేనుడు యజ్ఞాలు చేయరాదు. దానాలు యివ్వకూడదు. అంటూ మాటిమాటికీ గర్జించాడు. దానితో ఆ మునులందరూ కోపించి అభిమంత్రించిన వజ్రోపమాలైన కుశలతో నా దుష్టుని ప్రహరించి సంహరించారు. అంతట రాజులేని ప్రజలంతా, దస్యులు తమను పీడించగా నానా బాధలకు లోనై ఘోషిస్తూ మహర్షులను శరణు వేడుకున్నారు. అంతట నా ఋషులా వేనుని ఎడమ చేతిని మథించగా దానినుంచి ఒక మరుగుజ్జు పుట్టాడు. వారంతట నతనితో నీవిక్కడ కూర్చోమని చెప్పారు. ఆ పొట్టినానినుండి వేనుడి పాప ఫలంగా నిషాదులు జన్మించారు. అంతట ఋషులు ఆ వేనుని కుడి చేతిని మథించారు. దానినుంచి సాలవృక్షమంత పొడవుగలిగి దివ్య లక్షణాలతో కూడిన పురుషుడుద్భవించాడు. అతని చేతులలో ధ్వజ ధనుర్బాణ శంఖ చక్రాది రేఖలున్నవి. ఆ పురుషుని చూచి ఇంద్రుడు మొదలయిన దేవతలందరు, పృథ్వీ పాలకునిగా అతనికి అభిషేకం చేశారు. అతడు ధర్మాత్ముడై భూమిని రంజింప చేశాడు. తన తండ్రి పెట్టిన బాధలకు క్షోభించిన పృథివిని అతడు తన పాలనతో రంజింపజేసి 'రాజు' అనే శబ్దాన్ని సార్థకం గావించాడు. ప్రజల నుంచి రాజ్యం స్వీకరించిన తదుపరి అతనిలా ఆలోచనలో పడ్డాడు- నా తండ్రి ఆధార్మికుడు. యజ్ఞ విఘాతకుడు. ఆయనకు ఉత్తమలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఆలా చింతావ్యాకులుడైన రాజు వద్దకు నారద మహర్షి రాగా నా రాజు తగిన ఆసనం యిచ్చి నమస్కరించి యిలా ప్రశ్నించాడు- భగవన్! తమరు సర్వజ్ఞులు. శుభాశూభ కర్మల రహస్యం తెలిసినవారు. నా తండి దుష్టుడు, లోకవేద నిందకుడు, విహితకర్మలు చేయకుండానే మరణించాడు. అంతట దివ్యదృష్టితో అంతా గ్రహించి నారదుడిలా అన్నాడు. రాజా! నీ తండ్రి క్షయ కుష్ఠు రోగాలతో మ్లే చ్ఛులలో జనించాడు. మహాత్ముడగు నారదుని మాటలు విని ఆ రాజు చాలా దుఃఖించి తాను ఏమి చేయవలెనా అని ఆలోచనలో దిగాడు. పుత్రుడనగా పితరులను భయాలనుంచి రక్షించువాడే నన్న భావం ఆయనకు తోచింది. అంతట మరల నామహామునిని తన తండ్రి తరించుటకు తానేమి చేయవలెనో వివరించమని వేడుకున్నాడు.
నీవు తీర్ధాలన్నింటిని దర్శించి అచట నీళ్ళతో ఈతని దేహాన్ని శుద్ధి చేయము. వానితో సన్నిహిత సరోవరం దగ్గర ఉన్న స్థాణు తీర్థానికి గూడ వెళ్ళుము. నారద మహర్షి వచనాలు విని ఆ రాజు తన రాజ్య భారాన్ని మంత్రుల కప్పగించి తాను బయలుదేరాడు. అచట నుండి ఉత్తర భూములకు వెళ్ళి అక్కడ మ్లేచ్ఛుల మధ్య కుష్ఠ క్షయ వ్యాధులతో బాధపడుతున్న తండ్రిని చూచి చాలా దుఃఖించి ఆ మ్లేచ్ఛులతో యిలా అన్నాడు. ఓ మ్లేచ్ఛులారా! నేనీ పురుషునకు నమస్కరించి యీయననింటికి తీసికొనిపోయి రోగముక్తుణ్ణి చేసుకుంటాను. మీరనుమతినివ్వండి. అందులకా మ్లేచ్ఛులంతా ప్రణామం చేసి అలాగే మీ యిష్ట ప్రకారం చేసుకోవచ్చని అన్నారు. అంతట నారాజు పల్లకీ బోయీలకు యిబ్బడి కూలి యిచ్చి తన తండ్రిని ఒక శిబికలో ఎక్కించుకుని యింటికి తీసుకొని పోయినాడు. బోయీలా దయామయుని కోర్కె మన్నించి ఆ శిబిక నెత్తుకొని త్వరిత గతిని కురుక్షేత్రంలోని స్థాణ తీర్థం వద్ద దించి వెళ్ళిపోయారు. అంత నా రాజు మధ్యాహ్న కాలాన అతనిని నదిలో స్నానం చేయించాడు. ఆ సమయాన ఆకసాన్నుంచి వాయువేతెంచి యిలా అన్నది. వత్సా! తొందరపడవద్దు. తీర్థ పవిత్రతను కాపాడుము. ఇతన్ని మహా ఘోరమైన పాపాలు చుట్టుకొని ఉన్నవి. వేదనింద అనే పాపానికి నిష్కృతి లేదు. అలాంటి దుష్టుడు స్నానం చేస్తే తీర్థ పవిత్రత నశించి పోతుంది. వాయువు మాటలు విని మరింతగా దుఃఖిస్తూ, అయ్యో! ఈయన ఎంతటి భయంకర పాపాలకు నెలవైనాడని విలపించాడు. యీ పాప పరిహారానికేదైనా ప్రాయశ్చిత్తం ఉంటే నేనది తప్పక చేయగలను. దయతో దేవతలు సెలవియ్యండి. అని ఆర్థించాడు. అంతట దేవతలందరు యిలా సలహాయిచ్చారు. నీవు వరసగా ఒక్కొక్క తీర్థంలో స్నానంచేసి ఆ నీళ్ళతో యీతణ్ణి అభిషేకించుము. ఇలా ఓజస తీర్థం నుంచి సరస్వతి కావలనున్న చులుక తీర్థం వరకు చేయుము. శ్రద్ధాశువులిలా తీర్థ స్నానం చేస్తే ముక్తులౌతారు. ఇక ఇతడో, అతి స్వార్థపరుడు దేవ దూషకుడు. బ్రాహ్మణులితణ్ణి పరిత్యజించారు. అంచేత పవిత్రుడు కానేరడు. కనుక యితని నుద్దేశించి నీవు తీర్థాలలో మునిగి ఆ నీటితో మార్జనం చేస్తే శుద్ధుడౌతాడు.
ఆ మాటలు విన్న ఆ రాజు ఆయనకొక కుటీర మచ్చట నిర్మించి అందతని నుంచి, తాను మనస్సులో తండ్రి ముక్తిని కాంక్షిస్తూ తీర్థాటనానికి బయలుదేరాడు. ప్రతిరోజూ ఆయా తీర్థాల్లో మునిగి అందలి పవిత్రోదకాలు తెచ్చి తండ్రి మీద ప్రోక్షణం చేసేవాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకచటకొక కుక్క వచ్చింది. అది పూర్వ జన్మలో స్థాణుమఠంలో కాల స్వామియొక్క ద్రవ్యరక్షణా బాధ్యత అప్పగించబడిన అధికారిగా ఉండేది. మొదట్లో దేవద్రవ్య రక్షణ, పరిగ్రహం, వినియోగం మొదలయిన విషయాలలో చాలా నిక్కచ్చిగా, పవిత్రంగాఉంటూ అందరి మన్ననలకు పాత్రుడైన అధికారి కాలాంతరంతో బుద్ధి చెడిపోయి దేవద్రవ్య నాశనానికి కారకుడైనాడు. ధర్మదూరుడై మరణించిన అతడు పరలోకానికి పోగా యమడాతనిని చూచి తత్‌క్షణమే వెళ్ళి కుక్కవై జన్మించమని శిక్షించాడు. అతడు మరుక్షణం సౌగంధిక వనంలో శునక జన్మ యెత్తి అనేక శునకాలతో కలిసి తిరుగసాగాడు. కొన్నాళ్ళకొక ఆడకుక్క (సరమ) చేత అవమానం పొంది ఎంతగానో దుఃఖించాడు. ఆద్వైతవనాన్ని వదలి వంటరిగా పవిత్రమైన సంనిహిత్య సరోవరానికి పారిపోయాడు. అక్కడ స్థాణ్వీశ్వరుని దయవల్ల విపరీతమైన దాహం తీర్చుకోవడానికి సరస్వతీనదిలో మునిగాడు. దాహశాంతికి నీళ్ళలో మునిగిన ఆ కుక్క సకల పాపాల నుంచి విముక్తి పొందింది. స్నానం చేయగానే కరకర ఆకలి వేయడంతో ఆహారాన్ని వెతుక్కుంటూ అది రాజు తండ్రి ఉన్న గుడిసెలో దూరింది. రాజా కుక్కనుచూచి భయంతో మెల్లగా తాకాడు. వెంటనే స్థాణుతీర్థంలో మునిగాడు. వెనకటి తీర్థంలో మునిగిన శరీరాన్ని ఆ కుక్క విదిలించుకొనగా అవి రాజుమీద పడినాయి. కుక్క వంటిమీది నీటిబిందువులు తన మీదపడగా ఆ రాజు భయపడినాడు. స్థాణుతీర్థ మహిమవల్ల ఆ విధంగా కుమారుని మూలాన ఆయన తరించాడు. వెంటనే ఇంద్రియ జయంకలిగి దివ్యశరీరాన్ని పొందాడు. అంతమహానందంతో ఆ వేనుడు ప్రణమిల్లి స్థాణు భగవానుని స్తోత్రం చేయసాగాడు.
నమస్కారం, పయ (జలం) స్వరూపా, తుండపతీ (వక్త్రాధిపతి) అన్నదాతా, అన్నపతీ, నానాన్న భోజీ నీకు ప్రణామములు. సహస్ర శీర్షా! సహస్ర చరణా, సహస్రోద్యత శూలీ, సహస్రాభరణా, బాలానుచర గోప్తా (చిన్న పిల్లలను రక్షించువాడా) బాలలీలావిలాసీ, బాలరూపా, వృద్ధరూపా, క్షోభించినవాడా, క్షోభింపజేయువాడా, గంగాలులిత కేశా (గంగాధర), ముంజకేశా, నమస్కారము. షట్కర్మ సంతోషీ, కర్మత్రయనిరతా, నగ్నప్రాణా, చండా! కృశా! స్ఫోటనా (సాక్షాత్కరించువాడా) చతుర్విధ పురుషార్థరూపా, చతుర్విధ పురుషార్థ ప్రతిపాదకా నీకు నమోవాకములు.
ప్రభూ! సాంఖ్య శాస్త్రం నీవే, అసాంఖ్యసారతత్వం నీవే. సాంఖ్యయోగ శాస్త్రాధినేతవు నీవే. విరథుడవు, రధ్యుడవు, చతుష్పథరథికుడవు నీవే, ఇట్టి నీకు నమస్కారము. మృగచర్మధరా, సర్పయజ్ఞోపవీతా, వక్త్ర సంధానకేశా (ముఖానికంటుకొనిన కేశములు కలవాడా) హరికేశా నీకు ప్రణామము. మూడు కన్నులుగల అంబికాపతీ, వ్యక్తావ్యక్త స్వరూపా, విరించీ నీకు నమస్కారము. కామకామదాతా, కామహరా, తృప్తాతృప్త విచారకా, సర్వదాతా, పాపనాశకా, కల్ప సంఖ్యా విచారకా నీకు నమోవాకములు. మహాసత్వా, మహాబాహో, మహాబలా, మహామేఘా, మహాప్రఖ్యా, మహాకాళా, మహాద్యుతీ, మేఘావర్తా, యుగావర్తకా, చంద్రసూర్యపతీ నీకు నమస్సులు. అన్నానివి నీవు అన్నభోక్తవు నీవు, పక్వభోజివి, పావనోత్తముడవు, జరాయుజ, అండజ, స్వేదజ ఉద్భిజాలనే నాలుగురకాల జీవసమూహంనీవే, ఈ చరాచర జగత్తు సృష్టించినది నీవు. దీనిని రక్షించి లయముచేసేదీ నీవే. బ్రహ్మవేత్తలగువారు నిన్ను సృష్టికర్తగా బ్రహ్మవేత్తలకు పరమ గమ్యముగా పేర్కొంటారు. నీవు మనస్సుయొక్క వెలుగువు. దివ్యజ్యోతులలోని వాయువు నీవే. హంస వృక్షం (జీవాత్మల) పై తిరిగే మధుకరమని నిన్ను బ్రహ్మవాదులు ప్రశంసిస్తారు. ఋగ్యజుస్సామ వేదమయుడవు నీవు, వేదోపనిషత్తు లెల్లప్పుడు నిన్నే స్తుతిచేస్తుంటాయి. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర తదితర వర్ణాలునీవే, మేఘబృందం, విద్యుత్తు, అశనిపాతం, సంవత్సర ఋతుమాస పక్షములు, యుగములు, నిమేషకాష్ఠాలు, నక్షత్రగ్రహ కళలు అన్నీ నీ రూపాలే. నీవు వృక్షాల్లో అర్జున వృక్షానివి, గిరులలో హిమవంతానివి, మృగాల్లో వ్యాఘ్రానివి, పక్షులలో వైనతేయుడవు, సర్పాలలో అనంతుడవు, సముద్రాల్లో క్షీరసముద్రానివి, యంత్రాలలో ధనుస్సువు, ప్రహరణాల్లో వజ్రానివి, వ్రతాలలో సత్యానివి. ద్వేషం, కోరిక, రాగమోహాలు, క్షమాక్షమలు, వ్యవసాయం, ధృతి లోభం కామక్రోధ జయాపజయాలన్నీ నీవే. నీ వద్ద బాణాలు, గదలు, ధనుస్సులు, ఖట్వాంగాలు, తూణీరాలు ఉన్నవి, నీవు ఛేత్తవు, భేత్తవు, ప్రహర్తవు, మంతవు (మననశీలివి) నేతవు సనాతనుడవు, దశలక్షణ లక్షితమైన ధర్మానివి, అర్థకామాలు నీవే, సముద్రాలు, నదులు, గంగ, పర్వత సరోవరాలు లతలుతృణాలు, ఓషధులు పశుమృగపక్షి గణాలు అన్నీ నీవే ప్రభూ! ద్రవ్య, కర్మ గుణాల ఉద్గమం, కాలమనే పుష్పం, దాని ఫలం యిచ్చేది నీవే, వేదాల ఆద్యంతాలు, గాయత్రి, ప్రణవ ఓంకారం, లోహిత, హరిత, నీల, కృష్ణ, పీత, శ్వేత, కద్రు, కపిల, కపోత, మేచకాది వర్గాలు అన్నీ నీ విలాసాలే. వర్ణ (రంగు) రాహిత్యం, వర్ణత్వం, కర్తృత్వం, ఉపసంహరణం అంతా నీవే. నీవింద్రుడవు, యముడవు, వరుణుడవు, కుబేరుడవు, వాయువు, రాహువు, అగ్నివి.
నీవు శిక్షాహోత్రుడవు (యజ్ఞజ్ఞానోపదేష్టవు) త్రిసుపర్ణ ఛందః స్వరూపివి. యజుర్వేదములోని శంరుద్రీయమవు, పవిత్రులలో పవిత్రుడవు, శివంకరులలో శివంకరుడవు; తిందుక, గిరిజ తరువులు, అందరకు జీవనరూపమైన ముధ్గ (పెసర) ధాన్యము, ప్రాణతత్వము, సత్వరజస్తమాలు, ప్రతిపత్పతి, ప్రాణాపాన సమానోదాన వ్యానములు, ఉన్మేషనిమేషాలు, చీదుట, ఆవులించుట అన్నియు నీవే; రక్తంలో నీవే దాగియున్నావు, దృష్టివి, మహావక్త్రుండవు, మహోదరుడవు, శ్వేతరోముడవు, హరితత్మశ్రు (పచ్చని గడ్డముగల) డవు, ఊర్ధ్వకేశివి, చలాచలుడవు. నీకు నమస్సులు. గీతవాదిత్రనృత్య జ్ఞాతవు. గీతవాదిత్రనృత్య ప్రియుడవు, మత్స్యానివి, వలవు, జలగవు, కాలుడవు, కేళికళవు, కవివి, అకాల, వికాల, దుష్కాల, కాలములు నీరూ పాలే. మృత్యువు, మృత్యుకారకుడు, యక్షుడు, యక్షులకు భయము గొల్పువాడు. సంవర్తకుడు, అంతకుడు, సంవర్తక వలాహక మేఘములు, అన్నీ నీ రూపాలే. గంటవు, గంట కలవాడవు, గొప్ప గంట కలవాడవు, మందగతి, మాలాధరుడవు, మాతలివి, బ్రహ్మవు. కాలుడవు, యముడవు, అగ్నివి, దండ ధరుడవు, కేశ రహిత శిరుడవు, త్రిమస్తకుడవు, నాల్గుయుగాలను నాల్గు వేదాలను, నాల్గు హోత్రాలను ప్రవర్తింపజేయువాడవు. నాలుగాశ్రమాలకు ఆధినాయకుడవు. చాతుర్వర్ణ్య కర్తవు, అన్నీ నీవే. ఎప్పుడూ జూదప్రియుడవు. ధూర్తుడవు, సర్వ గణాలను నిరీక్షించు వాడవు, గణాధీశ్వరుడవు, ఎర్రని మాలలు వస్త్రాలు ధరించువాడివు, కందుకానివి, కందుక ప్రియుడవు, శిల్పానివి, శిల్పులలో శ్రేష్టుడవు, సర్వ శిల్పాలను ప్రవర్తింపచేసిన ప్రభుడవు నీవు. భగుని నేత్రాలను పూషుని పండ్లను రాలగొట్టిన భయంకరుడవు, స్వాహా, స్వధా, వషట్కార నమస్కారరూపివైన నీకు శతశః నమన్సులు. నీవు, గూఢ వ్రతుడవు, గుహ్య తపస్వివి, తారవు, తారకామయుడవు, ధాతవు, సంధాతవు, పృథివికి వేరొండు ఆధారానివి. వేద బ్రహ్మ, తపస్సు, సత్యం, వ్రతాచరణం, ఆర్జవం, భూతాత్మ, భూతకర్త, ఐశ్వర్యం, భూతభవిష్యద్వర్తమానాలు, భూర్‌భుఃవసువర్లోకాలు, ఋతం, ధ్రువం, దాంతం, అన్నీ నీ రూపాలే. నీవు మహేశ్వరుడవు, దీక్షితుడవు, దీక్షా రహితుడవు, చక్కని వాడవు, దుర్దాంతుడవు, దాంతికి మూలానివి! చంద్రుని రూపాన, యుగాల రూపాన, మేఘాల రూపాన నీవే మాటి మాటికీ వస్తుంటావు. బిందురూపివి, అణు రూపిపి, స్థూలుడవు, కర్ణికార (గన్నేరు) పుష్పమాలాప్రియుడవు, నంది ముఖుడవు, భీమ ముఖుడవు, సుముఖుడవు, దుర్ముఖుడవు, హిరణ్యగర్భుడవు, పక్షివి, భయంకరమైన సర్ప శేష్టుడవు, విరాట్పురుషుడవు, అధర్మ నాశకుడవు, మహా దేవుడవు, దండధారిని, ఉత్కట గణరూపిని, ఎద్దువలె రంకె వేయువాడవు, (గోవర్ద), గోవులను దాటించువాడవు, వృషభేశ్వర వాహనుడవు, త్రిలోక రక్షకుడవు, గోవిందుడవు, గోమార్గానివి, మార్గానివి, స్థిరుడవు, శ్రేష్టుడవు, స్థాణు రూపివి, విక్రోశ, క్రోశ రూపివి అయిన నీకు నమస్సులు. నిన్నెవ్వరూ వారించలేరు, సహించలేరు అతిక్రమించలేరు, ధర్షించలేరు. నీ వెలుగు (కొందరకు) దుష్టమైనది, నిన్ను దర్శించుట కష్టము. నిన్నెవరు జయింపలేరు. నీవు విజయానివి. చంద్రాగ్నులవలె చల్లగా వేడిగా ఉంటావు నీవు. ఆకలి, దప్పిక, ఆరోగ్యము, ఆధి వ్యాధులు, వ్యాధి శమనము అంతా నీవే. సమూహాలకు సమూహాలనే సంహరిస్తావు. సనాతన దైవానివి, శిఖండివి, పుండరీకాక్షుడవు, పుండరీక వనాల్లో (సరస్సుల) ఉంటావు. త్య్రంబకుడవు, దండ ధరుడవు, ఉగ్రదంష్ట్రం కలవాడవు, కులాంతకుడవు. విషనాశకుడవు, దేవశ్రేష్టుడవు, సోమరసపాయివి, మరుత్తుల నాయకుడవు. అమృతభోజివి, దేవతలకు దేవగణాలకు అధిపతివి, మధువులొలికించువారల మధువు త్రాగువాడవు, బ్రహ్మవాణివి, నేయిరాల్చువాడవు. సర్వలోకాలు నీకు భోజ్యాలు. సర్వలోకాలకు పితామహుడవు నీవే. నీకు నమోవాకములు.
ప్రభూ! నీవు హిరణ్యరేతస్కుడవు! ఏకైక పరమపురుషుడవు. నీవు స్త్రీవి, పురుషుడవు, నపుంసకుడవు, బాలుడవు, ముసలివాడవు, స్థవిరుడవు ఐరావత గణానివి. సర్వమాన్యుడవైన విశ్వకారకుడవు. నీకు నమస్సులు. సృష్టిచేయు విధాతలలో నీవు సర్వశ్రేష్టుడవు. శ్రద్ధాళువు లెల్లవేళల నిన్నారాధిస్తారు. చంద్రసూర్యులు నీ నేత్రాలు, నీవే అగ్నివి బ్రహ్మవు. సరస్వతీ రూపాన నిన్నారాధించి నరులు వాక్కును సంపాదింతురు. రాత్రింబవళ్ళు నీవే, నిమేషం (కన్నులు మూయుట) ఉన్మేషం (కండ్ల తెరచుట) నీవే. ఓ మంగళ స్వరూపా! నీ మహిమను యథార్థముగా తెలిసికొనుట బ్రహ్మ విష్ణువు ప్రాచీన మహర్షులకు గూడనలవి కాదు. వేలాది ప్రజల నావరించి నిబిడీకృతమైన ఘోరాంధకారాని కవ్వల వెలుగుచు నీవు వారందరనూ రక్షిస్తూ నడుపుతూ ఉంటావు. నిద్రా ప్రాణాలను నిరోధించి, జితేంద్రియులై సత్వగుణ ప్రధానులగు మహాత్ములు జ్యోతిస్సు రూపంలో దర్శించే యోగాత్మవు, పరమాత్ముడవు నీవు, అట్టి నీకు నమస్కారము. నిర్దేశించుట కలవిగాని సూక్ష్మాతి సూక్ష్మాలయిన నీ అనంతమూర్తులతో, కన్నకొడుకును తండ్రివలె నీవు నన్ను రక్షింపుము. నే నీచే రక్షింపబడదగిన వాడను. అట్టినన్ను సదారక్షించుము. ఓ పాపరహితా నీకు నమస్సులు. భక్తుల కనికరించు భగవాన్ నే నెల్లవేళల నీకు దాసుడను. ఓ జటాధరా! ముండీ! దండధరా! లంబోదర దేహా! కమండలధరా! రుద్రరూపా నీకు నమస్కారము. నీ కేశాలలో మేఘాలున్నవి, సర్వాంగ సంధుల యందూ నదులున్నాయి, నీకుక్షి సర్వ సముద్రాలకు నిలయం, అలా జలాత్మకుడవగు నీకు ప్రణామాంజలులు! యుగాంతరవేళల్లో సకల జీవరాశినీ భక్షించి జలాల్లో విశ్రమించే జలశయానుడగు ప్రభువును శరణువేడుచున్నాను. ఆ ప్రభువు రాహువు నోటిలో ప్రవేశించి రాత్రివేళల్లో సోమపానం చేస్తాడు. నీ తేజస్సు రక్షా కవచం కాగా రాహువు సూర్యునే మ్రింగుచున్నాడు. రుద్రుని రక్షణలో యిచట గర్భపాతాలు జరుగుతున్నవి! అద్భుతానికి స్వధా, స్వాహాగా మారుతున్నది. అంగుష్ఠమాత్ర పురుషాకృతిలో సకల శరీరులలో నెలకొన్న ప్రభువు ప్రతి నిత్యము నన్ను రక్షించుగాక. ముందుకు నడుపుగాక! నదులలో, సముద్రాల్లో, పర్వత గుహలలో, వృక్షమూలాలలో, గోశాలల్లో, కీకారణ్యాలలో, చతుష్పథాలలో, రాజమార్గాలలో, సభాసదనాలలో, గజాశ్వరథశాలల్లో, శిథిలాలయాలలో, ఉద్యానవనాల్లో, పంచభూతాల్లో, దిగ్దిగంతరాలలో, చంద్ర సూర్యులలో, వారలకిరణ సమూహంలో, పాతాళ వాసులలో తదితర స్థానాల్లో సర్వత్రా ఆ విధంగా వ్యాపించియుండే ఆ ప్రభువు మూర్తులకు అహరహం నమస్సులు, ప్రణామాలు, నతులు చేయుచున్నాను. లెక్కకు మిక్కుటమైన రూపాకృతులలో, అసంఖ్యాకంగా గణాల రూపంలో సర్వత్రా వ్యాపించియున్న రుద్రులకు నమోవాక శతాంజలులు! మీరందరు నా యెడ ప్రసన్నులుకండు. మీకు కళ్యాణమగుగాక. నేను మీ వాడను. ఓ దేవదేవా! నీవే నా హృదయం, నా బుద్ధి మతి సర్వస్వమూను. నీకు నమస్సులు! ఆ విధంగా మహాదేవుడైన శంకరుని స్తుతించి ఆ ఉత్తమ ద్విజుడు వినతుడయ్యెను.
అధ్యాయము 26 Complete
Summary of chapter 98 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya explains the transcendent spiritual connection between the holy city of Avimukta Vārāṇasī and the river Sarasvatī flowing through Kurukshetra. The text reveals that bathing in river Sarasvatī while meditating upon Parameśvara Śiva yields the exact spiritual merit as departing mortal life in Vārāṇasī. This divine synthesis assures seekers that devotion at Kurukshetra grants immediate liberation from the cycle of worldly existence.