వామన మహా పురాణము
అధ్యాయము 30
నారదా! చండమముండులు వధింపబడి తమ సైన్యమంతా చెల్లాచెదరు కావడంచూచి శుంభనిశుంభులు రక్తబీజుడనే ఘోరరాక్షసుణ్ణి ముప్పదికోట్ల అక్షౌహిణీ సైన్యంతో యుద్ధానికి పంపించారు. వారు రావడం చూస్తూనే చండిక భయంకరమైన సింహనాదం చేసింది. ఆదైత్యులు కూడా సింహనాదాలు చేశారు. ఆమె గర్జిస్తుండగా నామె నోటినుండి, అక్షమాలకమండలాలు ధరించి హంసల విమానం మీద కూర్చున్న బ్రహ్మాణి వెలువడింది. మరుక్షణాన మూడుకన్నులు త్రిశూల, సర్పకుండలాలు వలయాలు ధరించి వృషభారూఢయై మాహేశ్వరి ఉద్భవించింది. అంతట మహర్షీ! ఆమె కంఠాన్నుండి నెమలి ఈకలు శక్తిని ధరించి నెమలి మీద కూర్చొని కౌమారి పట్టింది. ఆమె బాహువుల నుండి శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గబాణాలు ధరించి గరుడుని ఆరోహించి రూపసి అయిన వైష్ణవి జన్మించింది. ఆమె పృష్ఠ భాగాన్నుంచి మహోగ్రమైన రోకలిపట్టుకుని క్రోధంతో దంష్ట్రలతో భూమిని త్రవ్వుతూ శేషనాగం మీద కూర్చొని వారాహీదేవి వచ్చింది. ఆమె స్తనమండలాన్నుంచి ఏనుగుమీద కూర్చొని వజ్రాంకుశాలూ వివిధాలంకారాలు ధరించి మహేంద్రి ఆవిర్భవించింది. అంతట భయంకరమైన జూలువిదిల్చి ఆసటలతో ఆకాశంలోని గ్రహనక్షత్రతారకలను చెదరకొట్టుచు వాడియైన గోళ్ళతో భయంకరాకారయగు నారసింహీ, ఆ దేవిహృదయాన్నుంచి బయటకువచ్చింది. వారలచేత సంహరించబడిన రాక్షసబలాన్ని చూచి నిర్భయంగా ఆ చండిక మరొకపర్యాయం గర్జించింది. ముల్లోకాలలో నిండిన ఆ మహానాదాన్ని విని దేవదేవుడు త్రిశూలి త్రినేత్రుడచటకువచ్చి అంబికకు అభివాదనం చేసి- "దుర్గే! నేను చేయవలసిన కర్తవ్యం ఆజ్ఞాపించమని' కోరాడు. ఆయన వాక్యాలతోబాటు దేవి శరీరం నుండి వచ్చిన శివ ఆయనతో, శంకరా నీవు శుంభనిశుంభుల వద్దకు దూతగా వెళ్ళి వారితో - మీరు బ్రతుకదలచుకుంటే వెంటనే సపరివారంగా సప్తపాతాళానికి వెళ్ళండి. దేవతలకు వారి స్వర్గం యిచ్చివేయండి. బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞయాగాదులు చేసుకుంటారు. అలాగాక బలంతో క్రొవ్వి యుద్ధం చేయదలచుకుంటే అవశ్యంగా రండి. అందరనూ యమలోకానికి పంపుతామని చెప్పమన్నది.
ఓ నారదా! ఆమె శివుని దూతగా నియోగించినందున శివదూతిఅను పేరు గలిగినది. శంకరునిహితవచనాలువిని ఆ గర్విష్టులు హూంకారాలు చేస్తూ ఆ కాత్యాయని ఉన్నవైపు పరుగులుతీశారు. అంతట ఆ రాక్షసులందరు బాణాలు శక్తులు, అంకుశాలు పరశువులు, శూల భుశుండి పట్టిసాదులు, వాడిగల ప్రాసపరిఘలు ఆ దేవి మీద ఒక్కమారుగా వర్షించారు. ఆ మహేశ్వరి ఉత్తమమైన ధనుస్సును సంధించి వందలాది నిశితబాణాలు గుప్పించి, ప్రచండమైన విక్రమంతో, ఆ మహాసురుల శస్త్రాస్త్రాలను తునాతునకలు గావించి వారల బాహువుల ఖండించింది. మరెందరనో బాణసహస్రాలు వర్షించి వధించింది. మారిత్రిశూలంతో కొందరను పరిమార్చింది. కౌశికి ఖట్వాంగంతో కొందరను వధించింది. ఇక బ్రాహ్మి మంత్రించిన జలం చిలకరించి ఎందరనో హతమార్చింది. మహేశ్వరి శూలంతో శత్రువుల వక్షాలను చీల్చి చంపితే వైష్ణవి మరెందరనో భస్మంగావించింది. కౌమారీ శక్తితో, ఐంద్రి వజ్రంతో, ముట్టెతోను చక్రంతోను వారాహి, వాడిగోళ్ళతో చీల్చి నారసింహీ, వికటాట్టహాసధ్వనులతో శివదూతీ ఎందరనో యమసదనానికి పంపించారు. రుద్రుడు త్రిశూలంతో వినాయకుడుపరశువుతో ఎందరనో హతమార్చారు. ఈ విథంగా పరమేశ్వరి తన అసంఖ్యాక రూపాలతో దైత్యముఖ్యులనెందరనో సంహరించింది. వారల దెబ్బలకు భూపతితులైన రాక్షసులందర్నీ భూతగణాలు తినివేయడంతో మహాప్రళయం ఏర్పడింది. ఆ విధంగా దేవతలు మాతృగణాల సంహారకాండకు భయాతురులై రాక్షసవీరులు జుట్టుముడులు వీడగా కళ్ళచూపులు చెదిరిపోగా ఫారిపోయి రక్తబీజుని ఆశ్రయించారు. అంత నా రక్తబీజుడు భయంకరంగా గర్జిస్తూ శ్రేష్ఠమైన ఆయుధాలతో మాతృకాగణాలను, భూతగణాలను చీకాకుపరుస్తూ కదనరంగానికి దూకాడు. అది చూచిన మాతృకాగణాలు వాడి శరీరాన్ని వాడిశస్త్రాస్త్రాలు వర్షించి చిల్లులుపడజేసారు. వాడి శరీరాన్నుంచి క్రిందపడిన ప్రతి రక్తపుబిందువునుంచి వాడంతటివాడు మరొక రక్తబీజుడు పుట్టసాగాడు. యుద్ధభూమి అంతా రక్తబీజులతో నిండిపోయింది. ఆ విచిత్రాన్ని గమనించిన కౌశికికేశిని పిలిచి- ఓ చండీ! నీ నోటిని విశాలంగా తెరచి వాడి వంటి నుండి పడే రక్తబిందువులన్నీ త్రాగేసివేయుమని ఆదేశించింది. దేవి ఆదేశం ప్రకారమే ఆ చండి పై పెదవి ఆకాశాన్నీ క్రింది పెదవి భూమిని తాకునట్టు తన భయంకరమైన వక్త్రాన్ని తెరిచి ఆ శత్రువును జుట్టుపట్టుకొని తన నోటిలోవేసుకొని మింగేసింది. శూలంతో వాడి వక్షం భేదించి ఒక్కబొట్టు కూడ క్రిందపడకుండా త్రాగేసింది. శరీరంలోని నెత్తురంతా పోవడంతో ఆ రక్తబీజుడు శక్తిహీనుడైపోయాడు. వాడిని వెంటనే స్వర్ణాలంకృతమైన చక్రంతో నూరుముక్కలుచేసింది.
అలా రాక్షస సైన్యాధిపతి చావడంతో దానవులంతా దైన్యంతో "హా తండ్రీ! హా సోదరా! వెళుతున్నావా, క్షణం ఆగుమాగు"మంటూ ఆర్తనాదాలు గావించారు. జుట్లు విరబోసికొని వస్త్రాలూడిపోగా, కవచాలు ఆభరణాలు ముక్కలుకాగా భయకంపితులయిన యితరుల నా మృడాని నేలపై బడగొట్టినది. వారలు 'బ్రతుకు జీవుడా'యని ఆ కొండను వదలి పారిపోయారు. ఆ విధంగా కవచాదులు భిన్నమై దిగంబరులుగా పారివచ్చిన తన బలాలను చూచి దానవేంద్రుడయిన నిశుంభుడు, చక్రాలు దెబ్బతిని యిరుసులూడుచున్న రథంతో, క్రోధోన్మత్తుడైదేవిని సమీపించాడు. మెరిసి పోతున్న ఖడ్గం డాలు పట్టుకొని నిలబడి, ఆ దేవి సౌందర్యానికి ముగ్ధుడై వాడు చిత్రలిఖిత ప్రతిమలాగా స్తంభించి చూస్తూ ఉండిపోయాడు. అలా కదలికలేక నిలబడిన ఆ దేవవిరోధిని చూచి పకపకనవ్వి - ఈ పౌరుషంతోనేనా నీవు దేవతలను జయించింది ? ఈ వీరత్వంచూపియేనా నన్ను పొందాలని చూస్తున్నావురా?" అని గేలి చేసింది. కౌశికి మాటలు విని ఆ మాటకారి అయిన రాక్షసుడు క్షణకాలం ఆలోచించి యిలా అన్నాడు. "ఓ భీరూ! నీ శరీరమో అతి కుసుమారం! నా బాణాలో అతితీక్ష్ణాలు. ఒక్క వ్రేటునకు పచ్చికుండవలె నూరుముక్కలవుతుందే అని విచారిస్తున్నాను. అంచేత నిన్ను ప్రహరించేందుకు మనసొప్పకుండా ఉన్నది నాకు. కాబట్టి ఓ సుందరీ! విశాలాక్షీ! నన్ను సేవించుము. నా కత్తివ్రేటుకు ఇంద్రుడు, సైతం నిలవజాలడు. యుద్ధ సంకల్పం వదలి నన్ను వివాహం చేసుకో. ఓ నారదా! వాని మాటలకా యోగీశ్వరి అర్థ గర్భితంగా యీ మాటలు పలికింది. "యుద్ధంలో ఓడిపోకుండానేనెవడి భార్యనగుటకూ వీలుపడదు కదా! వివాహ సంకల్పమే ఉంటే రా! యుద్ధంలో నన్ను ఓడించు." ఆ మాట వింటూనే ఆ దానవుడు ఖడ్గాన్ని బలంకొద్దీ దేవిమీదకు విసిరివేశాడు. అంతట కౌశికి ఆరు బాణాలు గుప్పించి ఆ ఖడ్గాన్నీ డాలునూ ముక్కలు ముక్కలుగావించింది. దానితో వాడు మండిపడి రెండు చేతులతో పెద్దగదను తిప్పుతూ దేవి మీదకు దుమికాడు. అంతనాయంబిక ఒక క్షురప్రంతో గదతో కూడా వాడి రెండు చేతులనూ నరికివేసింది. నిష్ప్రాణమైనవాడి శరీరం నేలకొరిగింది. ఆ దానవుని మరణానికి చండమారి మొదలయిన మాతృశక్తులు సంతోషంతో కిలకిల రావాలు చేశారు. భూతగణాలు తూర్యాలు మోగించారు. దేవతలు ఆ తల్లిమీద పుష్పవర్షం గురిపించారు. నిశుంభుని సంహారంచూచి శుంభుడు కోపంతో పాశం ధరించి ఏనుగుమీదనెక్కి దేవిపైకి లంఘించాడు. అలా వచ్చే ఆ రాక్షసాధముణ్ని చూస్తూనే అంబిక అలవోకగా నవ్వుతూ, నాలుగు అర్ధచంద్ర బాణాలు చేతితో తీసికొని రెండు క్షురప్రాలతోవాడి ఏనుగుకాళ్ళను నరికి, యింకొక రెండు బాణాలతో దాని కుంభస్థలాన్ని బద్దలు గావించింది. దానితో ఆ ఏనుగు దేవేంద్రుని వజ్రాఘాతానికి విరిగిన పర్వత శిఖరంలాగా కుప్పకూలిపోయింది. కూలిన ఏనుగు మీద నుంచి దిగుతుండగానే పరమేశ్వరి మరొక బాణంతో కుండలాలతో వెలుగుతున్నవాడి తలను ఖండించింది. తల తెగిన ఆ మహాదైత్యుడు ఏనుగుతో బాటు కార్తికేయుని బాణాహతికి మహిషంతో కూడ నేలకొరిగిన క్రౌంచంవలె పడిపోయాడు. పరమేశ్వరి దేవశత్రువునువధించిన వార్త విని, ఇంద్రుని ముందుంచుకొని సూర్యయమ మరుదశ్వినీ వసువులు మొదలయిన దేవతలంతా వింధ్యగిరికేతెంచి వినయావనతులై చేతులు జోడించుకొని ఆ జగదంబిక నిలాస్తుతించారు.
దేవతలు యిలా స్తోత్రం చేశారు. హే భగవతి! పాపనాశిని నీకు నమస్సులు! దేవశత్రువుల దర్పం నాశమొనర్చు తల్లీ! హరిహరులకు రాజ్యమిచ్చు జననీ! యజ్ఞకార్యాలు రక్షించు తల్లీ! నీకు నమస్సులు. దేవ శత్రువులనురుమాడు తల్లీ! శుంభనిశుంభుల చంపినమాతా, నమస్సులు! ప్రజల ఆర్తిపోగొట్టే తల్లీ! త్రిశూలధారిణీ! నారాయణీ! చక్రధారిణీ! నీకు నమస్సులు, ఎల్లపుడు భూమిని ధరించెవారాహీ! నారసింహీ! వజ్రం ధరించిన ఐంద్రీ! మయూర వాహినివగు కౌమారీ! నీకు ససుస్కారము. హంస వాహినివగు బ్రాహ్మీ! మాలాధారిణివగు కేశినీ! గార్దభారూఢవగు తల్లీ! ఎల్లర దుఃఖాలుపోగొట్టు జగన్మయీ! నీకు నమస్కారము. దేవబ్రాహ్మణ శత్రువుల సంహరించి విశ్వరక్షణచేసే విశ్వేశ్వరీ, సర్వమయీ, త్య్రంబకే! వరదాయినీ! నీకు ప్రణామాలు. మమ్మనుగ్రహింపుము. నీవు బ్రహ్మాణివి, మృడానివి, నెమలిమీదనెక్కు శక్తిధారిణి కౌమారివి, వారాహివి, గరుడారూఢవై శార్‌ఙ్గం ధరించిన వైష్ణవీదేవివి. చూడభయంకరమై, ఘుర్ఘరధ్వనులుచేసే నారసింహివి. వజ్రంధరించి మాహేంద్రివి. చండముండవు, శవగమనప్రియవు, యోగిని. ఇవన్నియు నీ రూపాలే. నీకు సమస్సులు. త్రినయనా భగవతీ, రాత్రింబవళ్ళు అవనతశిరులై నీ చరణాలను సేవించువారలకు, స్తోత్రాలతో బల్యన్నాలతో పుష్పాలతో నిన్ను పూజించు ఘనులకు జీవితంలో పరాభవంగాని అశుభంగాని ఎన్నడూ కలుగవు. తల్లీ నీకు నమోవాకములు!" దేవతలు గావించిన ఈ స్తోత్రంవిని ఆ అంబిక వారలతో మీ ప్రసాదంవల్లనే సంగ్రామ రంగంలో శత్రు విజయం నాకు చేకూరినదని నవ్వుతూ అన్నది. మీరందరు గావించిన ఈ స్తోత్రాన్ని భక్తితో కీర్తించు మానవులకు దుస్వప్పనాశనం కలుగుతుంది. సందేహం లేదు. ఇక మీకు కావలసిన వరం కోరుకొనండి అని ఆ తల్లి ఆదేశించింది.
తల్లీ! దేవతలకు మరొకవరం యివ్వదలచినచో బ్రాహ్మణ శిశు గోవులకు మేలుగావింపుము. మళ్ళీ నీ అగ్నిశరీరంతో రాక్షసులను భస్మమొనరింపుము.
దేవతలారా ; నేను మరల శంకరుని ముఖమందలిస్వేదం (చెమట) నుండి రుధిరాననం (ముఖం)తో జన్మించి అంధకాసురుణ్ణి సంహరిస్తాను. అప్పుడు నన్ను చర్చిక అంటారు . మళ్ళీ నందుని యింట యశోదకు జన్మించి విప్రచిత్తి లవణాసురుడు సుంభనిశుంభాదులను నా దంతాలతో చీల్చి చంపుతాను. తర్వాత, దేవతలారా, కలియుగంలో జనులు తిండిలేక మాడిపోవు సమయాన యింద్రునింట మారిగా పుట్టి సత్యభామాదేవి సహాయంతో దేవతలనందరకు అన్ని రకాల కూరగాయలు సమకూర్చి రక్షిస్తాను. అప్పుడు నా పేరు 'శాకంభరి'. ఆ తర్వాత మరల శత్రువులను సంహరించి ఋషులను రక్షించుటకు వింధ్యగిరులలో పుట్టి దైత్యులను వధించి సురాలయానికి చేరుకుంటాను. అంతేకాదు. ఆ తర్వాత కూడ మరొక పర్యాయం అరుణాక్షుడనే రాక్షసుడు ప్రజలను బాధించునపుడు నేను ఒక పెద్ద గండుతుమ్మెదగా పుట్టి వాడివి చంపి దేవతలకు మేలు గావించి మరల స్వర్గానికి వెళ్తాను. ఈ విధంగా భవిష్యత్తులో కూడ మీరు కోరినట్లు సాధుసంరక్షణ చేస్తూ ఉంటాను.
వరదాయిని అయిన ఆ అంబిక యిలా వరప్రదానం చేసి, బ్రాహ్మణశ్రేష్ఠుల కభివాదనం చేసి భూతగణాదులనందరను పంపివైచి సిద్ధసంఘాలు తన వెంటరాగా స్వర్గానికి వెళ్ళినది. అంబిక యొక్క విజయగాధలు తెలిపే ఈ వ్యాఖ్యానం చాల పవిత్రమైనది ప్రాచీనమైనది. ఇది అన్ని శుభాలు చేకూర్చుతుంది. ఇది సకల రాక్షసనాశకమని భగవానుడు స్వయంగా వక్కాణించాడు. కనక మానవులంతా దీనిని సదా శ్రవణంచేస్తూ ఉండాలి.
అధ్యాయము 30 Complete
Summary of chapter 30 of the Vāmana Mahā Purana is as follows:
As the divine moment arrives, Bhagavān Vishṇu takes birth as the beautiful dwarf brāhmaṇa child, Vāmana Prabhu, from the womb of Mother Aditi, filling the entire cosmos with celestial fragrance, auspicious omens, and heavenly music. Pitāmaha Brahmā, accompanied by all the ṛshis and celestial hosts, gathers to perform the sacred birth ceremonies and sacred thread investiture for the divine child. Overwhelmed with awe, Pitāmaha Brahmā offers a magnificent eulogy, praising Vāmana Prabhu as the ultimate resting place of the universe who has manifested to perform the grand cosmic play of reclaiming the worlds through three steps of charity.