వామన మహా పురాణము
అధ్యాయము 3
ఓ నారదా ! తన చేతి కంటుకొనిన బ్రహ్మకపాలమట్లే యుండుట చూచి రుద్రుడెంతో కలవరపాటందెను. అప్పుడు కాటుకకొండ లాగ భయంకరాకారంతో ఎర్రటి వెండ్రుకలతో రూపుదాల్చిన బ్రహ్మహత్య, రుద్రుని సమీపించెను. కరాళాకృతితో వచ్చిన ఆమెను చూచి శంకరుడో క్రూరురాలా! నీవెవ్వతెవు? యిచ్చటి కేలవచ్చితి వనెను. అపుడా భీకరాంగన త్రిలోచనా! నేను బ్రహ్మహత్యను. నన్ను స్వీకరించు మనుచు శివుని దేహములో ప్రవేశించెను. రుద్రుడందుల కెంతయోపరితాపము పొందెను. ఆయన దేహమంతయు కంపించెను.
బ్రహ్మహత్యసోకిన శంకరుడు వెంటనే బదరికాశ్రమమునకు పరుగిడెను. అయితే అక్కడ నరనారాయణు లాయనకు కనపడలేదు. ఆ ధర్మపుత్రులు కనుపించక పోవుటతో చింతాశోకవ్యాకులితుడై శంకరుడు యమునలో స్నానము చేయబోగా నానది ఎండి పోవుచుండెను. కాళిందిలో నీరు లేకుండుటతో ప్లక్షజానదిలో మునుగపోగా నానదియు ఎండి యుండెను. అక్కడ నుండి పుష్కరారణ్యం మగధారణ్యం సైంధవారణ్యం వెళ్ళి అక్కడి జలాల్లో యథేచ్చగా స్నానం చేశాడు. తర్వాత ధర్మారణ్య నైమిశారణ్య తీర్థాల్లో మునిగిన శంకరుని బ్రహ్మ హత్య వదలలేదు. అంతటనాజీమూత కేతువు శివుడెన్నో తీర్థాల్లో నదీ నదాల్లో మునిగి ఎన్నియో క్షేత్రాల్లో ఆశ్రమాల్లో దేవాయతనాల్లో పూజలు, యోగాబ్యాసాలు చేశాడు. ఎన్ని చేసినా బ్రహ్మహత్య వదలకుండుటతో నిర్విన్నుడై కురుజాంగల భూమి చేరి అందున్న గరుడ ధ్వజుని శంఖ చక్ర గదాధరుడైన పుండరీకాక్షుని దర్శించి అంజలి ఘటించి ఈ విధంగా స్తోత్రం చేశాడు.
ఓ దేవేశ్వరా! గరుడద్వజా! నీకు నమస్కారము. శంక చక్ర గదాధరా! వాసుదేవా నీకు వందనము! నిర్గుణా! అనంతా! అప్రతర్క్యా ! సృష్టికర్తా! జ్ఞానాజ్ఞాన స్వరూపా! సర్వాదారా! నిరాధారా! నీకు నమో వాకములు! రజోగుణివైన సనాతన బ్రహ్మమూర్తి! చరచరాత్మకమైన నీ జగత్తంతయు నీ సృష్టియే. నీకు కై మోడ్పులు! సత్వగుణాశ్రయుడవై ప్రజాపాలన మొనరించు అధోక్షజా! లోకేశ్వరా! జనార్దనా! విష్ణో! మహాబాహో! నీకు వందనము. తమోమూర్తినై నీ క్రోధాంశాతో జనించినవాడను నేను. ఓ సర్వవ్యాపి! దేవేశ్వరా! నీకు ప్రణామము! ఓ జగన్నాథా! ఈ భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, బుద్ధి, మనస్సు దివారాత్రులు నీవే. నీకు సాష్టాంగపడెదను ధర్మం, యజ్ఞం తపస్సు, సత్యాహింసలు, శౌచము, ఆర్జవము, క్షమాగుణం, దానం, దయ, లక్ష్మి బ్రహ్మచర్యం అన్నియు నీవే! షడంగాలతో కూడిన నాలుగు వేదాలు నీవే! వాటిని ఎరిగిన వాడవు. వాని ద్వారా తెలియదగిన పరతత్వము నీవే! ఉపవేదాలు నీవే! సమస్తమూ నీవే! నీకు నమస్సులు. ఓ అచ్చుతా! చక్రపాణీ! మాధవా! మత్స్యమూర్తీ! నీకు నమస్కారము. లోకములో పరమకారుణికుడవైన లక్ష్మీపతి! ఈ పాపబంధాల నుండి నన్ను రక్షించుము. నా దేహగతమైన అశుభాన్ని హరించుము. బ్రహ్మహత్యా సంభవమైన ఆ జ్వాలలో నేను దగ్దమగుచున్నాను, వివేకహీనుడను.ఓ తీర్ధ స్వరూపా! నన్ని జ్వాలల నుండి కాపాడుము. పవిత్రుని గావింపుము. నీకు నమస్కారము!
శంకరుడు చేసిన ఈ స్తోత్రమును విని ఆయన బ్రహ్మహత్యా నివారణార్ధమైన చక్రపాణి యిట్లనెను:
మహేశ్వరా! బ్రహ్మహత్యా నివారకములు కర్ణమధురములు శుభకరములునగు నా వచనములు వినుము. యిక్కడకు తూర్పుగా ప్రయాగ క్షేత్రంలో అవ్యయమగునాయంశ వల్లజన్మించిన యోగశాయి నిత్య నివాసియై యున్నాడు. అతని దక్షిణ చరణము నుండి సర్వపాపనాశిని శుభదాయిని యగు వరణానది యుద్భవించినది. వామ చరణము నుండి అసియనెడునది వెలువడినది. ఈ రెండు నదులు లోకపూజ్యములు పవిత్రములు. ఆ రెంటికీ మధ్యనున్న యోగశాయి క్షేత్రము సర్వపాపములు పోగొట్టు పవిత్ర తీర్థము. ముల్లోకములలో శ్రేష్టమైనది. స్వర్గమర్త్య పాతాళాలలో అలాంటి క్షేత్రం లేదు. ఈశ్వరా! అక్కడ పరమ పవిత్రమూ మంగళకరమునగు వారాణసీ నగరమున్నది. ఆ ప్రదేశాన భోగులు కూడ నీలో లయము పొందుదురు. అచట విలాసినీ స్త్రీల మొలనూలు ధ్వనులు విప్రశ్రేష్టుల వేద ధ్వనులతో కలిసి పవిత్రతను సంతరించుకొనును. వాని శ్రవణసుభాగత్వాన్ని పెద్దలు మందహాస వదనాలతో మాటిమాటికి విని ఆమోదింతురు. లత్తుక పారాణిపూసిన అందలి పురస్త్రీల చరణ చిహ్నాలతో నలంక్రుతాలయిన చతుష్పథాలను చూచి, చంద్రుడు స్థల పద్మినులా త్రోవ నడచిరాయని యచ్చెరువందును. ఆ నగరంలోని ఆకాశాన్నంటే దేవాయతనాలు రాత్రులందు చంద్రకాంతినీ, వాని శిఖరాలపై రెపరెపలాడు సుందర పతాకాలు పగటి యందు సూర్యరశ్మినీ నిరోదించుచుండును. అచ్చటి చంద్రకాంత శిలా భిత్తికల మీద చిత్రించబడిన స్త్రీల వదనారవిందాల ప్రతిబింబాలను చూచి తుమ్మెదలు భ్రమించి వానిని వదలి నిజమైన పుష్పముల వంకకుపోవు. వినోదక్రీడలలో పరాజితులైన వారలలో కూడ నచట అలసట గోచరించదు. తమ యిండ్ల యందలి ఈత కొలనులలో జల క్రీడలాడు స్త్రీలలో గూడ పరిశ్రాంతి ఏ మాత్రము కనిపించదు. శంభో! ఆ నగరవాసులలో, ద్యూత క్రీడల్లో తప్ప, పరగృహములనాక్రమించు వారు లేరు. అనంగ క్రీడలలో తప్ప నబలలపై పరాక్రమము చూపువారుండరు. అక్కడ ఉన్న గజరాజులకే సాధనము, మదపుటేనుగులలోనే దాన జల నిరోధము. యౌవనంలో ఉన్న మగ ఏనుగులలోనే మాన (దేహపు కొలత)ము మదము (మదజలము) కనిపించును. (ఈ నాలుగు అవలక్షణాలు అచటి పురజనులలో లేవన్న మాట) అందలి కౌశికు (గుడ్లగూబ)లే దోష (రాత్రి) ప్రియలు. ఇతర జనులు కారు. అకులీనత్వం (భూమిలో లీనముగాకుండుట) నక్షత్రాలలోనే, వృత్తచ్యుతి (శీలము-ఛందోవృత్తము లేకుండుట ) గద్యమునందే ఓ శంకరా! భూతి (ఐశ్వర్యము) లోభం గలిగిన అచటి వారాంగనలే భుజంగు (విటులు)లతో చంద్రుల(చంద్రహారములు)తో కలిసి నీ వలె విహరించుచుందురు. (శివుడు భస్మ సర్ప చంద్రాలంక్రుతుడు గదా !) ఈశానా ! ఏవంగులు విశిష్టమైన వారాణసీ పుణ్యాశ్రమంలో సర్వపాప హరుడగు లోలార్కదేవుడు విజయం చేసియున్నాడు. దశాశ్వమేధ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన అచ్చోట ణా అంశతో కేశవుడున్నాడు. అచటకు వెళ్ళినంతనే ఓ సురశ్రేష్టా ! నీవు పాపవిముక్తుడవు కాగలవు.
గరుడధ్వజుని ఈ పలుకులు విన్నంతనే వృషద్వజుడాయనకు శిరసాప్రణామం చేసి అతిత్వరగా, తన పాప విముక్తికై వారాణసి క్షేత్రానికి వెళ్ళెను. పవిత్ర తీర్థాలతో కూడిన ఆనగరిని దర్శించి, అందలి తీర్థాలలో స్నానమాడి, దశాశ్వమేధాన్ని లోలార్క భగవానుని దర్శించి సర్వ పాపాల నుండియు విముక్తుడై శంకరుడు కేశవుని చూచుటకై తిరిగి వెళ్ళెను. కేశవునకు ప్రణామం చేసి యిట్లనెను. “హృషీకేశా! నీ దయవల్ల బ్రహ్మహత్య తొలగిపోయినది. కాని ఈ కపాలము నా యర చేతిని వదలకున్నది. ఇందులకు కారణమేమి?”
మహాదేవుని మాటకు విష్ణు విట్లనెను. “ఓ రుద్రా! కపాల మోచనోపాయము చెప్పెదను వినుము. ఇదిగో నా ఎదుటనే పద్మోత్సలాలతో నిండియున్న ఈ దివ్య సరోవరం పరమ పవిత్ర తీర్థం, దివ్యగంధర్వసేవితం. దీనిలో స్నానం చేసినంతనే నీకు కపాల మోచనము కాగలదు. ఆ కారణంగా ఈ తీర్థానికి కపలమోచన క్షేత్రమనీ, నీకు కపాలి యనీ ప్రసిద్ధి కలుగుతుంది. నారదా! సురేశ్వరుడగు కేశవుడు చెప్పినట్లు మహేశ్వరుడా కపాలమోచన తీర్థంలో విద్యుక్తంగా స్నానమాచరించగా ఆయన అరచేతికంటుకొని యున్న బ్రహ్మపుర్రె యూడిపడెను. భగవత్ప్రసాదం వల్ల అది కపాల మోచనమను పేర పవిత్ర తీర్తమాయెను.
అధ్యాయము 3 complete
Summary of chapter 3 of the Vāmana Mahā Purana is as follows:
Following the tragic dissolution of Daksha's sacrifice, Mahādeva Śiva, overcome with deep grief and divine detachment, roams the sacred realms carrying the holy frame of Satī Devi until Bhagavān Vishṇu uses his divine discus to dismember the body, establishing the revered Śakti Pīṭhas across the earth. Afterwards, a profound cosmic dialogue takes place between Hari and Hara, wherein the essential non-difference and eternal identity of Bhagavān Vishṇu and Parameśvara Śiva are revealed to the devas and ṛshis. The two supreme manifestations of the Divine affirm that whoever perceives duality between Hari and Hara remains bound in ignorance, whereas those who honor both with equal devotion attain ultimate liberation and eternal peace.