వామన మహా పురాణము
అధ్యాయము 6
“మునివర ! బ్రహ్మమానస పుత్రుడు దివ్యశరీరి యగు ధర్ముడు. దాక్షాయణి ఆయన భార్య. ఆ దంపతులను హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడను నలుగురు కుమారులు. వారిలో హరికృష్ణులు యోగాభ్యాస నిరతులైనారు”.
కాగా పురాణ ఋషి సత్తములయిన నరనారాయణులు లోకకల్యాణార్థం హిమాలయాలలో బదరికాశ్రమాన గంగా తీరాన పరబ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశారు.
వారలు గావించిన ఘోర తపస్సుకు చరాచర జగత్తంతా తల్లడిల్లినది. అది చూచి ఇంద్రుడు కలవరపాటోందెను. వారల తపస్సు భంగపరచుటకై దేవరాజు రంభాది అప్సరో కామినులను వారి కడకు పంపెను. వారితో బాటు అమ్రవల్ల వాద్యాయుధాలు ధరించి, సహచరుడైన వసంతునితో కలిసి మన్మథుడు కూడ వారల ఆశ్రమానికి వెళ్ళెను.
వారందరు బదరికాశ్రమము ప్రవేశించి యిష్టము వచ్చినట్టుగా విహరించసాగిరి. వసంతాగమనంతో ఆకులూడ్చుకొని పుష్పించిన మోదుగచెట్లు, అగ్నిశిఖల్లాగా భూమికి అలంకారంగా వెలుగొందినవి. శిశిరమనే ఏనుగును మోదుగుపూవులనేగోళ్ళతో చీల్చుచున్నదోయన్నట్లు వసంతకేసరి విజ్రుంభించింది. ఆ కాంతితో తుషార సముదాయమనే ఏనుగు జయించాననే దర్పంతో మల్లె మొగ్గల దావళ్య మిషతో వసంతుడు వెక్కిరించుచుండెను. సర్వాభరణభూషితులై వెలుగొందే రాజకుమారుల వలె పుష్పించిన కర్ణికార ఉద్యానవనాలు శోభిల్లెను. వాని ప్రక్కనే నీప (కడిమి) వృక్షములు ప్రభు సమ్మాన లబ్దకింకరుల వలె శోభించినవి. మరొక వైపు పుష్పితాశోకవనాలు తమ ప్రభువైన వసంతునికై పోరాడి క్షతగాత్రులై నిలచిన సేవకుల వలె విరాజిల్లినవి.
తెల్లని మచ్చలు గల లేళ్ళ గుంపులు గహనకాననాల్లో, సంమిత్రులేతెంచినపుడు ఆనందపులకాంకితులగు సజ్జనుల వలె తిరుగసాగినవి. “ మముబోలిన వృక్షములెవ్వి?” యని అంగుళి చాలనంతో ప్రశ్నించుచున్నవో యన్నట్లు నదీ తీరాల్లో పుష్ప మంజరులతో వేతన(పేము)లతలు వెలసినవి.
ఓ నారదా! వసంతలక్ష్మి రక్తాశోక హస్తాలతో, అరుణ కింశుక చరణాలతో, నీలాశోక కచభారంతో, వికసిత పద్మముఖంతో, నీ లేందీవర నేత్రాలతో, మారేడుపండ్ల చమకట్టుతో, వికసిత కుంద దంతాలతో, బంధు జీవాధరాలతో, తెల్లని సిందువార నఖ కాంతులతో, అంకోల వస్త్రదారణంతో, గండు కోయిలల కల స్వరాలతో, నెమళ్ళ గుంపుల అలంకారాలతో, నీటిబెగ్గురు స్వరనూపుర ఘలంఘలలతో, ప్రాగ్వంశకటి సూత్రాలతో, మదమరాళ గమనాలతో, పుత్రజీవాంబరలతో, భ్రమరరోమావళితో సకల జన మనోభిరామమైన సౌందర్యాన్ని పుణికి పుచ్చుకుని బదరికాశ్రమంలో ప్రవేశించింది. తమ ఆశ్రమాన్ని ఆవరించిన ఆ అనవద్య శోభను తిలకిస్తూ నారాయణ ఋషి అచట అనంగుని చూచెను.
“బ్రహ్మర్షీ! అవ్యయుడు జగన్నాథుడునగు నారాయణర్షి దర్శించిన ఆ మన్మథు(ఆనంగు)డెవ్వరు?”
ఆ అవంగుడు హర్షతనయుడగు కాముడు. శంకరునిచే దగ్ద శరీరుడై అనంగు (శరీర)రహితుడైనాడు.
“ఏ కారణమున కామదేవుని దేవదేవుడగు శంకరుడు భస్మము గావించెను. ఆ వివరణము తెలుపుము.”
నారదా! వినుము. దక్షపుత్రి సతీదేవి మరణానంతరం త్రిలోచనుడు దక్షయజ్ఞం ధ్వంసం గావించి సంచరించుచుండగా, అపత్నీతుడగు నా వృషకేతనుని చూచి కుసుమాయుదుడగు కందర్పుడున్మాదనాస్త్రంతో ప్రహరించెను. ఆ ఉన్మాదనాస్త్ర ప్రభావం వల్ల హరుడు పిచ్చివానివలె అడవుల్లో నదీతీరాల్లో తిరుగాడ సాగెను. తన భార్య సతీదేవి స్మరణకు రాగా, బాణందెబ్బతిన్న మదగజంలాగా మనోనిబ్బరాన్ని కోల్పోయెను. ఆతాపాన్ని భరించ లేక హరుడు యమునా నదిలో దుమికెను. ఆ విరహానలానికి క్రాగి యమునాజలాలు నల్లబడెను. అప్పటినుంచీ కాటుక రంగు నీరు కలిగిన యమున “కాళింది” యయ్యెను. ఆ ప్రవాహం భూదేవికేశపాశంలాగా ప్రవహించి పవిత్ర తీర్థ మాయెను. ఆ విధంగా ఎన్నో పవిత్ర నదుల్లో సరస్సులలో వాపీకూపాల్లో మునుగుతూ నదీ తీరాల్లో పర్వత భూముల్లో అరణ్యాల్లో స్వచ్చందంగా తిరుగాడుచున్నను శివునకు మనశ్శాంతి కలుగలేదు. కొంతసేపు ఎమోపాడుతూ, కొంతసేపు ఏడుస్తూ, కొంత సేపు ధ్యానంలో ఉంటూ, అందాల బరిణ అయిన దక్షకన్యనే స్మరిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కపుడు ఆమెని గురించి కలకంటూ యిలా కలువరించెడివాడు.” “ఓ నిర్ణయురాలా! నిలువుము. ఓముగ్ధా! అనింద్యురాలా! నన్నువిడువకుము. నీ వియోగం వల్ల మదనానలంతో దగ్ధమగుచున్నాను. ఓ సతీ, సుందరీ నా మీదకోపమా? కోపింపకుము. నీపాదములకు మ్రొక్కెదను. నాతో మాటాడుము. ప్రియురాలా! నిన్ననుక్షణం చూచుచున్నాను. వినుచున్నాను, స్పృశిస్తున్నాను, కౌగిలించుచున్నాను, నీకు నమస్కరిస్తున్నాను. అట్టి నాతో ఏల మాటాడవు? ఇలా విలపించే వానిని చూచి ఎవని గుండె కరుగదు? అందులోనూ భర్త అయిన వాని పట్ల ఇంతటి కాటిన్యమా ? నిన్ను వదలి నేను జీవించజాలను.” అంటూ నీవిదివరకు చేసిన బాసలు ఏమైనవి? ఎంతటి అసత్యవాదినివి? ఓసునేత్రీ! ఇంతటి నిర్దయ వలదు. రమ్ము. నన్ను కౌగలించుకొనుము. లేనిచో ఈ కామాగ్ని చల్లారదు. నేను దగ్దమగుట తథ్యము. నిజాము చెప్పుచున్నాను.” ఇలా ఇలా కలవరించి స్వప్న భంగం కావడంతోటే తెలివి తెచ్చుకొని అడవుల్లో భోరున నేడ్చుచు పర్యటించును.
ఇలా దీనంగా విలపిస్తున్న హరునిచూచి కాముడు సంతాపనమనే మరొక బాణముతో గొట్టెను. ఆదెబ్బకు శంకరుడు మరింత సంతప్తుడై ఆగ్నేయ నిశ్వాసాలు పూత్కారాలు గావిస్తూ ప్రపంచాన్నంతటినీ తీవ్రతాపంలో ముంచెను. అదేసమయాన మరల కాముడు విజ్రుంభణమనే బాణాన్ని వదలెను. దానితో శివుడు విపరీతంగా ఆవులించుచూ నలుదిశలు కలయజూచెను. అప్పుడతనికి కుబేర పుత్రుడు పాంచాలికుడనువాడు కనుపించెను. వెంటనే వానిని సమీపించి శివుడు _ “బాబూ, నీవు మహావీరుడవు. నేను చెప్పునట్లు చేయుము.” అనెను.
“ప్రభూ! మీరు అసమాన పరాక్రములు. మీకు దాసుడను. మీరు చెప్పునది దేవతలకు అసాధ్యమైననూ సరే, నేను తప్పక చేయుదును. ఆజ్ఞాపింపు” డనెను.
“పుత్రా! వరదాంబిక మరణానంతరం కామాగ్నిదగ్దుడనై విజ్రుంభణ ఉన్మాదన బాణాలకు గురియై విలవిల లాడుచున్నాను. మదన చోదితాలయిన ఈ జ్రుంభణ మాదన స్నాతాప నాస్త్రాల వేడిమిని తట్టుకొన గలవాడు నీవు దక్క మరొకడులేడు. కనుక వీనిని గ్రహించి నాకు శాంతి కలిగించుము.
ఈశ్వరుని వచనములు విని యక్షపుత్రుడా జ్రుంభణ మాదనాది అస్త్రాలను గ్రహించెను. అంతట సంతోషించిన వాడై శూలి అతని కిట్లనెను.
బిడ్డా! దుస్సహములయిన జ్రుంభణాది అస్త్రముల తాపమును స్వీకరించిన నీయందు ప్రీతుడనైతిని. అందుకు బదులుగా నీకు అనుకూలించునదియు లోకులకు సంతోషకరమైనదియునైన వరమొకటి యిచ్చు చున్నాను. చైత్రమాసంలో నిన్ను చూచినను తాకినను, భక్తితో అర్పించినను, అట్టివారు వృద్దులైనా, బాలురైనా, స్త్రీలైనా పురుషులైనా సరే వారందరు ఉన్మత్తులగుదురు. వారు ఆస్థితిలో నాట్యగానాలు చేయుదురు. వివిధ వాద్యాలు నేర్పుతో వాయింతురు. నీ ముందర హాస్యోక్తులు పలుకుచుందురు. అయితే వారందరకు దివ్యశక్తులు లభించును. ఇక నీవూ, భూలోకంలో నా పేరుతో పాంచాలికేశ్వరుడవుగా విఖ్యాతుడవై నిన్ను గొలిచినవారలకు వరములొసంగెదవు. ఎల్లరకు పూజ్యుడవగుదువు.
హరునిచే వరము పొంది ఆ పంచాలికుడు సమస్త దేశాలలో పరిభ్రమించెను కాలింజరానికి ఉత్తరాన, హిమవత్పర్వతానికి దక్షిణాన గల పవిత్ర దేశంలో ఆ యక్షపుత్రుడు శివానుగ్రహం వల్ల పంచాలికేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ముక్కంటి కూడ వింధ్యగిరికి పయనించెను. అయితే మదనుడాయననచటకు గూడ వెంబడించి మరల ప్రహరింపనుద్యుక్తుడు కాగా హరుడచతటనుండి పలాయితు డయ్యెను. అట్లు పరుగిడి అనేకులు ఋషులకు తత్పత్నులకు నావాసమైన భయంకరమగు దారుకావనమున ప్రవేశించెను. అట్లు కామునిచే తరుమబడి తమ ఆశ్రమాలలో బ్రవేశించిన శివుని జూచి ఋషులు తమ తలలువంచికొనిరి. శివుడు వారలను బిక్ష పెట్టుడని అడిగెను.
నారదా! అంతట ఋషులు మౌనంగా ఉండుట చూచి హరుడు వారల ఆశ్రమముల నంతట కలయదిరిగెను. అట్లు తిరుగుచున్న శివుని చూచి భార్గవ, ఆత్రేయ ఋషుల భార్యలందరు విమోహితలై నిగ్రహాన్ని కోల్పోయి కామార్తలై శివుడెచటకు పోయిన నచటకు వెంటబడి పోసాగిరి. అయితే పరమపతివ్రతలగు అరుంధతీ అనసూయలు మాత్రము ఆ వికారమునకు లోను గాకుండిరి. తమ ఆశ్రమాలు యిండ్లు వదలి మదించిన ఏనుగు వెంబడించు కరిణుల వలె పరమ శివుని వెంట పరుగిడు భార్యల చేష్టలు చూచి క్రోదోన్మత్తులైన అంగిరసాది ఋషులు శివుని లింగము నేలబడునట్లుగ శపించిరి. వెంటనే శివుని లింగము భూమిని బ్రద్దలు చేయుచు నేలబడెను. అంతట త్రిశూలియగు శివుడంతర్హితుడాయెను.
అట్లునేలబడిన లింగము భూమిని బ్రద్దలు చేసుకొని పాతాళానికి పైన బ్రహ్మాండాన్ని ఖేదించుకొని ఊర్ద్వలోకాలకూ వ్యాపించెను. అంతట నదీనద సముద్ర పర్వతాలతో నిండిన భూగోళము కంపించెను. పాతాళాది భువనాలన్నీ ఘూర్లిల్లి పోయినవి, అట్లు సంక్షుభితాలయిన భువనాలను చూచి బ్రహ్మవిస్మితుడై క్షీరసాగరశాయి అయిన మాధవుని చూడ బోయెను. అచట హృషీకేశుని చూచి భక్తితో స్తోత్రముచేసి, “ప్రభో ! ఈ మహోపద్రవ మెట్టిది? అని అడిగెను. అప్పుడు శ్రీహరి విరించీ! మహర్షుల శాపకారణంగా శర్వుని లింగము ఊడిపడినది. ఆ భారము వహించ లేక భూమి కంపించి పోవుచున్నదనెను. ఆ అద్భుతానికి విస్మితుడై బ్రహ్మ మనమచ్చటకు పోవుదమని విష్ణువును తొందరపెట్టెను. అంతట బ్రహ్మ విష్ణువు లిద్దరు శివలింగము పడిన చోటుకు చేరిరి. తుద మొదలు కనుపించని ఆ లింగమును చూచినంతనే విష్ణువు గరుడునిపై నెక్కి ఆశ్చర్యంతో పాతాళానికి వెళ్ళిపోయెను. బ్రహ్మ పద్మవిమానాన్నెక్కి ఊర్ద్వ లోకాలన్నీ గాలించాడు. కాని లింగపు కోన కనుగొన జాలక ఆశ్చర్య చకితుడై తిరిగి వచ్చాడు. అట్లే సప్త పాతాళాలను శోధించిన విష్ణువు కూడ లింగపు మొదలు కనుగొన జాలక తిరిగి వచ్చాడు. అంతట విధి విష్ణు లిద్దరూ లింగమును సమీపించి చేతులు జోడించి ఆ మహాదేవుని ఈ విదంగా స్తోత్రం చేయ మొదలిడిరి.
“ఓ శూలపాణీ! నీకు నమస్కారం! వ్రుషభద్వజా, నీకు వందనము! కవీ! శర్వా! త్ర్యంబకా! శంకరాః నమస్కారము! మహేశ్వరా, మహేశానా, సువర్ణాక్షా, వృషాకపీ, దక్షాధ్వరనాశకా, కాలరూపా, నీకు నమస్సులు! ఈ జగత్తుకు మొదలు, మధ్య, తుది నీవే! పరమేశ్వరా! భగవన్! నీవు సర్వవుడవు! నీకు వందనములు!”
ఆ స్తోత్రమునకు సంతసించి ఆ దారుకావనంలో వక్యవిశారదుడగు ఈశ్వరుడు హరిబ్రహ్మలకు ప్రత్యక్షమై,
“ఓ దేవాదిపులారాః కామ సంతప్తుడనై విధి క్రమాలు విసర్జించి, చిత్తశాంతి లేకుండా ఉన్న నన్నెందు స్తోత్రము చేయుచున్నారనెను.
మహాదేవా! ఇచట భూపతితమైన భవదీయ లింగాన్ని తిరిగి పరిగ్రహించండి. ఇదే మా ప్రార్థనము.
“ఓ దేవోత్తములారా! దేవతలందరు నాలింగమును పూజించినచో నేను దీనిని తీసికొందును. లేనిచో తీసికొనను.
అందులకు కేశవుడంగీకరించగా బ్రహ్మ స్వయంగా నా బంగారు వికారముగల లింగమును తీసికొచ్చెను. అనంతరం భగవానుడు నాలుగు వర్ణముల వారిని హరార్చన పరులనొనర్చెను. అందులకు వలసిన ముఖ్యశాస్త్రముల ప్రవర్తింప జేసెను. వానిలో మొదటిది శైవము, రెండవది పాశురము, మూడవది కాలవదనము నాల్గవది కాపాలికము. వశిష్టుని ప్రియపుత్రుడు శక్తి శైవుడు, ఆయన శిష్యుడు గోపాయనుడని తెలియుచున్నది. ఇక భరద్వాజుడు మహాపాశుపతుడు. ఆ తపస్వి శిష్యుడు ఋషభ సోమకేశ్వరుడను నరపతి. తపోధనుడగు నాపస్తంబుడు కాలాముఖ భక్తుడు. ఆయన శిష్యుడు క్రాథేశ్వరుడను వైశ్యుడు. కుబేరుడు మహావ్రత దీక్షితుడు. కాగా ఆతని శిష్యుడు మహాతపస్వియగు కర్ణోదరుడను శూద్రుడు, ఈ విధంగా బ్రహ్మ చాతుర్వర్ణముల వారిని శివపూజకైనియోగించి తనలోకమునకు తిరిగి పోయెను. బ్రహ్మ వెళ్ళిన తర్వాత శివుడు లింగమునుపసంహరించుకొని సూక్ష్మరూపమున దానిని చిత్రవనమున ప్రతిష్టించి వెడలిపోయెను.
మహేశ్వరుడట్లు మరల తిరుగుట చూచి కుసుమాయుదుడాయనను మరల ప్రహరించుటకై ధనుష్పాణియై ఎదుట నిలచెను. వానిని చూచినంతనే కోపంతో కనుల నిప్పులు రాల్చుచు శివుడాతనినినఖశిఖ పర్యంతము వీక్షించెను. తేజస్వియైనను మదనుడా వేడిమికోర్వ లేక పోగా నతని పాదముల నుండి నడుమువరకు గల భాగము దగ్దమయ్యెను. పాదములట్లు తగులబడగా మదనుడు తన ధనుస్సును వదలివేయగా నది అయిదు ఖండములాయెను. బంగారంవలె మేరయుచున్నదాని ముష్టిబంధము సువాసనలు వెదజల్లే సంపంగి వృక్షమాయెను. రత్నము పొదిగిన దాని సుందర నాహస్థానం, కేసరవనంలో చక్కని వకుళ (పొగడ) చెట్టుగమారెను. మునీ! ఇంద్రనీలమణులు పొదిగిన ఆ ధనుస్సు కోటి (అగ్రం) తుమ్మెదలతో నిండిన అందమైన పాటల తరువైనది. వాహస్తానానికిపైన చంద్రకాంతమణులు పొదిగిన పిడి (ముష్టి) చంద్రకాంతివలె తెల్లనైన అయిదురేకల మల్లెపూవయ్యెను. పిడిపైన, వంపు దిరిగిన చివరలకు దిగువ పగడములతో అలంకరించబడిన దొంతరలుగల వివిధ (వన) మల్లికలయినవి. నారదా! ఈ విధంగా పరమేశ్వరుని ద్వారా మంచి వాసనలు వెదజల్లే మల్లె మొదలయిన పుష్పాలు సృష్టింపబడినాయి. శరీరంతగలబడడం చూచి మన్మథుడు తన బాణాలను గూడ పారవైచెను. వానినుండి వేలాది ఫలవృక్షాలు పుట్టినవి. శంకరుని కృపవల్ల దేవతలందరకు రుచికరములగు మామిడి మొదలయిన పలురకముల ఫలములేర్పడినవి. ఇట్లు మన్మథుని దగ్దంచేసి తన శరీరాన్ని అదుపులో నుంచుకొని శివుడు పుణ్యార్జనకై కైలాసమున తపస్సు కొరకై వెళ్ళిపోయెను. ఈ విధంగా పురాసమయాన దేవశ్రేష్టుడగు శివుడు ధనుర్భాణాలతో సహా మదనుని దగ్దము కావించగా ఆ మహా దానుష్కుడా నాటినుండియు ఆనంగుడని పిలువబడెను.
అధ్యాయము 6 complete
Summary of chapter 6 of the Vāmana Mahā Purana is as follows:
The narrative turns to the celestial crisis caused by the demon Tārakāsura, whose tyranny could only be quelled by a son born of Mahādeva Śiva and Parvatī, the rebirth of Satī Devi as the daughter of Himavān. To awaken Mahādeva from his deep cosmic meditation on Mount Kailāsa, the devas send Kāmadeva, the deity of desire, who shoots his floral arrows of passion at the Supreme Ascetic. Enraged by the disruption of his sacred trance, Parameśvara Śiva opens his third eye, emitting a scorching flame of divine fire that instantly reduces Kāmadeva to ashes, demonstrating the utter futility of worldly desire before the supreme power of spiritual tapas.