వామన మహా పురాణము
అధ్యాయము 57
ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి శంకరుని దర్శించి సువర్ణాక్షుని అర్చించి అతడు నైమిసారణ్యానికి వెళ్లాడు. అక్కడ గోమతి కాంచనాక్షి గురుదా నదుల మధ్య నున్న పాపనాశ కాలయిన ముప్పదివేల తీర్థాలలో స్నానాలు చేసి పీతాంబరుడగు నచ్యుతుని అర్చించి, అచటగల నైమిషారణ్యవాసులయిన ఋషులనందరను పూజించాడు. మహాదేవుడగు శంకరుని ఆరాధించి అటనుండి గోపతిదేవుని దర్శించుటకు గయాక్షేత్రానికి ఆ ప్రహ్లాదుడు ప్రయాణించాడు. అచట బ్రహ్మధ్వజంలో స్నానం చేసి ప్రదక్షిణలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం గావించాడు. ఉదపానంలో స్నానం చేసి పితృతర్పణాలొసగి గదాధరస్వామినీ గోపతీశ్వరునీ పూజించాడు. ఇంద్ర తీర్థంలో స్నానపితృతర్పణాలు గావించి మహానదీ జలాల్లో మునిగి ఆపైన సరయూ తీరాన్ని చేరుకున్నాడు. అందులో స్నాతుడై గోప్రతారంలో కుశేశయ ప్రభువును అర్చించి ఒకరాత్రి నిద్రచేసి ఉపవసించి అటునుండి విరజానగరాన్ని చేరాడు. విరజలో స్నానమాడి పితృలకు పిండ ప్రదానం చేసి ఆ మహనీయుడు అజితుడగు పురుషోత్తముని దర్శించుటకు వెళ్ళాడు. అటశుచియై అక్షరుడైన పుండరీకాక్షుని దర్శించి ఆరురాత్రులుండి దక్షిణ దిశగా మహేంద్రానికి వెళ్ళాడు. అచట దేవేశ్వరుడగు అర్థనారీశ్వరుని దర్శించి పితృపూజలు చేసి ఉత్తర మహేంద్రానికి చేరాడు. అచట శివుని గోపాలుని సోమపాయిని దర్శించి సోమతీర్థంలో స్నానం చేసి సహ్యాద్రికొచ్చాడు. అచట మహెూదకిలో మునిగి భక్తితో నారాయణుని దర్శించి దేవపితరుల తృప్తి పరచి పారియాత్ర గిరికి వెళ్లాడు. అచట లాంగలినిలో మునిగి అపరాజిత ప్రభువునర్థించి కశేరుదేశానికి వెళ్లి విశ్వరూపుని దర్శనం చేసుకున్నాడు. ఆ చోటనే గణాల ఆరాధ్యదైవతం యోగవేది అయిన శంకరుడు తన విశ్వరూపం ప్రదర్శించాడు.
అక్కడ మంకుణిక నదిలో మునిగి మహేశ్వరునర్చించి మంచి గంధపు వాసనలతో నొప్పిన మలయగిరికి వెళ్ళాడు. అచటి సరోవరంలో మునిగి శంకరుని పూజించి ఆ ప్రహ్లాదుడు సదాశివుని దర్శించుటకై వింధ్యకు వెళ్లాడు. అక్కడ విపాశానదిలో స్నానమాడి సదాశివుని పూజించి మూడు రాత్రు లుపవసించి అనంతరం అవంతీనగరానికి చేరాడు. అచట శిప్రానదిలో మునిగి విష్ణుదేవునకు ప్రణమిల్లి స్మశాన నిలయుడైన మహాకాళదేహుని చూచాడు. అక్కడనే తమోగుణాత్మకమైన మహాకాలరూపాన్ని ధరించి సర్వవశంకరుడైన శంకరుడు ప్రాణులందరను సంహరిస్తూంటాడు. ఆచోటనే శ్వేతకి అనే రాజును, శంకరుడు సర్వప్రాణి సంహారకుడైన అంతకుణ్ణి దగ్ధంచేసి కాపాడాడు. ಆ పవిత్రభూమిలో ఉమాసహాయుడైన ఈశ్వరుడు ప్రమధకోటిగణాలు దేవ గణాలు సేవిస్తూ ఉండగా సంతోషంతో నివసిస్తూంటాడు. ఆకాలకాలాంతకులనంతమొందించే మహాకాళేశ్వరుని, మృత్యువుకు మృత్యువైనవానిని, యమునకు ముక్కుత్రాడు వేసిన ప్రభువు, చిత్రవిచిత్ర చరిత్రుని, శ్మశానవాసిని, జగత్పతిని మంగళకరుడైన త్రిశూలిని దర్శనం చేసికుని ఆదానవేశ్వరుడటనుండి నిషిధకు వెళ్లాడు. అచట నమరేశ్వర మహాదేవుని సేవించి మహెూదయ క్షేత్రానికి వెళ్లి హయగ్రీవుని దర్శించాడు. అచట అశ్వతీర్థంలో మునిగి హయాననుని దర్శించి శ్రీధరుని సేవించుకుని పాంచాలదేశానికి వెళ్లాడు. అచట నుంచే వీరపుత్రుడైన ఐశ్వర్య గుణసంపన్నుడు పాంచాలికుని సందర్శించి ఆ జితేంద్రియుడు ప్రయాగకు చేరుకున్నాడు. సర్వదేవసన్నిహితాలైన పవిత్రయమునా జలాల్లో స్నానమాడి అక్షయవటేశ్వరరుద్రునీ, మాధవుడ్ని శ్రద్ధాభక్తులతో ఆరాధించాడు. మాఘమాసమంతా ఉపవాస వ్రతం నెరపి అక్కనుండి వారణాసికి వెళ్లాడు సర్వపాపహారిణులైన అసీ వరణా నదులలో వేరు వేరుగా స్నానం చేసి పితృదేవతలను అర్చించాడు. ఆ అవిముక్తేశ్వరుడ్ని, మాధవుడ్నీ పూజించి నగర ప్రదక్షిణ గావించాడు లోలార్కదేవుని సేవించి అటుపై మధువనానికి చేరుకున్నాడు.
ఆ అసురేశ్వరుడచట స్వయంభూదేవుని ఆరాధించి పుష్కరారణ్యానికి వెళ్లాడు. అచ్చట పుష్కరాక్ష అయోగంధి బ్రహ్మలను పూజించి మూడు తీర్థాలలో స్నాతుడై పితృదేవతలను నర్చించాడు. అక్కడ నుంచి మరల ముల్లోకవిఖ్యాతమైన సరస్వతీ తీరాన కోటి తీర్థంలో వెలసిన రుద్రకోటేశ్వరదేవుని సన్నిధి చేరాడు. నైమిషలు మాగధులు సైంధవులు ధర్మారణ్యులు పౌష్కరేయులు, దండకారణ్యవాసులు, చాంపేయులు, భారుకచ్ఛవాసులు దేవికా తీరస్థులూ నగు విప్రవరు లసంఖ్యాకంగా అక్కడ మహాదేవుని చూచుటకు సమావేశమౌతారు కోటి సంఖ్యలో వచ్చే ఆ తపస్వులు మేము ముందు అంటే మేము ముందు అంటూ తోసుకుంటూ ఆహరుని చూచేందుకు ఉబలాటపడతారు. అలా దగ్ధకల్మషులైన ఆ శ్రద్ధాళువులు మహర్షులూ తన దర్శనకోసం పెనగులాడటం చూచి వారిని అనుగ్రహించుటకై ఆ దయామయుడగు మయస్కరుడు కోటి రూపాల్లో వారలకు దర్శనమిస్తాడు. అందుచే అచట ఆ దేవునికి రుద్రకోటేశ్వరుడు అని పేరు వచ్చింది. అలా కోటి మూర్తులుగా దర్శనమిచ్చే స్వామిని వారలు వేరువేరు తీర్థాలలో అర్చించి కోటితీర్థాలేర్పరిచారు. అలాంటి అద్భుతమైన కోటితీర్థంలో స్నానం చేసి ఆ తేజస్వి రుద్ర కోటేశ్వరుడుని పూజించి పితృవసుదేవతలకు తర్పణాలిచ్చాడు. పిదప ఆయశోధనుడు కురుజాంగలానికి వెళ్లి సరస్వతీ పవిత్రోదకాల్లో నిమగ్నుడైన పార్వతీధవుడు దేవపూజితుడగు స్థాణ్వీశ్వరుని దర్శించాడు. సరస్వతీ నదిలో స్నానం చేసి తర్వాత దశాశ్వమేధ తీర్థంలో మునిగి దేవ పితరుల నర్చించాడు. కన్యాసరోవరంలో మునిగి శుచియై, సహస్ర లింగేశ్వరుని పూజించి గురువైన శుక్రునకు ప్రణామం చేసి సోమతీర్థానికి వెళ్ళాడు అక్కడ స్నానార్చనలు కావించి చంద్రుని పితరులను భక్తితో పూజించి ఆ జితేంద్రియుడు క్షీరకావాసం వెళ్లి స్నానం చేశాడు. అక్కడ తరు ప్రదక్షిణం చేసి వరుణదేవుని పూజించి ఆ మహామతి మరల కురుధ్వజాన్ని చూచి పద్మానగరికి వెళ్లాడు. అక్కడ లోకపూజితులైన భాస్కరులను మిత్రుని వరుణుని అర్చించి కుమారధారకు వెళ్ళి కుమారస్వామిని దర్శించాడు. అక్కడ కపిలధారలో మునిగి పితరులను దేవతలను ఆరాధించాడు. ఆపైన నర్మదానదికి వెళ్ళాడు. నర్మదలో స్నానం చేసి శ్రీవల్లభుడగు వాసుదేవుని అర్చించి ఆయన భూధరుడూ చక్రపాణియగు వారాహస్వామిని చూచుటకు వెళ్ళాడు.
కోకాముఖ తీర్థంలో స్నానం చేసి ఆభూవరాహమూర్తిని పూజించి అర్బుదేశ్వరుడైన త్రిసౌవర్ణేశ్వరుని చూచుటకు వెళ్ళాడు. అచట నారీహ్రదంలో స్నానం చేసి శంకరు నారాధించి కాలింజరానికి వెళ్ళి నీలకంఠేశ్వరుని దర్శించాడు. నీలతీర్థంలో మునిగి ఆ శివుని అర్చించి అచటనుండి సాగరతీరాన గల అనుపమానమైన ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అచట సరస్వతీ సాగర సంగమాన స్నానమాడి లోకనాధుడైన సోమేశ్వరుని దర్శించాడు. దక్షుడి శాపంవల్ల కళలు క్షీణించిన తారానాధుడీ ప్రదేశాననే శంకరుని ఆరాధించి ఆ కపర్ది కృపవల్లా శ్రీ విష్ణువు అనుగ్రహం వల్ల తిరిగి తన కాంతిని పొందాడు. అలాంటి క్షేత్రంలో ఆదేవాధిదేవుల నిద్దరనూ అర్చించి మహాలయానికి వెళ్ళాడు. అక్కడ రుద్రుని సేవించి ఉత్తర కురుభూములలో పద్మనాభుని సేవించి నేరుగా సప్తగోదావరానికి చేరాడు. అక్కడ గోదావరిలో స్నాతుడై త్రైలోక్యవందితుడగు భీమేశ్వరుని అర్చించి, ఆ అసురోత్తముడు దారుకావనానికి వెళ్లి శ్రీలింగదర్శనం అర్చనం చేసికొన్నాడు. అటునుండి బ్రాహ్మణినదికి వెళ్ళి స్నానం చేసి శివార్చన గావించాడు. అనంతరం ప్లక్షావతరణానికి వెళ్లి శ్రీనివాసుని సేవించాడు. అటుపైన కుండినపురికి వెళ్లి ఆప్రాణరక్షకుని అర్చించి శూర్పారక క్షేత్రంలో చతుర్భుజుని సేవించుకున్నాడు. అచటనుండి మగధారణ్యంలో వసుధాధికుడైన విశ్వేశుని అర్చించి ప్రజాముఖానికి చేరి అచట మహాతీర్థంలో స్నానం చేసి వాసుదేవుని పూజించి శోణపురిని చేరి రుక్మవర్ణేశ్వరుని అర్చించాడు. అనంతరం మహాకోశీలో హంశేశ్వరదేవుని పూజించి ఆ భక్తుడు ఉత్తమమైన సైంధవారణ్యానికి వెళ్లాడు.
అచట శంఖం శూలం ధరించిన సునేత్రేశ్వరుని పూజించి ఆ మహాభుజుడు త్రివిష్టపానికి వెళ్ళాడు. అక్కడ జటాధరుడుగ్రా ప్రసిద్ధి గాంచిన మహాదేవుని హరినీ అర్చించి కనఖల తీర్థానికి వెళ్లాడు. అచట భద్రకాళీశ్వరునీ, వీరభద్రునీ కుబేరునీ, మేఘాంకునీ పూజించి గిరివ్రజానికి వెళ్లాడు. అచట లోకేశ్వరుడైన పశుపతిని పూజించి కామరూపదేశానికి వెళ్లాడు. అచట చంద్రకాంతితో వెలిగే ఉమాసహితుడగు త్రినేత్రుని పూజించి మహాతీర్థానికి వెళ్ళి మహాదేవుని విద్యుక్తగా ఆరాధించాడు. అటునుండి మూడు శిఖరాలతో వెలిగే అత్రిపుత్రమనే పర్వతాన నెలకొన్న చక్రపాణిని దర్శించి భక్తియుక్తుడై పరమపవిత్రమై గజేంద్ర మోక్షణ స్తవం జపించి ఆ ప్రభువును ప్రార్థించాడు. ఆ దైత్యేశ్వరపుత్రు డాక్షేత్రంలో మూడు నెలలపాటు గడ్డలు పండ్లు జలం సేవిస్తూ గడపి ద్విజోత్తములకు స్వర్ణదానం చేసి అటునుండి ఘోరమైన దండకారణ్యానికి వెళ్ళాడు. అచట మహాశాఖలతో దివ్యమైన వృక్షరూపం ధరించి హింసకమృగాలను దరిజేరనీయక విరాజిల్లే నారాయణుని దర్శించి, ఆ వృక్షమూలాన ఆ భాగవతోత్తముడు నేలమీద పరుండి సారస్వత స్తోత్ర పారాయణం చేస్తూ మూడు రాత్రులు గడిపాడు. అచట నుండి ఆ దానవ విద్వాంసుడు సర్వపాప ప్రమోచన మనే క్షేత్రానికి సర్వపాప హరుడైన శ్రీహరిని దర్శించుటకు వెళ్ళాడు. పూర్వకాలాన వరాహారూపుడైన భగవంతుడు ప్రసాదించిన పాప ప్రణాశకాలైన రెండు స్తోత్రాలను ఆస్వామి ఎదుట జపించాడు. అచట నుండి ఆ ప్రహ్లాదుడు స్థావర జంగమా లన్నింటిలో విష్ణుని సాన్నిహిత్యం కలిగిన మహాక్షేత్రం శాలగ్రామానికి వెళ్ళాడు. అచట ప్రతివస్తువులోనూ సర్వగతుడైన విష్ణుని భావించి మహాప్రీతితో ఆప్రభువు పాదాలను పూజించాడు. ఓ నారదా ! ఈ విధంగా మహాభాగవతుడైన ప్రహ్లాదుడుగావించిన పుణ్యప్రదమైన తీర్థయాత్రా వివరణము నీకు వినిపించాను. దీనిని గానంచేసినా శ్రవణం చేసినా, యితరులకు దానం చేసినా మానవుడు సర్వ పాపాలనుండీ విముక్తుడౌతాడు.
అధ్యాయము 57 Complete
Summary of chapter 61 of the Vāmana Mahā Purana is as follows:
The narrative recounts the history of the water-born demon Jalodbhava, who resided within a vast lake in the valley of Kashmīra and was immune to attack while submerged in water. Jalodbhava emerged periodically to devastate surrounding hermitages and consume sages and pilgrims, leaving the region desolate. Maharshi Kaśyapa performed intense austerities to invoke Bhagavān Vishṇu and Parameśvara Śiva, who cut open the surrounding mountains with a divine plow, drained the lake, and exposed Jalodbhava, allowing Bhagavān Vishṇu to slay the demon with His discus and establish Kashmīra as a holy land of learning and pilgrimage.