అధ్యాయము 63

ఓ బ్రహ్మర్షీ ! నా వ్యక్త రూపాల్లో మొదటిదీ మహోన్నతమైనదీ మత్స్యరూపం. మానస సరోవరంలో ఉన్నది. కీర్తన స్పర్శనాదుల చేతనే అది సర్వ పాపాలనూ నశింప జేస్తుంది పాప నాశకమై కూర్మరూపం కౌశికి నదిలో సన్నిహితమై యున్నది. కృష్ణాంశ తీర్థంలో హయ శీర్షం హస్తినాపురంలో గోవింద రూపాలున్నాయి. త్రివిక్రమ రూపం యమున లో, భవ రూపం లింగభేదంలో, కేదారంలో మాధవ శౌరి రూపాలు, కుబ్జామ్రంలో హృష్టమూర్ధజ హృషీకేశ రూపాలున్నాయి. బదరికా వనంలోని నారాయణుడు, గరుడా సన క్షేత్రంలోని వరాహమూర్తి, భద్రకర్ణంలోని జయేశ్వరుడు, విపాశా నదిలోని బ్రాహ్మణ ప్రియుడు నా రూపాలే. ఇరావతి లోని రూపధరుడు, కురుక్షేత్రం లోని కురుధ్వజుడు, కృతశాచం లోని నృసింహుడు, గోకర్ణం లోని విశ్వకర్మ, ప్రాచీనంలో కామపాలుడు, మహాంభసంలోని పుండరీకుడు, విశాఖయూపంలో అజితుడు హంసపది లోని హంసుడు, వయోష్ణి లోని అఖండుడు , వితస్త లోని కుమారిలుడు, మణిపర్వతాన గల శివుడు, బ్రహ్మణ క్షేత్రం లోని ప్రజాపతి , వీరందరు నా రూపాలే. మధు నది లోని చక్ర ధరుడు, హిమాలయాన శూలపాణి, ఓషధిప్రస్థాన గల విష్ణువు, భృగు తుంగం లోని సువర్ణాక్షుడు, నైమిషం లోని పీతాంబరుడు, గయా క్షేత్రం లోని గదాధర గోపతీశ్వరులు, గోప్రతారల లోని త్రైలోక్య నాధ, వరద, కుశేశయ రూపాలు, దక్షిణాన పవి త్రమైన మహేంద్ర గిరి మీది అర్థ నారీశ్వరుడు, ఉత్తర మహేంద్రంలో గోపాల, సోమపీధి, మూర్తులు సహ్యగిరిపై వెలసిన వైకుంఠుడు, పారియాత్రా చలాన అపరాజితుడు, కవేరు దేశం లోని దేవేశ్వర, విశ్వరూప, తపోధన, రూపాలు మలయ పర్వతాన గల సుగంధి (పరిమళం), వింధ్య పాదాన గల సదాశివ రూపం, నా విభూతులే నని తెలుసుకో భరద్వాజా ! అవంతి దేశాన విష్ణువు, నిషధ లోని అమరేశ్వరుడు. పాంచాల భూమి యందలి పాంచాలిక దేవుడు, మహోదయం లోని హయగ్రీవుడు, ప్రయాగ లోని యోగ శాయి, మధు వనంలోని స్వయంభూ దేవుడు, పుష్కర కేశవుడు, లోలుడు, నా అంశలే!

పద్మక్షేత్రంలో పద్మ కిరణ రూపంలో సముద్రంలో బడవా ముఖంగా, కుమార ధారలో బాహ్లీశ కార్తికేయ, బర్హిణులుగా , అజేశంలో శంభు, అనఘ రూపాల్లో, కురు జాంగలంలో స్థాణువుగా, కిష్కింధవాసుల చే వనమాలియని పిలువ బడుతూ ఉన్నవి, నా అంశలే. నర్మదలో నన్ను వీరుడనీ, కువలయా రూఢుడనీ, శంఖచక్ర గదా ధరు డనీ, శ్రీ వత్సాంకుడనీ, ఉదారాంగుడు శ్రీయఃపతి అనీ, పిలుస్తారు. మాహిష్మతి లో త్రినయను డనీ, హుతాశను డనీ, అర్బుద క్షేత్రాన త్రిసౌపర్ణు డనీ, సూకరాచలంలో క్ష్మాధరుడనీ నాకు పేర్లు. ఓ బ్రహ్మర్షీ ! ప్రభాస క్షేత్రాన త్రిణాచికేత, కపర్ది, సోమశేఖర, రూపాల్లో నేనుంటాను. ఉదయ తీర్ధాన శశి, సూర్య, ధ్రువులు గా హేమ కూటంలో హిరణ్యాక్షుడుగా, శరవణంలో స్కందుడుగా ఉన్నాను. మహాలయంలో రుద్రుడుగా, ఉత్తరు కురు దేశాన సర్వ సౌఖ్య దాయకుడగు పద్మనాభుడుగా నాకు ప్రసిద్ధి! సప్త గోదావరి క్షేత్రాన హాటకేశ్వరుడుగా, మహా హంసగా, వటేశ్వరుడుగా, ప్రయాగలో నాకు పేర్లు. శోణలో రుక్మ కవచుడను, కుండినంలో ఘ్రాణ తర్పణుడను, ఖిల్లీ వనంలోని మహాయోగిని, మద్ర దేశంలోని పురుషోత్తముడను నేనే. ప్లక్షావతరణంలో విశ్వుడుగా, శ్రీనివాసుడుగా, శూర్పారకాన చతుర్భుజుడుగా, మగధలో సుధాపతిగా నన్ను పేర్కొంటారు. గిరివ్రజంలో పశుపతిగా, యమునా తీరాన శ్రీకంఠుడుగా, దండకారణ్య వాసులచే వనస్పతిగా తెలియ బడుచున్నాను. కాలింజరంలో నీల కంఠుడను. సరయూ తీర్థాన శంభుడను. మహాకోశిలో హంస యుక్తుడను. దక్షిణ గోకర్ణంలో శర్వుడను. ప్రజా ముఖ తీర్థంలో వాసుదేవుడను. వింధ్య శిఖరాన మహాశౌరిని. కంధలో మధుసూదనుడను గా ఉన్నాను. ఓ బ్రాహ్మణా! త్రికూట శిఖరాన చక్రపాణి ఈశ్వరులుగా, లౌహ దండంలో హృషికేశుడుగా, కోసలలో మనోహరుడుగా సురాష్ట్రంలో మహా భుజుడుగా, నవరాష్ట్రంలో యశోధరుడుగా, దేవికా నదిలో భూధరుడుగా, మహోదలో కుశ ప్రియుడుగా నన్ను పేర్కొంటారు. గోమతిలో ఛాదిత గదుడుగా, శంఖోద్ధారంలో శంఖిగా, సైంధవారణ్యంలో సునేత్రుడుగా, శూరపురంలో శూరుడు గా నే నే ఉన్నాను. హిరణ్యధతిలో నేను రుద్రుడను. త్రి విష్టపంలో వీరభద్రుడను. భీమా తారాన శంకు కర్ణుడను. శాలవనంలో భీముడను.

అక్కడనే నా విశ్వామి త్ర రూపం. ఉన్నది కైలాసాన వృషభ ధ్వజుడను, మహాళాగిరి మీద మహేశుడను, కామ రూపాన శశి ప్రభుడను, వలభిలో గోమి త్రుడను, కటాహ క్షేత్రాన పంకజ ప్రియుడను, సింహళ ద్వీపంలో ఉపేంద్రుడను, శక్ర తీర్థాన కుంద మాలా ధరుడను, రసాతలంలో సహస్రశీర్షు ( ఆదిశేషువు) డు గా విఖ్యాతుడను అక్కడనే కాలాగ్ని రుద్ర కృత్తి వాసుల రూపాన గూడ ఉన్నాను. సుతలాన కూర్మ, అచల, రూపాలలో, వితలాన పంకజాసనుడుగా ఉన్నది నా అంశలే. ఓ గురూ! మహా తలాన ఛాగలేశ, దేవేశులుగా తల లోకాన సహస్ర చరణుడుగా, సహస్రభుజుడుగా, ఈశ్వరుడుగా, సహస్రాక్షుడుగా, ముసలాకృష్ణ దానవుడుగా పిలువ బడుతున్నాను . పాతాళంలో యోగీశ, హరి, శంకర, రూపాల్లోను, ధరా తలాన కోక నదుడు గాను, మేదిని యందు చక్రపాణి గాను ప్రసిద్దుడనైనాను. భువర్లోకాన నేను గరుడుడను. స్వర్లోకాన అవ్యయుడ నగు విష్ణువును. మహా ర్లోకంలో అగస్త్యుడను. జనో లోకాన కపిలదేవుడను. తపో లోకంలో అఖిల వాజ్మయ సత్య సంయుతరూపాలు. ఏడవది యగు లోకాన బ్రహ్మ రూపాన నేను ప్రతిష్ఠ నందు చున్నాను. శైవ వాతావరణంలో సనాతనుడను. వైష్ణవ సముదాయాన పరబ్రహ్మను. నిరాలంబస్థితిలో అప్రతర్క్యుడను. నిరాకాశం లో తపోమయుడను. జంబూ ద్వీపంలో చతుర్భుజుడను. కుశ ద్వీపంలో కుశేశయుడను. ఓ ముని శ్రేష్ఠా! ప్లక్ష ద్వీపంలో గరుడ వాహనుడు గా ఖ్యాతి వహించాను. నన్ను క్రౌంచ ద్వీపంలో పద్మనాభుడనీ, శాల్మలంలో వృషభ ద్వజుడనీ, శాక దీపాన సహస్రాంశుడనీ, పుష్కర ద్వీపాన ధర్మరాట్ అనీ పిలుస్తారు. అలాగే ఓ బ్రహ్మర్షీ! ఈ పృథ్వి మీద శాల గ్రామాలలో నా ఉనికి. జల స్థలాలలో గల స్థావర జంగమ జీవు లన్నింటిలో నేను నివసిస్తాను. సనాతనాలు, పురాతనాలు, పవిత్రాలు నైన యివన్నియు నే నుండు స్థానాలు. ఇవి ధర్మప్రదాలు. తేజో మయాలు. పాప నాశకాలు. సదా కీర్తింప దగినవి. ఈ దేవతల దర్మన స్పర్శన కీర్తన స్మరణాదు లా చరించిన చో దేవ మానవ సాధ్యులు నాలుగు విధాల పురుషార్థాలూ సాధిస్తారు. ఇది నిశ్చయము. బ్రాహ్మణా ! లెమ్మునా తపోమయా లయిన విభూతి స్థానాలు తెలుసుకున్నావు. ఇక మనమా దేవతలకు కల్యాణం చేకూర్చుటకు అసురేశ్వరుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్దాము పద.

ఇలా భగవానుడు వామనుడు చెప్పి ఆ భరద్వాజ ఋషి తో ఆ పర్వతా న్నుంచి లీలా విలాసాలు వెలార్చుతూ కురు జాంగలానికి వెళ్లాడు.

అధ్యాయము 63 Complete