వామన మహా పురాణము
అధ్యాయము 10
ఆ విధంగా పిరికివాండ్లను హడలెత్తించే సంగ్రామం జరుగుతుండగా, ఇంద్రుడు తన పెనుచాపాన్నెక్కు పెట్టి బాణాలు వదలసాగాడు. అంధకుడు సైతం, దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన వింటిని వంచి, మహావేగంతో నెమిలి ఈకలతో నలంకరించిన తీవ్ర శరాలను దేవేంద్రుని మీద కురిపించాడు. వారొకరినొకరు, బంగారు వికారము గల పదునైన బాణాలతో కారు వేగంతో ప్రహరింప సాగారు. అంతట దేవేంద్రుడు కంపితుడై తన వజ్రాయుధాన్ని గిర గిర త్రిప్పి అంధకుని పై వేయగా నంధకుడది చూచి తీవ్రమైన శస్త్రాస్త్రాలు ప్రయోగించగా వానినాతడెండు చెట్లను అగ్ని కాల్చి వేయునట్లు బూడిద గావించెను. తనపై విరుచుకుపడనున్న యింద్రుని వజ్రాన్ని చూచి దైత్యపతి తన రథం వదలి క్రిందకు దుమికెను. అంతట నా వజ్రము రథాన్ని సారథిని గుర్రాలను ధ్వజకూబరాలను దగ్ధం కావించి యంధకుని సమీపించెను మహాబలశాలి యగు నంధకుడు తన కఠోర ముష్టిఘాతంతో, వేగంగా వస్తూన్న వజ్రాన్ని భూమ్మీద పడగొట్టి, భీషణంగా గర్జించాడు: గర్జారావం చేస్తూన్న శత్రునిపై యింద్రుడు బాణాలు గుప్పింపగానాతడు వాటిని వారించి యింద్రునిపై లంఘించెను. అతని మదపుటేనుగు కుంభస్థలాన్ని అరచేతితోను తొండమును కాళ్ళతోను మర్దించి మోకాళ్ళతో దాని దంతాన్ని ముక్కలు గావించెను. ఎడమ చేతి పిడికిలితో ఏనుగు పార్శ్వాలను నుగ్గు నుగ్గు గావించి నేలపై పడగొట్టేను. నేలమీద కొరిగిపోవుచున్న ఐరావతం మీదినుంచి క్రిందకు దుమికి యింద్రుడు త్వరత్వరగా తన వజ్రాయుధాన్ని తీసికొని అమరావతికి పారిపోయెను. నాయకుడు పారిపోగా మిగిలిన దేవతలనందరను ఆదైత్యనాథుడు పదాఘాతాలతో ముష్టిఘాతాలతో మర్దించివైచెను. బ్రాహ్మణోత్తమా! అంతట తన దండాన్ని ఝళిపిస్తూ యముడు ప్రహ్లాదుని చంపుటకై అతనిని వెంబడించెను. అంతనా హిరణ్యకశ్యపసుతుడు త్వరగా విల్లెక్కుపెట్టి బాణ వృష్టితో ముంచెత్తెను. అంతట నా సూర్యతనయుడా బాణ సమూహాన్ని చెదరగొట్టి లోక భయంకరమైన తన దండాన్ని ప్రహ్లాదుని పైకి విసరివైచెను. యమునిచే వదలబడిన ఆ దండం ముల్లోకాలను దహించి వేసే కాలాగ్ని లాగా మండుతూ రావాడం చూచి రాక్షసభటులు “అయ్యో! ప్రహ్లాదుడు యముని చేతిలో హతుడయినాడని ఆక్రోశించారు. వారి ఆర్తనాదం విన్న అంధకుడు వెంటనే “ నేనుండగా భయమెందుకు? ఎవడా సురాధము”డంటూ నొక్క యుదుటన దుమికి ఎడమ చేతితో నా దండాన్ని పట్టుకొని అట్టహాసం గావించెను. తమ నాయకుడా విధంగా ప్రహ్లాదుని రక్షించుట చూచిన దైత్య దానవ యోధులు ఆనందోత్సాహాలతో వారినభినందించిరి. తన కాల దండాన్ని ఆ విధంగా అంధకుడు గిర గిర త్రిప్పడం చూచి భరించలేక రవిపుత్రుడు యముడు అంతర్హితుడై పోయాడు. ధర్మరాజు పలాయనంకావడంతో ప్రహ్లాదుడు దేవసైన్యాన్ని చెల్లాచెదురు కావించెను. అంతట వరుణుడుకుపితుడై, తన శిశుమారాన్నెక్కి రాక్షసులను తన పాశాలతో బంధించి గదతో మొదసాగెను. అంతట వరుణునిపై విరోచనుడు లంఘించి వజ్రోపమాలైనతోమరశక్తి ముద్గర కణపాది ఆయుధాలతో, నాతని ప్రహరించెను. దానితో రెచ్చిపోయి వరుణుడు తన గదతో విరోచనుని నేలబడగొట్టి మదపుటేనుగను వలె తన బలమైన పాశాలతో కట్టివైచెను. నారదా! అంతట క్షణ మాత్రాన విరోచానుడా వరుణపాశాలను త్రెంచి వైచికొని వరుణుని పై దూకి అతని నడుము నొడిసిపట్టెను. అపుడాతని ఏనుగు వరుణుని తన దంతాలతో క్రిందకుబడద్రోసి వాహనంతో కూడా ఆజలాధిపతిని తన కాళ్ళతో మర్దించివైచినది. వరుణుని దుర్గతి చూచినంతనే చంద్రుడు పరుగు పరుగున వచ్చి దానిని పదునైన బాణాలతో ప్రహరించెను. చంద్రుని వాడి బాణాల బాధకు ఓర్వలేక ఘీంకరిస్తూ ఆ గజం వరుణుని మరింతగా తనపాదాల క్రింద మర్దించసాగింది.
మహర్షే! అంతట వరుణుడు తన బలమంతా కూడగట్టుకొని తనను మర్దిస్తున్న ఏనుగు కాళ్ళను గట్టిగా పట్టుకొని తలతో బలంగా నెట్టెను. వెంటనే అతివేగంతో దాని తోకను తన వ్రేళ్ళతో పట్టికొని నాగాపాశాలతో పైనున్న విరోచనుని బంధించి, బలం కొలదీ ఆకాశానికి విసరివైచెను. అలా పైకెగర గొట్టబడి విరోచనుడు, సూర్యునిచే భూమి మీదకు సాట్ట గోపుర ప్రాకారహర్మ్యాదులతో త్రోసివేయబడిన సుకేశి నగరం వలె తన గజంతో గూడ నేలమీద పడిపోయెను. అతనిని చంపివేయుటకు తన గదను పాశాలకు తీసుకొని మీదబడుతూన్న వరుణుని చూచి దైత్యభటులు “అయ్యో! వరుణుని చేతిలో విరోచనుడు హతుడౌతున్నాడు గదా! ఓ ప్రహ్లాదా! జంభకుజంభులారా! ఎవరైనా అడ్డుపడండి. అంధకా! ఈ జలాధిపతి వాహనంతో కూడా విరోచనుని పాశబద్ధుని చేసి గదతో మర్దించి అశ్వమేధంలో ఇంద్రుడు పశువును వలె చంపుచున్నాడు. రండు! రక్షించు”డంటూ హాహాకారాలు చేశారు. ఆ అరుపులు విని జంభాదులైన రాక్షస నాయకులు అగ్ని శిఖలపై దూకి శలభాల వలె జలేశ్వరునిపైకి లంఘించారు. వారి రాక గమనించి వరుణుడు, విరోచనుని వదలి పెట్టి తన పాశాన్ని పెంచి గదాదండం త్రిప్పుతూ నా శత్రువులపై విరుచుకపడెను. జంభుణ్ణి పాశంతో సంహరించాడు. అరచేతితో తారుడి తల పగలగొట్టాడు. పాదాలతో వృత్ర కుజంభులను తన్ని, పిడికిటిపోటుతో బలుణ్ణి యమపురికి పంపాడు. అలా ఆ దేవశ్రేష్టుని చేత చావుదెబ్బలు తిని రాక్షసులు ఆయుధాలు వదలి తలకొక దారిగా పారిపోయారు. అది తెలిసిన అంధకుడు జలాదిపతితో సమరానికి త్వరత్వరగా పరుగులతో వచ్చిపడ్డాడు. తనమీద లంఘించిన ఆ దైత్యనాథుణ్ణి వరుణుడు పాశాలతో బంధించి గదతో ప్రహరించబోగా నాతడాకట్లు త్రెంచుకొని తన గదాదండం వరుణుని మీద ప్రయోగించాడు. తన గదాపాశాలు లాక్కొని తననే చంపవచ్చుచున్న అందకుని ధాటికి తట్టుకోలేక వరుణుడు సముద్రంలో మునిగి దాక్కున్నాడు. మిగిలిన దేవ సైన్యాన్ని అంధకుడు మర్దించసాగాడు. అదిచూచి పవనుడు తోడు కాగా అగ్ని విజృంభించి దైత్యసేనలను దహించసాగగా, వాండ్లపైకి విశ్వకర్మ మయ దానవుడు శంబరునితో కూడి దాడి చేశాడు. వారిర్వురను చూచి అగ్నివాయువుతో కలసి శక్తితో శూలంతో వారల కంఠాలను ప్రహరించి, యిద్దరిని గట్టిగాపట్టుకున్నారు. శక్తిఘాతానికి వాళ్ళదేహాలు చీలి పోయాయి. అగ్ని పట్టుకు యిద్దరి దేహాలు జ్వాలల్లో మాడిపోయాయి. అలా తగలబడుతూ వాళ్ళిద్దరూ సింహంచేత చిక్కిన మదపుటేనుగుల వలె ఆర్తనాదాలు చేశారు. ఆ శబ్దం విని దైత్యేశ్వరుడు కోపంతో మండిపడుతూ “ఏమిది? మయశంబరులను జయించిన వాడెవ్వడు? వాడెక్కడ?” అని అరిచాడు. అప్పుడు రాక్షసభటులు “ప్రభూ! అగ్ని వాయువులు వీరిని దహిస్తున్నారు. రక్షించండి! ఈ అగ్ని నివారించడం ఎవ్వరితరం గాదు” అని మోర పెట్టారు. మహర్షీ ! ఆ మాట వింటూనే హిరణ్యాక్ష పుత్రుడు మహావేగంతో ఇనుపగుదియ పట్టుకొని “అగ్నీ! నిలు నిలువు” మంటూ వెంబడించాడు.
అంధకుని కేక వినగానే అగ్ని అతనిని లాగిపట్టి నేలపై బడగొట్టెను. దానితో మండిపడి ఉత్తమాలయిన శస్త్రాలతో అందకుడాహుతాశనుణ్ణి ప్రహరించాడు. నెత్తిపై బలమైన దెబ్బతగలడంతో అగ్నిశంబరుణ్ణి వదలిపెట్టి అంధకుడి మీద దూకాడు అగ్ని తనను పరిఘతో ప్రహరించరాగా, అంధకుడు మరల గట్టిగా నతనిని కొట్టెను. దాంతో అగ్నియుద్ధభూమి వదలి భయంతో పారిపోయెను. మహర్షే! అంతటబోక, అంధకుడు చంద్ర సూర్య వాయువులను, రుద్రాశ్వి వసువులతోబాటు సాద్యనాగులను, ఆయుధాలు పట్టి నిలబడిన ప్రతివారిని, బాణాలతో ప్రహరించి యుద్ధభూమి వదలి పారిపోవునట్లు చేశాడు. ఆ విధంగా ఇంద్ర రుద్ర యమ సోమాదులతో కూడిన దేవతలను దేవ సైన్యాన్ని జయించి దైత్యదానవుల పూజలందుకొని అంధకుడు భూలోకానికి తిరిగి చేరుకున్నాడు. భూలోకంలోని రాజులందరను లోబరచుకొని వారి నుండి పన్నులు వసూలు చేస్తూ చరాచర జగత్తునంతను తన వశం గావించుకొని ఆ దీమంతుడైన అంధకుడు పాతాళానికిపోయి అశ్మకమనే నగరాన్ని చేరుకున్నాడు. ఆ మహాదానవుడక్కడ ఉండగా, గంధర్వ విద్యాధర అప్సరాదులు పాతాళానికి వెళ్లి అతనికి పరిచర్యలు చేయసాగారు.
అధ్యాయము 10 complete
Summary of chapter 10 of the Vāmana Mahā Purana is as follows:
The formidable demon king Andhaka, emboldened by severe penances performed in honor of Pitāmaha Brahmā, achieves immense strength and invincibility against celestial weapons. Marching across the three worlds, Andhaka defeats Indra and the lokapālas, conquering Heaven, Earth, and the lower realms to establish an empire of dark dominance. The devas are forced to live in disguise on Earth, while Andhaka's arrogance reaches its zenith, setting the stage for his eventual downfall when his unbridled desire leads him to challenge the supreme authority of Mahādeva Śiva.