వామన మహా పురాణము
అధ్యాయము 31
ఓ మహాద్యుతీ! మహిషంతోగూడ క్రౌంచగిరిని స్కందుడు ఎలా చీల్చాడో విపులంగా నా కెరిగించండి.
యిది చాలా పురాతనకాలపు కథ. పవిత్రమైనది. కార్తికేయుని యశోభివృద్ధిని వివరించే విషయం చెపుతున్నాను వినుము. ఆ విధంగా శివుని వీర్యాన్ని మ్రింగిన అగ్నిదేవుడా తేజస్సును భరించలేక తన తేజస్సును కోల్పోయాడు. అంత నాతడు దేవతలతో చెప్పుకోగా వారంతాకలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. మార్గమధ్యంలో అగ్ని కుటిలాదేవిని చూచి ఆమెతో అమ్మా! ఈ శివతేజాన్ని భరింపలేకున్నాను. ఇది ముల్లోకాలను దహిస్తోంది. అంచేత దీనిని నీవు ధరిస్తే నీకు చక్కని పుత్రుడు కలిగి ధన్యతచెందుతావని చెప్పాడు. అంతట కుటిలతన వెనుకటి ఉదంతాన్ని జ్ఞప్తికితెచ్చుకొని నదీరూపంధరించి ఆ శివవీర్యాన్ని తన నీళ్ళలోకి వదలమని అగ్నితో చెప్పింది. ఆ కుటిలాదేవి శివవీర్యాన్ని ధరించి పోషించింది. అగ్ని కూడ తన బాధ వదిలించుకొని స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. అగ్ని అయిదువేలేండ్లు ఆ అద్భుత తేజాన్ని ధరించినందువల్ల దాని ప్రభావాన అతని రక్తమాంసాస్థిమేదోంత్ర రేతస్సులు చర్మంతోసహా అన్నీ బంగారుమయమయ్యాయి. ఆ కారణాన హుతాశనుడీనాటికీ 'హిరణ్యరేత' అని కొనియాడబడుతున్నాడు. కుటిల కూడ ఆ దివ్యవీర్యాన్ని అయిదువేలేండ్లు గర్భంలో ధరించి ఆ వేడిని భరింపలేక బ్రహ్మవద్దకువెళ్ళింది. ఆ మహానది అలా శివవీర్యజ్వాలల్లో దగ్ధంకావడం చూచి బ్రహ్మ, ఆ శుక్రం నీ గర్భంలో ఎవరు ఉంచారవి ప్రశ్నించాడు. అందులకామె ఓ మహానుభావా! శివశుక్రాన్ని తాగిన అగ్ని దానిని భరించలేక నాలో ఉంచితే ప్రస్తుతం నేనది భరిస్తున్నానని చెప్పింది. అయిదువేలేండ్ల నుంచి నేను ధరిస్తున్నా యింకా అది పక్వదశకువచ్చి బయటపడలేదని తనగోడు చెప్పుకుంది. అంతట నా బ్రహ్మ ఆమెతోనిట్లా అన్నాడు. "నీవు వెంటనే ఉదయాద్రికి వెళ్ళిపో. అక్కడ నూరుయోజనాల భయంకరమైన రెల్లువనం ఉంది. ఓ సుందరీ! ఈ తేజాన్ని దానిలో వదలివేయుము. పదివేల ఏండ్లతర్వాత బాలకుడుద్భవిస్తాడు".
ఆ రెల్లుదుబ్బులు విస్తరించిన పర్వత సానువులలో వీర్యాన్ని వదలుము. పదివేలేండ్ల తర్వాత బాలకుడు జన్మిస్తాడు". అలా బ్రహ్మ చెప్పిన మాటలు విని ఆ సుందరి ఉదయగిరికి వెళ్ళి గర్భపిండాన్ని అక్కడ పమనంగావించి మరల బ్రహ్మవద్దకు వెళ్ళి మంత్రశక్తివల్ల నదిగా మారిపోయింది. ఆ తేజస్సు వల్ల ఆ రెల్లువనం అక్కడి చెట్లుచేమలు మృగపక్షులూ అన్నీ బంగారు కాంతితో వెలిగిపోయాయి. అంతట పదివేలేండ్లు గడచిన వెనుక ఉదయభానుని కాంతితో కమలరేకుల్లాంటి నేత్రాలతో చక్కని బాలుడు ఉద్భవించి. ఆ రెల్లువనంలో వెల్లకిలాపండుకొని బొటనవ్రేలు నోటిలోపెట్టుకొని మేఘ గంభీరస్వనంతో ఏడవసాగాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న ఆరుగురు కృత్తికా సుందరీమణులు రెల్లుపొదలో పరుండిన బాలకుని చూచారు. అంతట జాలిగొని ఆ స్కందుడు (శిశువు)న్నచోట వెళ్లి నేనుముందంటే నేను ముందంటూ ఆ బిడ్డకు స్తన్యం యిచ్చేందుకు పొటీపడ్డారు. వారల తగవుచూచి ఆ బాలుడు ఆరు ముఖాలవాడయ్యాడు. అంతట ఆ ఆరుగురు కృత్తికలు వాత్సల్యంలో ఆ బిడ్డకు ఒకేసారి పాలుత్రాగించారు. అలా కృత్తికల స్తస్యపానంచేసి ఆ బాలకుడు దినదినప్రవర్ధమానుడయ్యాడు. బలవంతులలో శ్రేష్ఠుడయిన ఆ శిశువు కార్తికేయుడుగా ప్రసిద్ధివహించాడు. ఈ లోపల బహ్మ అగ్నిదేవుని, నీ కుమారుడు గుహుడు ఎంతవాడయ్యాడని అడిగాడు. శివవీర్యం బాలక రూపం ధరించడం తెలియక పావకుడు నా పుత్రుడెవడో గుహుడెవడో నాకు తెలియదన్నాడు. "అది కాదోయీ! నీవు పూర్వం మ్రింగి కుటిలానదీజలాల్లో వదలిన శివవీర్యం శరవణవనంలో బాలకుడుగా జన్మించాడ"ని వివరంగా చెప్పాడు విరించి. అది వింటూనే మహావేగంగా పరుగెత్తే మేక మీద కూర్చొని అగ్నిశరవణవనానికి వెళ్ళడంచూచిన కుటిల, "ఓ అగ్నీ! యింత హడావిడిగా ఎక్కడకు వెళుతున్నావని అడిగింది. "అక్కడ శరవణవనంలో జన్మించిన నా పుత్రుడికోసం వెళ్తున్నా"నని అగ్ని చెప్పగా నామె ఆ బిడ్డడు నా కుమారుడని నిలదీసింది. అలా అగ్నీ కుటిలాదేవీ నాబిడ్డడంటే నా బిడ్డడని కీచులాడుకొనుచుండగా నచటకు నారాయణుడు వచ్చి మీ వివాదానికి కారణమేమని అడిగాడు. శివశుక్రంవల్ల కలిగిన బాలకుడికోసం మా తగవు అని వారలు చెప్పగా నా విష్ణువు, ఈ విషయం తేల్చవలసినది ఆ త్రిపురాంతకుడే. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేయుడ"ని సలహాయిచ్చాడు.
వాసుదేవుడు చెప్పినట్లుగా కుటిలా అగ్నీ శివునివద్దకు వెళ్ళి ఆయనను ఆ బిడ్డ ఎవరి కుమారుడో నిజం చెప్పమని అర్థించారు. వారల మాటలు విని శంకరు డానందంపట్టలేక "ఆహా! ఆహా! ఎంతమంచిమాట!" అని పార్వతితో అన్నాడు. అది విని పార్వతి భర్తతో, "నాధా! మన మా బాలకుని వద్దకు వెళ్దాము. అతడు మనలో నెవరివద్దకువస్తాడో ఆ వ్యక్తికే తనయుడు కాగల"డని అన్నది. మంచిదంటూ శివుడులేచి, ఉమ కుటిల అగ్ని వెంటరాగా శరవణవనానికి వెళ్ళాడు. అక్కడ వారు నలుగురూ, ఆ బిడ్డను కృత్తికల ఒడిలో చూచారు. యోగి అయిన నా బాలకుడు పరిస్థితిని బాగా ఆలోచించి నాలుగు రూపాలు ధరించాడు. వారిలో కుమారుడు శంకరుని సమీపిస్తే విశాఖుడు గౌరి ఒడిలోకి వెళ్ళాడు. శాఖుడు కుటిల నాశ్రయించగా మహాసేను డగ్నిచేతుల్లోకి వెళ్లాడు. అదిచూచి హరుడు ఉమ కుటిల అగ్ని నలుగురు ఎంతో సంతోషించారు. అప్పుడా కృత్తికలు ఈ షణ్ముఖ బాలకుడు శివుని కుమారుడా? అని అడిగారు. అంతట హరుడు అందరకూ సంతోషం కలుగునట్లుగా ఒక నిర్ణయం వినిపించాడు. " ఈ బాలకుడు కార్తికేయుడుగా మీ కుమారుడు. కుమారుడుగా కుటిలకు పుత్రుడు. ఈ అవ్యయుడు స్కందుడుగా ఉమాతనయుడుగా ప్రఖ్యాతుడౌతాడు. ఇక గుహుడను పేరుతో నాకు ఔరసుడు. మహాసేనుడుగా ఈ మహాయోగి హుతాశనుని పుత్రుడు. ఈ శరవణవనంలో పుట్టినందున శారద్వతుడుగా ప్రసిద్ధుడౌతాడు. ఆరు తలలు కలిగినందుకు ఈ మహావీరుడు షణ్ముఖుడుగా కీర్తింపబడతాడు". ఈ విధంగా అందరనూ తృప్తిపరచి ఆ శూలపాణి బ్రహ్మాదిదేవతలందరనూ స్మరించాడు. తత్‌క్షణం వారందరూ వచ్చి శివపార్వతులకు వందనాలు చేసి అగ్ని, కుటిల, కృత్తికలను ప్రీతితో సంభావించి, తన శరీరకాంతితో దేవతల కండ్లకు మిరుమిట్లుగొలపుచూ సూర్యుని వలె ఉగ్రమైన తేజస్సుతో వెలిగిపోతున్న నా షడాననుణ్ణి చూచి మహదానందభరితులై "హరా! దేవా మీరూ శ్రీఅంబికా, అగ్నిదేవుడు ఈ విధంగా దేవకార్యాన్ని సంపన్నం గావించారు. "వెంటనే లేవండి మనమందర మీక్షణమే మహాశక్తివంతమూ అవ్యయమూ అయిన కురుక్షేత్ర తీర్థానికి వెళ్ళి ఈ అద్భుత బాలకుణ్ణి పవిత్ర సరస్వతీ జలాలతో అభిషిక్తుని గావించుదాము" అన్నారు.
దేవగంధర్వకిన్నర సేనల కితడు నాయకుడౌతాడు. భయంకరులైన మహిషాసుర తారకాసురులను వధించగలడు". అది విని హరుడు మంచిదంటూ లేచాడు. దేవతలు కూడ ఆయన వెంట కుమారునితో కలసి మహాఫలదాయియగు కురుక్షేత్రానికి చేరుకున్నారు, హరిహరబ్రహ్మలు యింద్రాదిదేవతలు మునులూ అంతా కలిసి అభిషేక ప్రయత్నాలు చేశారు. అంతట అచ్యుతాలు మహాఫలదాయకాలయిన నదీజలాలు సప్తసముద్రోదకాలు, శ్రేష్ఠమైన ఓషధులు వేయింటిని కలిపి, ఆ గుహునకు మంగళాభిషేకస్నానం చేయించారు. సమస్తదేవసేనల నాయకుడుగా కుమారు నభిషేకించు సమయాన గంధర్వులు గానంచేశారు. అప్సరసలు నాట్యాలు గావించారు. అలా అభిషేకించబడిన ముద్దుబిడ్డను చూచి మప్పిరిగొన్న వాత్సల్యంకో ఒడిలోకి తీసుకొని ఉమ ముద్దులతో ముంచెత్తింది. కార్తికేయుని అభిషేకంతో తడిగా ఉన్న ముఖాన్ని మాటిమాటికీ గుండెలకు హత్తుకొని ముద్దాడింది. ఆ సమయాన ఆ గిరినందిని, ఇంద్రుని ఒడిలో నుంచుకొని తేజరిల్లిన దేవమాత అదితిని మరపించింది. అలా అభిషేకించబడిన తనయుని చూచి శివుడు ఆనందభరితుడైనాడు. అగ్నికృత్తికలు కుటిల కూడ ఎంతో ఆనందించారు. దేవసేనాపతిగా పట్టాభిషిక్తుడైన గుహునకు హరుడు, ఇంద్రతుల్య పరాక్రమవంతులైన ఘంటాకర్ణ లోహితాక్షనందిసేనకుముదమాలీలను నలుగురు ప్రసిద్ధులైన ప్రమథులను కాన్కగాయిచ్చాడు. నారదా! అలా శివుడు తన గణముఖ్యులను స్కందునకు యివ్వడం చూచి బ్రహ్మాదిదేవతలందరూ తమతమ ప్రమథులను సమర్పించారు. బహ్మ స్థాణుగణాన్ని యిస్తే విష్ణువు సంక్రమ, విక్రమ, పరాక్రములనే ముగ్గుర్ని యిచ్చాడు. ఇంద్రుడు ఉత్కేశ,పంకజులను, రవిరండక, పింగళులను సమర్పించారు. చంద్రుడు మణి, వసుమణులనూ, అశ్వనీదేవతలు వత్సుయనంది అను వారిని యిచ్చారు. అగ్ని జ్యోతి, జ్వల జ్జిహ్వులనూ, ధాత కంద, ముకుంద, కుసుములనే ముగ్గురు అనుచరులను యిచ్చారు. త్వష్ట చక్రామ చక్రుల నిద్దరను, వేధ అతిస్థిర, సుస్థిరులను యిచ్చారు. పూషుడు పాణిపత్యజకాలకులనే యిద్దరు బలశాలురను యిస్తే, హిమవంతుడు స్వర్ణమాలుడు ఘనాహ్వుడనే ఉత్తమ ప్రమథులనిచ్చాడు. వింధ్యుడు తన ఔన్నత్యానికి తగినట్టుగా అతిశృంగుడు పార్షదుల నిచ్చాడు. వరుణుడు సువర్చస అతివర్చసులను, సముద్రుడు సంగ్రహ విగ్రహులను, నాగులు జయమహాజయులను వారిని, అంబిక ఉన్మాదుడు, శంకుకర్ణ, పుష్పదంతులను, వాయుదేవుడు ఘస, అతిఘసులను, అంశుమంతుడు పరిఘ, గటక, భీమ, దహాతిదహనులకు ఆ షణ్ముఖునకిచ్చారు. యముడు ప్రమాథ, ఉన్మాథ, కాలసేన, మహాముఖ, తాళపత్ర, నాడీజంఘులను అనుచరులను ఆరుగురను, ధాత సుప్రభ సుకర్మలను గణద్వయాన్నీ ఆ మహాసేనునకర్పించారు.
ఓ బాహ్మణోత్తమా! ఆ స్కందునకు మిత్రుడు సువ్రతసత్యసంధులను యక్షులు అనంత, శంకుపీఠ నికుంభ కుముద అంబుజ, ఏకాక్ష కునటి చక్షు, కిరీటి, కలశోదర, సూచీవక్త్ర కోకనద ప్రహాసప్రియక, అచ్యుతులనే మదిహేను గురుగణాలను అర్పించారు. కాళిందీనది కాలకందునీ, నర్మద రణోత్కటుని, గోదావరి సిద్ధయాత్రుని, తమసానది అద్రికంపకుని, సీత సహస్రవాహుని వంజుల స్మితోదరుని, మందాకిని నందునీ, విపాశ ప్రియంకరుని, ఇరావతి చతుర్దంష్ట్రుని వితస్త షోడశాక్షుని, కౌశికి మార్జారుని, గౌతమి క్రథ క్రౌంచులను, బాహుద శతశీర్షుని, వాహానది గోనంద నందికులను, భీమరథి భీముని, సరయువేగారిని, కాశీ అష్టబాహుని, గండకి సుబాహుని, మహానది కువలయుని, మధూదక మధువర్ణుని, ధూతపాప జంబూకుని, వేణా శ్వేతాననుడిని, పర్ణాస శ్రుతవర్ణుని, రేవసాగరవేగిని, ప్రభావనది అర్థుని, సహుని, కాంచన కనకేక్షకుని విమల గృధ్రపత్రుని, మనోహర చారువక్త్రుని, ధూత పాపమహారావుని, కర్ణానది ద్రుమ సన్నిభుని, సువేణు సుప్రసాదుని, ఓఘవతి జిష్ణుడిని, విశాల యజ్ఞబాహువును, ఆ స్కందునకు ఇచ్చాయి. ఈ విధంగా నదులన్నీ కార్తికేయుని కార్యానికి తోడ్పడినాయి. తన ప్రియ పుత్రునికి కుటిల, దేవేంద్రునితో సమాన బలులైన, కరాళ, సితకేశ, కృష్ణకేశ, జటాధర, మేఘనాద, చతుర్ధంష్ట్ర, విద్యుజ్జిహ్వ, దశానన, సోమాప్యాయన, దేవయాజిఅనే పదిమంది గణ ప్రముఖులను యిచ్చింది. ఇక కృత్తికలందరు ఆ షణ్ముఖునకు హంసాస్య కుండజఠర, బహుగ్రీవ, హయానన, కూర్మగ్రీవులనే గణపంచకాన్ని పుత్రవాత్సల్యంతో యిచ్చారు. ఋషులంతా కలిసి స్థాణుజంఘ, కుంభవక్త్ర లోహజంఘమహానన పిండకారులనే అయిదుగురను స్కందునకు ఆశీస్సులతో యిచ్చారు.
ఆ స్కందదేవునకు పృథూదక తీర్థం నాగజిహ్వ, చంద్రభాస, పాణికూర్మ, శశీక్షక, చాషవక్త్ర, జంబూక గణాలను యిచ్చింది. చక్రతీర్థం సుచక్రాక్షుని, గయాశిరతీర్థం మకరాక్షుని, కనఖలతీర్థం పంచశిఖఅనేస్వంతగణాన్ని కుమారున కిచ్చాయి. బంధుదత్తుని వాజిశిరం, బాహుశాలుని పుష్కరం, మానసతీర్థం సరౌజస మాహిషకపింగళులను యిచ్చాయి ఔశనస తీర్ణం వసుదాముని, ప్రభాసం నందినిని, ఇంద్రతీర్థం విశోకుని, ఉదపానం ఘనస్వననూ, సప్త సారస్వత తీర్థం అద్భుతం గొలిపే నలుగురు మాతృకలు గీతప్రియ, మాధవి తీర్థనేమి స్మితాననలను యిచ్చాయి. నాగతీర్థం ఏకచూడను, కురుక్షేత్రం పలాసదను, బ్రహ్మయోని చండశిలను, త్రివిష్టపం భద్రకాళిని, చరణపావనతీర్థం చౌండి, భైండి యోగభైండిలను గణాలను యిచ్చాయి మహీసోపానీయను, మానససరోవరం శాలికను, బదరికాశ్రమం శతానంద, శాతఘంట ఉలూఖలమేఖలలను, పద్మావతి మాధవీ గణాలను యిచ్చాయి. కేదార క్షేత్రం సుషమ, ఏకచూడ, దేవి, ధమధమా, ఉత్క్రాథని వేదమిత్రలనే మాతృగణాల నిచ్చింది. రౌద్రమహాలయం సునక్షత్రాన్ని, కద్రూల, సుప్రభాత, సుమంగళ, దేవమిత్ర చిత్రసేనలను యిస్తే ప్రయాగ కోటర, ఊర్ధ్వవేణి శ్రీమతి బహుపుత్రిక పతిత, కమలాక్షీలనే మాతృగణాన్ని యిచ్చింది. సర్వపాపవిమోచనక్షేత్రం సూపల, మధుకుంభ, ఖ్యాతిదహదహ పరా, ఖటకటా సంతానిక వికవికలను యిచ్చింది. క్రమతీర్థం చత్వరవాసిని, జలేశ్వరి, కుక్కుటిక, సుదామా లోహమేఖలా గణాలను యివ్వగా శ్వేతతీర్థం వపుష్మతి, ఉలూకాక్షి, కోకనామ మహాశనీ రౌద్రాకర్కటిక తుండగణాలను కార్తికేయునకిచ్చింది. ఇందరు భూతాలు గణాలు మాతృకలు ఆ స్కందుని సేవించడం చూచి మహాత్ముడగు వైనతేయుడు పరమ వేగశాలి ఐన తన కుమారుడు మయూరు (నెమలి)ని, అరుణుడు తన పుత్రుడు తామ్రచూడు (కోడి)ని, ఆయనకు సమర్పించారు. అగ్నిదేవుడు శక్తిని, పార్వతి వస్త్రాన్ని, బృహస్పతి దండాన్ని, కుటిల కమండలాన్ని విష్ణువు పుష్పమాలను, శంకరుడు ధ్వజాన్ని, ఇంద్రుడు తనమెడలోని స్వర్ణహారాన్ని విశాఖునకు ఇచ్చారు. భూతగణాలందరు తన్ను పరివేష్ఠించి కొలువగా మాతృగణాలు వెంటరాగా దేవసేనాధిపత్యం వహించిన ఆహరాత్మజుడు మయూరం మీదనెక్కి భాస్కర ప్రభతో వెలిగిపోయాడు.
అధ్యాయము 31 Complete
Summary of chapter 31 of the Vāmana Mahā Purana is as follows:
Following her rebirth as the daughter of Himavān, Mother Umā Parvatī leaves behind royal opulence to undertake excruciating tapas upon the freezing peaks of the Himālayas to win the heart of Parameśvara Śiva. As it happens, She discards all delicate garments, wears bark clothing, and subjects Her tender form to summer fires, torrential monsoon rains, and freezing winter snows while remaining entirely absorbed in meditating upon the lotus feet of Śiva. Moved by Her unshakeable devotion and pure heart, Parameśvara Śiva tests Her resolve by disguising Himself as an old ascetic who criticizes Śiva, but Mother Umā firmly defends the Supreme Yogi and prepares to leave, whereupon Śiva reveals His divine form and accepts Her eternal love.