వామన మహా పురాణము
అధ్యాయము 10
సమస్త పర్వతవనాలతో కూడిన భూమి అలా కంపించుట చూచి తన గురువు శుక్రాచార్యులకు ప్రణమిల్లి బలి యిట్లడిగెను. ఆచార్యదేవా! సముద్ర పర్వతాదులతో సహా ఈ భూమి కదలాడుతున్నది. అసురులిచ్చు హవిస్సులను అగ్నులు నిరాకరిస్తున్నవి. ఈ విపరీతానికి కారణమేమి? బలి అడిగిన ప్రశ్నకు మహామేధావియగు శుక్రాచార్యుడు చాలాసేపు ఆలోచించి ఆ దైత్యపతితో యిలా అన్నాడు. దానవ శ్రేష్టా! జగత్కారణుడగు శ్రీహరి కరిశ్యపునింట నవతరించాడు. వామన రూపుడగునా సనాతన పరమాత్మనీ యజ్ఞవాటికకు రానున్నాడు. ఆయన అడుగుల బరువునకు భూమి కంపిస్తున్నది. కొండలు సముద్రాలు అల్లకల్లోల మవుతున్నాయి. ఆ భూతేశ్వరుని భారం భూమి మోయజాలకున్నది. దేవాసుర గంధర్వ యక్ష పన్నగ మానవాదులతో కూడిన పంచభూతాత్మకమైన విశ్వాన్నంతా ఆయన ధరించి యున్నాడు. అట్టి సర్వాధారుడగు కృష్ణుని అనిర్వచనీయమైన మాయవల్ల దార్యదారక సంబంధం ఏర్పడి జగత్తు పీడింపబడుతోంది. ఆయన సన్నిధాన ప్రభావాన సురద్వేషులయిన రాక్షసులు యజ్ఞార్హతను కోల్పోయినారు. అందుచేతనే అగ్నులు వారలర్పించు హవిస్సులను గ్రహించుటలేదు. తన గురువు చెప్పిన మాటలు విన్నంతనే బలిచక్రవర్తి సంతోషంతో పొంగిపోయాడు. ఆచార్యదేవా! ఆహా! ఏమి నా అదృష్టం, ఎంత ధన్యుడను నేను! సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన ఆ పరమాత్ముడే ణా యజ్ఞవాటికకు రానున్నాడు. నాకన్న అధికుడెవ్వడు? ఏ మహాత్ముని యోగిజనులెంతో శ్రమించి చూడవలెనని ఉబలాటపడతారో అట్టిదేవదేవుడు తనంతట తానే నాయజ్ఞానికి వస్తున్నాడు. ఆహా ఏమి నాబాగ్యము. గురుదేవా! ఈ సంతోష సమయాన నేను ఏం చేయాలో దయతో ఆదేశించండి !
దైత్యరాజా! వేదాలననుసరించి సత్వగుణ సంపన్నులైన యజ్ఞ భాగభోజ్యార్హత ఏర్పడింది. కాని నీవు నీ శక్తి సామర్థ్యంవల్ల దానిని రాక్షసులకు గూడ సంపాదించి పెట్టినావు. సత్వస్వరూపి అయిన ప్రభువు సృష్టిపాలనం చేస్తూనే మరొకవంక తను సృష్టించిన ప్రజలను తానేభక్షిస్తుంటాడు. స్థితిపాలకుడగు నీ విష్ణువు నిన్ను తప్పక బందీగా చేస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని నీకెలా తోచునో అలా చేయుము. ఎట్టి పరిస్థితిలో కూడ ఆయనకు ఏ చిన్నవస్తువుకూడా యిస్తానని మాటయివ్వకుము. అయితే ఆయనతో తియ్యగా, ప్రయోజనశూన్యంగా మాటలు చెప్పి పంపివేయుము. కృతకృత్యుడగు కృష్ణుడు దేవకార్యం చక్కబెట్టుటకు నిన్ను యాచించినచో చాలినంత ధనమిస్తానని మాత్రం చెప్పు.
భగవన్, దేహియని యాచించిన వానికి లేదని ఎలా చెప్పగలను? అట్టిచో, సంసారపాపాలు పోగొట్టే దేవదేవుడే అడిగినచో వేరే చెప్పవలెనా? ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేస్తే గాని లభించని ప్రభువు గోవిందుడే వచ్చియాచించడాన్ని మించిన భాగ్యమేముంటుంది? శమ దమాది సద్గుణ సంపన్నులే యజ్ఞేశ్వరుని కొరకై యజ్ఞ కార్యాలన్నీ చేస్తుంటారో ఆ భగవంతుడు మనలను యాచించుట చూడగా మనమెంతటి సుకృతాలు తపసదాచరణాలు చేసిన వారమో తెలియగలదు. అలాంటి విశ్వేశ్వరునకు లేదని చెప్పడం కన్న ప్రాణత్యాగం మేలు. అట్టి అభ్యాగతుడగు సాక్షాద్విష్ణుదేవుని తిరస్కరించను. ఇంతవరకు యితర యాచకుల నేవ్వరికీ నేను యివ్వనని చెప్పలేదు. అలాంటప్పుడు నేడు అచ్యుతునే ఎట్లు పొమ్మందును? తనకు బాధ కలిగించని దానం ఎంతో ముఖ్యమని పెద్దల వచనం. ఇక నావిషయమా, చూడండి. నా రాజ్యంలో సుఖికాని వాడు కాని, దరిద్రుడు కాని, ఆతురుడు గాని, దుఃఖితుడు గాని మనశ్శాంతి లేని వాడు కాని, శమదమాదులు విడిచినవాడు గాని ఒక్కడూ లేడు. అందరూ సంతుష్టులు, సుఖులు, నీలిపరులు, అందరకన్నా నేను ఎల్లపుడూ సుఖంగా ఉంటున్నాను. ఈ వైశిష్ట్యం దాన బీజం యొక్క ప్రభావమేగదా. యిలాగనే తమరే చెప్పియున్నారు గదా? ముని శ్రేష్టమగు బీజం యొక్క ప్రభావమే గదా? ముని శ్రేష్టాః నాదానం స్వీకరించినందున, దేవతలకు అభ్యుదయం కలుగజేసే పక్షంలో, ఆయజ్ఞారాధితుడగు శ్రీహరినన్ను తప్పక అనుగ్రహిస్తాడు. ముల్లోకాలకు శ్రేష్టమగు బీజం, మూలకారణుడైన సర్వోత్తమపాత్రత గలిగిన ఆ గురుబీజం జనార్దనుని చేతిలో నాదాన బీజం పడటం కన్న మేలు అభ్యుదయం ఏముంటుంది? నాకు లభించనిదంటూ ఏముండగలదు? సర్వ దేవతలను తృప్తి పరచగలనాదానం అతి విలక్షణమైనది కాగలదు. తాను అనుభవించడం కన్న దానమిచ్చుట నూరురెట్లు శ్రేష్ఠమని పెద్దల మాట, యజ్ఞాలచేత నారాదింపబడిన శ్రీహరినన్ను అనుగ్రహించుటకే, తన దుర్లభమైన దర్శన భాగ్యం కలిగించుటకే, నా యింటికి వస్తున్నాడు, గురుదేవా! ఇందులో అణు మాత్రం సరిదేహం లేదు. అలాకాక ఒకవేళ, దేవతల యజ్ఞ భాగాలు ఆపినందుకు నామీద కోపంతో, నన్ను వధించుటకే వచ్చినా అదినాకు యింకా మంగళ ప్రదం అవుతుంది. ఆయన చేత మరణం సామాన్యంగా దొరుకునా ? గురూత్తమా! ఇవన్నీ సాకల్యంగా ఆలోచించి గుర్తించిన మీదట, జగన్నాదుడగు గోవిందుడు యాచించినచో కాదనుట, లేదనుట ఈ రాదనుట ఎంత మాత్రమూ భావ్యము కాదు.
మునులారా! బలియిలా అంటూండగానే సర్వదేవమయుడు, అచింత్యుడునగు జనార్థనుడు కపట వామనరూపంలో అచటకు వచ్చిచేరాడు! అలావచ్చిన ఆతేజోమయుని చూస్తూనే యజ్ఞశాలలోనున్న దైత్యులంతా సంక్షోభంతో తమ తేజస్సు కోలుపోయారు. కాగా జప దీక్షలో ఉన్నమునులు వసిష్ఠ విశ్వామిత్ర గర్గాదిమహర్షులు బలి చక్రవర్తి వీరంతా తమ జన్మలు సార్థకమైనట్లు ఆనందించారు, సంభ్రమాశ్చర్యాల్లో మునిగి వారెవ్వరు మాటాడలేక పోయారు. అందరూ ఆ దేవదేవుని తమ తమ భక్తి కొద్ది పూజించి నిలబడ్డారు. వినయానతులైన ఆ దైత్యేశ్వరునీ, ఋషి మున్యాదులను చూచి ప్రీతుడైన విష్ణుదేవుడు ఆయజ్ఞాన్నీ, అగ్నులను, యజమానిని. అర్చితులను, యజ్ఞకర్మాదికారులను సభ్యులను ఉత్తమమైన యజ్ఞ సంఖారాలను బహువిధాల ప్రశంసించాడు. సర్వోత్తమాదికారి (పాత్ర) అయిన ఆవామన దేవుని చూచి సదస్యులందరు సాధువాక్యాలు పలికారు. అంతట ఆనందంతో దేహమంతా పులకించగా నాబలి రాజేంద్రుడర్ఘ్య పాద్యాదులతో ణా గోవిందునే అర్చించి యిలా అన్నాడు.
వటూత్తమా! నాకు కలిగిన సంపదలో నీకేది యిష్టమో దానిని కోరుకొనుము. తప్పక యిచ్చెదను. బంగారం, రత్నరాసులు, గజాశ్వ సమూహాలు, సుందరాంగనలు, వస్త్రాభరణాదులు, ఆలమందలు, గ్రామాలు, నారాజ్యమంతా నీముందున్నది. యిందులో ఏమి కావలెనో కోరుకొనుము. దైత్యేశ్వరుడత్యంత ప్రేమాతిశయంతో పలికిన మాటలు విని చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేయగా గంభీరమైన స్వరంతో, నాకు మాత్రం పవిత్రాగ్నులుంచుకొనుటకు మూడడుగుల నేల నొసగి, తక్కినవన్నియు అవి కావలసిన అర్థులకొసగుమనెను.
పదవీదారులలో శ్రేష్టుడా! మూడు పదాలనేలతో నీకేంలాభం? ఏ నూరువేల అడుగుల భూమియో అడుగుము.
ఓ రాక్షసేశ్వరా! ఈ మాత్రం దానం నాకు చాలు. ఇంకా ఎందరో యాచకులున్నారు. వారలు కోరినవన్నీ యిచ్చి వేయుము. అంతట బలి వామనునకు అడిగినదిత్తునని మాట యిచ్చాడు. దాన జలం చేతిలో పడగానే అంతవరకు పొట్టిగానున్న ఆ ప్రభువు అవామనుడై గట్టివాడైనాడు. సర్వదేవమయమైన తన విరాడ్రూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపుడి నేత్రాలు చంద్ర సూర్యులు, శిరస్సుద్యులోకం, కాళ్ళు భూమి, పాదాంగుళులు పిశాచాలు, చేతుల వ్రేళ్ళు యక్షులు, మోకాళ్ళు విశ్వదేవులు జంఘలు, గోళ్ళుయక్షులు, రేఖలు అప్సరోగణం, చూపులు నక్షత్రాలు, కేశాలు సూర్యకిరణాలు, తారలు రోమకూపాలు, ఆ రోమాలలో మహర్షులున్నారు. బాహువులు విదికలు, శ్రోత్రుగుజందిశలు, అశ్వనీ దేవతలు బాహ్యశ్రవణాలు, నాసిక వాయువులు, ఆ మహాత్ముని అనుగ్రహం చంద్రుడు, మనస్సులో ధర్మదేవత, సత్యమాయన వాక్కు, సరస్వతి నాలుక, కంటం దేవమాత అదితి, త్రయీవిద్య దానిలోని త్రివశులు, అనూరాధ స్వర్గద్వారం, కనుబొమలు త్వష్టపూషులు, నోరు వైశ్వానరాగ్ని, వృషణాలు ప్రజాపతులు, పరబ్రహ్మ హృదయం, పుంస్త్వం (మగటిమి) కశ్యపుడు, వీపు పశువులు, సకలసందులు మరుత్తులు, వక్షోభాగం రుద్రుడు, దృతి (సహనశక్తి) మహాసముద్రాలు, కడుపు గంధర్వులు, లక్ష్మి మేధాదృతి కాంతి సకల విద్యలు కటి ప్రదేశం. ఆ ప్రభువు యొక్క తేజస్సే సకలమైన గ్రహ నక్షత్రాదిజ్యోతిర్గణంగా వెలిగిపోతోంది.
నిగమాలన్నీ ఆయన శరీరంలో కుక్షిలో ఉన్నాయి. మహాయజ్ఞాలన్నీ యిష్టులు పశువు బ్రాహ్మణ కర్మలు మోకాళ్ళలో నిలిచాయి. మహాత్ముడగు విష్ణువుయొక్క ఆ సర్వదేవాత్మక విశ్వరూపాన్ని చూచి రాక్షసులందరు అగ్ని జ్వాలల్లోదూకే శలభాల్లాగా ఆయన మీదకు లంఘించారు, చిక్షురుడా ప్రభువు బొటన వ్రేలిని తన దంతాలతో పట్టుకోగా ఆ హరి వాని కంటాన్ని ఆ కొన గోటితో త్రుంచి వేశాడు. ఆ విధంగా రాక్షసులందరను తన అరచేతులతో అర కాళ్ళతో నణగ ద్రొక్కి త్రివిక్రమరూపంతో విజ్రుంభించాడు. అడుగుతో భూమిని ఆక్రమించినపుడు సూర్య చంద్రులాయన స్తనాల మధ్య నిలచారు. ఆకాశాన్ని ఆక్రమించగా వారిద్దరు పిరుదుల వద్దకు దిగారు. యింకా పైభాగాన్ని ఆక్రమించగా ఆ సూర్య చంద్రులు మోకాళ్ళ క్రిందకు చేరారు. ఈ విధంగా దేవతల కార్యం సాధించుటకు ఆ విష్ణువు విరాట్ రూపాన్ని ధరించి రాక్షస సంహారంగావించి త్రిలోక రాజ్యాన్ని పురందరునకిచ్చాడు. పరమ ప్రదాతయైన బలిరాజేంద్రునకు భూమికి క్రింద ఉన్న సుతలమనే పాతాళలోకాన్ని ప్రసాదించాడు. అంతట నాదైత్యపతితో యిలా అన్నాడు. ఓ బలి రాజా! నీవిచ్చిన దానజలాన్ని నేను నాచేతితో గ్రహించాను. ఈ కారణంవల్ల నీకు కల్పాయుర్దాయము, ఉత్తమమైనది. చేకూరినది. ఇప్పుడు జరుగుతున్న వైవస్వతమవ్వంతరం గడచిన తర్వాత రాబోవు సావర్ణి మవ్వంతరంలో నీవు యింద్ర పదవి పొందగలవు. ఈ లోపల సంభవించు డెబ్బదియొక్క చతుర్యుగ చక్రాల లోపల యింద్రుని నెదిరించు శత్రువులందరు నాచేత దండింపబడుతారుసుమా! ఎందుకంటే అతడు నన్ను పూర్వం ఎంతో భక్తితో ఆరాధించాడు. కనుక నా ఆదేశానుసారం సుతల లోకానికివెళ్లి అక్కడ సుఖంగా ఉండు. అక్కడ నీకు నూర్లుకొలది ఉత్తుంగసౌధాలు, కమలాకరాలు, ఉపవనాలు, చీనిచీనాంబరాలు రత్నాభరణాదులు స్రక్చందనాది సకల సౌఖ్యాలు సమకూరుతవి. నృత్యగీతాది వినోదాలనుభవిస్తూ శతాధిక సుందరీమణులతో విహరించ గలవు. దేవ బ్రాహ్మణులకు విరోధంగా ప్రవర్తించనంతకాలము నీవు అన్ని భోగాలు అనుభవించగలవు. అలాకాక దేవ బ్రాహ్మణులతో వైరం పెట్టుకొనినచో భయంకరమైన వరుణ పాశాలు నిన్ను బంధించ గలవు.
భగవన్, నీ యాజ్ఞప్రకారం పాతాళంలో ఉన్నన్నాళ్ళు నిరంతరం నీ స్మరణ చేస్తూ ఉండుటకు అచట నాకు తగిన భోగాపదార్తములేవి గలవు?
“ఓ బలిరాజా! బాగా వినుము. అవిధి పూర్వకంగా చేసిన దానాలు, అవైదికంగా చేసిన శ్రాద్దకర్మలు, శ్రద్దలేకుండా చేసిన హోమాలు, వానిఫలం నీవు పొందగలవు. దక్షిణ యివ్వకుండా చేసిన యజ్ఞాలు, విధివిహితాలు కాని క్రియలు, బ్రహ్మచర్య దీక్ష లేకుండా చేసిన వేదాధ్యయనాలు, ఉదకం లేకుండా చేసిన పూజలు, దర్భ లేకుండా జరిగినకర్మలు , నేయిలేని హోమాలు నీకు కావలసిన ఫలాన్నిస్తాయి. ఈ ప్రదేశాన చేయబడిన ఎలాంటి కర్మలలోనూ అసురులకు హవిర్భాగాలుండవు. పరమపావనమైన జ్యేష్టాశ్రమంలో విష్ణుపద సరోవరంలో, నియమపూర్వకంగా యేయేశ్రాద్దములాచారింపబడునో, విధివిధానంగా గాని, అవిధిపూర్వకంగాగాని చేయబడు సమస్త కర్మలకూ అక్ష్యఫలప్రాప్తి కలుగుతుంది. సందేహంలేదు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడుపవసించి ద్వాదశినాడు వామనదర్శనం చేసికొని విష్ణు పదసరోవరంలో స్నానంచేసి తనశక్తి కొలది దానంచేయుచో పరమపదప్రాప్తి లభించగలదు.”
మహర్షులారా! శ్రీహరి ఈ విధంగా బలిరాజేంద్రునకు వరములు, శతకత్రువుకు స్వర్గరాజ్యాన్ని యిచ్చి తనవిశ్వరూపంతో అంతర్దానం పొందాడు. ఇంద్రుడెప్పటివలె దర్పంతో ముల్లోకాలను పాలించాడు. గడువుపూర్తి అగునంతవరకు బలిరాజేంద్రుడు పాతాళంలో ఉండిపోయాడు. ఇలాంటి వామనరూపియగు విష్ణుదేవుని మాహాత్మ్యగాథ విన్నవారల పాపములు తొలగిపోవును. బలి ప్రహ్లాదుల సంవాదం, బలి శుక్రాచార్యుల మంత్రాలోచనము, బలివామన దేవుల చరిత్రము స్మరించిన వారలకెటువంటి ఆధులు వ్యాధులు, మనోవ్యథలు కలుగజాలవు. అధికారం, రాజ్యంకోలుపోయిన వారలకు తత్ప్రాప్తి, వియోగిజనులకు యిష్టజనుల సమాగమము, ఈ కథా శ్రవణంచేయు మానవులకు లభించగలవు; బ్రాహ్మణులకు వేద విద్య, క్షత్రియులకు భూమివిజయం వైశ్యులకు ధనసమృద్ది శూద్రులకు సుఖప్రాప్తి కలుగును. శ్రీవామన దేవుని మాహాత్మ్య శ్రవణంవల్ల సర్వపాపాలు నశించును.
అధ్యాయము 10 complete
Summary of chapter 83 of the Vāmana Mahā Purana is as follows:
The text extols the holy region of Brahmāvarta and Sthanu-tīrtha, where Parameśvara Śiva established His eternal Sthanu-linga form for the protection and spiritual uplifting of all living beings. The narrative explains that worshipping Sthanu-Śiva with lotus flowers, bilva leaves, and holy Sarasvatī water cleanses the devotee of the most severe karmic impurities. Seekers who perform devout circumambulation around Sthanu-tīrtha attain royal prosperity in this life and ultimate liberation in the divine realm of Kailāsa.