వామన మహా పురాణము
అధ్యాయము 25
స్థాణువటానికి ఉత్తరంగా శుక్రతీర్థం ఉంది. స్థాణువటానికి తూర్పున సోమతీర్థం దక్షిణాన దక్షతీర్థం పడమరగా స్కంద తీర్థం ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాల నడుమనున్నది స్థాణువు. దాని దర్శన మాత్రాన్నే పరమ పదం లభిస్తుంది.అష్టమీ చతుర్దశీ తిథులలో దానికి ప్రదక్షిణం చేస్తే అడుగడుగుకూ యజ్ఞఫలం లభిస్తుంది. సందేహం లేదు. ఈ తీర్థాలను మునులు సాధ్యులు ఆదిత్యులు వసువులు, మరుత్తులు అగ్నులు మొదలగు వారందరూ శ్రద్ధగా సేవించారు. ఈ స్థాణు క్షేత్రరాజాన్ని దర్శించిన యితర ప్రాణులందరూ సర్వపాపాలూ తొలగి పరమపదం పొందుతారు. దాని సన్నిధిన మహాదేవుడగు శూలపాణి లింగం దానికి ప్రక్కనే ఎప్పుడూ విడవకుండ లింగ రూపంలో ఉమాదేవి ఉన్నారు. దానిని చూచినంతనే మానవుడు సిద్ధిపొందుతాడు. వటవృక్షానికి ఉత్తరంగా మహాత్ముడగు తక్షకుడు ప్రతిష్ఠించిన సర్వకోర్కెలు వర్షించే మహాలింగం ఉంది. వటానికి తూర్పుదిశగా విశ్వకర్మ నిలిపిన గొప్ప లింగాన్ని చూస్తే సిద్ధి లభిస్తుంది. అక్కడే లింగరూపంలో సరస్వతీ దేవి ఉన్నది. ఆమెకు భక్తితో నమస్కరిస్తే బుద్ధి మేధాశక్తులు లభిస్తాయి. వటానికి ప్రక్కగా బ్రహ్మప్రతిష్ఠితమైన వటేశ్వర లింగదర్శనం పరమపదం ప్రసాదిస్తుంది. అంతట స్థాణు వటాన్ని దర్శించి ప్రదక్షిణం చేస్తే సప్తద్వీపా వసుంధరను ప్రదక్షించిన ఫలం లభిస్తుంది. స్థాణువునకు పడమర దిశగా నకులీశగణం ఉన్నారు. దానిని చక్కగా అర్చిస్తే సర్వపాపాలూ పోతాయి.
అచటకు దక్షిణంగా రుద్రకర తీర్థముంది. దానిలో స్నానంచేస్తే అన్ని తీర్థాల్లో స్నానంచేసినఫలం కలగుతుంది. దానికి తూర్పున మహాత్ముడైన రావణుడు ప్రతిష్టించిన, గోకర్ణేశ్వర మహాలింగం ఉంది. ఆషాఢకృష్ణచతుర్దశినాడు ఆ గోకర్ణ స్వామిని అర్చిస్తే కలిగేపుణ్యం ఎట్టిదో వినండి. ఆ లింగార్చనవల్ల తెలిసీ తెలియకాచేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ హరుని శుచియై ఆష్టమినాడు పూజిస్తే బ్రహ్మచర్యవ్రతం చక్కగా పాలించిన ఫలమంతా కలుగుతుంది. కుమారేశ్వరని మహిమవల్ల కోరిన రూపసాందర్యం సౌభాగ్యం ధన సంపదలన్నీ నిస్సంశయంగా నెరవేరుతాయి. దానికి ఉత్తరంగా ఉన్న లింగాన్ని పూజించి విభీషణుడు జరామరణాదుల జయించాడు. ఆషాఢ శుక్ల అష్టమినాడు ఉపవసించి ఆ లింగ పూజ చేసినచో అమరత్వం లభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా! అక్కడ ఖరుడు (దానవుడు) పూజించిన లింగాన్ని యత్నపూర్వకంగా అర్చిస్తే సకలకోర్కెలు ఫలిస్తాయి. అక్కడే మహేశ్వరారాధన గావించి దూషణుడు త్రిశిరుడుకూడ చింతిత ఫలాలుపొంది సంతోషించారు. చైత్రశుద్ధ పక్షంలో ఆ రెండు లింగాలను అర్చించిన వారలకాదేవతలు కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తారు. స్థాణువటానికి తూర్పుగా హస్తిపాదేశ్వర లింగం ఉండి. దాన్ని దర్శిస్తే జన్మాంతరార్జిత పాపాలన్నీ తొలగిపోతాయి. దానికి దక్షిణదిక్కుగా హారీతముని ప్రతిష్టించిన లింగానికి భక్తితో ప్రణమిల్లిన వానికి సిద్ధులు లభిస్తాయి. దానికి దక్షిణంగా మహాత్ముడగు వాపీతుడు ప్రతిష్టించిన, ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందిన, సర్వపాపహర లింగం ఉంది. ఇక అస్థిపంజరంలో రుద్రునిచేత ప్రతిస్థితమైన మహాలింగ రూపం సర్వపాపాలు హరించి భుక్తి ముక్తులు ప్రసాదిస్తుంది. దాని దర్శన మాత్రాన్నే అగ్నిష్టోమ యాగఫలం లభిస్తుంది.
దానికి పడమరగా సిద్ధులచే ప్రతిష్ఠింపబడి సకల సిద్ధులు ప్రసాదించే సిద్ధేశ్వర లింగమనే ప్రసిద్ధమైన లింగం ఉంది. దానికిదక్షిణంగా మహాత్ముడగు మృకండు ప్రతిష్ఠితమై దర్శనమాత్రాన్నే సకలసిద్ధులుయిచ్చే శివలింగముంది. దానికి తూర్పున మహాత్ముడగు నాదిత్యుడు నెలకొల్పిన సర్వకిల్బిషాలు నశింపజేసే శ్రేష్టలింగం ఉన్నది. చిత్రాంగదుడనే గంధర్వుడూ అప్సరోమణి రంభ పరస్పరానురాగ బద్ధులై స్థాణు మహాదేవుని దర్శించుటకు వెళ్ళి ఆ మహాదేవుని పూజించి తమ అనురాగానికి ప్రతీకలుగా ఆ వరదుడగు మహేశ్వరుని లింగాలు రెండు ప్రతిష్ఠించారు. ఓ ద్విజులారా! చిత్రాంగదేశ్వర రంభేశ్వరులనే ఆ లింగాలను దర్శించినవారు సుందర సుభగాకారాలతో సత్కులంలో జన్మిస్తారు. దానికి దక్షిణంగా యింద్రుడు పూర్వం స్థాపించిన లింగం అనుగ్రహంవల్ల చింతితఫలాలు సిద్ధిస్తాయి. అలాగే పరాశరముని కూడ ఆ స్వామిని ఆరాధించి దర్శించి ఉత్తమ కవిత్వశక్తి సంపాదించాడు. వేదవ్యాసమునికూడ ఆ పరమేశ్వరునారాధించి సర్వజ్ఞత్వం బ్రహ్మజ్ఞానం పొందాడు. ఆ స్థాణులింగానికి పడమరదిశన జగత్ప్రాణుడు వాయుదేవుడు నెలకొల్పిన మహాలింగం దర్శనమాత్రాన్నే పాపాలు పోద్రోలుతుంది. దానికి దక్షిణంగా ఉన్న హిమవతేశ్వరలింగం దర్శించిన పుణ్యాత్ములకు సిద్ధులు ప్రసాదిస్తుంది. దానికిగూడ దక్షిణంగా కార్తవీర్య స్థాపితమైన పాపనాశక లింగం చూచినంతనే పుణ్యాలు ప్రసాదిస్తుంది. దానికి ఉత్తరంగా సుపార్శ్వుడు స్థాపించిన లింగాన్ని ఆరాధించి హనుమంతుడు సిద్ధులుగడించాడు. దానికి తూర్పనఉన్న మహాదేవుని అర్చించి ప్రభ విష్ణువైన విష్ణువు సుదర్శన చక్రాన్ని సంపాదించాడు. దానికి తూర్పున మిత్రావరుణులు సర్వకామ్యాలు తీర్చే రెండు లింగాలు ప్రతిష్ఠించారు. మునులు సాధ్యులు ఆదిత్యులు వసువులు అందరు వీనిని శ్రద్ధాభక్తులతో సేవించి సర్వపాప విముక్తులయ్యారు.
స్వర్ణలింగానికి వెనుకభాగాన తత్త్వద్రష్టలయిన ఋష్యాదులు స్థాపించినలింగాలు లెక్కకుమించినవి. అలాగే దానికి ఉత్తరాన ఓఘవతీనది వరకుగల భూభాగంలో స్వామికి పశ్చిమాన ఒక వేయి లింగాలు స్థాపింపబడినవి. దానికి తూర్పు దిశగా సంనిహిత సరస్సువరకుగల భూమిలో మహాత్ములగు వాలఖిల్య మనులొకకోటి లింగాలు ప్రతిష్ఠించారు. స్వామికి దక్షిణంగా గంధర్వ యక్షకిన్నరులు ప్రతిష్ఠించిన లింగాలు అసంఖ్యాకాలు. వాయువు చెప్పినట్టుగా మూడున్నర కోట్ల లింగాలు ఆ పుణ్య భూమిలో వెలసినవి. ఇకపోతే ఆ స్థాణ్వీశర్వని ఆశ్రయించి అచటఉన్న వేలాదిరుద్రుల సంఖ్యయిందులో చేరదు. ఈ విషయాలన్నింటినీ గ్రహించి ఆ స్థాణ్వీశ్వర మహాలింగాన్ని శ్రద్ధాభక్తులతో ఆశ్రయించినవారల కోరికలన్నీసిద్ధిస్తాయి. సందేహం లేదు. సకామంగాగానీ లేక నిష్కామంగా కానీ ఆ స్థాణుపు ఆలయాన ప్రవేశించిన ప్రతిమానవుడూ ఘోర పాపాల నుంచి ముక్తుడై పరమపదం పొందుతాడు. చైత్రత్రయోదశినాడు దివ్యనక్షత్రాలు శుక్ర సూర్య చంద్రగహాలతో కలిసి పరమ పుణ్యదినాన ఆ స్థాణులింగాన్ని సాక్షాత్తు విరించి బ్రహ్మ ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా దానిని ఋషి ముని దేవతా సంఘాలు సేవిస్తూ ఉన్నాయి. ఆ పవిత్ర దినాన ఉపవసించి శ్రద్ధాభక్తులతో ఆ పరమ శివునారాధించిన నరులు పరమపదాన్ని పొందుతారు. అచ్చట ఆ పరమేశ్వరుని సన్నిధానాన్ని భావించుకొని ఆ ప్రదేశానికి ప్రదక్షిణం చేసినచో సప్తద్వీపాలతోకూడిన ఈ భూమండలాన్నంతా చుట్టివచ్చిన పుణ్యఫలం లభిస్తుంది.
అధ్యాయము 25 Complete
Summary of chapter 97 of the Vāmana Mahā Purana is as follows:
The narrative chronicles how King Viśvāmitra, through excruciating penances, rigorous fasting, and complete self-surrender on the holy banks of Sarasvatī at Prithūdaka, completely erased his royal pride and Kshatriya karmas. Recognizing his flawless spiritual elevation, Pitāmaha Brahmā and the celestial hosts bestowed upon him the sacred status of a Brahmarshi. This divine event established Prithūdaka as the ultimate site for achieving spiritual transformation and higher wisdom.