వామన మహా పురాణము
అధ్యాయము 12
ఓ విప్రశ్రేష్టులారా! ఏ ఏ కర్మలు చేస్తే ఈ నరకాలు సంభవిస్తాయి? వినాలని కుతూహలంగా ఉంది. చెప్పండి.
సుకేశీ! ఏ ఏ దుష్టకర్మలు చేస్తే యీ నరకాలు కలుగుతాయో, అంతా వివరంగా విను. ఎల్లవేళలా వేదాలను విప్రులను నిందిస్తూ పురాణేతిహాసాలనుద్వేషించే పాపులు, గురువులను దూషించేవారు, యజ్ఞాలు ద్వంసం చేసేవారు, దాతలను దానంచేయకుండా నివారించేవారు అందరూ ఈ నరకాల్లోపడతారు. స్నేహితులను, దంపతులను, అన్నదమ్ములను, స్వామిసేవకులను, పితాపుత్రులను, యాజ్ఞికోపాధ్యాయులను, దుర్భుద్భితో విడదీసేవారు, ఒకనికి తన కూతునిత్తునని చెప్పి యివ్వక మరొకరికి యిచ్చే అధములు, వీరందరను యమకింకరులు రంపాలతో రెండు ముక్కలుగా చీలుస్తారు. పరులకు తాపంకలిగించే వారు, చందనం, ఉశీరం (వట్టివేరు) చామరవ్యజనాలు, దొంగిలించేవారు, కరంభసికత నరకానికి పోతారు. శ్రాద్దనిమంత్రణం స్వీకరించి, మరొక చోట భుజించువారలను భయంకరఖగాలు తమ ముక్కులతో ముక్కలు ముక్కలుగా చీలుస్తాయి. మర్మవేధకాలయిన నిందావాక్యాలతో సాధువుల మనస్సులు నొప్పించు దుర్మార్గుల నెత్తిపై వ్రాలి గ్రద్దలు ముక్కులతో బయటకు లాగి చీల్చుతాయి. ఏ పొగరు బోతులు తలిదండ్రులను గురుజనులను అవమానిస్తారో, వారలు మలమూత్రాదులతో నిండిన అప్రతిష్టమనే నరకకూపాల్లో ముంచబడతారు. దేవతలకు, అతిథులకు, జీవాలకు, సేవకులకు అభ్యాగతులకు, బాలురకు, పితృదేవతలకు అగ్నికి పెట్టకుండా తాముభుజించే అధములు, చీము రక్తంతో కలిపిన మాంసాహారాన్ని, నోటినిండా సూదులు గ్రుచ్చబడుటచే, తినలేక ఆకలి తీరక వేదనతో ఆక్రోశిస్తూ ఉంటారు.వాళ్ళ శరీరాలు ఉబ్బిపోయి వికృతంగా ఉంటాయి. ఒకే పంక్తిలో కూర్చున్న వారికి పక్షపాతంతో భేదదృష్టితో వడ్డించే నీచులు, విధ్భోజనం అనే నరకంలో పక్షుల రెట్టలకుప్పలలో పడిపోతారు. పలువురతో కలిసి ప్రయాణం చేయునపుడు దారిలో తాము తెచ్చుకొన్న తినుబండారాలను యితరులతో పంచుకొనక తనే భుజించువారు శ్లేష్మభోజన ‘నరకగాములౌతారు. ఎంగిలి చేతులతో గోవులను బ్రాహ్మణులను పవిత్రాగ్నులను ముట్టుకునే వారి చేతులను ఎర్రగా క్రాగిపోయే కుంభాలలో వేసి కాల్చుతారు.
అశుచిగా ఉంటూ ఎంగిలి నోటితో చేతులతో, ఎవరైతే సూర్యుని చంద్రుని నక్షత్రాలను కావలయునని చూచెదరో వాళ్ళ నేత్రాగ్నిని (జ్యోతిని-చూపును) యమకింకరులు లాగివేస్తారు. మిత్రుని భార్యను, తన తల్లిని, అగ్రజుని, తండ్రిని, తోబుట్టువును, కుమార్తెను, చుట్టపు ఆడువారిని, గురువులను, పెద్దలను ఎవరు తమ కాలితో తాకుదురో ఆ పాపుల పాదాలను యినుప సంకెళ్ళతో కట్టి మోకాళ్ళ వరకు అగ్నిలో కాచి రౌరవనరక జ్వాలల్లో తోసేస్తారు. పాలలో వండిన పరమాన్నాన్ని, మాంసాన్ని భగవన్నివేదనము చేయకుండా భుజించే వారినోళ్ళలో, నిప్పులో కాచిన యినుప గుండ్లను కుక్కుతారు. గురుదేవ బ్రాహ్మణులను వేదాలను గురించి చేసే నిందా వాక్యాలను ఓపికగా వినే పాపుల చెవులలో యమదూతలు, ఎర్రగా కాల్చిన మేకులు గ్రుచ్చుతారు. చలివేంద్రాలను, దేవకులాలను, గుడులను, తోటలోని చెట్లను, బ్రాహ్మణుల యిండ్లను, సభామంటపాలను, మథాలను, బావులను చెరువులను, కూల్చినాశనం చేసే సంఘద్రోహుల చర్మాలను పదునైన కత్తులతో ఒలిచి, యమదూతలు, బాధతో పెద్దగా విలపించే వారలను క్రూరంగా హింసిస్తారు. ఆవులకు బ్రాహ్మణులకు సూర్యునకు అగ్నికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జనము చేయువారల గుదస్తానాన్ని ముక్కులతో చీల్చికాకులు లోపలి ప్రేవులను బయటకు లాగుతాయి. కరువు కాటక పరిస్థితుల్లో తన తలిదండ్రులను పుత్ర భ్రుత్యబార్యా బాంధవులను అన్నార్తులుగా వదలి పెట్టి తానొక్కడే కడుపు నింపుకునే వాడు శ్వభోజనమనే నరలోకానికి పోతాడు. శరణు జొచ్చిన వారిని వదలివేయువాడు, యితరులను చెరసాలలలో బంధించువారు ‘యంత్రపీడ’ మనే నరకంపాలౌతారు. ఏ ప్రయోజనం లేకుండా ఉబుసుపోకకు విప్రులను యితరులను బాదించే పాపులను యమదూతలు శిలాయంత్రాల్లో పిండి పిండిగా విసిరినిప్పుల మీద కాలుస్తారు. తమ వద్దదాచుకొన్న యితరుల సొమ్ము అపహరించే దురాత్ములు, ఆకలితో ఎండిన నాలుకలతో అక్రోశిస్తూంటే, వారలను యమదూతలు సంకెళ్ళతో బంధించి వృశ్చికాశనమనే నరకంలో తోసేస్తారు. పర్వదినాల్లో స్త్రీ సంగమం చేసేవారిని, పరస్త్రీలను చెరిచే వారిని, శాల్మలి అనే నరకంలోనికి త్రోసి వారల చేత అక్కడ భగభగమండే మేకులతో కూడిన యినుపస్తంభాలను ఆలింగనం చేయిస్తారు. ఉపాధ్యాయుని కన్న ఎత్తైన ఆసనం మీద కూర్చొని అధ్యయనంచేసిన శిష్యులూ ఆ గురువూ యిద్దరూ తమనెత్తిమీద రాతిబండలు మోయవలసి వస్తుంది. నీళ్ళలో మలమూత్ర విసర్జనం, నిష్టీవనం చేసే వారలను విణ్మూత్ర మనే దుర్గంధ పూర్ణమైన నరకంలోకి తోసివేస్తారు. శ్రాద్దాది కార్యాలలో పరస్పరం ఒకరింటికొకరువెళ్ళి భోజనము చేయు మూర్ఖులు, పరస్పరం ఒకరి మాంస మొకరు తినవలసి ఉంటుంది. వేదాలను, అగ్నులను, గురువులను, భార్యా, పితరులను వదలి పెట్టే పాపులను యమకింకరులు గిరిశిఖరాల నుంచి క్రిందకు పడద్రోయుదురు. విధవలను పెండ్లాడువారు, కన్యలను చెరచువారు, అట్టివారల పితృదేవతలతో సహా మురికి గుంటలలోని పురుగులను చీమలను భక్షించగలరు. శూద్రచండాలుర నుంచి దక్షిణలు తీసికొనిన పురోహితుడు ఆ పురోహితుని నియమించిన యజమానీ యిద్దరూ శిలా గర్భంలో పురుగులయి జన్మిస్తారు. లంచగొండులూ పృష్టమాంస భుక్కులూ, ఓ దైత్యేశ్వరా! వృక్షభక్షమనే నరకంలో పడతారు. బంగారం దొంగిలించువారు, బ్రాహ్మణులను చంపువారు, సురాపానం చేయువారు, గురువు భార్యను పొందువారు, యితరుల గోవులను భూములను అపహరించువారు, గోవులను స్త్రీలను శిశువులను చంపువారు, సోమ విక్రయం వేద విక్రయం చేసే విప్రులు, మోసగాళ్ళు, అపవిత్రులు, నిత్య నైమిత్తికాదులు వదలినవారు, తప్పుడు సాక్ష్యం చెప్పువారు, మహారౌరవ నరకాన్ని పొందుతారు.
వీరంతా పదేసి వేల సంవత్సరాలు తామిస్రక, అంధతామిస్ర అసిపత్రవన, ఘటీయంత్ర, తప్తకుంభ నరకాలలో వరుసగా యాతనలనుభవిస్తారు. నేను వివరించిన ఈ నరక యాతనలన్నీ వరసగా క్రుతఘ్నులు లోకనిందకులు గూడ అనుభవిస్తారు.
రాక్షసేంద్రా! దేవతలందరిలో శ్రేష్ఠుడు జనార్దనుడైనట్లు, పర్వతాల్లో హిమవంతంవలె, ఆయుధాల్లో సుదర్శనం మాదిరి, పక్షులలో గరుత్మంతుని వలె, జాతి సర్పాల్లో అనంతునికి వలె, భూతాల్లో ప్వథ్వివలె, నదులలో గంగ, జలజాల్లో పద్మం ఎలా శ్రేష్ఠములో అసురులలో శివభక్తుడెట్లో, క్షేత్రాల్లో కురుజాంగలం, తీర్థాలలో పృథూదకం, సరస్సులలో మానసం, వనాల్లో నందనవనం, లోకాల్లో బ్రహ్మలోకం, ధర్మాదిక్రియాలలో సత్యం ఏ విధంగా శ్రేష్ఠమైనవో, యజ్ఞాల్లో అశ్వమేధం, ప్రియబంధువులలో పుత్రుడు, తపస్వులలో అగస్త్యుడు ఎలా ముఖ్యులో, ఆగమాల్లో వేదాలు, పురాణాల్లో మత్సపురాణం, సంహితలలో స్వాయంభువసంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులలో అమావాస్య, విషునాల్లో దానం ఎంత శ్రేష్టాలో, తేజఃపుంజాల్లో సూర్యుడెట్లో, నక్షత్రాల్లో చంద్రుడెట్లో, జలాశయాల్లో సముద్రం ఎట్లు ముఖ్యమో, రాక్షసవర్యులలో నీ వెట్లో, పాశాల్లో నాగపాశం, స్తిమితులలో బంధితుడు, దాన్యాలలో వరి, ద్విపాత్తులలో విప్రుడు, చతుష్పాత్తులలో ఆవు, శ్వాపదాల్లో సింహం, పుష్పాల్లో జాజి, నగరాల్లో కాంచీ, స్త్రీలలో రంభ, ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం, పురములలో కుశస్థలి , దేశాల్లో మధ్యదేశం, ఫలాల్లో మామిడి, మొగ్గలలో అశోకం, ఔషదాల్లో హరీతకి (కరక్కాయ), గడ్డలలో కంద ఎట్లు ఉత్తమములో, వ్యాధులలో అజీర్ణ రోగం, తెల్లని వానిలో పాలు, బట్టలలో నూలు (ప్రత్తి) వస్త్రాలు, కళలలో గణితం, విజ్ఞానాల్లో మహేంద్రజాలం, శాకాలలో కాకమాచి (ఆకుకూర), షడ్రసాలలో లవణం, ఎత్తైన చెట్లలో తాళం, పద్మ సరస్సులలో పంపాసరం, వనచరాలలో జాంబవంతుడు, వృక్షాల్లో వటం, జ్ఞానులలో శివుడు ఎలా శ్రేష్టులో, పతివ్రతలలో పార్వతి, ఆవులలో కపిలగోవు, ఎడ్లలో గూడనీలపుటెద్దు ఎలా శ్రేష్టాలో, భరింపరాని నరకాలన్నింటిలో వైతరణి ఎంత దుస్తరమైనదో అట్లే ఓ నిశాచరపతీ! పాపులందరలో కృతఘ్నుడు పరమనికృష్టుడు! కృతఘ్నత్వం సర్వపాపాల్లో భయంకరమైంది. బ్రహ్మహత్య గోహత్యా పాతకాలకైనా నిష్కృతి (ప్రాయశ్చిత్తం) ఉండవచ్చుగాని, స్నేహితులొనరించుమేలు మరచిన కృతఘ్నుడికి కోటి సంవత్సరాలకైనా నిష్కృతి లేదు. ఇది నిజం.
అధ్యాయము 12 complete
Summary of chapter 12 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya instructs Devarshi Nārada on the infallible law of Karma, detailing how every action, thought, and deed produces its corresponding fruit in this life and future births. The chapter provides a profound discourse on the consequences of virtuous acts such as charity, truthfulness, pilgrimage, and devotion, contrasted with the karmic retributions awaiting those who indulge in adharma, cruelty, and deceit. Emphasizing the inexorable nature of cosmic justice, the text urges all human beings to cultivate purity of mind and align their daily conduct with the eternal principles of Sanātana Dharma.