అధ్యాయము 60

ఓ జగన్నాధా! నీకు ప్రణామము. దేవ దేవా నీకు నమస్కారము! వాసుదేవా! బహురూపీ ! నీకు నమస్కారము. ఏకశృంగా! వృషాకపీ! శ్రీనివాసా!భూతభావనా! నీకు సమస్సులు. విష్వక్సేనా! నారాయణా! ధ్రువకేతనా! సత్యధ్వజా! నీకు నమోవాకములు! యజ్ఞధ్వజా! ధర్మధ్వజా! తాళధ్వజా!(బలరామ), గరుడధ్వజా! నీకు నమస్కారము. సర్వోత్తమా! విష్ణూ!వైకుంఠా! పురుషోత్తమా! జయంతా! విజయా! జయా! అనంతా! పరాజితా! (భక్తపరాజితా)! నీకు నమస్కారము. కృతావర్తా!(కల్పాల రూపాన తిరిగేవాడా)! మహావర్తా!(అందరనూ ముంచివేయు సుడిగుండం)! మహాదేవా! ఆది లేని వాడా! ఆది అంతమూ నైన వాడా! మధ్య అంతమునగువాడా! బ్రహ్మప్రియా! నీకు నమస్సులు. పురంజయా! శత్రుంజయా! శుభంజయా(మంచికి అధిపతి)! ధనుంజయా నీకు జోహారులు! సృష్టికి నెలవగువాడా! పవిత్ర నాముడా! గొప్పగా విన బడువాడా(పృథుశ్రవా)హిరణ్యగర్భా! కమల గర్భా! నీకు ప్రణామము. కమలనేత్రా (కాటుకకన్నులవాడా) కాలనాభా (సమయమే నాభి అయినవాడా)! మహానాభా! నీకు నమస్సులు. వృష్టిమూలా!(వర్షానికి కారణమైనవాడా)! మహామూలా!(సర్వానికి గడ్డ), మూలావాసా(మొదటి ఆశ్రయమా)! ధర్మానికీ జలానికీ సంపదలకు నిలయమైనా వాడా! నీకు నమస్సులు. ధర్మాధ్యక్షా! (ధర్మాన్నిపరిశీలించు వాడా)! ప్రజాధ్యక్షా! లోకా ధ్యక్షా! సేనాధ్యక్షా! కాలాధ్యక్షా! నీకు జోహారులు! గదాధరా! వేదాల నుద్దరించువాడా! చక్రాన్నీ, లక్ష్మనీ ధరించువాడా! వనమాలను, భూదేవిని, ధరించుదేవా! హరీ నీకు సమస్సులు. ఆర్చిషేణా!(గొప్పవెలుగు )! మహా సేనా స్వరూపీ పురుష్టుతా(గొప్పగా కీర్తింపబడువాడా)! బహుకల్పా! మహాకల్పా! సమస్త కల్పనలకు ప్రధానుడా! సర్వాత్మా! సర్వగా! విభూ! విరించీ! శ్వేతా! కేశవా! నీలా! రక్తా(ఎర్రనివాడా)! మహానీలా! అనిరుద్దా! నీకు ప్రణామములు. ద్వాదశాదిత్యులను గర్భీకరించుకున్న కాలరూపా! సామవేదరూపా! పరమాత్మా! ఆకాశ రూపా! మంగళకర మగు ఉన్నత తత్వమా!(సుబ్రహ్మాన్)! సర్వ జీవాత్మకా! నీకు జోహారులు! హరీ (పచ్చని)కేశా! మహాకేశా! గుడా దట్టమైన కేశా! ముంజ (ఒక గడ్డి) కేశా! హృషీకేశా ! హృషీకేశా (ఇంద్రియాధిపతి)! సర్వనాథా ! నీకు నమస్కారము సూక్ష్మరూపా ! మహాసూక్ష్మ ! స్థూలా! మహాస్థూలా ! కళ్యాణకారీ! తెలుపు బంగారం వన్నె నల్లనైన వస్త్రలు ధరించువాడా నీకు వందనములు!

ఓ కుశేశయా ! (దర్భశయనా) పద్మేశయా ! జలేశయా! గోవిందా! హంసరూపా ! పీతాంబర ప్రియా! ప్రీతి కర్తా ! నీకు నమస్సులు అధోక్షజా ! (ఇంద్రియ దమనా) సీరధ్వజా !(నాగలిటెక్కెము గా గలవాడా) జనార్దనా ! వామనా ! మధుసూదనా ! నీకు ప్రణామాలు సహస్రశీర్షా ! బ్రహ్మశీర్షా ! సహస్ర నేత్రా ! చంద్ర సూర్యాగ్ని నేత్రా ! అధర్వ శీర్షా ! మహాశీర్షా ! ధర్మ నేత్రా ! మహా నేత్రా ! నీకు నమస్కారములు . ఓ సహస్ర పాదా! సహస్ర బాహు (బాణుడు) శత్రూ ! యజ్ఞ వరాహా ! మహారూపా నీకు ప్రణామములు. విశ్వేదేవా ! విశ్వాత్మా! విశ్వసంభవా ! విశ్వరూపా ! నీ నుంచియే ఈ విశ్వం ఉద్భవించింది. నీకు ప్రణామములు. మహా శాఖలతో నొప్పుచు మూల (వ్రేళ్లు) కుసుమాలతో నర్చించ బడు న్యగ్రోధ (మహా వట వృక్ష) రూపా నీకు స్కంధ (కాండములు) పత్ర అంకురలతా పల్లవాలతో విలసిల్లే నీకు నమస్కారము. నీకు మొదలు బ్రాహ్మణులు. స్కంధాలు క్షత్రియులు. ఓ బ్రహ్మన్! వైశ్యులు కమ్మలు. దళ(ఆకు)ములు శూద్రులు. ఓ వనస్పతీ ! ప్రభూ ! నీకు నమస్కారాలు భగవన్! నీకు నిరతాగ్నిహోత్రు లగు విప్రులు ముఖము. సాయుధు లగు క్షత్రియులు బాహువులు. ప్రక్కలు(తొడలు) వైశ్యులు. శూద్రులు పాదములు. ఆ యా అంగాల నుండి వార లుద్భవించారు. నీ నేత్రాల నుండి సూర్యుడు, పాదాల నుంచి భూమి, చెవుల నుంచి దిక్కులు, నాభి నుండి అంతరిక్షం, చంద్రుడు మనస్సు నుండి, నీ ప్రాణాల నుండి వాయువులు, కామం (కోరిక) నుండి బ్రహ్మ, ఉద్భవించారు. నీ క్రోధం నుండి త్రినేత్రు డగు రుద్రుడు , శిరస్సు నుండి దివి జననము, నోటి నుండి యింద్రాగ్నులు, మలము నుండి పశువులు జననము. నీ రోమాల నుండి ఓషధు లుద్భవించాయి. అట్టి విరాజ పురుషుడ వగు నీకు ప్రణామాలు. పుష్పము లే నవ్వుగా గల వాడవు ! అట్టహాసము గావించు వాడవు నగు నీకు నమస్సులు. నీవు ఓంకారానివి. వషట్కారానివి. వౌషట్ స్వధా స్వాహకారాలు సుధ హంతకారము అన్నీ నీవే. నీకు ప్రణామాలు. అన్ని ఆకారాలు నీవే. నీకే ఆకారం లేదు. వేద రూపివి నీవు వేద మయుడవు. సర్వ దేవ మయుడవు. సర్వతీర్థ మయుడవు. సర్వ యజ్ఞ మయుడవు. అట్టి నీకు ప్రణామములు. ఓ యజ్ఞ పురుషా ! యాగ భాగ భోక్తా ! వేయి అంచులు నూరుఅంచులు గల వజ్ర స్వరూపా! నీకు ప్రణామాలు. భూః భువః స్వః లోకాలు నీవు. గో (యింద్రియ) దాయివి, అమృతదాయివి, సువర్ణ జ్ఞాన దాతవు, సర్వము యిచ్చు వాడ వగు నీకు నమస్కారము. నీవు బ్రహ్మేశ్వరుడవు. బ్రహ్మకు ఆదిమూర్తివి. బ్రహ్మ రూప ధారివి. పర బ్రహ్మవు. శబ్ద బ్రహ్మవు. నీకు నమస్కారములు.

ప్రభూ! నీవు విద్యవు. వేద్య రూపివి. తెలిసికో దగిన వాడవు. బుద్దివి. బోధ్యుడవు. బోధజ్ఞానానివి. నీకు నమస్కారములు . హోతవు. నీవు హోమం, హావ్యం, హూయ మానం (హవ్యముగా అర్పించబడునది) గూడ నీవే. హవ్య వాహను డవు (అగ్ని) పాతవు (రక్షకుడు)పోతవు. (పవిత్రం గావించువాడు), పూతుడవు(పవిత్రుడవు), పావనీయుడవు, సర్వమూనైన ప్రణవానివి. నీకునమస్సులు . హంత(చంపువాడ)వు. చంప బడు వాడవు, అపహరింప దగిన వాడవు గూడ నీవే. హరించు వాడవు, నాయకుడవు, నీతివి, పూజ్యుడవు, అగ్య్రుడవు (మెదటివాడవు), విశ్వాన్ని ధరిచే వాడవు నీవే, స్రుక్ స్రువాలు నీ రూపాలే. పరమ పదానివి నీవు. కపాలం(పురోడాశంయిచ్చే పాత్ర), ఉలూఖలం (రోలు), అరణి (అగ్నికై మధించే కొయ్య) నీవే. యజ్ఞ పాత్ర యగు ఆరణేయం నీవు. ఒకటిగా రెండుగా మూడుగా రూపొందునది నీవే. నీవు యజ్ఞానివి, యజమానుడవు, ఈడ్యుడవు ( ఆరాధింపబడువాడవు), యాజకుడవు నీవే. జ్ఞాత (తెలిసినవాడ) వు, తెలిసి కోవలసిన వాడవు, జ్ఞానానివీ నీవే. నీకు ప్రణామాలు. జ్ఞాన యోగం, యోగి గతి, మోక్షం, ధృతి, సుఖం, యోగాంగాలూ నీ రూపాలే. సర్వ వ్యాపి వగు నో ఈశ్వరా ! నీకు నమస్సులు (యజ్ఞశాలలోని) బ్రహ్మవు, హోతవు, ఉద్గాతవు, సామగానానివి, యూపం, దక్షిణ, దీక్ష, పురోడాశం (యుజ్ఞేశ్వరునకిచ్చే నైవేద్యం), యజ్ఞ పశువు, పశువును తెచ్చేవాడు ఈ అన్ని రూపాల్లో నీవే వ్యక్త మౌతావు. నీవు గుహ్యుడవు. (రహస్యం) ధాతవు, పరముడవు, శివుడవు, నారాయణుడవు. జనసమూహం, నిరయనం,వేయి చంద్ర సూర్యుల శోభతో వెలుగు వాడవు. నీకు నమస్సులు పన్నెండు (చక్రపు) ఆకులు ఆరు యిరుసులు మూడు వ్యూహాలు రెండు యుగము (కౌడి) లు కాల చక్ర రూపివగు భవానీ శ్వరు (మహాకాళేశ్వరు) డవు నగు నో పురుషోత్తమా! నీకు కైమోడ్పులు. పరాక్రమం, విక్రమం, హయగ్రీవ, హరి, ఈశ్వరులు, నీవు. సర్వేశ్వరుడవు (ప్పథ్వీపతి) బ్రహ్మేశ్వరుడవు సూర్యేశ్వరుడవు నగు నీకు నమస్కారములు. నీవు హయ ముఖడవు. (కిన్నరుడు). మహామేధా (గొప్పయజ్ఞా) నివి. శంభుడవు. యింద్రుడవు. ప్రభంజనుడవు. మిత్రావరుణమూర్తివి పాపరహితుడవైన పరముడవు. ప్రాగ్వంశ కాయుడవు( రూపుకట్టిన మోదటివంశానివి). జీవులందరకు మొదలు అయిన వాడవు. పెనుభూతానివి. చ్యుతి లేని వాడవు. ద్విజుడవు, ఊర్ధ్వకర్తవు, ఊర్ధ్వానివి, ఊర్ద్వ రేతస్కుడవు, నీకు నమస్సులు. మహాపాతక ఉపాతకాలు నశింప చేయు వాడవు సర్వపాపాలకు అతీతుడ వగు నీకు శరణాగతుడ నగు చున్నాను. ఓ నారదా! పరమోత్తమ మైన ఈ సర్వ పాప మోచన స్తవాన్ని నీకు వినిపించాను దీనిని మహేశ్వరుడు వారాణసి క్షేత్రంలో ప్రకాశింప జేశాడు. సితోదక తీర్థంలో స్నానం చేసి కేశవుని ఎదుటకు వెళ్లి రుద్రుడు పాప విముక్తు డైనాడు. త్రిపురాంతకుడు చెప్పిన ఈ స్తోత్రం విష్ణు పరమైనది. పవిత్రమైనది. దీనిని శ్రద్దతో పఠించిన నరుడు పాప విముక్తుడై శాంతిని

పొందుతాడు. ప్రసిద్ధులైన దేవతలకు కూడ పూజ్యుడౌతాడు.

అధ్యాయము 60 Complete