వామన మహా పురాణము
అధ్యాయము 39
ఓ బాలా ! ఆ లోపల యోగ యోగీశ్వరుడైన శ్రీ కంఠేశ్వరుని దర్శనానికై ఆ యక్షఅసుర కన్యకలు ఆలయానికి వెళ్ళారు. అక్కడ వారలు వాడిపోయిన పూలు అక్షతాదులతో నిర్మాల్యంతో నిండియున్న స్వామి లింగాన్ని దర్శించారు. అది ఋతధ్వజుడు కావించిన పూజా నిర్మాల్యం. అంత నా కన్య లిద్దరూ నిర్మాల్యం తొలగించి విధి పూర్వకంగా అభిషేకం చేసి రాత్రింబవళ్ళు అర్చన గావించారు. వారక్కడ అలా ఉండగా నొకనాడు అవ్యక్తమూర్తియగునా శ్రీ కంఠదేవుని దర్శించడానికి గాలవుడను మహర్షి వచ్చాడు. ఆ బాలిక లిర్వరను చూచి యాముని వీరెవ్వరి కుమార్తెలోయని అనుకుంటూ స్నానం చేయడానికి కాళిందిలో దిగాడు. స్నానానంతరం ఆ ముని పూజ చేస్తూండగా నా కన్యలిరువురూ కమనీయంగా భగవంతుని గుణానుగానం చేశారు. వారి మధుర గానం విని గంధర్వ కామినులని నిశ్చయించుకున్నాడు. జపతప పూజాదులు సక్రమంగా నెరవేర్చిన అనంతరం ఆ కన్యలిద్దరూ ఆ మునికి నమస్కరించారు. అంతట నాముని, శివభక్తి సమేతలై మీమీ వంశాలకు అలంకారాలుగా వెలిగే మీరలెవరి బిడ్డలమ్మా అని ప్రశ్నించాడు. అంతట నో చంద్రముఖీ ! ఆ బాలికలు తమతమ గాథలు ఉన్నవి ఉన్నట్టుగా వివరించి చెప్పారు. అదివిన్న ఆగాలవుడా రాత్రియచటనే ఉండి మరునాడుదయం మరల శివుని అర్చించి వారలతో నేను పుష్కరారణ్యానికి వెళ్తున్నానని చెప్పాడు. అంతట నా యక్షా సురపుత్రికలు చేతులు జోడించుకొని మహాత్మా ! మీబోటి వారలదర్శనం దుర్లభం. పుష్కరారణ్యానికి మీరెందుకు వెళ్ళుతూన్నారు. అని అడిగాడు. అందులకా తేజస్వి, రాబోవు నెలలో కార్తీక పూర్ణిమా పర్వం పుష్కరారణ్యంలో వైభవంగా జరుగుతుంది. అందుకోసం వెళ్తున్నానని చెప్పగా నా యువతులు మహానుభావా ! మేముగూడా మీవెంట వచ్చెదము. దయచేసికొనిపొండు. మిమ్ము విడచి యిక్కడ యిక ఉండలేమని ప్రార్థించారు.
మంచిది అలాగే రండని సమ్మతించి ఆ మునివరుడు మహేశ్వరునకు మ్రొక్కి ఆ కన్యలను వెంటబెట్టుకొని భక్త్యాదరాలతో పుష్కరారణ్యానికి వెళ్ళాడు. అచ్చటకు వేలసంఖ్యలో యితర ఋషులు, నరపతులు, జానపదులు వచ్చి చేరుకున్నారు. ఒక్క ఋతధ్వజుడు మాత్రం వెళ్ళలేదు. ఆ కార్తిక పూర్ణిమా పర్వాన ఆ ఋషులంతా ఇక్ష్వాకునరేశుడు నాభాగుడాదిగా గల రాజులంతా స్నానాలు చేశారు. గాలవముని కూడ ఆ కన్యలతోబాటు పుష్కర జలాల్లో స్నానార్థందిగాడు. నీళ్ళలో మునిగిన ఆముని ప్రవాహ మధ్యన ఒక పెనుచేపను ఎందరో మత్స్యాంగనలతో తిరుగడం చూచాడు. ఆడచేపలలా తిమింగలానితో ప్రేమకలాపాలు జరపబోగా నా మహామత్స్యం వాటితో, ఓముగ్ధాంగనలారా! మీరు ధర్మం ఎరుగరు. ఇందువలన కలిగే విపరీతమైన జనాపవాదాన్ని నేను భరించలేను. కనుక తొందర పడకుడని మందలించాడు. అదివిని ఆడ చేపలు, తపస్వి అయిన ఆ గాలవుడే కన్యలను వెంటపెట్టుకొని యథేచ్చగా తిరుగుతుండగా, ఆ మహాత్మునకు లేని భయం, నీళ్ళలోపల ఉండే మీ కేలనని అనగా నా తిమింగిలం తపోధనుడై ననేమి ? ఆరాగాంధుడు పిల్లవాడిలాగా భయాన్ని, లజ్జనూ వదిలేశాడని చీదరించుకున్నది. ఆ మత్స్యసంవాదంవిని నీళ్ళలో ఉన్న గాలవుడు సిగ్గుపడి బయటకు రాకుండా అలాగే ఉండిపోయాడు. అరటి కాండలవంటి తొడలుగల ఆ కన్యకలు స్నానం ముగించుకొని నీళ్ళలో మునిగిన ఆ జితేంద్రియుడు గాలవునికై నిరీక్షిస్తూ నిలబడ్డారు. పుష్కర పర్వం ముగిసి వచ్చిన వారంతా, ఋషులు రాజులు జానపదులూ, తిరిగి వెళ్ళిపోయారు. సర్వాంగ సుందరి విశ్వకర్మ తనయ చిత్రాంగద ఒక్కతె నలువైపులా చూస్తూ ఉండిపోయింది. గాలవునితో వచ్చిన కన్యలిద్దరు కూడ, ఆ ముని నీళ్ళలో నుంచి రానందున, తీరాన అలాగే చూస్తూ ఉండిపోగా, వారలు ముగ్గురూ పరస్పరం చూచుకున్నారు. ఇంతలో ఘృతాచి కడుపున జన్మించిన పర్జన్యుని కుమార్తె వేదవతి అనే గంధగ్వ కన్య కూడా అక్కడకు వచ్చింది.
ఆమె ధనురాకారంలో ఉన్న పుష్కరమధ్య జలాల్లో స్నానంచేసి సరోవరానికి ఉభయ తీరాల్లో నిలబడిన ముగ్గురు కన్యలను చూచింది. చిత్రాంగదను సమీపించి మృదువుగా, అమ్మా నీవెవరవు ఏ కారణాన ఈ నిర్జన ప్రదేశాన ఉన్నావని ప్రశ్నించింది. ఆ చిత్రాంగద తన కథ యిలా వినిపించింది. నేను ప్రఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ కుమారై చిత్రాంగదను. నేనొకపరి నైమిషారణ్యంలో కాంచనాక్షి సరస్వతిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్ళాను. అక్కడకు వచ్చిన విదర్భరాజు సురథుడు నన్నుచూచి కామార్తుడై శరణువేడుకున్నాడు. సఖులు వారించినా వినక నే నతనికి వశమయ్యాను. ఆకారణాన నా తండి నన్ను శపించినందువల్ల భర్తకు దూరమై ఆత్మహత్యకు పూనుకోగా ఒక యక్షుడు వారించి శ్రీ కంఠక్షేత్రానికి పంపాడు. అక్కడనుండి సప్తగోదావరికి వెళ్ళి ఈ తీర్థ రాజానికి వచ్చాను. ఇక్కడ కూడ యింతమంది జనంలో నాభర్త సురథుడు కనిపించలేదు. ఇది నా కథ. ఇక నీవెవరో యాత్రముగిసిన తర్వాత యిచట కేలవచ్చితివో దాచకుండా నాకు చెప్పమన్నది. అందుకా బాలిక, ఓకృశోదరి! అయితే ఈ మందభాగ్యురాలి కథ కూడ విను చెబుతానంటూ యిలా మొదలుపెట్టింది. నేను పర్జన్యునకు ఘృతాచికి పుట్టిన దానను. పేరు వేదవతి, ఒక పర్యాయం వన ప్రాంతంలో క్రీడించుచుండగా ఒక బలశాలియైన వానరం నన్నుచూచి - ఓ దేవవతీ! ఎక్కడకు వెళ్తున్నావు? భూతలాన నిన్నుంచిన ఆశ్రమంనుంచి ఈ మేరు పర్వతానికి ఎవరు తీసుకవచ్చారని గద్దించి పలుకగా నేనంతట "నా పేరు వేదవతి, నేను దేవవతినికాను. ఈ మేరుగిరియే నా నివాసమన్నాను. అంతట నాధూర్త వానరం వినక వా వెంటపడగా నేను భయపడి పక్కనేఉన్న ఒక ఎత్తైన బంధుజీవ వృక్షంమీదకు ఎక్కాను. అంతట ఆ దుష్టుని ప్రచండ కరాఘాతానికాచెట్టు విరిగిపడిగా నేనొక కొమ్మను గట్టిగా కరుచుకుని పట్టుకున్నాను. ఆకోతి ఆచెట్టును సముద్రజలాల్లోకి విసరివేయగా నేను విలవిలలాడుతూ కొమ్మతోకూడ పడిపోయాను. ఆ సమయాన ఆకాశాన్నుంచి క్రిందపడుతూన్న ఆ చెట్టునూ దానితోపాటు నన్నూ స్థావర జంగమ ప్రాణులందరు చూచి హాహాకారాలు చేశారు. సిద్ధులూ గంధర్వులూ - "అయ్యో ! ఎంతకష్టం? మహాత్ముడైన మనుపుత్రుడూ వేయి యజ్ఞాలుచేసిన వీరుడూ నైన ఇంద్రద్యుమ్న మహారాజుకు పట్టపురాణి కాగలదని స్వయంగా బ్రహ్మచేత దీవింపబడిన ఈ సాధ్వికా యీ దుర్దశ ! అంటూ విలపించారు.
ఆ తియ్యని వాణి చెవిన బడిన వెంటనే నేను మూర్ఛిల్లి పడిపోయాను. అందుచేత ఆ వృక్షాన్ని నరికినదెవరో తెలుసుకోలేక పోయాను. అంతట అగ్ని మిత్రుడు వాయువు ప్రచండ వేగంతో నన్నీచోటికి విసరి వైచినాడు. ఇక్కడ నిన్ను చూచాను. ఇక లెమ్ము. మనంవెళ్ళి పుష్కరానికి ఉత్తరతీరాన నిలబడిన ఆ యిద్దరు కాంతలెవరో అడిగి తెలుసుకుందాము. అని చెప్పి ఆ వేదవతి చిత్రాంగదతో, ఓకన్యామణీ ! ఆ సుందరీల వద్దకు వెళ్ళింది. ఆమె అడిగిన మీదట వారుభయులూ తమతమ వృత్తాంతాలు వినిపించారు. అంతట నాకన్యలు నలువురూ సప్తగోదావరి క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వర మహాదేవుని అర్చిస్తూ ఉండిపోయారు. ఈ లోపుగా శకుని, జాబాలి, ఋతధ్వజులుమువ్వురూ ఆ కాంతలను వెదకుచూ చాలా ఏండ్లు తిరిగారు. వేయేండ్ల తర్వాత జటాభారంతో అలసిపోయిన జాబాలిని వెంటబెట్టుకుని నిరాశులైనారు. శాకలానికి వెళ్ళారు. ఆ నగరాధిపతి ఇంద్రద్యుమ్న మహారాజు, వారలు వచ్చుటతెలిసికొని ఆర్ఘ్యపాత్రతో ఎదురుగా వెళ్ళి ఋషులను పూజించి సోదరపుత్రుడయిన శకునిని సంభావించాడు. ఋతధ్వజుడా రాజుతో, రాజన్ మా బిడ్డ నందయంతి తప్పిపోయినది. ఆమెకోసం భూమి అంతా గాలించాం. విసిగి వేసారి పోయాం. మీరు వెంటనే లేచి ఆమెను వెదకి మాకు సహాయం పడండని అర్థించాడు. అంతట నా ఇంద్రద్యుమ్నుడు కూడ, మహామునీ ! కోమలాంగియైన నా భార్య కూడ ఎక్కడనో తప్పిపోయింది. ఆమె కోసం నేనూ వెదకి విసిపోయాను. నా బాధ ఎవరితో చెప్పుకోను ? సిద్ధులమాటలాకర్షించి ఆకాశాన్నుంచి పడిపోతున్న ఒక పర్వతంలాంటి వృక్షాన్ని ఖండించాను. ఆ సుందరికేమాత్రము దెబ్బతగులలేదు. కాని ఆమె ఎక్కడ పడిపోయినదో ఎక్కడ ఉన్నదో తెలియక నిరంతరం నేనూ వెదకుతున్నాను. అని చెప్పి త్వరగా లేచి మూడు రథాలు తెప్పించాడు. ఋషులిర్వరకూ, శకునికీ రెండు రథాలు యిచ్చి తాను మూడవది ఎక్కి అందరూ నేల నాలుగుమూలలా వెదకుతూ బదరీ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కఠోర తపస్సులో వేగిపోతూ, దుమ్ముకొట్టుకున్న జడలతో, కృశించిపోయి, ఎంతో కష్టంతో ఊపిరిపీలుస్తూ ఉన్న ఒక యువ తపస్విని చూచారు.
అతనిని చూచి మహాభుజుడైన ఇంద్రద్యుమ్న నృపతి చిన్నవాడా ! యౌవనంలోనే యింతటి కఠోర తపస్సు ఏమాశించి చేస్తున్నావు ? అని ప్రశ్నించగా నతడు, మీరెవ్వరు శోకార్తుడనైన నన్ను యింత ప్రేమానురాగాలతో అడుగుతున్నారని బదులు చెప్పాడు. అందులకా నరపతి నేను మనువు కుమారుడను. ఇక్ష్వాకు సోదరుడను శాకల నగరాధిపతినని చెప్పగా నా యువక తపస్వి తన పూర్వగాథ అంతా వివరించాడు. అదివిని ఆ రాజర్షి, బాబూ ! నీవు శరీర త్యాగం చేసికోవద్దు. నీవు నా సోదరుని కుమారుడవే. రారమ్ము. నీ ప్రియురాలని అన్వేషించుదమంటూ ఆ కృశించిన యువకుని కౌగలించుకున్నాడు. అతనిని తన రథంమీద కూర్చుండ బెట్టుకొని ఋషుల వద్దకు తీసుక వెళ్లారు. ఋతధ్వజుడు అతనితో, రా బాబూ ! రా! నీకు ప్రియం కలుగజేస్తా. నీవు నైమిషారణ్యంలో చూచిన చిత్రాంగదను నేనే సప్త గోదావరి తీర్థంలో వదలి వచ్చాను." అనిచెప్పి అందరను చూచి, రండి ! రండి ! సుదేవుని కుమారుని కోసం మనం సప్త గోదావరి సంగమానికి వెళ్దాం. అక్కడే ముగ్గురు కన్యలూ ఇతరులూ మనకు కనిపిస్తారన్నాడు. అలా సుదేవకుమారుని సమాశ్వసించి శకునీ ఇంద్రద్యుమ్నుడు తన పుత్రునితో కలిసి అంతా రథారూఢులై ఆ బాలికామణలు వెళ్ళి సప్తగోదావరానికి బయలుదేరారు. ఈ లోపున ఘృతాచి తనకుమార్తెను గానక విచారమగ్నమై ఉదయగిరిమీద అంతటా వెదకుతూ తిరిగింది. దారిలో తారసిల్లి వానరాన్ని చూచి ఆ అప్సరస, ఓ కపీ ! నీవొక కన్యక నెవరినైనా చూచావా నిజం చెప్పమని అడుగగా నా కపి, దేవవతి అనే కన్యను చూచాను. ఆమెనొక మహాశ్రమంలో కాళిందీ తీరాన మృగపక్షి సంకీర్ణమైన అరణ్యంలో వదలి వచ్చాను. ఆ ఆశ్రమం శ్రీకంఠేశ్వరాలయాని కెదురుగా ఉంది. అని చెప్పింది. అందుకామె, ఓ వానర శ్రేష్ఠా ! ఆమెపేరు వేదవతి. రమ్ము మనమచ్చటకు వెళ్ళుదామన్నది.
ఘృతాచి మాటలువిని ఆ వానరం పెద్దపెద్ద అంగలువేస్తూ త్వరగా ఘృతాచిని వెంట బెట్టుకొని కౌశికీనదికి వెళ్ళింది. ఆ రాజర్షులు ముగ్గురూ యిద్దరు మునులు కూడా రథాలమీద వేగంగా పయనించి కౌశికీనది చేరుకున్నారు. రథాలు దిగి నదిలో పవిత్ర స్నానం చేయుటకు వెళ్లారు. ఘృతాచి కూడ నదిలోకి స్నానం చేయడానికి దిగగానే ఆ ప్రక్కనే ఉన్న వానరాన్ని చూస్తూనే జాబాలి తండ్రితోను మహావీరుడైన చక్రవర్తితోను యిలా అన్నాడు. తండ్రీ! అడుగో నా జడలు చెట్టుకొమ్మకు కట్టి ఆ దుష్టవానరుడు. మళ్ళీయిటే వస్తున్నాడు. జాబాలి మాటవింటూనే శకుని కోపంతో మండిపడి మహర్షి నీ రాజునూ చూచి, తపోధనా ! మహారాజా ! అనుజ్ఞ యివ్వండి. ఒక్కకోలతో నీ పాడు కోతినినేల గూలుస్తానన్నాడు. ఆ మాటలు విని సర్వజీవ కారుణ్యమూర్తి అయిన ఋతధ్వజుడు వారించి "వత్సా ! పొరబడుతున్నావు ! లోకంలో ఎవ్వరూ ఎవ్వరినీ చంపరు. చావులుగాని, బంధనాలు గాని వారివారి కర్మల ననుసరించియే కలుగుతాయి. కనుక నీ ప్రయత్నం విరమించుమని చెప్పి ఆ కపిని చూచి ఓ వానరా ! మాకు నీవల్ల ఒక సహాయం కావాల్సి ఉంది. రమ్మురమ్మని" ఆహ్వానించాడు. ఓ అరజా సుందరీ ! ముని మాటలువిని ఆ వానరం చేతులు జోడించి ప్రణామంచేసి, "ఓ బ్రహ్మర్షీ ! ఆజ్ఞాపించండి. శాసించండి. నేనేమి చేయవలసి ఉన్నదో అని ప్రార్థించినది. అందుకు ముని, వెనుక నీవు నా కుమారుని జటలతో లతాదికాలతో వటవృక్షానికి బంధించావు. ఈ మహారాజు సహాయంతో ఆ కొమ్మను మూడు ఖండాలుగా నరికి పిల్లవాడిని విడిపించుకున్నాం. అయినప్పటికీ జడలతో నీవు కొమ్మకు బిగించిన కట్లు విప్పడం ఎవరికీ శక్యంకాలేదు. అందుచేత నీ పసివాడు గతించిన పదివేలేండ్లుగా, తలకు కట్టబడిన కొమ్మబరువు మోస్తూ తిరుగుతున్నాడు. ఆ కట్లు విడదీసి వానికి పూర్తి విముక్తి కలిగించు మనగా నాశాఖామృగం మెల్లమెల్లగా ఆ చిక్కుముడులు విప్పి ఆ జాబాలికి పూర్తి విమోచనం కలిగించింది. అంతట సంతోషించిన ఆ ముని ఆ కపిని ఏదేని వరం కోరుకొమ్మన్నాడు.
ఋతధ్వజుని మాటలువిని వానరుడుగా ఉన్న మహాతేజస్వి విశ్వకర్మ యిలా వరం అడిగాడు. భగవన్ ! నాకు వరమివ్వరునెంచినచో, ఒకనాడు తమ నాకు యిచ్చిన మహా కఠోర శాపాన్ని ఉపసంహరించండి. ఓ తపోధనా ! తమచే వానరుడుగా శపించబడిప చిత్రాంగద తండ్రిని, అభాగ్యుడనైన విశ్వకర్మ దేవశిల్పిని నేనే అని తెలుపుకుంటున్నాను. కపి చాపల్యం వల్ల నేనెన్నియో పాపాలు చేశాను. వానినన్నింటినీ నశింపజేయండి. నన్ననుగ్రహించండి. అంతట ఋతధ్వజుడు ఏనాడు నీవుఘృతాచివల్ల మహాబలుడైన కుమారుని కంటావో ఆనాటితో నీకపిత్వం సమాప్తమౌతుంది. అంటూ శాపాంతం సూచించాడు. అంతట సంతసించి ఆ కపి స్నానార్థం ఆ మహానదిలో దిగాడు. ఇతరులందరూ ఒకరొకరుగా పవిత్ర స్నానాలు చేసి పితృదేవార్చనలు గావించారు, అనంతరం తమతమ రథాలెక్కి వెళ్ళిపోయారు. ఘృతాచి గగనమార్గానికెగిరి పోగా నా మహాకపి ఆమెను వెంబడించాడు. ఆ సర్వాంగ సుందరిని చేరుకోగానే ఆమెకూడా నా ప్లవంగ శ్రేష్ఠుని విశ్వకర్మగా గుర్తించి కామించింది. అంతట వారిద్దరూ కోలాహల పర్వతసానుకందరాలలో యథేచ్చగా రమిస్తూ ఒకరినొకరు సంతృప్తిపరుచుకుంటూ విహరించారు. అలా విహరిస్తూ చాలాకాలానికి వింధ్యపర్వతానికి చేరుకున్నారు. ఆ విధంగా ఋతధ్వజుడు మిగిలిన నలుగురూ రథాల మీద మధ్యాహ్నవేళకు సప్తగోదావర క్షేత్రానికి ప్రీతులై చేరుకున్నారు. విశ్రాంతి కోసం త్వరత్వరగా రథాలు దిగారు. సారథులు గుర్రాలను కడిగి నిర్మలోదకాలు త్రాగించి చుట్టుప్రక్కలగల చక్కని పచ్చిక బయళ్ళలోకి మేయుటకై వదిలారు. ముహూర్తకాలంలో అవి కడుపునిండా మేతమేసి తృప్తిచెందాయి. అంతట అందరూ రథాలెక్కి హాటకేశ్వరాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయంలో ఉన్న నాస్త్రీ రత్నాలా గుర్రపుడెక్కల చప్పుళ్ళు విని అది ఏమో తెలుసుకుందామని, దేవాలయ పైభాగానకు ఎక్కి నలువైపులా తేరిపార చూడసాగారు.
స్నానానంతరం ఆలయంలో కూర్చొని వారు హాటకేశ్వరుని మ్రోల గీతాలాపన చేయుచున్న ఆ కన్యలను చూచారు. వారిలో విశ్వకర్మ తనయను గుర్తుపట్టి సుదేవకుమారుడు సంతోషంతో తబ్బిబ్బైనాడు. ఋతధ్వజుడు కూడ చిత్రాంగదను గుర్తించి యోగ దృష్టితో సర్వమూ తెలిసికొని సంతోషించాడు. అంతట వారందరూ లేచి త్వరగా వెళ్ళి హాటకేశ్వరుని పూజించి క్రమంగా స్తోత్రాలు గావించారు. ఋతధ్వజునితో కలిసి వచ్చిన వారలను చూచి, చిత్రాంగద తన సఖులతో లేచి వారలకు నమస్కారం చేసింది. అంతట నామహర్షి కుమారుడూ తక్కిన రాజులతో కలసి వారలకు ప్రత్యభినందనలు తెలిపి అందరూ కూర్చున్నారు అదే సమయాన ఆ వానరవీరుడు ఘృతాచితో కలసి అక్కడ కేతెంచి గోదావరిలో స్నానంచేసి హాటకేశ్వర దర్శనానికి ఆలయంలో ప్రవేశించాడు. అక్కడి తన కుమార్తెను చూచి ఘృతాచీ తల్లిని చూచి వేదవతీ ఆనందాతిరేకంతో ఒకరినొకరు గాఢంగా కొగలించుకొని జలజలా కన్నీళ్ళు రాల్చారు. అంత నా మహర్షి ఆ కపిసి చూచి, నీవు వెంటనే అంజనాద్రికి వెళ్ళి యక్షేశ్వరుడు అంజనునీ, పాతాళానికి వెళ్ళి దైత్యపతి కందరమాలినీ స్వర్గానికి వెళ్ళి పర్జన్య గంధర్వునీ తీసుకొని రమ్మని ఆదేశించాడు. అంతట దేవవతి ఆ కపితో, అయ్యా ! గాలవ మహర్షిని గూడ తీసుకొని రండనీ అర్థించింది. అంతట బాయు విక్రముడైన నాకపివీరుడ ట్లేయని, వాయువేగంతో వెళ్ళి అంజనుని పిలచి అమరగిరికి వెళ్ళి పర్జన్యుని సప్తగోదావరి మహాశ్రమానికి వెళ్ళమని చెప్పి తాను పాతాళానికి వెళ్ళాడు. అచ్చట కందర మాలికి చెప్పి మరల భూమిమీదకు వచ్చి గాలవమునికోసం మాహిష్మతికి వెళ్ళాడు. ఆ పరిసరాలలో మహాతపస్వి యైన గాలవుని చూచి తనతో ఆకాశమార్గాన సప్తగోదావరానికి గొని వచ్చాడు. అక్కడ ఇద్దరు నదిలో స్నానంచేసి ఆలయానికి చేరారు. అచట నా ముని నందయంతిని దేవవతిని చూచాడు. ఆ కన్యలిద్దరామునికి లేచి వినయంతో నమస్కరించారు. గాలవుడంతట మహాదేవుని అర్చించి అచటనున్న ఋషలకభివాదనం చేశాడు. ఆ రాజ శ్రేష్ఠులు లేచి నిలబడి ఆ తపస్విని యథావిధిగా పూజించారు. అందరూ సంతోషస్వాంతులై కూర్చున్నారు.
వారలా కూర్చొని యుండగా వానరునిచే పిలువబడిన యక్షగంధర్వ దైత్యులూ వచ్చి చేరారు. అంతట ప్రేమతో చెమ్మగిలిన నేత్రాలతో నా ముగ్గురూ తమ తప్పిపోయిన పుత్రికలను కౌగలించుకున్నారు. ఆ సుందరాంగనలు కూడ కండ్లనీరు పెట్టుకున్నారు. తన తండ్రి ఒక్కడు మాత్రమే లేనందుకు తన దురదృష్టానికి చింతించి చిత్రాంగద కన్నీరు విడవడం చూచి ఆ ఋతధ్వజుడు పుత్రీ బాధపడకుము. ఈ కపివరుడు నీ తండ్రియేనని సత్యం వెల్లడించగా నా బాలిక సిగ్గుపడి మహాత్ముడగు విశ్వకర్మకీ వానరత్వమెట్లు గలిగెనో కదా ! నాలాంటి కుమార్తె వల్లనే ఈ దుస్థితి కలిగి ఉంటుంది. అందుచే ఈ పాడు శరీరాన్ని వదలి వేస్తానని నిశ్చయించుకొని ఋతధ్వజునితో, స్వామీ ! నన్ను రక్షించండి. నేను పితృహంతకు రాలిని. నా మూలాన్నే నా తండ్రికీ దురవస్థ కలిగినది. నేను చనిపోవుదును. అనుమతి ఇండని వేడుకున్నది. అందులకాముని "అమ్మా ! విదారించకు; భవితవ్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. శరీర త్యాగం చేయవద్దు. కొంచెం ఓపిక పట్టుము. ఈ కపికి ఘృతాచి వలన పుత్రుడు కలుగగానే శాపాంతమై పూర్వపు రూపం పొందుతాడు. నీవు నీ తండ్రిని మరల కలుసుకుంటావని ఓదార్చాడు. ఆ తర్వాత ఘృతాచి చిత్రాంగదను సమీపించి మృదువుగా, పుత్రీ శోకింపకుము. పది నెలలలో నావల్ల నీ తండ్రికి ఔరసుడు కలుగుతాడు. అంతవరకూ వేచి యుండుమని నచ్చజెప్పినది. అదివిని చిత్రాంగద ఎంతో సంతోషించింది, తండ్రి సమక్షాన వివాహం చేసుకోనెంచిన చిత్రాంగద అందుకొరకు ప్రతీక్షించసాగింది. తక్కిన ముగ్గురు కన్యలు కూడా తమ నెచ్చెలితో బాటే తమ వివాహాలుకూడ వాయిదా వేసుకొన్నారు. ఆ స్నేహితురాండ్ర సంకల్పం ఫలించి పదినెలలమీద ఘృతాచి ఆ గోదావరి తీర్థంలోనే నలుడను కుమారుని ప్రసవించింది. పుత్రుడు కలుగగానే కపి రూపం వదలి విశ్వకర్మ తనతొంటి రూపంతో ప్రియపుత్రికను ఆలింగనం చేసుకొన్నాడు.
ఆ విధంగా కుమారైను కలుసుకొని ఆ సుర శిల్పి దేవరాజు ఇంద్రుని సురకిన్నరాదులను మనసా స్మరించుకున్నాడు. వెంటనే శక్రుడు మరుత్తులు సురలు రుద్రగణాలతో కూడి ఆ విశ్వకర్మ కోర్కె ననుసరించి హాటకేశ్వర క్షేత్రానికి వచ్చి చేరాడు. అలా దేవతలు గంధర్వులు అప్సరసలంతా వచ్చిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు ఋషిసత్తముడైన ఋతధ్వజునితో యిలా అన్నాడు.
"బ్రహ్మర్షీ ! కందరమాలి కుమార్తెను మీ పుత్రుడు జాబాలికిచ్చి విధిపూర్వకంగా వివాహం జరిపించండి. రూపవంతుడగు శకుని నందయంతిని పరిణయమాడగలడు. నేను వేదవతిని గ్రహించెదను. విశ్వకర్మ పుత్రికను సురథుడు వివాహమాడును. అందులకు మంచిదని ఋతధ్వజుడనగా సంతోషంతో వివాహ సంస్కారం పారంభమైంది. గాలవముని ఋత్విజత్వం వహించి వైవాహిక హోమాలు నిర్వర్తించాడు. గంధర్వులు నృత్యాలు చేస్తూ మంగళ గీతాలు పాడారు. మొదట జాబాలి కందరమాలి కుమార్తెను పాణిగ్రహణం చేసుకున్నాడు. తర్వాత వరుసగా ఇంద్రద్యుమ్నుడు వేదవతిని, శకుని యక్షపుత్రికను సురథుడు చితాంగదను పరిగ్రహించారు. ఓ సన్నని నడుముగల కళ్యాణీ అరజా ! ఇలా వివాహ కార్యం సంపన్నమైన తర్వాత ఋతధ్వజుడు ఇంద్రాది దేవతలతో, మీరందరు నీ పవిత్ర సప్త గోదావరి తీర్థంలో విశేషించి ఈ వైశాఖ మాసంలో నివసించుట ఉత్తమ మనెను. వారందరు నందులకంగీకరించి అట్లేయుండిరి. అనంతరం దేవతలు తమతమ నెలవులకు వెళ్ళి పోయారు. మునులంతా ఋతధ్వజ జాబాలురతో స్వస్థానాలకు వెళ్ళారు. రాజులు తమతమ భార్యలతో తమ నగరాలకు వెళ్ళి సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఓ కళ్యాణీ ! చిత్రాంగద వృత్తాంతమంతా సమగ్రంగా నీకు వినిపించాను. ఓ కమలనేత్రీ, నారీరత్నమా ! ఇక ఆలసింపక నన్ను భజింపుమని ఆ దండక నృపతి, శుక్రనందిని అందాన్ని పొగడుతూ చెప్పినంతనే ఆ మానవతి మృదు వచనాలతో ఇలా చెప్పింది.
అధ్యాయము 39 Complete
Summary of chapter 40 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya recounts the origin of the sacred pilgrimage site Kedāra-tīrtha, detailing how its holy waters were blessed by Parameśvara Śiva to cleanse all sins and bestow liberation upon earnest seekers. Interwoven with this sacred geography is the history of the formidable demon Mura, who performed severe penances to obtain boons of invincibility and terrorized the devas across the three worlds. Bhagavān Vishṇu entered into battle against Mura, ultimately slaying the demon and establishing His divine protection over all who seek refuge at holy tīrthas like Kedāra.