వామన మహా పురాణము
అధ్యాయము 19
మునే! మహిషునిచే నిర్జింపబడి దేవతలెల్లరు తమతమ లోకాలను ఆయుధాలు వాహనాలతో సహా వదలి బ్రహ్మను ముందుంచుకొని లక్ష్మీపతియైన నారాయణుని వద్దకు వెళ్ళిరి. అచట శివకేశవుల నిర్వురను చూచి నమస్కరించి ఆ సిద్ధి ప్రదాయకులతో దుష్టుడైన మహిషుని అత్యాచారాలను యిలా విన్నవించారు – “ప్రభో! దురాత్ముడైన మహిష దానవుడు సూర్యచంద్ర వాయ్వగ్ని పితామహవరుణెంద్ర ఆశ్వినులాదిగా గల దేవతల అధికారాలను అపహరించి వారలను స్వర్గం నుంచి భూమికి తరిమి వైచినాడు. అలా తరుమబడిన మేమందరము మీ శరణాగతులమైనాము. మాకు మేలగు విధానము చెప్పండి. లేనిచో ఆ దానవుని దెబ్బల కోడి మేము రసాతలానికి పోయెదము. దేవతల దీనవచనాలను వినిన వెంటనే అవ్యయుడైన శ్రీ హరికాలాగ్ని వలె క్రోధంతో నిండిపోయినాడు. ఆ వెంటనే శంకర పితామహులు క్రోధ మూర్చితులయ్యారు. వారితో బాటు యింద్రాది దేవతలందరి ముఖాలు క్రోదారుణాలైనాయి. ఆ విధంగా దేవతల నుండి బయలు దేరిన క్రోధాగ్ని ఒక భయంకరమైన శిఖరంగా ఆవిర్భవించి అసమాన తేజస్వి అయిన కాత్యాయని మహర్షి ఆశ్రమంలో ఆయన తేజంతో కలిసి విజృంభించింది. జ్వలించుచున్న సహస్ర సూర్యకాంతితో వెలిగే ఆ మహాజ్యోతి నుంచి యోగవిశుద్ధ శరీరంతో అతి సుందరమూర్తి అయిన కాత్యాయనీ దేవి నిర్గమించింది. శివుని జ్యోతితో ఆమె ముఖము, అగ్ని కాంతితో మూడు కన్నులు, యముని తేజస్సు వల్ల కేశాలు, విష్ణుతేజం వల్ల పదునెనిమిది బాహువులు ఏర్పడినవి. చంద్రుని కాంతి చక్కని స్తనయుగంగా, యింద్రతేజంతో నడుము, వరుణ కోపాగ్ని వల్ల తొడలు జంఘాలు పిరుదులు, బహ్మ తేజం వల్ల పదాబ్జాలు, ఆదిత్యుల కాంతి వల్ల పాదాంగుళులు, వసువుల తేజస్సుతో చేతివ్రేళ్ళు ప్రజాపతుల కాంతితో దంతములు, యక్షతేజంతో నాసిక, మరుత్తుల వల్ల చేతులు, సాధ్యుల తేజంతో కనుబొమలు, రూపొంది ఆమె కందర్పుని బాణాసనం లాగ తేజరిల్లింది. కాత్యాయన మహర్షి తపశ్శక్తితో నిండిన ఆ తేజోమూర్తి ఆ సమయాన్నుంచీ కాత్యాయనీ దేవిగా జగత్ప్రసిద్ధి వహించింది.
ఆ దేవికి వరప్రదాతయగు శూలపాణి త్రిశూలం యిచ్చాడు. శ్రీహరి చక్రం యిచ్చాడు. వరుణుడు శంఖం, అగ్ని శక్తి ఆయుధం, వాయువు ధనుస్సు సూర్యుడు అక్షయ శరతూణీరాలు, యింద్రుడు వజ్రంఘంట, యముడు దండం, కుబేరుడు గద, అక్షమాలకమండములు బ్రహ్మ, కాలుడు మహోగ్ర ఖడ్గం డాలు, యిచ్చారు. చంద్రుడు కంఠహారం చామరాలు, సముద్రుడు మాలను, హిమవంతుడు మృగరాజును (వాహనం, సింహం) శిరోమణి, కుండలాలు, చంద్రరేఖను విశ్వకర్మ గండ్రగొడ్డలిని ఆ దేవికి యిచ్చారు. కుబేరుడు రాజతానులిప్తమైన ఉత్తమ పానపాత్రను శేషుడు సర్పమణిహారం, ఋతువులు ఎన్నడు వాడని పుష్పమాలను సమర్పించారు. ఆ విధంగా దేవతా శ్రేష్ఠుల చేత సంభావించబడి ఆ త్ర్యంబకేశ్వరి అట్టాట్టహాసం చేసింది. దానితో బ్రహ్మ విష్ణు రుద్రేందాదులతో గూడిన దేవసమూహమంతా సంతోషించారు. ఈ విధంగా స్తోత్రం చేశారు. “దేవతల చేత పూజింపబడు దేవీ! నీకు నమస్కారము! పృథివి యందలి సకల జీవులలో నిద్రారూపాన తృష్ణగా, లజ్జగా, ఆకలిగా, భయంగా, కాంతిగా, శ్రద్ధగా, స్మృతి, పుష్టి, క్షమ, ఛాయ, శక్తి, లక్ష్మి వృత్తి, దయా, భ్రాంతి, కోరిక, మాయ, యిత్యాది రూపాల్లో నిండి సంసార రూపాన ఉండే పరమేశ్వరీ! నీకు నమస్కారము! తల్లీ నీకు నమస్సులు!” ఆ విధంగా దేవతలంతా స్తోత్రం చేసిన వెంటనే ఆ దేవి సింహం మీద స్వారీ చేస్తూ, ఎత్తైన శిఖరాలతో ఉంటూ, అగస్త్యముని వల్ల అనంతరం తగ్గి కుంచించుకుపోయిన వింధ్య పర్వతానికి వెడలిపోయెను.
పూర్వమొక పర్యాయం వింధ్యుడు ఆకాశం పొడవున పెరిగిన సూర్యుని గమనాన్ని నిరోధించెను. అంతట రవి కుంభజుడగు నగస్త్యుని చేరి ఆ ముని హోమ కార్యానంతరం యిట్లనెను. ఓ బ్రాహ్మణ శ్రేష్టా! బహుదూరాన్నుంచి వచ్చియున్నాను; నన్నుద్ధరింపుము. నేను నిరాటంకముగా అంతరిక్షగమనం చేయుటకు వీలుగ నామనోవాంఛితాన్ని ప్రదానం చేయుము. సూర్యుని అర్ధగర్భితాలయిన మాటలు విని అగస్త్యుడు – నన్నర్ధించిన వారెవ్వరూ విఫలులై తిరిగి వెళ్ళరు ణీ మనోవాంఛితము తెలుపుము. నెరవేర్చెదను. అనగా అమృతోపమాలైన ఆ మాటలకు సంతోషించి చేతులు జోడించుకొని సూర్యుడు – ‘ఈ పర్వత శ్రేష్టుడు ణా మార్గాన్ని నిరోధించినాడు. ఈ వింధ్యుని ఔన్నత్యాన్ని తగ్గించండి. అని విన్నవించెను. ‘దివాకరా! ననాశ్రయిచితివి. నీకేమి బాధకలుగును? వింధ్యుని శిఖరములను అణచినట్లే తెలియుము. ణీ కిరణ ప్రసారానికిక ఆటంకం ఉండదు, అని సూర్యుని ఊరడించి అగస్త్యుడు, భక్తితో రవికి మ్రొక్కి దండకారణ్యం వదలి వింధ్యాచలానికి ప్రయాణించెను. వింధ్యుని చూచి కుంభజుడు అచలోత్తమా! నేను ముసలివాడను. పుణ్యతీర్థయాత్రలకై వెళ్ళుచున్నాను. నిన్ను దాటిపోజాలకున్నాను. కనుక నీవు వెంటనే క్రిందకు వంగి నాకు దారి యిమ్మనెను. ఆ ముని శ్రేష్టుని కోరికను తలదాల్చి వెంటనే వింధ్యుడు పొట్టి వాడాయెను. ఆ పర్వతాన్ని దాటిన తర్వాత నాగస్త్యుడతనితో నిట్లనెను. ఓ శైలమా! నేను తీర్థావగాహనం చేసి పరిశుద్దుడనై నిజాశ్రమానికి తిరిగి వచ్చువరకు నీవు పెరుగకుండా యిట్లే పడియుండుము. లేనిచో నీయవజ్ఞకు శపింపగలను. ఆ విధంగా ఉద్ధతుడగు వింధ్యుని హెచ్చరించి అగస్త్యుడాకాశామార్గాన దక్షిణ దిశగా వెళ్లి, తగిన అదనుచ్చోచి తిరిగి పోవ ఉద్దేశ్యముతో నచటనే స్థిరపడిపోయెను. అచట బంగారు తోరణాలతో రమ్యంగా ఉండే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని విదర్భ రాజపుత్రియుగు భార్య లోపాముద్ర నచటవదలి నిజాశ్రమానికి వెళ్ళెను. ఋతు ఋతువుకూ పర్వసమయాల్లో ఆ మహర్షి ఆకాశంలోని ఆ ఆశ్రమంలో ఉంటూ ఇతర సమయాల్లో దండ కారణ్యంలోని నిజాశ్రమానికి వెళ్తూ ఉంటాడు. ఇక వింధ్యుడు గూడ ఆకాశంలోని ఆ దివ్యాశ్రమాన్ని చూచి భయపడి పెరుగుటమాని ఆ తేజస్వి తిరిగి వస్తాడని ప్రతీక్షిస్తూ తన శిఖరాలను వంచుకొనియే యున్నాడు. ఈ విధంగా తపోధనుడగు నగస్త్యుడా వింధ్యుని తల పొగరణచి పాదాక్రాంతు నొనరించినాడు. మహర్షే! మునీశ్వరులంతా స్తోత్రాలు చేస్తూండగా నాకాత్యాయనీ దుర్గ రాక్షస సంహారం చేసే సంకల్పంతో ఆ వింధ్యాద్రి ఊర్ధ్వ శృంగాన్ని అధిరోహించి నిలచింది. ఇక తమ బాధలు మరచి దేవతలు సిద్ధులు, ఉరగులు, విద్యాధరులు, భూతగణాలు, అప్సరసలు ఆ కాత్యాయనీ దేవిని రంజింపచేస్తూ ఆమె సేవలో ఉండి పోయారు.
అధ్యాయము 19 complete
Summary of chapter 19 of the Vāmana Mahā Purana is as follows:
The narrative continues to glorify the supreme majesty and cosmic potency of the Divine Mother, who rides forth on her fierce lion mount, filling the universe with her roaring divine splendor. The chapter details the awe-inspiring preparations as the Goddess manifests multiple arms holding celestial weapons, terrifying the demonic hosts while filling the devas with boundless hope and devotion. The text extols Her as the ultimate source of creation, sustenance, and dissolution, whose mere glance destroys all darkness and protects those who take refuge in Her lotus feet.