వామన మహా పురాణము
అధ్యాయము 38
ఓ అరజా ! ఆ చిత్రాంగద అక్కడ వీరుడైన సురథుణ్ని స్మరిస్తూ చాలకాలం ఉండిపోయింది. దైవోపహతుడై విశ్వకర్మ మునిశాపంవల్ల భయంకరాకారంతో వానరుడై మేరుశిఖరాన్నుంచి భూమ్మీద శాలూకినీ నదీతీరాన శాల్వేయ పర్వతం వద్ద భయంకరారణ్యంలో పడిపోయాడు. అక్కడ కందమూల ఫలాలు తింటూ అనేక సంవత్సరాలు గడిపాడు. ఒక పర్యాయం కందరుడు దైత్యశ్రేష్టుడు దేవవతిగా ప్రసిద్ధిగాంచిన తన ప్రియ పుత్రికను వెంటబెట్టుకుని అక్కడకు వచ్చాడు. తండ్రితో కలిసివస్తూన్న ఆ చంద్రముఖిని చూచి ఆ వానర శ్రేష్ఠుడు బలవంతంగా ఎత్తుకొని పోయాడు. తన కుమార్తె నతడు హరించుకొని పోవుట చూచి మండిపడి ఆ కందరుడు కత్తిదూసి వానిని వెంబడించాడు. తనమీదకు దూకుతున్న దైత్యుని చూచి ఆ కపి దేవవతితో హిమాచలానికి పారిపోయాడు. అక్కడ యమునా తీరాన శ్రీకంఠేశ్వరుని అక్కడకు సమీపంలో ఋషిలేనటువంటి శూన్యాశ్రమాన్ని చూచి ఆ పవిత్రాశ్రమం లోపల వేదవతిని ఉంచి తాను ఆ రాక్షసుడు చూస్తుండగా కాళిందీ జలాల్లో మునిగిపోయాడు. అంత నా దానవుడు వానరంతోబాటు తన కుమార్తె కూడా నదిలో మునిగి చనిపోయిందని భావించి నిరాశుడై తనపాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ వానరుడావిధంగా కాళిందీ ప్రవాహంలో కొట్టుకొనిపోయి సజ్జనులకావాసమై 'శివి' అనే దేశం చేరాడు. అక్కడ నీళ్ళల్లో నుండి బయటపడి దేవవతిని వదలి వచ్చినచోటకు వెళ్ళాలని త్వరగా బయలుదేరాడు.
అంతట అంజనుడను యక్షశ్రేష్ఠుడు తనకూతురు నందయతితో అటువైపు రావడం చూచి ఆమెయే దేవవతి యనుకొని తను నీళ్ళలో దూకడం వ్యర్థమైనదని భావించాడు. అలా అనుకొని ఆమెను పట్టుకొనుటకు లంఘించగా నామె నామె భయపడి హిరణ్వతీ ప్రవాహంలో దూకింది. అలా తన పుత్రిక నదిలో పడిపోవటంచూచి చాలాసేపు దుఃఖించి ఆ యక్షుడంజనాద్రికి వెళ్ళిపోయాడు. అక్కడ మౌనవ్రతంతో ఆ మహాతేజస్వి అనేక సంవత్సరాలు తపస్సులో ఉండిపోయాడు. హిరణ్వతి ప్రవాహంలో కొట్టుకొని పోయిన నందయంతి మహాపుణ్యభూమి అయిన కోశల దేశం చేరింది. సాధువులకు నెలవైన ఆ భూమి మీద విలపిస్తూ పోయిపోయి ఆ సుందరి అసంఖ్యాకాలయిన ఊడలతో విశాల ప్రదేశంలో శివుని జటాభారంలాగ విస్తరించిన ఒక మర్రిచెట్టు మూలాన ఒకశిలా వేదిక మీద వెళ్ళి కూర్చున్నది. ఆవటచ్ఛాయలో విశ్రమించిన ఆమెకు ఇలా కొన్ని మాటలు వినపడ్డాయి "తపోధనుడైన నా తండ్రికి, నీ పుత్రుడు మర్రిచెట్టుకు బంధింపబడి ఉన్నాడని చెప్పగల పుణ్యాత్ములు లేరా ! ఆ మాటలు విని ఆ సుందరాంగి క్రింద పైన ప్రక్కలా నలువైపులా కలయ చూచింది. అంతట నామె ఆ మర్రిచెట్టు చిటారుకొమ్మన, తన జడలతో చెట్టుకొమ్మకు గట్టిగా కట్టి వేయబడిన ఐదేండ్ల బాలకుని చూచి చాలా దుఃఖించి బాబూ ! ఏ పాపిష్ఠుడు నిన్నిలా బంధించాడు ? అని అడిగింది, అంత నాబాలకుడా నందయంతితో అన్నాడు. ఓ మహనీయురాలా ! పరమ దుర్మార్గుడైన ఒక కపి నన్నిక్కడ జడలతో బంధించాడు. కేవలం తపోబలంతో బతికి ఉన్నాను. మహేశ్వరునకావాసమైన పురోన్మత్తపురంలో నా తండ్రి పరమ తపోరాశి ఋతధ్వజుడున్నాడు. ఆ మహాయోగి జపసమాధిలో ఉండగా సర్వశాస్త్ర విశారదుడనై తుమ్మెదలతో ఆవరింపబడి నేను జన్మించాను. అంతట నా తండ్రి నాకు జాబాలి అని నామకరణం చేసి యిలా అన్నాడు. నీవు అయిదువేలేండ్లు బాలుడివిగా ఉంటావు. పదివేలేండ్లు కౌమార్యం యిరవై వేలేండ్లు యౌవనం, తర్వాత నలభై వేల యేండ్లు పైకాలం గడుపుతావు. ఇందులో బాల్యంలో అయిదు వందల ఏండ్లు దృఢ బంధనం అనుభవిస్తావు, కౌమారంలో వేయేండ్లు శరీర బాధతో కష్టవడతావు. యౌవనంలో రెండువేలేండ్ల పరమ సౌఖ్యాలు అనుభవిస్తావు.
ముసలితనంలో, నాలుగువేలేండ్లు భూమ్మీద శయనిస్తూ దుష్టాన్నం భుజిస్తూ బాధలనుభవిస్తావు. ఇలా నా తండ్రి నా విషయం వివరించాడు. నేను అయిదేండ్ల బాలుడుగా నడుస్తూ స్నానానికై హిరణ్వతీనదికి వెళ్తుండగా ఆ కపివీరుడు చూచి, మూర్ఖుడా ! మహాశ్రమంలో నేనుంచిన దేవవతిని తీసుకొని ఎక్కడికెళ్తున్నావని భయంతో గడగడలాడుతున్న నన్ను పట్టుకొని నా జడలతోనే ఈ వట వృక్షానికి గట్టిగా కట్టివేశాడు. ఆ దుష్టుడు నేను క్రిందపడకుండా తీగలతో త్రాళ్ళతో, క్రిందా పైనా నలువైపలా అభేద్యంగా బంధించాడు. ఇలా లతాయంత్ర బద్ధుణ్ణి గావించి ఆ వానరుడమర పర్వతానికి వెళ్ళిపోయాడు. నేను చూచినదంతా యథాతథంగా నీకు చెప్పాను. ఇక ఓ సుందరీ ! నీవెవరు ? ఎవరితో వచ్చి ఈ మహారణ్యంలో వంటరిగా చిక్కుబడి పోయావు. నాకు చెప్పమని ఆ బాలుడడిగాడు. అందులకానందయంతి, అంజనుడను యక్షునకు ప్రమ్లోచ వలన గలిగిన కుమార్తెను నేను. పేరు నందయంతి. ముద్గలమహర్షి నా జాతకం చూచి నేను నరేంద్ర మహిషినయ్యెదనని జోస్యం చెప్పాడు. వెంటనే శుభాశుభసూచకంగా దేవదుందుభులు మ్రోగాయి. పిడుగుల ధ్వనులూ వినిపించాయి. అంతనాఋషి ఈ బాలిక రాజుభార్య కావడం తప్పదు. అయితే కన్యగా ఉన్న దినాల్లో ఆపదల్లో చిక్కుకుంటుందని తుది నిర్ణయం చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకు మా తండ్రి నన్ను వెంటబెట్టుకొని పవిత్ర తీర్థానికి వెళ్తుండగా హిరణ్వతి నది తీరాన ఒక వానరం నామీద దూకింది. నేను భయంతో సాగరాభి ముఖంగా పోతున్న హిరణ్వతీ ప్రవాహంలో పడిపోయి నిర్మానుష్యమైన ఈ దేశానికి కొట్టుక వచ్చినాను. అంటూ తన వృత్తాంతమంతా వినిపించింది. అదివిని జాబాలి ఆమెతో ఓ కోమలీ ! నీవు యమునాతీరానగల శ్రీకంఠేశ్వర క్షేత్రానికి వెళ్ళు. ప్రతిదినం మధ్యాహ్నవేళ కచటకు నా తండ్రి శివుని అర్చించుటకు వచ్చును. ఆయనకాళ్ళు పట్టుకొని ఆశ్రయిస్తే నీకు మేలు తప్పక కలుగుతుందని చెప్పాడు. అదివిని నందయంతి తన కష్టాలు పోగొట్టుకొనుటకై త్వరగా హిమాచలాన యమునా తీరానగల శ్రీకంఠక్షేత్రానికి బయలుదేరి చాలాకాలం కందమూల ఫలాలు తింటూ ప్రయాణం చేసి తుదకుశంకర నిలయానికి చేరుకుంది.
ఆమెలోకవంద్యుడగు శ్రీకంఠేశ్వరునకు ప్రణమిల్లి అచట వ్రాయబడిన శ్లోకం చదువుకొని అర్థం చేసుకుంది. అంతట నామె కళకళలాడే నవ్వు మొగముతో దాని క్రిందనే జాబాలి చెప్పిన శ్లోకం తాను వ్రాసింది. ఆ వెంటనే తన గాథను కూడ తెలిపే మరొక శ్లోకం కూడా వ్రాసింది ఈ విధంగా "ముద్గలుడు రాజపత్నివి అవుతావని నాకు జోస్యం చెప్పాడు. అయితే నేనీ దురవస్థలో ఉన్నాను. ఎవరో ఒక ప్రభువు నన్ను రక్షించుగాక. "ఆ శిలావేదికమీద ఆ విధంగా వ్రాసి ఆమె యమునలో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ మత్తకోకిల నాదాలతో మారుమోగుతున్న ఆశ్రమాన్ని చూచి ఆ ఋషివర్యుడక్కడ తప్పకుండా ఉన్నాడని అనుకుంటూ ఆ ఆశ్రమం లోపల ప్రవేశించింది. అయితే అక్కడ దివ్యకాంతిలో వెలుగుతున్న పవిత్రురాలు దేవవతి ముఖం ఎండిపోయి, కళ్ళలో ప్రాణం పెట్టుకొని వాడిన తామరపూవులా కనిపించింది. ఆ యక్షపుత్రి తనవైపు రావడం చూచి దైత్యకుమారి లేచి నిలబడి ఈమె ఎవరా, అని, ఆలోచించసాగింది. అంతట వారిద్దరు ఒకరినొకరు సమీపించి స్నేహపరస్పరంగా గాఢాలింగనాలు కావించుకున్నారు. ఒకరి నొకరు ప్రశ్నించుకొని పరస్పర వృత్తాంతాలు తెలుసుకున్నారు. అలా వారు కుశల ప్రశ్నలు వేసుకొనుచుండగా నా తత్వదర్శి అయిన మునిశ్రేష్ఠుడు స్నానార్థం శ్రీకంఠేశ్వరాలయానికి వచ్చి అక్కడ శిలాపట్టం మీద వ్రాయబడిన అక్షరాలు చదువుకొని మహూర్తకాలం ధ్యానస్థుడై అంతా సాకల్యంగా తెలుసుకున్నాడు. అంతట నా ఋతధ్వజుడు త్వరగా స్వామిని అర్చించి ఇక్ష్వాకు చక్రవర్తిని చూచుటకు అయోధ్యకు పోయి చేరుకున్నాడు. ఆ రాజ శ్రేష్ఠుని చూచి ఆ తపస్వి ఓ నరశార్దూలా ! రాజా ! నావిజ్ఞప్తి వినుము. సర్వగుణోపేతుడు సర్వశాస్త్రకోవిదుడైన నా కుమారుని ఒక వానరుడు నీ రాజ్యసీమలో బంధించియున్నాడు. అర్థశాస్త్రవిధి అయిన నీ కుమారుడు శకుని తప్ప మరెవ్వరు ఆ బాలుని విడిపించజాలరన్నాడు.
ఓ సన్నని నడుముగల అరజా ! ఆ మునిమాటలు విని నా తండ్రి తన ప్రియ తనయుడు శకునిని ఆయనవెంట వెళ్ళమని ఆదేశించాడు. అంతట మహాభుజుడైన నా సోదరుడు మునివెంట వెళ్ళి ఊడలతో దిశలన్నీ కప్పివేస్తూ ఉన్న ఆ బ్రహ్మాండమైన మర్రిచెట్టును సమీపించి వృక్షం చివర కట్టబడి ఉన్న మునికుమారుణ్ణి చూచాడు. ఆ బాలకుని నలువైపులా లతలు గట్టిగా బంధించి ఉన్నాయి. అతని జటలతోనే అతడు కొమ్మకు బంధింపబడి ఉన్నాడు. అంత నారాకుమారుడు విల్లెక్కుపెట్టి అతి నేర్పుతో బాలకునకు దెబ్బతగలకుండా చుట్టూ వానరుడు బిగించిన లతా బంధాలు తెగకొట్టాడు. కపి కట్టిన లతాపాశాలన్నీ అయిదు వందల సంవత్సరాల తర్వాత ఆ మహావీరుని బాణ ఘాతాలకు తెగిపోయాయి. వెంటనే ఆ ముని త్వరగా తెగిన లతలతో కప్పబడిన ఆ వటశాఖాగ్రానకు ఎక్కి కుమారుని చూడగా నా బాలకుడు జడలచే బంధితుడయినందున శిరోనమ్రభావంతో తండ్రికి నమస్కరించాడు. పుత్ర స్నేహంతో ఋతధ్వజుడా జాబాలిని నుదురుపై మాటిమాటికి ముద్దుపెట్టుకున్నాడు. పూర్తిగా కట్లు విప్పడానికి తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలంకాగా ఆ వీరుడు శకుని విల్లంబులతో చెట్టుమీద ఎక్కి తాను ప్రయత్నించాడు. అయినా బాలకుని కట్టు ఊడలేదు. అంతట నా వీరుడు మునితోకూడ చెట్టుమీదనుంచి క్రిందకు దిగి అతి లాఘవంగా బాణాలతో ఒక శరమండపాన్ని కట్టి ఆ కొమ్మను మూడు ముక్కలుగా ఖండించాడు. అంతట నా జాబాలి తలకు కట్టబడిన చిరుగొమ్మల బరువుతో, ఆ బాణాల మెట్లమీద నుంచి మెల్లగా క్రిందకు దిగివచ్చాడు. ఆ విధంగా ధానుష్కులలో ముఖ్యుడైన రాజకుమారుడు బంధవిముక్తుడిని గావించిన కుమారుడు జాబాలిని, తలమీద బరువుతో సహా, వెంటబెట్టుకొని ఆ ఋతధ్వజుడు యమునానదికి వెళ్ళాడు.
అధ్యాయము 38 Complete
Summary of chapter 39 of the Vāmana Mahā Purana is as follows:
The chronicle details the ongoing conflict involving the demon king Andhaka, who seeks to assert demonic authority over the cosmos with the aid of his ally Pātālaketu. As the divine forces of Parameśvara Śiva and the devas unleash relentless spiritual energy against the asura strongholds, Pātālaketu is overwhelmed by divine weapons and defeated. Realizing the impossibility of overcoming the Supreme Divine on Earth and Heaven, the terrified demon Andhaka flees from the battleground and takes refuge in the subterranean realm of Pātāla to regroup his surviving forces.