వామన మహా పురాణము
అధ్యాయము 14
ఋషులు
అహింస, సత్యం, అస్తేయం(అచౌర్యం), దానం, క్షాంతి(సహనం), దమం(ఆత్మనిగ్రహం), శమం(శాంతి), అలోభిత్వం, పవిత్రత, తపస్సు, ఈ పదీ సర్వవర్ణాల వారికి నిర్దేశింపబడిన ధర్మదేవతకు అంగములు. నాలుగాశ్రమాలకు విహితాలయిన బ్రాహ్మణులకు కూడా అనుష్ఠేయాలు.
తపోధనులారా! బ్రాహ్మణులు జీవితంలో నాలుగు దశ(ఆశ్రమము) ల యందు ఆచరించాల్సిన ధర్మవిధులు నాకు వివరంగా చెప్పండి. ఇంతవరకు విన్నదానితో నా జ్ఞానతృష్ణ తీరలేదు.
ఉపనయనమైన పిదప బ్రహ్మచారి గురుకులానాసం చేస్తూ అక్కడి విధులన్నీ పాటించాలి. వినుము. వేదాధ్యయనం, అగ్నిసేవనం, స్నానం, భిక్షాటనం తెచ్చిన భిక్ష గురువుకు నివేదించి, ఆయన అనుజ్ఞతో భుజించుట, ఉత్సాహంతో గురువుగారికి అన్ని విధాల శుశ్రూష చేస్తూ ఆయన ప్రేమకు పాత్రుడు కావడం, గురువు పిలిచినప్పుడు భక్తిశ్రద్ధలతో వెళ్లి ఆయన చెప్పే పాఠాలు వినడం, ఒకటో రెండో, లేక నాలుగు వేదాలను గురుముఖతః అభ్యసించి, గురువుకు తగిన దక్షిణ యిచ్చి, ఆయన అనుజ్ఞతో తన యిష్టప్రకారం గృహస్తాశ్రమాన్ని కానీ, వానప్రస్థ, సన్యాసాశ్రమాన్ని కానీ స్వీకరించడం, లేక గురువు ఇంట్లోనే ఉంది నైష్టిక జీవితం గడపడం, ఆయన తర్వాత ఆయన కుమారుని కానీ, కుమారులు లేని పక్షాన ఆయన శిష్యులను కాని ఏ మాత్రం గర్వాభిమానాలు లేకుండా సేవించడం, బ్రహ్మచర్యాశ్రమ విధులు. ఈ విధంగా నడుచుకొనే బ్రాహ్మణుడు మృత్యువును జయిస్తాడు. రాక్షసవరా! గృహస్థుగా నుండ గోరినవాడు గుర్వాశ్రమం వదలి, తనకన్నను భిన్న గోత్ర ఋషిపరంపరకు చెందిన ఉత్తమకుల వధువును భార్యగా స్వీకరించాలి. తన విధ్యుక్త ధర్మానుసారం ధనోపార్జన చేసి, పితృదేవాతిథును భక్తితో సంతృప్తి పరుస్తూ చక్కని నడవడి కలిగి ఉండాలి.
సదాచరణం, మంచి నడవడి అన్నారు గదా. ఆ మంచి నడవడి అనగానేమో దయచేసి వివరించండి .
నీమీద గల ఆదరంతో నీకు సదాచారణమును వివరించాము. రాక్షసపతీ! దానిని గురించి వివరంగా వినుము. గృహస్తు ఎల్లప్పుడు ఆచారవంతుడుగా ఉండాలి. ఆచార హీనునకు ఇహపరాల్లో గూడ మేలుకలుగదు. సదాచారోల్లంఘన చేయువానికి, యజ్ఞం దానం తపోవ్రతాదుల వల్ల మంచి కలుగదు. దుష్టాచరణం చేయువానికి యిహపరాలలో సుఖం కలుగదు. కాబట్టి గట్టిగా ప్రయత్నించి మానవుడు సదాచరణం చేయాలి. సదాచరణ చెడుగును నశింపచేస్తుంది. దానవా! ఆ సదాచరణ స్వరూపాన్ని చెబుతున్నాం. శ్రద్ధగా వినుము. ధర్మం సదాచార వృక్షానికి మొదలు, దానం శాఖలు, కామం పుష్పం, మోక్షం ఫలం. ఇలాంటి సదాచార వృక్షాన్ని సేవించిన వాడే పుణ్యాత్ముడు. బ్రాహ్మీ ముహూర్తాననే నిద్ర లేచి దేవస్మరణం ఋషిస్మరణం చేయాలి. తర్వాత శంకర ప్రోక్తమైన ప్రాభాతిక మంగళస్తోత్రం పఠించాలి.
పాపబంధ విముక్తికై పరమశివుడనుగ్రహించిన ఆ సుప్రభాత స్తోత్రమెట్టిది ?
రాక్షస శ్రేష్ఠా ! శంకరుడనుగ్రహించిన సుప్రభాతం వినుము. దీనిని విన్నా, చదివినా అనుస్మరణం గావించినా సరే సర్వపాప విముక్తి కలుగుతుంది.
బ్రహ్మ, మురారి, త్రిపురాంతకుడు, సూర్యచంద్రులు, అంగారక బుధులు, గురుశుక్రులు, శనైశ్చరుడు వీరంతా నాకు సుప్రభాతం అనుగ్రహింతు గాక! భృగువు, వశిష్టుడు, క్రతువు, అంగీరసులు, మనువు, పులస్త్యుడు పులహ గౌతములు, రైభ్య మరీచులు, చ్యవనఋభులు నాకు సుప్రభాత మోసగుడురుగాక! సనకసనందసనత్కుమార సనాతనులు, ఆసురిపింగళులు, సప్తస్వరాలు, సప్తరసాతలాలు నాయీ ప్రభాతాన్ని కళ్యాణమయం గావింతురు గాక! గంధ గుణం గల పృథ్వీ రాసాత్మకమగు జలములు, స్పర్శ గుణాత్మకమగు వాయువు, తేజో రూపము గల అగ్ని, శబ్ద గుణకమగు నాకాశము, మహత్తుతో కూడి ఈ ప్రొద్దు నాకు శుభములు చేకూర్చు గాక! సప్త భువనాలు వీరందరూ నాకు సుప్రభాత మనుగ్రహింతురు గాక! ఉదయం నిద్ర నుండి లేవగానే ఈ సుప్రభాత పఠనం శ్రవణం లేక స్మరణం చేసినచో అంతకు ముందు రాత్రి సంభవించిన దుస్వప్న దోషాలు తొలగి భగవత్కృప వల్ల మానవుడు శుభాలు పొందుతాడు. ఇందులో సందేహం లేదు.
అలా భాగావత్స్మరణతో శయ్య నుంచి లేచి, ధర్మార్థ చింతన పూర్వకంగా శ్రీహరినామం స్మరించి నిత్య విధుల కుపక్రమింపవలెను. దేవబ్రహ్మణాగ్ని మార్గాలను, రాజవీథులను, చతుష్పథాలను, గోశాలలను వదలి తూర్పు పడమర దిక్కులను వదలి మలమూత్రాదులు వదలాలి. మలోత్సర్జనం తర్వాత మట్టితో గుదస్తానాన్ని ముమ్మారు, ఎడమ అరచేతిని ఏడు పర్యాయాలు, తర్వాత నా రెండింటినీ పది పర్యాయాలు, లింగాన్ని ఒక పర్యాయం శుభ్రం చేసుకోవాలి. ఓ రాక్షసా! సదాచారం తెలిసిన వాడు ఈ మృత్తికను, నీళ్ళలో నుంచి కాని, ఎలుక బొరియల నుంచి కాని, పాముపుట్టల నుండి గాని ఒక పర్యాయం ఉపయోగించి వదలినది కాని, లేక యింటిలో నుంచి కాని తీసుకోరాదు. తెలిసిన వ్యక్తి తూర్పు ముఖంగా కాని, ఉత్తర ముఖంగా కాని తిరిగి కూర్చోని మొదట రెండుమార్లు ముఖం కడుగుకొని నురుగులేని నీళ్ళతో పుక్కిలించవలెను. అనంతరము చేతితో పంచేంద్రియాలను, శిరస్సును స్పృశించి, దంత ధావనం చేసి, తల దువ్వుకొని అద్దంలో ముఖం చూచుకొని యథావిధిగ సంధ్యా వందనం చేయవలెను. ఆ పైన శిరఃస్నానం గాని అంగ స్నానం గాని చేసి, దేవా పితృజల తర్పణం విడిచి, హోమం చేసి మంగళ ద్రవ్యం ముట్టుకొని అనంతరం బయటకు వెళ్ళుట ప్రశస్తం. ఈ మంగళ ద్రవ్యములలో దూర్వా(గరిక), పెరుగు, నెయ్యి, జలకుంభం, దూడతో ఉన్న ధేనువు, వృషభం, బంగారం, మృత్తిక, ఆవుపేడ, స్వస్తికం, అక్షతలు, పేలాలు, తేనె, బ్రాహ్మణ కన్య, తెల్లని పూలు, అగ్ని, చందనం, సూర్యబింబం, రావిచెట్టు ముఖ్యమైనవి. వీనిలో ఏ యొక దానినైనను స్పృశించి యితర పనులు చూచుకోవలెను. దేశ కాలాదులననుసరించి తన కులధర్మం గోత్రవిధులు వదలకుండా నిర్వర్తించుకోవలెను. ఆ విధంగా అర్థ సిద్ధిని పొందుతూ, అనవసర విషయాలు, అసత్య వచనాలు, పరుష వచనాలు, వేద శాస్త్ర విరుద్ధ విషయాలు మాటాడకుండా కాలయాపన చేయాలి. లేనిచో సజ్జనుల నిందకు గురికావలసి వచ్చును. సదాచారశీలునకేనాడును ధర్మభంగం చేయడం కాని దుష్టులతో సహవాసం కాని విహితాలు కావు. ఉభయ సంధ్యలలో గాని పగటివేళ కాని స్త్రీ సంగమం పనికిరాదు. పరస్త్రీలతో అసలే పనికి రాదు. ఇండ్లులేని బయలు ప్రదేశాలలో గాని, నీళ్ళలో గాని స్త్రీ సంగమం చేయకూడదు. ఋతుకాలాల్లో స్త్రీలను కూడరాదు. ఓ వీరాగ్రణీ! ప్రయోజనం లేని తిరుగుడు, అర్థంలేని దానం, పశు హింస అక్రమంగా దారపరిగ్రహణం గృహమేధి చేయరాదు. వృథా పర్యటనం వల్ల నిత్యనైమిత్తిక కర్మలకు అంతరాయం, వ్యర్థపు దానం వల్ల ధన నష్టం సంభవిస్తాయి. ఉబుసుపోక పశుహింస చేయువాడు నరకానికి పోతాడు. ఇక అక్రమ దారగ్రహణం వల్ల సంతాన హాని అమంగళకరమైన వర్ణసాంకర్య భయం సంభవిస్తాయి.
ఉత్తములగు వారు పరధనానికి పరుల భార్యలకు ఆశ పడరు. వానిలో మొదటిది నరక ద్వారమైతే రెండవది మృత్యువునకు హేతువు. వివస్త్రలుగా ఉన్న పరస్త్రీలను చూడరాదు. చోరులతో సంభాషింప రాదు. ఋతు కాలంలో ఉన్న స్త్రీలను చూడరాదు, తాకరాదు. వారితో సంభాషింప గూడదు. తోబుట్టువులతో గాని, యితరుల భార్యలతో గాని, తన తల్లితో కాని వయసు వచ్చిన కూతురుతో గాని ఒకే ఆసనం మీద కూర్చోకూడదు. దిగంబరంగా పరుండరాదు, స్నానం చేయరాదు. అటునిటు తిరుగరాదు. పగిలిపోయిన ఆసనాలను(పీటల) గాని పాత్రలను గాని దూరంగా వదలివేయాలి. శుక్ల పాఢ్యమి, షష్టి, ఏకాదశి తిథులలో తైలాభ్యంజన మాచరించరాదు. చతుర్థి నవమి చతుర్దశీలలో క్షౌరం చేసుకోకూడదు. శుక్ల పంచమీ, దశమి పూర్ణిమలలో స్త్రీ సంగమం పనికిరాదు. అయితే శుక్ల విదియ, సప్తమి ద్వాదశీ తిథులలో పైవన్నియూ చేయవచ్చు. ఆదివారం మంగళవారములలో తలంటిస్నానం శుక్రవారాల్లో క్షౌరం, శనివారాల్లో మాంసాహారం వర్జించాలి. బుధవారాల్లో స్త్రీ సంగమం చేయకూడదు. మిగతా దినాలలో ఏదైనా ఎపుడైనా చేయవచ్చు. చిత్త, హస్త, శ్రవణ నక్షత్రాలలో అభ్యంజనం, విశాఖ అభిజిత్తులలో క్షౌరం, మూల, మృగశిర, భాద్రపదాలలో మాంసభక్షణం, మఖ కృత్తిక ఉత్తర నక్షత్రాలలో స్త్రీ సంగమం చేయకూడదు. పశ్చిమ ఉత్తర దిశగా తలపెట్టుకు ఏనాడూ నిద్రించారాదు. రాక్షసేశ్వరా ! దక్షిణ దిశగా గాని పడమట దిక్కుగా గాని కూర్చొని భోజనం చేయరాదు. దేవాలయాలను, దారి ప్రక్కన, దారులు కలిసే చోట (చతుష్పథాలు) ఉండే చెట్లను, విద్యాధికులను, గురువులను కుడివైపు నుండి ప్రదక్షిణించకూడదు. తెలిసిన వాడు యితరులుపయోగించిన, పూమాలలను, అన్నపానీయాలను, వస్త్రాలను తాను ఉపయోగించకూడదు. రోజూ శిరఃస్నానం చేయాలి; విశేష కారణం లేకుండా రాత్రి వేళల చేయరాదు. అనగా గ్రహణ పర్వాలలో గాని, బంధువులు మరణించినప్పుడు కాని, జన్మ నక్షత్రం లోనికి చంద్రుడు ప్రవేశించినప్పుడు కాని రాతుల్లో శిరస్నానం చేయవచ్చు. రాక్షస రాజా! తలంటుకొనిన వానిని తాకకూడదు.తలారా స్నానం చేసిన వెంటనే వెంట్రుకలను విదిలించరాదు. వెంటనే విడిచిన గుడ్డతో గాని చేతితో గాని శరీరం తుడుచుకొకూడదు. చక్కని రాజ్యపాలనలో ఉన్న దేశంలో ఐకమత్యంతో కలిసికట్టుగా ఉన్న సమాజంలో, క్రోధనులు న్యాయప్రియులు అయిన జనులమధ్య కష్టపడి సేద్యముచేయు రైతులు, అనేక విధాల ధాన్యపుపంటలు కలిగి సమృద్ధమైన చోట నివాసమేర్పరచుకోవాలి. అశక్తుడు ప్రజలను దండించే వాడునైన రాజు ఉన్నచోటున పరస్పర వైరంతో, ఆమోద ప్రమోదాల్లో మునిగి తేలే ప్రజానీకం ఉన్న చోట బుద్ధిమంతుడగు వాడుండరాదు. సుకేశీ ! ఈ విషయాలు మరువరాదు సుమా !
అధ్యాయము 14 complete
Summary of chapter 14 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya imparts profound discourses on the eternal tenets of Dharma, defining the duties associated with the various varṇas and āśramas within human society. The chapter emphasizes the universal virtues of ahiṃsā, satya, asteya, śaucha, and indriya-nigraha as the foundational pillars for spiritual ascension and social harmony. Through illustrative examples and sage counsel, the text highlights that true righteousness is not merely external ritualism, but an internal transformation rooted in selflessness, devotion to the Supreme Divine, and service to all living beings.