31 - పరశురామాయ శ్రీకృష్ణ కవచ ప్రదానం

నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునితో నిట్లనెను-

భగవంచ్ఛ్రోతు మిచ్చామీ కిం మంత్రం భగవాన్ హరః ।

 కృపయాఽదాత్పరశురామాయ స్తోత్రమేవ చ వర్మ చ ॥

కోవాఽస్యమంత్రస్యారాధ్యః కిం ఫలం కవచస్య చ ।

 స్తవనస్య ఫలం కిం వా తద్భవాన్వక్తుమర్హసి ॥

ఓ నారాయణమునీ! పరమశివుడు పరశురామునకు ఉపదేశించిన స్తోత్రము, మంత్రము, కవచము ఎట్టివి? ఆమంత్రము ఎవరికి సంబంధించినది? స్తోత్రము కవచముల యొక్క ఫలమేమి?  విషయములనన్నిటినీ నాకు వివరించి చెప్పుమని ఆడిగాను.

 నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-

 మంత్రారాధ్యో హి భగవాన్ పరిపూర్ణతమః స్వయం ।

 గోలోకనాథః శ్రీకృష్ణా గోపగోపీశ్వరః భుః ॥

 త్రైలోక్యవిజయం నామ కవచం పరమాద్భుతం।

స్తవరాజం మహాపుణ్యం భూతి యోగ సముద్భవం॥

 మంత్రం కల్పతరుం నామ సర్వకామ ఫలప్రదం ।

 దదౌ పరశురామాయ రత్న పర్వత సన్నిధౌ ॥

స్వయం ప్రభా నదీ తీరే పారిజాత వనాంతరే ।

 ఆశ్రమే లోక దేవస్య మాధవస్య చ సన్నిధౌ ॥

పరమ శివుడు పరశురామునకు ఉపదేశించిన మంత్రమునకు ఆరాధ్యదైవము పరిపూర్ణుడు గోపగోపికానాథుడగు శ్రీకృష్ణుడే. శంకరుడు ఉపదేశించిన త్రైలోక్య విజయమను కవచము చాల అద్బుతమైనది. అట్లే ఆతడు ఉదేశించిన స్తోత్రము వలన గొప్ప సంపద మరియు యోగము కలుగును. ఆతడుపదేశించిన కల్పతరువను మంత్రము సమస్తమైన కోరికలను తీర్చును. వీటిని పరమశివుడు రత్నపర్వత సమీపమున, స్వయంప్రభానదీ తీరముననున్న పారిజాత వనములోని పరమేశ్వరుని ఆశ్రమమున మాధవుని యొక్క సమీపమున ఉపదేశించెను.

మహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లనెను-

వత్సాగచ్ఛ మహాభాగ భృగువంశ సముద్భవ ।

పుత్రాధికోఽసి ప్రేమ్ణా మే కవచ గ్రహణం కురు ॥

 శ్రుణు రామ ప్రవక్ష్యామి బ్రహ్మాండే పరమాద్భుతం ।

 త్రైలోక్య విజయం నామ శ్రీకృష్ణస్య జయావహం ॥

శ్రీకృష్ణేన పురాదత్తం గోలోకే రాధికాశ్రమే ।

రాసమండలమధ్యే చ మహ్యాం బృందావనే వనే॥

అతి గుహ్యతరం తత్వం సర్వమంత్రౌఘ విగ్రహం ।

 పుణ్యాత్పుణ్యతరం చైవ పరం స్నేహాద్వదామి తే ॥

 యద్ధృత్వా పఠనాద్దేవి మూలప్రకృతిరీశ్వరీ ।

శుంభం నిశుంభం మహిషం రక్తబీజం జఘాన హ ॥

యద్ధృత్వాఽహం చ జగతాం సంహర్తా సర్వతత్త్వవిత్ ।

అవధ్యం త్రిపురం పూర్వం దురంతమపి లీలయా ॥

యద్ధృత్వా పఠనాద్బ్రహ్మ ససృజే సృష్టి ముత్తమాం।

యద్ధృత్వా భగవాంఛేషో విధత్తే విశ్వమేవ చ॥

యద్ధృత్వా కూర్మరాజశ్చ శేషం ధత్తే హి లీలయా।

యద్ధృత్వా భగవాన్వాయుర్విశ్వాధారో విభుః స్వయం॥

యద్ధృత్వా వరుణః సిద్ధః కుబేరశ్చ ధనేశ్వరః ।

యద్ధృత్వా పఠనాదింద్రో దేవానామధిపః స్వయం ॥

 యద్ధృత్వా భాతి భువనే తేజోరాశిః స్వయం రవిః ।

యద్ధృత్వా పఠనాచ్చంద్రో మహా బల పరాక్రమః ॥

అగస్త్య సాగరాన్సప్త యద్ధృత్వా పఠనాత్పపౌ ।

చకార తేజసా జీర్ణం దైత్యం వాతాపి సంజ్ఞకం॥

యద్ధృత్వా జగతాం సాక్షి ధర్మో ధర్మభృతాం వరః ।

 సర్వవిద్యాధిదేవి సా యచ్చ ధృత్వా సరస్వతీ ॥

యుద్ధం జగతాం లక్ష్మీరన్నదాత్రీ పరాత్పరా ।

 యద్ధృత్వా పఠనాద్వేదాన్ సావిత్రీ సా సుషావ చ ॥

 వేదాశ్చ ధర్మవక్తారో యద్ధృత్వా పఠనాత్ భృగో ।

యద్ధృత్వా పఠనాచ్ఛుద్ధస్తేజస్వీ హవ్యవాహనః ॥

సనత్కుమారో భగవాన్ యద్ధృత్వా జ్ఞానీనాం వరః ॥

 దాతవ్యం కృష్ణభక్తాయ సాధవే చ మహాత్మనే ।

శఠాయ పరశిష్యాయ దత్వా మృత్యుమవాప్నుయాత్ ॥

భృగువంశమున పుట్టిన భార్గవరామా! నిమ్న నా పుత్రుని కంటే మిన్నగా ప్రేమించుచున్నాను. అందువలన త్రైలోక్య విజయమను ఈకవచమును స్వీకరింపుము. శ్రీకృష్ణునకు చెందిన ఈ త్రైలోక్యవిజయమమ కవచము అత్యద్భుతమైనది. సమస్త జయములను కలిగించును.

ఈ కవచమును శ్రీకృష్ణుడు గోలోకమున బృందావనములోని రాసమండలమున నున్న రాధికాశ్రమమున నాకు ఉపదేశించెను. ఇది మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములకు సారరూపమైనది. మిక్కిలి పుణ్యమైన దీనిని నీపై నున్న ప్రేమతో నీకు ఉపదేశించుచున్నాను.

ఈకవచమును శరీరమున ధరించి, పఠించి మూల ప్రకృతి యగు దుర్గాదేవి శుంభ నిశుంభులను మహిషాసురుని, రక్తభీజుని చంపగలిగినది. అట్లే నేను సర్వతత్త్వములను తెలిసికొని జగత్సంహార కారకుడనైతిని. అట్లే జయింపరాని త్రిపురములను అవలీలగా జయించితిని. దీనిని ధరించినందువలననే బ్రహ్మదేవుడు సృష్టిని చేయగలిగాను. శేషుడు అనంత విశ్వమును, ఆశేషుని ఆది కూర్మము ఆవలీలగా మోయుచున్నారు. ఈ కవచము వలననే వాయుదేవుడు సర్వప్రాణులకు ఊపిరిగానున్నాడు, వరుణుడు సిద్దినందినాడు. కుబేరుడు ధనాధిపతియైనాడు. ఇంద్రుడు దేవతలకు అధిపతి కాగలిగాను. సూర్యుడు తేజోరాశియైనాడు, చంద్రుడు మహా బలప రాక్రమ వంతుడయ్యెను. అగస్త్య మహాముని సప్త సాగరములను త్రాగగలిగెను, అట్లే వాతాపియను రాక్షసుని జీర్ణము చేసికోగలిగెను. ఈ కవచమును ధరించి పఠించినందు వలననే భూమీ అన్నిటికి ఆధారము కాగలిగినది. గంగ జగములన్నిటిని పవిత్రము చేయగలిగినది. ధర్మదేవత ధర్మవిదులలో శ్రేష్టుడు కాగలిగెను. సరస్వతీదేవి సమస్త విద్యలకు అధిదేవియైనది. జగన్మాతయగు అన్నపూర్ణాదేవి పరాత్పర కాగలిగినది. అగ్ని దేవుడు పరమశుద్ధుడు, తేజోవంతుడు కాగలిగెను. సనత్కుమారుడు జ్ఞానవంతులలో శ్రేష్టుడు కాగలిగెను.

ఇట్టి త్రైలోక్య విజయమను ఈ కవచమును మహాత్ముడు, సాధువు అగు శ్రీకృష్ణభక్తునకే ఉపదేశింపవలెమ గానీ మూర్ఖుడు ఇతర దేవతా భక్తుడగువానికి ఉపదేశింపగూడదు. అట్లు ఉపదేశించనిచో ఉపదేశము చేసినవాడు వెంటనే మృత్యువుపాలగును అని అనెను.

 త్రైలోక్య విజయస్యాస్య కవచస్య ప్రజాపతిః ।

ఋషిశ్చందశ్చ గాయత్రీ దేవో రాసేశ్వరః స్వయం ॥

త్రైలోక్య విజయప్రాప్తౌ వినియోగః ప్రకీర్తితః ।

 పరాత్పరం చ కవచం త్రిషు లోకేషు  దుర్లభం ॥

ప్రణవో మే శిరః పాతు శ్రీ కృష్ణాయ నమః సదా ।

పాయాత్కపాలం కృష్ణాయ స్వాహా పంచాక్షరః స్మృతః ॥

కృష్ణేతి పాతు నేత్రే చ కృష్ణ స్వాహేతి తారకం ।

 హరయే నమ ఇత్యేవం భ్రూలతాం పాతు మే సదా ॥

 ఓం గోవిందాయ స్వాహేతి నాసికాం పాతు సంతతం।

గోపాలాయ నమో గండౌ పాతు మే సర్వతః సదా ॥

ఓం నమో గోపాంగనేశాయ కర్ణౌ పాతు సదా మమ ।

ఓం కృష్ణాయ నమః శశ్వత్పాతు మేఽధర యుగ్మకం ॥

ఓం గోవిందాయ స్వాహేతి దంతౌఘం మే సదాఽవతు ।

పాతు కృష్ణాయ దంతాధో దంతోర్ధ్వం క్లీం సదాఽవతు ॥

 ఓం శ్రీకృష్ణాయ స్వాహేతి జిహ్వికాం పాతుమే సదా ।

 రాసేశ్వరాయ స్వాహేతి తాలుకం పాతుమే సదా ॥

 రాధికేశాయ స్వాహేతి కంఠం పాతు సదా మమ ।

 నమో గోపాంగనేశాయ వక్షః పాతు సదా మమ ॥

ఓం గోపేశాయస్వాహేతి స్కంధం పాతు సదా మమ ।

 నమః కిశోరవేషాయ స్వాహా పృష్ఠం సదావతు ॥

ఉదరం పాతు మే నిత్యం ముకుందాయ నమః సదా ।

ఓం హ్రీం క్లీం కృష్ణాయ స్వాహేతి కరౌ పాతు సదా మమ ॥

 ఓం విష్ణవే నమో బాహుయుగ్మం పాతు సదా మమ ।

 ఓం హ్రీం భగవతే స్వాహా నఖరం పాతు మే సదా ॥

 ఓం నమో నారాయణాయేతి నఖరంధ్రం సదాఽవతు ।

 ఓం హ్రీం హ్రీం పద్మనాభాయ నాభిం పాతు సదామమ ॥

 ఓం సర్వేశాయ స్వాహేతి కంకాళం పాతుమే సదా ।

 ఓం గోపీ రమణాయ స్వాహా నితంబం పాతుమే సదా ॥

 ఓం గోపీ రమణ నాథాయ పాదౌపాతు సదామమ ।

ఓం హ్రీం క్లీం రసికేశాయ స్వాహా సర్వం సదాఽవతు ॥

ఓం కేశవాయ స్వాహేతి మమ కేశాన్ సదాఽవతు ।

నమః కృష్ణాయ స్వాహేతి బ్రహ్మరంధ్రం సదాఽవతు ॥

 ఓం మాధవాయ స్వాహేతి మే రోమాని సదాఽవతు ।

 ఓం హ్రీం శ్రీం రాసికేశాయ స్వాహా సర్వం సదాఽవతు ॥

పరిపూర్ణ తమః కృష్ణః ప్రాచ్యాం మాం సర్వదాఽవతు ।

 స్వయం గోలోకనాథో మామాగ్నేయ్యాం దిశి రక్షతు॥

పూర్ణ బ్రహ్మస్వరూపశ్చ దక్షిణే మాం సదాఽవతు ।

నైఋత్యాం పాతుమే కృష్ణః పశ్చిమే పాతు మాం హరిః ॥

 గోవిందః పాతుమాం శశ్వద్వాయవ్యాం దిశి నిత్యశః ।

 ఉత్తరే మాం సదా పాతు రసికానాం శిరోమణిః ॥

ఐశాన్యాం మాం సదాపాతు బృందావన విహార కృత్ ।

 బృందావనీ ప్రాణనాథః పాతు మామూర్ద్వ దేశతః ॥

 సదైవ మాధవః పాతు బలిహారీ మహాబలః ।

జలేస్థలే చాంతరిక్షే నృసింహః పాతు మాం సదా॥

స్వప్నే జాగరణే శశ్వత్పాతు మాం మాధవః సదా।

సర్వాంతరాత్మా నిర్లిప్తః పాతు మాం సర్వతో విభుః ॥

తైలోక్య విజయమను ఈ కవచమునకు ఋషి బ్రహ్మదేవుడు. ఛందస్సు గాయత్రీ ఛందస్సు. దేవత రాసేశ్వరుడగు శ్రీకృష్ణపరమాత్మయే. మూడు లోకములందు జయము లభించుటకై దీనిని వినియోగింపవలెను. పరాత్పరమగు ఈ కవచము మూడు లోకములందును లభించదు.

ఓం శ్రీకృష్ణాయ నమః అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక. కృష్ణాయస్వాహా అను పంచాక్షరీ మంత్రము నా కపాలము రక్షించు గాక. కృష్ణా అనునది నా కండ్లను, కృష్ణస్వాహా అనునది నా తారకలను రక్షించుగాక, హరయే నమః అను మంత్రము నా కను బొమలను రక్షించుగాక. ఓం గోవిందాయ స్వాహా అనునది నా నాసికను రక్షించుగాక. గోపాలాయనమః అను మంత్రము నా చెక్కిళ్ళను రక్షించుగాక. ఓం నమో గోపాంగనేశాయ నమః అనునది నా చెవులను రక్షించుగాక. ఓం కృష్ణాయ నమః అను మంత్రము నా పెదవులను రక్షించుగాక. ఓం గోవిందాయ స్వాహా అనునది నా దంతములను రక్షించుగాక. కృష్ణాయ అనునది క్రింది చిగుళ్ళను, క్లీం అనునది పై చిగుళ్ళను, ఓం శ్రీ కృష్ణాయ స్వాహా అను మంత్రము నా నాలుకను, రాసేశ్వరాయ స్వాహా అనునది నా తాలువలను, రాధికేశాయ స్వాహా అను మంత్రము నా కంఠమును, నమో. గోపాంగనేశాయ అనునది  నా వక్ష స్థలమును, ఓం గోపేశాయ స్వాహా అనునది నా భుజములను, నమః కిశోర వేషాయ స్వాహా అనునది నా పృష్ఠ భాగమును, ముకుందాయ నమః అనునది నా ఉదరమును, ఓం హ్రీం క్లీం కృష్ణాయ స్వాహా అనునది నా కరములను, ఓం విష్ణవే నమః అనునది నా బాహువులను, ఓం హ్రీం భగవతే స్వాహా అను మంత్రము నా నఖములను, ఓం నమో నారాయణాయ అనునది గోళ్ళ వెనక భాగమును, ఓం హ్రీం హ్రీం పద్మనాభాయ అనునది నాభిని, ఓం సర్వేశాయ స్వాహా అనునది నా ఎముకల గూడును, ఓం గోపీరమణాయ స్వాహా అనునది నా నితంబములను, ఓం హ్రీం క్లీం రసికేశాయ స్వాహా అనునది వా సర్వాంగములను రక్షించుగాక! అట్లే ఓం కేశవాయస్వాహా అనునది నాయొక్క వెంట్రుకలను, ఓం కృష్ణాయ స్వాహా అనునది నా బ్రహ్మ రంధ్రమును,   ఓం మాధవాయ స్వాహా అను మంత్రము రోమములను, ఓం హ్రీం శ్రీం రాసికేశాయస్వాహా అనునది నా సమస్తావయవములను రక్షించుగాక.

పరిపూర్ణతముడగు కృష్ణుడు నా తూర్పుదిశన, గోలోకనాథుడు నా ఆగ్నేయభాగమును, పూర్ణబ్రహ్మస్వరూపుడు నా దక్షిణ భాగమును, కృష్ణుడు నా నైఋతి భాగమును, శ్రీహరి నా పశ్చిమ భాగమును, గోవిందుడు నా వాయవ్య భాగమును, రసిక శిరోమణి నా ఉత్తర భాగమును, బృందావన విహారి నా ఈశాన్య భాగమును, బృందావనీ ప్రాణనాథుడు నా ఊర్ధ్వభాగమును, మహాబలుడగు బలిహారి, మాధవుడు, నృసింహుడు భూభాగమున, జలభాగమున ఆకాశభాగమున నన్నెల్లప్పుడు రక్షింతురుగాక. మాధవుడు స్వప్నావస్థయందును, జాగ్రదావస్థయందును నన్నేల్లప్పుడు రక్షించుగాక. సర్వాంతరాత్మ స్వరూపి, నిర్లిప్తుడగు శ్రీకృష్ణుడు నన్నెల్లప్పుడు అన్ని దిక్కులనుండి రక్షించుగాక.

ఇతితే కథితం వత్స సర్వ మంత్రౌఘ విగ్రహం ।

త్రైలోక్య విజయం నామ కవచం పరమాద్భుతం ॥

మయా శ్రుతం కృష్ణవక్త్రాత్ ప్రవక్తవ్యం న కస్యచిత్ ।

గురుమభ్యర్చ విధివత్కవచం ధారయేత్తు యః ॥

కంటే వా దక్షిణే బాహో సోఽపి విష్ణుర్ణసంశయః ।

స చ భక్తో భవేద్యత్ర లక్ష్మీర్వాణీ వసేత్తతః ॥

యది స్యాత్సిద్ధకవచో జీవన్ముక్తో భవేత్తు సః ।

 నిశ్చితం కోటి వర్షాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ ॥

 రాజసూయ సహస్రాణి వాజపేయ శతాని చ ।

 అశ్వమేధయుతాన్యేవ నరమేధాయుతాని చ ॥

మహాదానాని యాన్యేవ ప్రాదక్షిణ్యం భువస్తథా ।

 త్రైలోక్య విజయాస్యాస్య కళాం నార్హంతి షోడశిం ॥

వ్రతోపవాసనియమం స్వాధ్యాయాధ్యయనం తపః ।

 స్నానం చ సర్వతీర్థేషు నాస్యార్హంతి కళామపి ॥

 సిద్ధత్వ మమరత్వం చ దాసత్వం శ్రీహరేరపి ।

యదిస్యాత్సిద్ధ కవచః సర్వం ప్రాప్నోతి నిశ్చితం ॥

 స భవేత్సద్ధకవచో దశలక్షం జపేత్తు యః ।

యోభవేత్సిద్ధ కవచః సర్వజ్ఞః స భవేత్ ధ్రువం॥

ఇదం కవచ మజ్ఞాత్వా భజేత్కృష్ణం సుమందధీః ।

కోటి కల్పం ప్రజప్తోఽసి నమంత్రః సిద్ధిదాయకః ॥

 గృహీత్వా కవచం వత్స మహీం నిఃక్షత్రియం కురు।

 త్రీస్సప్తకృత్వో నిశ్శంకః సదానందో హి లీలయా ॥

రాజ్యం దేయం శిరోదేయం ప్రాణాదేయాశ్చ పుత్రక ।

ఏవం భూతం చ కవచం న దేయం ప్రాణసంకటే॥

భార్గవరామా! సమస్త మంత్ర సారమైన త్రైలోక్య విజయమను కవచమును నీకు చెప్పితిని. దీనిని శ్రీకృష్ణుని వలన ఉపదేశము పొందితిని. దీనిని అర్హత లేనివారికి ఉపదేశింపకూడదు, గురువును శాస్త్రపద్ధతిలో పూజించి ఈ కవచమును తన కంఠ మందుగానీ దక్షిణ బాహువున గాని దీనిని కట్టుకొనవలెను. ఆ విధముగా చేసినచో అతడు విష్ణుతుల్యుడగును. అతడు శ్రీహరి భక్తుడగును. అందువలన అతని దగ్గర విద్య, ధనము, రెండును ఉండును.

కవచము సిద్ధించినచో ఆతడు జీవన్ముక్తుడగును. ఆతడు కోటి సంవత్సరములు శ్రీహరిని పూజించిన ఫలితమును పొందును. వేయి రాజసూయ యాగములు, నూరు వాజపేయయాగములు, పదివేల అశ్వమేధములు, నరమేధములు, గొప్పదానములు, భూమి ప్రదక్షిణము ఇవన్నియు త్రైలోక్య విజయము యొక్క పదునారవ ఆంశయైన కాజాలవు. అట్లే వ్రతములు ఉపవాస నియమములు, వేదాధ్యయనము, తపస్సు, సమస్త పుణ్య తీర్థస్నానము ఇవన్నియు ఈ కవచమునకు పదునారవవంతైనను కాజాలవు, సిద్ధకవచుడు సిద్ధత్వమును, దేవతాత్వమును, శ్రీహరి దాస్యమును అన్నిటినీ తప్పక పొందును.

ఈకవచమును పదిలక్షల మార్లు జపించినచో అతడు సిద్ధకవచుడగును. సిద్ధకవచుడు సర్వజ్ఞుడు కూడ కాగలడు. ఈ కవచమును వదలి పెట్టి అనేక కోట్లు శ్రీహరి మంత్రమును పఠించినను ఆ మంత్రము సిద్దికాదు. అందువలన ఈ కవచము యొక్క సహాయమువలన ఈ భూమిపై రాజులు లేకుండ ఇరువది యొక్క మార్లు తిరిగి, సంహారము చేయగలవు.

 రాజ్యము నివ్వవచ్చును చివరకు తన తలనైన ఈయవచ్చును. ప్రాణము లివ్వవచ్చును కానీ ప్రాణాపాయ పరిస్థితిలోనైనను ఈకవచమును అనర్హునకు ఉపదేశింపరాదు. అని పరమశివుడు భార్గవ రామునితో అనెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతియే గణపతిఖండే నారద నారాయణ సంవాదే పరశురామాయ శ్రీకృష్ణ కవచ ప్రదానం నామ ఏకత్రింశత్తమోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన పరశురామునకు శ్రీ కృష్ణ కవచ ప్రదానమను ముప్పది యొక్కటవ అధ్యాయము సమాప్తము.