బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

17 - గణపతి వివాహము, కార్తికేయుని పట్టాభిషేక కథనము

నారాయణ ఉవాచ - నారాయణముని  ఇట్లు పలికెను –

అథ విష్ణుర్జగత్కాంతో హృష్ట కృత్వా శుభక్షణం

రత్నసింహాసనే రమ్యే వాసయామాస షణ్ముఖం

నానావిధాని వాద్యాని కాంస్యతాలాదీకాని చ

నానావిధాని యంత్రాణి వాదయామాస కౌతుకాత్

వేదమంత్రాభిషిక్త్పెశ్చ సర్వతీర్థోదపూర్ణకైః

సద్రత్నకుంభశతకైః స్నాపయామాస తం ముదా

సద్రత్నసారఖచితం కిరీటం మంగళాంగదే

అమూల్యరత్నఖచిత భూషణానీ బహూని చ

వహ్నిశుద్ధాంశుకే దివ్య క్షీరోదార్ణవ సంభవం

కౌస్తుభం వనమాలాం చ తస్మై చక్రం దదౌ ముదా

జగన్నాయకుడైన శ్రీమహావిష్ణువు సంతోషముతో కార్తికేయునకు ఆశీస్సులనొసగి అతనిని రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను. తాళములు మొదలైన అనేక వాద్యములు, జంత్రములు మ్రోగుచుండగా అతనిని వేదమంత్ర ఘోషలమధ్య సమస్త పుణ్య తీర్థముల నుండి రత్నకలశములందు తీసికొని రాబడిన నీటిచే అతనిని అభిషేకము చేసెను.

అటు పిమ్మట కుమారస్వామికి మంచి రత్నముల కిరీటమును, అంగదములను, అమూల్య రత్నాభరణములను, పరిశుద్ధమైన వస్త్రములను, పాలసముద్రమున పుట్టిన కౌస్తుభమణిని, వనమాలను, చక్రమును సంతోషముతో నొసగెను.

బ్రహ్మా దదౌ యజ్ఞసూత్రం వేదా వై వేదమాతరం

సంధ్యామంత్రం కృష్ణమంత్రం స్తోత్రం చ కవచం హరేః

కమండలo చ బ్రహ్మాస్త్రం విద్యాం వై వైరిమర్దినీం

ధర్మో ధర్మమతిం దివ్యాం సర్వజీవే దయాం దదౌ

పరం మృత్యుంజయం జ్ఞానం సర్వశాస్త్రావబోధసం

శశ్వత్సుఖప్రదం తత్త్వజ్ఞానం చ సుమనోహరం

యోగతత్వం సిద్ధితత్వం బ్రహ్మజ్ఞానం సుదుర్లభం

శూలం పినాకం పరశుం శక్తిం పాశుపతం ధనుః

సంహారాస్త్రవినిక్షేపం తత్సంహారం దదౌ శివః

శ్వేతఛత్రం రత్నమాలాం దదౌ తస్మై జలేశ్వరః

గజేంద్రం చ హయేంద్రం చ సుధాకుంభం సుధానిధిః

మనోయాయి రథం సూర్య సన్నాహం చే మనోరమం

యమదండం యమశ్చైవ మహాశక్తిం హుతాశనః

నానాశస్త్రాణ్యుపాయాని సర్వే దేవా దదుర్ముదా

కామశాస్త్రం కామదేవో దదౌ తస్మై ముదాన్వితః

క్షీరోదోఽమూల్యరత్నాని విశిష్టీ రత్ననూపురే

పార్వతీ సస్మితా హృష్టా పరమానందమానసా

మహావిద్యాం సుశీలాం చ విద్యాం మేధాం దయార స్మృతిం

బుద్ధిం సునీర్మలాం శాంతీం తుష్టిం పుష్టిం క్షమాం ధృతిం

సదృడాం చ హరౌ భక్తిం హరిదాస్యం దదౌ ముదా

ప్రజాపతిర్దేవసేనాం రత్నభూషణ భూషితాం

సువినీతాం సుశీలాం చ సుందరీం సుమనోహరాం

దదౌ తస్మై వేదమంత్రైర్వివాహ విధినా స్వయం

యాం వదంతి మహాషష్ఠిం పండితాః శిశుపాలికాం

కుమారస్వామిని పట్టాభిషేకము చేసిన తరువాత బ్రహ్మదేవుడు వేదములు సంధ్యా మంత్రమును, శ్రీకృష్ణ మంత్రమును, స్తోత్రమును, కవచమును, కమండలువును, బ్రహ్మాస్త్రమును, శత్రువులను సంహరించు విద్యను ఇచ్చెను, ధర్మదేవత ధర్మజ్ఞానమును, సర్వభూతదయను, పరమశివుడు మృత్యుంజయ జ్ఞానమును, సమస్త శాస్త్రములను అవగాహన చేయు శక్తిని, ఎల్లప్పుడు సుఖమైన తత్త్వజ్ఞానమును, యోగతత్త్వమును, సిద్ధి తత్త్వమును, బ్రహ్మజ్ఞానమును, శూలము, పినాకము, గొడ్డలి, శక్తి, శివ ధనుస్సును అస్త్ర ప్రయోగ విధిని, వాటి సంహారవిధిని ఇచ్చెను.

వరుణుడు తెల్లని ఛత్రమును రత్నములు గల మాలనిచ్చెను. చంద్రుడు మంచి ఏనుగను, మంచి గుఱ్ఱమును, అమృతకుంభమునిచ్చెను. సూర్యుడు మనోజవముగల రథమునీయగా యముడు యమదండమును, అగ్నిదేవుడు మహాశక్తినిచ్చేను. అట్లే ఇతరదేవతలు కూడ వివిధములైన అస్త్రములను, ఇతరకానుకలనిచ్చిరి.

 మన్మథుడు కామ శాస్త్రజ్ఞానమునీయగా, క్షీరసముద్రము ఆమూల్యములైన రత్నములను, నూపురములను ఇచ్చెను. పార్వతీదేవి సంతోషముతో కార్తికేయునకు మహావిద్యను, మేధను, దయను, స్మృతిజ్ఞానమును, నిర్మలమైనబుద్ధినీ, శాంతిని, తుష్టిని, పుష్టిని, క్షమాభావమును, ధృతిని, శ్రీహరిభక్తిని శ్రీహరి దాస్యమునొసగెను. ప్రజాపతి రత్నాలంకారభూషిత, చక్కని వినయము కలది, మంచి నడవడికలది, సుందరి. అగు దేవసేనయను కన్యను వేద మంత్రముల నడుమ ఇచ్చి వివాహము చేసెను. ఆ దేవసేననే పండితులు మహాషష్ఠియని, శిశుపాలికయని పిలుతురు.

అభిషిచ్య కుమారం చ సర్వే దేవా యయుర్గృహం

మునయశ్చైవ గంధర్వాః ప్రణమ్య జగదీశ్వరం

నారాయణం చ బ్రహ్మాణం ధర్మం తుష్టాన శంకరః

ప్రణసామ హరీం రాత ధర్మమాలింగ్య నారద

ప్రీత్యా యయౌ చ శైలేంద్రః సగణః శంకరార్చితః

యే యే తత్రాగతాః సర్వే యయురానందపూర్వకం

కుమారస్వామిని ఆభిషేకించిన పిదప దేవతందరు తమ తమ ఇండ్లకు పోయిరి. ఆట్లే మునులు గంధర్వులు జగదీశ్వరుడగు శివునికి నమస్కరించి తమ తమ నెలవులకు వెళ్ళిరి. శంకరుడు శ్రీహరినీ, బ్రహ్మను, ధర్మదేవతను స్తుతించి వారిలో శ్రీహరిని నమస్కరించి. సాగనంపెను. ధర్మదేవతను ఆలింగనము చేసికొని సాగనంపెను. అట్లే శంకరునిచే సమ్మానములనందుకొన్న పర్వతరాజగు హిమవంతుడు తన అనుచరులతో కలసి, తన ఇంటికి పోయెను. ఇంకను కుమారస్వామి యొక్క అభిషేక మహోత్సవమునకు వచ్చినవారందరు సంతోషముతో తమతమ స్థానములు చేరుకొనిరి.

పరమానందసంయుక్తో దేవ్యా సహ మహేశ్వరః

కాలాంతరే చ తాన్ సర్వాన్ పునరానీయ శంకరః

పుష్టిం దదౌ వివాహేన గణేశాయ మహాత్మనే

సుతాభ్యాం సగణైః సార్థం పార్వతీహృష్టమానసా

సిషేవే స్వామినః పాదపద్మం సా సర్వకామదం

మిక్కిలి ఆనందముతో తన భార్య పుత్రులతో కాలము గడుపుచున్న శంకరుడు కొంతకాలము తరువాత దేవతలనందరిని మరల పిలిపించి గణపతికి పుష్టియనెడు కన్యనిచ్చి వివాహము చేసెను.

పార్వతీదేవి తన పుత్రులతో కలసి సంతోషముతో అన్నీ కోరికలను తీర్చు తన భర్తను సేవించుచు కాలము గడపసాగెను.

ఇత్యేవం కథితం సర్వం కుమారస్యాభిషేచనం

వివాహః పూజనం తస్య గణేశస్య వివాహకం

పార్వతీపుత్రలాభశ్చ దేవానాం చ సమాగమః

కా తే మనసి వాంఛాఽస్తి కిం భూయః శ్రోతుమిచ్ఛసి

ఓ నారదమునీ! నీకీవిధముగా కుమారస్వామియొక్క ఆభిషేక వృత్తాంతమును వివాహము మొదలగు విషయములను, గణపతియొక్క వివాహ వృత్తాంతమునంతయు తెలిపితిని. అట్లే పార్వతీదేవికి తనపుత్రుడగు కుమారస్వామి లభించిన విషయమును దేవతలందరు కైలాసపర్వతమున సమాగమమైన విషయమునంతయు వివరించితిని. ఇంకను నీవేదేని వృత్తాంతము వినదలచినచో నాకు తెలుపుమని నారాయణముని అనెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే కుమారగణేశ కుమారాభిషేక కథనం నామ సప్తదశోఽద్యాయః

శ్రీబ్రహ్మావైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణ సంవాద సమయమున పేర్కొనబడిన కుమారస్వామి, గణపతుల వివాహము, కుమారస్వామియొక్క అభిషేక వృత్తాంతము గల పదునేడవ అధ్యాయము సమాప్తము.