బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

12 - శిరః పతన విష్ణుకృత గణేశ శిరోయోజన శని శాపాదికథనం

నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను.

దుర్గా తద్వచనం శ్రుత్వా సస్మార హరిమీశ్వరం

ఈశ్వరేచ్ఛా వశీభూతం జగదేవేత్యువాచ హ

సా చ దేవీ దైవవశా శని ప్రోవాచ కౌతుకాత్

పశ్య మాం మచ్ఛీశుమీతి నిషేకః కేన పార్యతే

పార్వతీ దేవి శని యొక్క మాటలు విని శ్రీహరిని మనసులో తలచుకొని ఈ ప్రపంచమంతయు ఈశ్వరుని యొక్క అభీష్టముననుసరించి ప్రవర్తించునని పలికి దైవమునకు వశమై శనితో నన్ను నాపుత్రుని నీవు చక్కగా చూడుమని పలికెను.

పార్వత్యా వచనం శ్రుత్వా శనిర్మేనే హృదా స్వయం

పశ్యామీ కిం న పశ్యామి పార్వతీసుతమిత్యహో

యది బాలోమయా దృష్టస్తస్య విఘ్నో భవేత్ ధ్రువం

ఇత్యేవ ముక్త్యా ధర్మిణే ధర్మం కృత్వా తు సాక్షిణం

బాలం ద్రష్టుం మనశ్చకే న తు తన్మాతరం శనిః

విషణ్ణమానసః పూర్వం శుష్కకంకౌష్ఠతోలుకః

సవ్యలోచన కోణేన దదర్శ చ శిశోర్ముఖం

పార్వతీదేవి పలికిన పలుకులు విని శనైశ్చరుడు ఇట్లు చింతించెను. నేను పార్వతీదేవి పుత్రుని చూడవలెనా? చూడకూడదా? నేను శిశువును చూచినచో అతనికి తప్పక ఆపదలు కలుగును. శిశువును నేను చూడకపోయినచో పార్వతీదేవి కోపించి శపించునేమో! ఈ రెండింటిలో మొదలు ఆత్మ రక్షణ చేసికొనుట చాలామంచిదని తలపోసి తాను చేయబోవు పనిలో తన తప్పు లేశమైన లేదని భావించి దానికి ధర్మదేవతను సాక్ష్యముగా ఉంచి మనస్సు పరితాపము చెందుచుండగా కంఠము. పెదవులు, నాలుక ఎండిపోవుచుండగా పార్వతీదేవిని వదలి ఆమె పుత్రుని మాత్రము చూచెదనని తలపోసి కడకంటిచూపులో శిశువు ముఖమును వీక్షించెను.

శనేశ్చ దృష్టిమాత్రేణ ఛిన్నే వై మస్తకే మునే

చక్షుర్నిమీలయామాస తస్థౌ నమ్రాననః శనిః

తస్థా చ పార్వతీ క్రోడే తత్సర్వాంగం సలోహితం

వివేశ మస్తకం కృష్ణ గత్వా గోలోకమీప్సితం

మూర్ఛాం సంప్రాప సాదేవీ విలప్య చ భృశం ముహు

మృతేవ చ పృథివ్యాం తు కృత్వా వక్షసి బాలకం

విస్మితాస్తే సురాస్సర్వే చిత్రపుత్తలికా యథా

దేవ్యశ్చ శైలగంధర్వాః సర్వే కైలాసవాసినః

శనైశ్చరుని చూపుపడగానే బాలుని శిరస్సు తెగిపోగా శనైశ్చరుడు తలవంచుకొని కండ్లుమూసికొనెను, పార్వతీదేవియొక్క ఒడిలో ఆ శిశువుయొక్క మొండెము రక్తముతో నిండిపోయినది. ఆతని శిరస్సు గోలోకమునకుపోయి అచ్చటనున్న శ్రీకృష్ణునిలో విలీనమైపోయినది.

అప్పుడు పార్వతీదేవి తన పుత్రునికై ఏడ్చి ఏడ్చి ఆతని శరీరమును రోమ్మునకదుముకొని మృతురాలివలె మూర్ఛనందినది. ఆ దృశ్యమును చూచి కైలాసముననున్న దేవతా స్త్రీలు శైలములు గంధర్వులందరు చిత్తరువులోని బొమ్మలవలె నిశ్చేష్టులైరి.

తాన్ సర్వాన్ మూర్ఛితాన్ దృష్టివారుహ్య గరుడం హరిః

జగామ పుష్పభద్రాం స చోత్తరస్యాం దిశి స్థితాం

 పుష్పభద్రా నదీతీరే హ్యపశ్యత్కాననే స్థితం

 గజేంద్రం నీద్రితం తత్రశయానం హస్తినీయుతం

తథోదక్చిరసం రమ్యం మూర్చితం సురతశ్రమాత్

పరితః శావకాసల్వా పరమానందమానసం

శీఘ్రం సుదర్శవేనైవ చిచ్చేదే తచ్చిరో మునే

స్థాపయామాస గరుడే రుధ్రాక్తం మనోహరం

 గజచ్ఛిన్నాంగవిక్షేపాల్పబోధం ప్రాప్య హస్తినీ

శావకాన్పోధయామాస చాశుభం వదతీ తదా

రురోద శావకైస్సార్థం సా విలప్య శుచాతురా

తుష్టాన కమలాకాంతం శాంతం సస్మితమీశ్వరం

శంఖచక్రగదాపద్మధరం పీతాంబరం పరం

 గరుడస్థం జగత్కాంతం బ్రోమయంతం సుదర్శనం

నిషేకం ఖండితుం శక్తం నిషేకజనకం విభుం

నిషేక భోగదాతారం భోగనిస్తారకారణం

 ప్రభుస్తతవనాత్తుష్టస్తస్యై ఏప్రవరం దదౌ

ముండాతుండం పృథక్కృత్య యుయుజేఽన్యగజస్యచ

జీవయామాస తం తత్ర బ్రహ్మజ్ఞానేన సర్వవిత్

సర్వాంగే యోబయామాస గజస్య చరణాంబుజం

త్వం జీవకల్పపర్యంతం పరివారైః సమం గజ

ఇత్యుక్యా చ మనోయాయీ కైలాసం హ్యాజగామ సః

కైలాసముననున్న దేవతా స్త్రీలందరు మూర్చితులై పడియుండుటను గమనించిన శ్రీహరి గరుత్మంతున ధిరోహించి ఉత్తర దిక్కులో నున్న పుష్ప భద్రా నదీ తీరమునకు వెళ్ళెను. ఆ పుష్ప భద్రా నదీ తీరమున నున్న ఆడవిలో ఒక గజరాజు తన భార్యతో పిల్లలతో కలసి నిద్రించుచుండెను. ఉత్తరదిశవైపు తలపెట్టి నిద్రపోవుచున్న ఆ గజరాజు శిరస్సును శ్రీహరి తన సుదర్శన చక్రముచే వెంటనే ఖండించి ఆ గజరాజు శిరస్సును తీసికొని గరుత్మంతునిపై నుంచుకొనెను.

సుదర్శనచక్రముచే తెగిపడిన అవయవములు ఇటునటు పడిపోవుటను గమనించిన ఆడ ఏనుగు తన పిల్లలకు తండ్రి చనిపోయిన వృత్తాంతమును చెప్పుచు వాటినన్నిటిని లేపి దుఃఖించుచుండెను. తనకు ఎదురుగా శ్రీమహావిష్ణువు శంఖ చక్ర గదా పద్మములను తన నాలుగు చేతులలో ధరించి పీతాంబర వస్త్రధారియై సుదర్శన చక్రమును తప్పుచు గరుత్మంతునిపై కనిపించెను. చిరునవ్వుతోనున్న ఆ పరమేశ్వరుని ఆడ ఏనుగు ఇట్లు స్తుతించినది.

హే భగవాన్, ! నీవు కర్మ ఫలములను ఖండింపశక్తుడవు. అట్లే కర్మఫలములకు కారణభూతుడవు. కర్మ ఫలము నివ్వగలిగిన వాడవు. ఆ ఫల భోగమునుండి తప్పించ నీవే సమర్థుడవు   అని స్తుతింపగా భగవంతుడు సంతోషించి ఆ ఏనుగునకు వరమునిచ్చెను. ఆతడు ఇంకొక ఏనుగు తలను ఛేదించి ఈ గజరాజు శరీరమునకు బ్రహ్మజ్ఞానముచే అతికించెను. తరువాత ఆ గజరాజును కల్పపర్యంతము తన పరివారముతో సహ జీవించియుండుమనీ వరమునిచ్చి మనోవేగమున కైలాసపర్వతమును చేరుకొనెను.

ఆహృత్య పార్వతీహస్తాద్బాలం కృత్వా స్వవక్షసి

రుచిరం తచ్చిరప్పుమ్యగ్యోజయామాస బాలకే

బ్రహ్మస్వరూపో భగవాన్ బ్రహ్మజ్ఞానేన లీలయా

జీవయామాస తం శీఘం హుంకారోచ్చారణేనచ

 పార్వతీం బోధయిత్వా తు కృత్వా క్రోడే చ తం శిశుం

బోధయామాస తాం కృష్ణ ఆధ్యాత్మిక విబోధనైః

శ్రీమహావిష్ణువు గజశిరస్సును తీసికొనివచ్చి, పార్వతీదేవియొక్క చేతిలోనున్న మృతుడైన శిశువును చేతిలోనికి తీసికొని, ఆ శివువును తన రొమ్మునకు హత్తుకొని, తన దగ్గరనున్న గజశిరస్సును బాలకునకు చక్కగా, అమర్చెను. పర బ్రహ్మ స్వరూపుడు భగవంతుడునైన శ్రీహరి బ్రహ్మజ్ఞానముచే హుంకారోచ్చారణమాత్రమున ఆ శిశువునకు ప్రాణము పోసెను. అట్లే ఆ శిశువును తన ఒడిలోనుంచుకొని మూర్ఛపడియున్న పార్వతిని తట్టిలేపి ఆధ్యాత్మికబోధనలచే ఆమెమ ఓదార్చేను.

విష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను.

బ్రహ్మాదికీటపర్యంతం ఫలం భుంక్తే స్వకర్మణః

జగద్బుద్ధిస్వరూపానీ త్వం న జావాసి కిం శివ

కల్ప కోటి శతం భోగీ జీవినాం తత్స్వకర్మణా

ఉపస్థితో భవేన్నిత్యం ప్రతియోనౌ శుభాశుభైః

ఇంద్రః స్వకర్మణా కీటయోనౌ జన్మ లభేత్సతీ

కీటశ్చాపి భవేదింద్రః పూర్వకర్మఫలేన వై

సింహాపి మక్షికాం హంతుమక్షమః ప్రాక్తనం వినా

మశకో హస్తినం పంతుం క్షమః స్వపాక్షసేన చ

సుఖం దుఃఖం భయం శోకమానందం కర్మణః ఫలం

సుకర్మణః సుఖం హర్షమితం పాపకర్మణః

ఇహైవ కర్మణో భోగః పరత్ర చ శుభాశుభైః

కర్మోపార్జనయోగ్యం చ పుణ్యక్షేత్రం చ భారతం

కర్మణః ఫలదాతా చ విధాతా చ విధేరపి

మృత్యోర్ముత్యుః కాలకాలో నిషేకస్య ని షేకకృత్

సంహర్తురది సంహర్తా పాతుః పాతా పరాత్పరః

గోలోకనాథః శ్రీకృష్ణ పరిపూర్ణతమః స్వయం

నయం యస్య కళాః పుంసో బ్రహ్మ విష్ణుమహేశ్వరాః

మహావిరాడ్యదంశశ్చ యమలివరీ జగత్

కళాంశః కేపి తద్ధర్మే కళారశాంశాశ్చ కేచన

చరాచర జగత్సర్వం తత్ర తస్థౌ వినాయకః

ఓ పార్వతీ! బ్రహ్మమొదలుకొని కీటకమువరకున్న ఈ ప్రాణులన్నియు తాము చేసికొన్న ఫలముననుభవించుచున్నవి. ఆ తాము చేసికొన్న శుభాశుభఫలముల ననుసరించి ఆయా యోనులయందు పుట్టుచున్నవి. ఇంద్రుని వంటివాడు కీటకముగా జన్మనెత్తవచ్చును. ఆట్లే పూర్వజన్మలో చేసికొన్న కర్మననుసరించి కీటకమైనను ఇంద్రుడు కావచ్చును. తాను పూర్వము చేసికొన్న కర్మననుసరించి. దోమ కూడా ఏనుగును చంపగలుగుచున్నది. ఆట్లే సింహము ఈగను కూడా చంపలేకపోవచ్చును. సుఖము, దుఃఖము, భయము, శోకము ఆనందము మొదలగునవన్నియు ప్రాణులు తాము చేసికొన్న కర్మవలననే జరుగుచున్నవి. ప్రాణి సత్కర్మనాచరించినచో సుఖము, సంతోషము కలుగుచున్నవి. దుష్కార్యములనాచరించినచో దుఃఖము, భయము, శోకము మొదలగునవి ఏర్పడును.

 సుకృత దుష్కృతములయొక్క ఫలితమును ఈజన్మలోను తరువాత జన్మయందును తప్పక అనుభవించి తీరవలెను. పుణ్యక్షేత్రమైన ఈ భారతదేశము సత్కర్మాచరణకు అనుకూలమైనది. అందువలన ఇచట సత్కర్మ తప్పక చేయవలెను. ఓ పార్వతీ! నీవు బుద్ధిస్వరూపపు, అందువలన నీకు తెలియని దేదియులేదు.

ప్రాణులు చేయు కర్మలకన్నిటికి ఫలితమునిచ్చువాడు. సృష్టికర్తకి కారణభూతుడు, మృత్యువునకే మృత్యువైవవాడు. కాలునకే కాలుడనదగిన శ్రీకృష్ణుడు పరాత్పరుడు. అతడు గోలోకముననుండును, బ్రహ్మ విష్ణు శివాదులమగు మేము ఆ గోలోకనాథునియొక్క ఆంశ స్వరూపులము. ఈ బ్రహ్మాండములన్నిటిని తన రోమ కూపములందుంచుకొనిన మహావిరాట్స్వరూపుడు కూడ ఆ పరిపూర్ణతముని ఆంశస్వరూపమే. మిగిలినవన్నియు ఆ పరమపురుషునియొక్క అంశాంశలు లేక కళాంశాంశలు. అట్టి పరాత్పరుని అంశగా వినాయకుడున్నాడనెను.

శ్రీవిష్ణోర్వచనం శ్రుత్వా పరిశుష్టా చ పార్వతి

స్తనం దదౌ చ శిశచే తం ప్రణమ్య గదాధరం

తుష్టాన పార్వతీతుష్టా ప్రీరిలో శంకరేణ చ

కృతాంజలిపుటా భక్త్యా విష్ణుం తం కమలాపతిం

 ఆశిషం యుయుజే విష్ణుః శిశుం చ శిశుమాతరం

దదౌ గళే బాలకస్య కౌస్తుభం చ స్వభూషణం

బ్రహ్మా దదౌ స్పమకుటం ధర్మో వై రత్నభూషణం

క్రమేణ దేవ్యో రత్నాని దుదుః సర్వే యథోచితం

పార్వతీదేవి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలు విని ఓదార్పు చెందినదై శ్రీమన్నారాయణునకు నమస్కరించి తన శిశువునకు స్తన్యమునిచ్చినది. ఇంకనూ శంకరుడు బోధింపగా నామె భక్తితో శ్రీమహా విష్ణువును స్తుతించి నమస్కరించినది.

ఆప్పుడు శ్రీమన్నారాయణుడు పార్వతిని, ఆమె పుత్రుని ఆశీర్వదించి తన మెడలోనున్న కౌస్తుభరత్నమును శిశువు మెడలో వేసెను. తరువాత బ్రహ్మదేవుడా శిశువునకు తన కిరీటమునీయగా ధర్మదేవత తన రత్నభూషణములనొసగెను. అట్లే దేవతాస్త్రీలందరు యథోచితముగా రత్నహారములను కానుకగా నిచ్చిరి.

 తుష్టాన తం మహాదేవశ్చాత్యంతం హృష్టమావసః

దేవాశ్చ మువయః శైలాః గంధర్వః సర్వయోషితః

దృష్యా శివో శివాచైవ బాలకం మృతజీవితం

బ్రాహ్మణేభ్యో దదౌ తత్ర బాలకే మృతజీవితే

అశ్వానాం చ గజానాం చ సహస్రాణి శలాని చ

బందిభ్యః ప్రదదౌ తత్ర బాలకే మృతజీవీతే

హిమాలయశ్చ సంతుష్టా హృష్ణా దేవాశ్చ తత్ర వై

దదుర్ధానాని విప్రేభ్యో బందీభ్యః పర్వయోషితః

బ్రాహ్మణాన్భోజయామాస కారయామాస మంగళం

వేదాంశ్చ పాఠయామాస పురాణాని రమాపతిః

తన పుత్రునకు పునర్జన్మనిచ్చిన శ్రీమహావిష్ణువును శంకరుడు మిక్కిలిసంతోషముతో స్తుతించెను. అట్లే దేవతలు, ముసులు, శైలములు, గంధర్వులు, అచ్చటనున్న సమస్త స్త్రీలందరు శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

తమ పుత్రుడు తిరిగి బ్రతికినందువలన పార్వతీపరమేశ్వరులు చాలా సంతోషించి బ్రాహ్మణులకు కోటిరత్నములమ దానము చేసిరి. అట్లే భట్టుమూర్తులకు అనేక గజములను, గుఱ్ఱములను దానము చేసిరి.

 పార్వతీదేవి తండ్రియగు హిమవంతుడు, దేవతలు సంతోషముతో బ్రాహ్మణులకు, భట్రాజులకు అనేక దానములు చేసిరి. శ్రీహరి ఆ సమయమున బ్రాహ్మణులకు మృష్టాన్నభోజనమునొసగి. పుణ్యాహమును చేసెను. అట్లే బ్రాహ్మణులచే వేదములను పురాణములను చదివించెను.

శనీం సంలజ్జితం దృష్ట్వా పార్వతి కోపశాలివీ

శశాప చ సభామధ్యేఽప్యంగహీనో భవేతి చ

దృష్ట్యా శప్తం శనిం సూర్యః కశ్యపశ్చ యమస్తథా

తేఽతీరుష్ఠాః సముత్తస్థు: గాముకాః శంకరాలయాత్

రక్తాక్షాస్తే రక్తముఖాః కోపప్రస్పురీతాధరా:

తం ధర్మం సాక్షిణం కృత్వా విష్ణుం సంశపుముద్యతాః

బ్రహ్మా తాన్భోధయామాస విష్ణునా ప్రేరితః సురైః

రక్తాస్యాం. పార్వతీం చైవ కోపప్రస్ఫురితాధరా:

 బ్రహ్మాణమూచుస్తే తత్ర క్రమేణ సమయోచితం

 భీరవో దేవతాః సర్వే మునయః పర్వతాస్తథా

ఆ సమయమున దీనికంతయు తానే కారకుడనైతినన్నట్లు శని సిగ్గుపడుచు తలవంచుకొనగా చూచి పార్వతీదేవి కోపమును పట్టలేక ఆ సభయందే అతనిని అంగహీనుడవు కమ్మని శపించినది.

పార్వతీదేవీ శనైశ్చరుని శపింపగా చూచి అచ్చటనున్న సూర్యుడు, కశ్యపుడు, యముడు కోపముతో కైలాసమునుండి వెళ్ళిపోవలెనని లేచినిలబడిరి. కోపముతో ఎఱ్ఱబడిన ముఖములతో పెదవులు వణకుచుండగా వారు ధర్మదేవతను సాక్షిగా చేసి శనైశ్చరుని పార్వతీ మందిరమునకు పొమ్మని ప్రేరేపించిన విష్ణుమూర్తిని శపించుటకై యత్నించిరి. అప్పుడు విష్ణువు, దేవతలు ప్రేరేపించగా బ్రహ్మదేవుడు కోపముతో ఊగిపోవుచున్న సూర్యాదులను, పార్వతీదేవిని ఓదార్చ సాగెను. దేవతలు, మునులు, శైలములు భయపడిపోయి మిన్నకుండిరి.

ఆసమయమున కశ్యపుడు మొదలగువారు వరుసగా బ్రహ్మదేవునితో ఇట్లనిరి.

కశ్యప ఉవాచ - కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను-

 దుర్దుష్టోఽయం ప్రాక్తనేన పత్నీశాపేన సర్వదా

బాలం దదర్శ యత్నేన తస్య వై మాతురాజ్ఞయా

శనైశ్చరుడు పూర్వము తన భార్య పెట్టిన శాపమువలననే దుష్టమైన చూపుకలవాడయ్యెను. ఐనను బాలుని తల్లియగు పార్వతీదేవి యొక్క ఆజ్ఞననుసరించియే ఆతడు బాలుని ముఖమును ప్రయత్నపూర్వకముగా చూచెను. కావున శని యొక్క తప్పు ఇందేమి కలదన్నట్లు పలికెను.

శ్రీసూర్య ఉవాచ - సూర్యుడిట్లు పలికెను-

 తం ధర్మం సాక్షిణం కృత్వా సూనోర్వై మాతురాజ్ఞయా

యత్పుత్రోఽతిప్రయత్నేన హ్యపశ్యత్పార్వతీపుతం

యథా నిరపరాధేన మత్పుత్రం సా శశాప హ

తత్పుత్రస్యాంగభంగశ్చ భవిష్యతి న సంశయః

నా పుత్రుడగు శని, ధర్మదేవతాసాక్షిగా తల్లియైన పార్వతీదేవియొక్క ఆజ్ఞననుసరించియే ఆమె పుత్రుని అతి ప్రయత్నముతో చూచెను. అతనిలో తప్పేమీలేకున్నను పార్వతీదేవి నా పుత్రుని ఆంగహీనుడవు కమ్మని శాపమిచ్చినది. నా పుత్రుడేవిధముగా ఆంగహీనుడగునో పార్వతీదేవి పుత్రుడుకూడ అవయవరహితుడు కాగలడనెను.

యమ ఉవాచ – యమధర్మరాజిట్లనెను-

 ప్రదాయ స్వయమాజ్ఞాం చ శశాపేయం స్వయం కథం

 వయం శపామః కోఽధర్మో జీఘాంసోశ్చ విహింసనే

పార్వతీదేవి తాను స్వయముగా తన పుత్రుని చూడవచ్చునని ఆజ్ఞనిచ్చి తనకు చెడు జరిగినదని తానే శపించుట న్యాయమేనా? చంపదలచిన వానిని హింసించుటలో తప్పులేనట్లే మేమందరము ఈమెను శపించెదమనెను.

బ్రహ్మోఽవాచ - బ్రహ్మదేవు డిట్లనెను-

 శశాప పార్వతీ రుష్టా స్త్రీస్వభావాచ్చ చాపలాత్

సర్వేషాం వచనేనైవ క్షంతుమర్హంతు సాధవః

దుర్గే దత్వా త్వమాజ్ఞాం చ పుత్రదర్శన హేతవే

కథం శపసి నిర్దోషమతిథిం త్వ ధ్గృహఽగతం

 ఇత్యుక్త్యా శనిమాదాయ బోధయిత్వా చ పార్వతీం

తాం తం సమర్పణం చక్రే శాపమోచన హేతవే

ఓ కశ్యపాదులారా! పార్వతీదేవి తన స్త్రీ స్వభావమువలన తొందరగా కోపించి శనిని శపించినదేకాని వేరుకాదు. పూజ్యులైన మీరు మా అందరి ప్రార్థనపై ఆమెను క్షమింపుడు.

ఓ దుర్గాదేవీ! నీవుకూడ నీ పుత్రుని చూచుటకై ఆజ్ఞనొసగి తరువాత నీకు చెడు కలిగినదని శనైశ్చరుని శపించితివి. ఆతని తప్పేమియులేదు పైగా ఆతడు నీకు అతిథిగా నీఇంటికి వచ్చెను. అట్టివ్యక్తిని శపించుట న్యాయమేనా? అని బ్రహ్మదేవుడు పార్వతికి నచ్చజెప్పి శనియొక్క శాపనివృత్తి చేయుమని అతనిని పార్వతికి సమర్పించెను.

బభూవ పార్వతి తుష్టా బ్రహ్మణో వచనాన్మునే

శాంతా బభూవుస్తే తత్ర దినేశ యమ కశ్యపా:

ఉవాచ పార్వతితత్ర సంతుష్టా తం శనైశ్చరం

ప్రసాదితా శివేనైవ బ్రహ్మణా పరిసేవితా

బ్రహ్మదేవుడు పలికిన మాటలకు పార్వతీదేవి సంతోషపడినది. అట్లే సూర్య, యమ, కశ్యపులు కూడ శాంతించిరి. అప్పుడు పార్వతీదేవిని శంకరుడుకూడ శాంతింపచేసెను. అందువలన సంతోషించిన దుర్గాదేవి శనైశ్చరుని తోనిట్లనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

గ్రహరాజో భవ శనే మద్వరేణ హరిప్రియః

చిరజీవీ చ యోగీంద్రో హరిభక్తస్య కా కథా

ఆద్యప్రభృతి నిర్విఘ్న హరౌ భక్తి: దృడాఽస్తు తే

శాపోఽమోఘస్తతో మేద్య కించిత్థంజో భవిష్యతి

ఇత్యుక్త్యా పార్వతీ తుష్టా బాలం ధృత్వా చవక్షసి

ఉవాస యోషితాం మధ్యే తస్మై దత్వా శుభాశీషు

శనిర్జగామ దేవానాం సమీపం హృష్టమానసః

ప్రణమ్య భక్త్యా తాం: బ్రహ్మన్నంబీకాం జగదంబికాం

ఓ శనైశ్చరా! నా వరప్ర భావము వలన నీవు గ్రహములన్నిటికి ఆధిపత్యము వహింతువు. అట్లే శ్రీహరికి అత్యంతమిష్టమైనవాడవగుదువు. ఇంకను చిరంజీవివి, యోగీంద్రుడవు కూడ అగుదువు. నేటినుండి నీకు శ్రీహరిపై భక్తి ఇంకను దృడముకాగలదు అని వరములిచ్చి నా శాపమమోఘము కావున నీవు సర్వాంగహీనుడవు కాక కొద్దిగా కుంటి వాడవగుదువని శనితో పలికి ఆతనికి ఆశీస్పులొసగి తనపుత్రుని ఎత్తుకొని స్త్రీలమధ్య ఉండిపోయెను.

శనైశ్చరుడుకూడ జగన్మాతయగు పార్వతికి భక్తితో నమస్కరించి సంతోషముతో దేవతల దగ్గరకుపోయెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే శనికృతగణేశ దర్శన తఙ్ఞాత గణేశ శిర:పతన విష్ణుకృతగణేశ శిరోయోజన శనిశాపాదికథనం నామద్వాదశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణములో మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ సంవాదసమయమున పేర్కొనబడిన శని వృత్తాంతమను పన్నెండవ అధ్యాయము సమాప్తము.