బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

43 – గణేశ దంత భంగ కారణము

నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను –

గణేశ వచనం శ్రుత్వా స తదా రాగతః సుధీః

పర్శుహస్తస్సవై రామో నిర్భయో గంతుముద్యతః

గణేశ్వరస్తదా దృష్ట్వా శ్రీఘ్రముత్థాయ యత్నతః

వారయామాస స ప్రీత్యా చకార వినయం పునః

రామస్తం ప్రేరయామాస హుంకృత్వాతు పునః పునః

బభూవ చ తతస్తత్ర వాగ్యుద్ధం హస్తకర్షణైః

గణపతి పరశురామునితో పలికిన పలుకులు వినికూడ భార్గవరాముడు చేతిలో గొడ్డలి ధరించి నిర్భయముగా శంకరుని అభ్యంతరమం దిరము లోనికి వెళ్ళసాగెను. అప్పుడు గణపతి వెంటనే లేచి పరశురాముని వెళ్ళకుండ అడ్డగించెను. ఐనను పరశురాముని ప్రేమతోనే చూచెను.

అప్పుడు భార్గవరాముడు హుంకరించుచు యుద్ధమునకు ప్రేరేపించుచు చేతులను త్రిప్పుచు వాగ్యుద్ధమును చేయనారంభించెను.

పర్శుoనిక్షేపణం కర్తుం మనశ్చక్రే భృగుస్తదా

హాహాకృత్వా కార్తికేయో బోధయామాస సంసది

పరశురాముడు గణపతి పై తన గొడ్డలిని వేయబోగా కుమారస్వామి హాహాకారముచే యుచు పరశురాముని ఇట్లు ప్రబోధించెను.

అవ్యర్థమస్త్రం హేభ్రాతః గురుపుత్రే కథం క్షిపేః

గురువద్దురుపుత్రం చ మా భవాన్హాంతుమర్హతి

పర్శుం క్షిపంతం కుపితం రక్తపద్మదళేక్షణం

గణేశో రోధయామాస నివర్తస్వేత్యువాచ తం

పునర్గణేశం రామశ్చ ప్రేరయామాస కోపతః

పపాత పురతో వేగాన్మానహీనో గజాననః

గజాననః సముత్థాయ ధర్మం కృత్వాతు సాక్షిణం

పునస్త్రం బోధయామాస జితక్రోధః శివాత్మజః

నివర్తస్వ నివర్తన్వేత్యుచ్చార్య చ పునః పునః

ప్రవేశనే తే కా శక్తిరీశ్వరాఙ్ఞాం వినా ప్రభో

మమ భ్రాతా త్వమతిథి ర్విద్యాసంబంధతో ధ్రువం

ఈశ్వరప్రియశిష్యశ్చ సోడం వై తేన హేతునా

నహ్యహం కార్తవీర్యశ్చ భూపాస్తే క్షుద్రజంతవః

అతో విప్ర న జానాసీ మాం చ విశ్వేశ్వరాత్మజం

క్షణం తిష్ఠ నీవర్తస్వ సమరే బ్రాహ్మణాతిభే

క్షణాంతరే త్వయా సార్థం యాస్యామీశ్వర సన్నిధిం

ఓ సోదరా! అమోఘమైన అస్త్రమును గురుపుత్రుని పై ఎందుకు ప్రయోగించుచున్నావు, గురువు వలె గురు పుత్రుని చంపబూనుట మంచిదికాదు అని కుమారస్వామి పలికెను.

ఐనను కోపముతో ఎఱ్ఱనైన కండ్లతో గొడ్డలిని గణపతిపై ప్రయోగింప బోవు పరశురాముని గణపతి అడ్డగించి అతనిని వెనుకకు తిరుగుమని కోరెను. ఐనను పరశురాముడు కోపముతో గణపతిని కొట్టగా గణపతి వెంటనే క్రిందపడెను.

గణపతి వెంటనే లేచి ధర్మ దేవతను సాక్షిగా చేసి, కోపమును జయించినవాడు కావున అతడు పరశురాముని ప్రబోధింపసాగెను. ఓ భార్గవరామా! నీవు శంకరుని అంతః పురమునకు వెళ్ళకుండ వెనుదిరుగుము. ఈశ్వరుని ఆజ్ఞలేక అంతఃపురమునకు వెళ్ళుటకు నీ కెట్టి సామర్థ్యము కలదు? నీవు నాకు సోదరుని వంటి వాడవు. పైగా మా ఇంటికి వచ్చిన అతిథివి. ఈశ్వరునకు చాలా ప్రేమ గల శిష్యుడవు. అట్లే మన ఇద్దరి విద్యా గురువు ఒక్కడే యైనందువలన నీవు చేయు పనులను నేను సహింపవలసియున్నది.

ఓపరశురామా! నేను కార్తవీర్యుని వంటి వాడను కాను. అట్లే బలహీనులైన రాజుల వంటి వాడను కాను. నేను జగత్పతియగు శంకరుని పుత్రుడనను విషయము నీకు తెలియకున్నది. అందువలన ఓ బ్రాహ్మణాతిథీ ! నీవు ఈ యుద్దమును చేయక క్షణ కాలముండుము. ఈక్షణము గడిచిన పిమ్మట నీతో ఈశ్వరుని యొక్క సమీపమునకు నేను కూడ వత్తునని గణేశుడు పలికెను.

నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను –

హేరంబవచనం శ్రుత్వా ప్రజహాస పునః పునః

పర్శుం క్షేప్తుం మనశ్చక్రే ప్రణమ్య హరిశంకరౌ

పర్శుం క్షిపంతం కోపేన తం చ రామం గజాననః

దృష్ట్యా ముమూరుం దేవేశో ధర్మం కృత్వాతు సాక్షిణం

యోగేన వర్ధయామాస శుండాం తాం కోటియోబినాం

యోగీంద్రస్తత్ర సంతిష్ఠన్ భామయిత్వా పునః పునః

శతథా వేష్టయిత్వా తు భ్రమయిత్వా తు తత్రవై

ఊర్ద్వముతోల్య వేగేన క్షుద్రాహీం గరుడోయథా

సప్తద్వీపాంశ్చ శైలాంశ్చ మేరుం చాఖిలసాగరాన్

క్షణేన దర్శయామాస రామం యోగపరాహతం

హస్తపాదాద్యనాథం తం జడం సర్వాంగకంపితం

పునస్తం భామయామాస దర్పితం దర్పనాశనః

గణపతియొక్క మాటలను విని పరశురాముడు నవ్వి శ్రీహరిని, శంకరుని నమస్కరించి తన గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగింపబూనెను. అప్పుడు గణపతి ధర్మదేవతను సాక్షిగా పెట్టి యోగ విద్య వలన తన తొండమును బాగుగాపెంచి దానిచే పరశురాముని పట్టుకొని చుట్టు ముట్టు త్రిప్పసాగెను. ఆ గణపతి తన తొండముచే పరశురాముని చిన్న పామును గరుత్మంతుడు ఒడిసి పట్టుకొని త్రిప్పనట్లు త్రిప్పుచు సప్త మహా ద్వీపములను, కుల పర్వతములను, మేరు పర్వతమును, సమస్త సముద్రములను భార్గవ రామునకు క్షణములో చూపించెను. అట్లే మితిమీరిన గర్వముతోనున్న భార్గవ రాముని అతని సమస్త అవయవములు కంపించునట్లు మరల అతనిని త్రిప్పసాగెను.

భూర్లోకం చ భువర్లోకం స్వర్లోకం చ సురేశ్వరః

జనోలోకం తపోలోకం ధ్రువలోకం చ తత్పరం

గౌరీలోకం శంభులోకం దర్శయామాస నారద

దర్శయిత్వాతు వీధ్యండం స పపౌ సప్తసాగరాన్

పునరుద్ధిరణం చక్రే సనక్రమకరోదకం

తత్ర తం పాతయామాస గంభీరే సొగరోదకే

ముమూరుం తం సంతరంతం పునర్జగ్రాహ లీలయా

పునస్తత్ర భామయిత్వా యోగీంద్రా యోగమాయయా

వైకుంఠం దర్శయామాస సలక్ష్మీకం చతుర్భుజం

క్షణం తత్రభ్రామయిత్వా యోగీంద్రో యోగమాయయా

పునః కరం చ యోగేన వర్ధయామాస లీలయా

గోలోకం దర్శయామాస విరజాంచ నదీశ్వరీం

బృందావనం శృంగశతం శైలేంద్రం రాసమండలం

గోపీగోపాదిభిస్సార్థం శ్రీకృష్ణం శ్యామసుందరం

ద్విభుజం మురళీహస్తం సస్మితం సుమనోహరం

రత్నసింహాసనస్థం చ రత్నభూషణభూషితం

తేజసా కోటిసూర్యాభం రాధావక్షస్థలస్థితం

ఏవం కృష్ణం దర్శయిత్వా ప్రణమయ్య పునః పునః

క్షణేన లంబమానం చ భ్రమయిత్వా పునః పునః

దృష్ట్యా కృష్ణం చేష్టదేవం సర్వపాపప్రణాశనం

భ్రూహాత్యాదికం పాపం భృగోర్జూరం చకార హ

న భవేద్యాలనా నష్టా వినా భోగేన పాపజా

స్వల్పాం చ బుభుజే రామోగతాఽన్యా కృష్ణదర్శనాత్

క్షణేన చేతనారి ప్రాప్య భువి వేగాత్పపాతహ

బభూవ దూరీభూతం చ గణేశస్తంభనం భృగోః

గణపతి భార్గవరాముని తన తొండముతో వొడిసిపట్టి అతనికి భూలోకమును, భువర్లోకమును, స్వర్లోకమును, జనోలోకమును, తపోలోకమును, ధ్రువలోకమును, అట్లే గౌరీలోకమును, శంకర లోకమును బ్రహ్మాండమును చూపించెను.

ఆ తరువాత ఏడు సముద్రములలోనున్న నీటిని త్రాగి మరల వమనము చేసెను. అట్టి సాగర జలములలో భార్గవరాముని పడవేసెను. సముద్ర జలములలో పడి కొట్టు మిట్టాడుచున్నప్పుడు అతనిని మరల ఒడిసిపట్టుకొని తన యోగమాయతో త్రిప్పుచు వైకుంఠమును చూపించెను. అచ్చట చతుర్భుజుడు, లక్ష్మీ సమేతుడైన నారాయణుడున్నాడు.

ఆటు పిమ్మట భార్గవరామునకు తన తొండమును పెంచి గోలోకమును, ఆలోకమందున్న విరజానదిని, బృందావనమును, శత శృంగ పర్వతమును, రాసమం డలమును చూపెను. ఆ గోలోకమున రెండు భుజములతో, చేతిలో మురళిని పట్టుకొని, రత్న భూషణాలంకృతుడై రత్న సింహాసనమున రాధాదేవి వక్షస్థలము పైనున్న శ్రీ కృష్ణ పరమాత్మను చూపెను.

సర్వపాపహరుడు ఇష్టదేవుడగు శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనము వలన భార్గవరాముడు చేసిన భ్రూణహత్యాది పాపములన్నియు నశించిపోయినవి. చేసిన పాపములు అనుభవించక తీరిపోవు. భార్గవరాముడు తాను చేసికొన్న పాపముల ఫలితమును కొంత అనుభవించెను. మిగిలిన పాపము శ్రీకృష్ణుని దర్శించినందువలన సంపూర్ణముగా నశించినది. అతడు క్షణకాలము చైతన్యము పొందగా వేగముగా అతనిని క్రింద పడవేసెను.

సస్మార కవచం స్తోత్రం గురుదత్తం సుదుర్లభం

అభీష్టదేవం శ్రీకృష్ణం గురుం శంభుం జగద్గురుం

చిక్షేప పర్శుమవ్యర్థం శీనతుల్యం చ తేజసా

గ్రీష్మమధ్యాహ్నమార్తండప్రభాశతగుణం మునే

పితురవ్యర్థమగ్రం చ దృష్ట్వా గణపతిః స్వయం

జగ్రాహా వామదంతేన నాస్త్రం వ్యర్థం చకారహ

నీపాళ్య పర్ఫుర్వేగేన భీత్వా దంతం సమూలకం

జగామ రామహాస్తం చ మహాదేవబలేన చ

హాహేతి శబ్ధమాకాశ దేవాశ్చక్రుర్మహాభియా

వీరభద్రః కార్తికేయ క్షేత్రపాలాశ్చ పార్షదాః

పపాత భూమౌ దంతశ్చ సరక్తః శబ్దయస్తదా

పపాతగైరికాయుక్తో యథాస్ఫటికపర్వతః

భార్గవ రాముడు తనయొక్క అభీష్ట దేవుడగు శ్రీకృష్ణుని, గురువగు శంకరుని స్మరించుకొనుచు తన గురువగు శంకరుడు తనకు ప్రసాదించిన శ్రీ కృష్ణ కవచమును శ్రీ కృష్ణ స్తోత్రమును చదువుచు అమోఘమైన తన గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించెను. ఆ గండ్రగొడ్డలి ప్రభావమున శంకరుని వంటిది. గ్రీష్మ కాలమందలి మధ్యాహ్న సూర్యుల వంటి కాంతి గలది.

అమోఘమైన, తన తండ్రి యొక్క ఆ గొడ్డలిని గణపతి చూచి తన యొక్క ఎడమ దంతమునకు తగిలించి ఆ శస్త్రము వ్యర్థము కాకుండ చేసెను. ఆ గొడ్డలి వేగముగా గణపతి యొక్క ఎడమ ప్రక్కనున్న దంతమునకు తగిలి దానిని సమూలముగా పెకలించి శంకరుని మహిమవలన తిరిగి పరశురాముని చేతికి చేరెను. అప్పుడు అధికమైన భయముచే వీరభద్రుడు, కుమారస్వామి, ఇతర క్షేత్రపాలకులు, అనుచరులు మొదలగు దేవతలందరు హాహాకారములు చేసిరి. అప్పుడు గణపతి యొక్క దంతము రక్తముతో, గైరిక ధాతువుతోనున్న స్ఫటిక పర్వతమువలె పెద్ద చప్పుడు చేయుచు భూమిపై పడిపోయెను.

శబ్దేన మహతా విప్ర చకoపే పృథివీ భియా

కైలాసస్థాః జనాస్సర్వే మూర్చోమాపుః క్షణః బియా

నిద్రా బభంజ తత్కాలే నిద్రేశస్య జగత్ర్పభోః

ఆజగామ బహిశ్శంభూః పార్వత్యాసహా సంభ్రమాత్

పురో దదర్శ హేరంబం లోహితాస్యం క్షతేన తం

భగ్నదంతం జితక్రోధం సస్మితం లజ్జితం మునే

పప్రచ్ఛ పార్వతీ శీఘ్రం స్కందం కిమితీ పుత్రక

సచ తాం కథయామాస వార్తాం పౌర్వాపరం బియా

చుకోప దుర్గా కృపయా రురోద చ ముహుర్ముహుః

ఉవాచ శంభోః పురతః పుత్రం కృత్వా స్వవక్షసి

సంబోధ్య శంభుం శోకేన భియా వీనయ పూర్వకం

ఉవాచ ప్రణతా సాధ్వీ ప్రణతార్తిహారం పతిం

నారదా! గణపతియొక్క దంతము క్రిందపడినప్పుడు కలిగిన శబ్దము వలన భూమియంతయు భయముతో కంపించెను. కైలాస నగరమున ఉన్న జనులందరు భయముతో క్షణకాలము మూర్ఛనొందిరి. ఆ శబ్దమునకు జగత్ర్పభువగు శంకరునకు నిద్రా భంగమై పార్వతీదేవితో కలసి తన భవనము నుండి బయటకు వచ్చెను. అప్పుడాతనికి తన దంతము పోయినందువలన ఎఱ్ఱనైన ముఖముతో, కోపమును జయించిన వాడు కావున సిగ్గుతో తలవంచుకొనియున్న గణపతి కన్పించెను.

అప్పుడు పార్వతీదేవి అచ్చటనున్న కుమార స్వామిని ఏమి జరిగెనో వివరింపుమని కోరగా ఆ సుబ్రహ్మణ్య మూర్తి జరిగిన విషయమునంతయు ఆమూలాగ్రముగ వినిపించెను. అందువలన దుర్గాదేవికి భార్గవరా ముని పై కోపము కలిగినది. తన పుత్రుని దీనావస్థను చూచి దుఃఖించినది. ఆ దేవి తన పుత్రుడగు గణపతిని అక్కున చేర్చుకొని భక్తజ నుల యొక్క ఆర్తిని పోగొట్టు తన భర్తకు నమస్కరించి అతనితో ఇట్లు పలికెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే గణేశదంతభంగకారణవర్ణనం నామ త్రిచత్వారింశత్తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన గణపతియొక్క దంత భంగ కారణమను నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.