బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

27 - జమదగ్నిసంహార పరశురామ ప్రతిజ్ఞ

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను –

హరిం స్మృత్వా గృహం గత్వా రాజా విస్మితమానసః

ఆజగామ మహారణ్యే జమదగ్న్యాశ్రమం పునః

రథానం చ చతుర్లక్షం రథినాం దశలక్షకం

అశ్వేంద్రాణాం గజేంద్రాణాం పదాతీనామసంఖ్యకం

రాజేంద్రాణాం సహస్రం చ మహాబలపరాక్రమం

మహాసమృద్ధియుక్తశ్చ త్రైలోక్యం జేతుమీశ్వరః

సర్వతోవేష్టయామాస జమదగ్న్యాశ్రమం ముదా

రథస్థో వర్మయుక్తశ్చ కార్తవీర్యార్జునః స్వయం

సైన్యశబ్దైర్వాద్యశబ్దై ర్మహాకోలాహలైర్మునే

జమదగ్న్యాశ్రమస్థాశ్చ మూర్ఛామాపుర్భయేన చ

కుటీo ప్రవిశ్య బలవాన్ గృహీత్వా కపిలాం శుభాo

పురం గంతుం మనశ్చక్రే దుర్బుద్ధిరసదాశ్రయః

సముత్తస్థౌ మునిశ్రేష్ఠో గృహీత్వా సశరం ధనుః

ఏకాకీ ముక్తగాత్రశ్చ ధేనుం నత్వా హరీం స్మరన్

ఆశ్రమస్థాన్ జనాన్ సర్వాన్ సమాశ్వాస్య చ యత్నతః

ఆజగామ రణస్థానం నీశ్శంకో నృపతేః పురః

నిర్మమే శరజాలం చ సమునిర్మంత్రపూర్వకం

ఆచ్చాదయత్ స్వాశ్రమం తైర్మానవం వర్మణా యథా

అపరం శరజాలం చ నిర్మమే మునిపుంగవః

తైరేవ వారయామాస సర్వసైన్యం యథాక్రమం

మునీనా శరజాలేన సర్వసైన్యం సమావృతం

తాని సర్వాణి గుప్తాని యథా పత్రాణి పంజరే

కార్తవీర్యుడు ఇంటికివెళ్ళి హరిని మనస్సులో స్మరించుకొని జరిగినదానికి ఆశ్చర్యపడి తిరిగి జమదగ్నియొక్క ఆశ్రమమునకు వచ్చెను. అతని వెంట నాలుగులక్షల రథములు పదిలక్షల రథికులు, అసంఖ్యాకమైన గజదళము, ఆశ్వదళము, పదాతిదళము, గొప్ప బల పరాక్రమములుగల వేయిమంది రాజేంద్రులుండిరి. ఇట్టి గొప్ప సైన్యముతో కార్తవీర్యుడు ముల్లోకములను సహితము జయింపగలిగియుండెను. కార్తవీర్యుడు తనసైన్యమునంతయు జమదగ్ని ఆశ్రమము చుట్టు నిలిపియుండెను. ఆ మహారాజు కవచమును ధరించియుండెను. అతని సైన్యఘోషవలన, అతని సైన్యమందలి వాద్యఘోషవలన జమదగ్నియొక్క ఆశ్రమమున నున్నవారందరు మూర్ఛిల్లిరి. అప్పుడతడు జమదగ్నియొక్క ఆశ్రమమును ప్రవేశించి అందున్న కపిలను బలాత్కారముగా తన పట్టణమునకు తీసికొనిపోవ ప్రయత్నించెను.

అప్పుడు జమదగ్ని మహర్షి మూర్చనుండి తేరుకొని అమ్ములతోనున్న ధనుస్సును తీసికొని కవచము ధరింపకనే ఒంటరిగా యుద్ధమునకు బయలుదేరెను. బయలు దేరుటకు పూర్వము జమదగ్ని మహర్షి కపిలకు నమస్కరించి శ్రీహరిని మనస్సులో స్మరించుకొనుచు ఆశ్రమమునందున్న సమస్తజనులను ఓదార్చి శంకలేక యుద్ధరంగమును చేరుకొనెను.

అతడు మంత్రపూర్వకమైన బాణములచే తన ఆశ్రమమును కవచము ధరించిన మానవునివలె కప్పిపుచ్చి మరియొక బాణపరంపరచే శత్రువుల సమస్తసైన్యమును కప్పివేసెను.

రాజా దృష్ట్వా మునిశ్రేష్ఠమవరుహ్య రథాత్పురః

సార్థం నృపేంద్రైర్భక్త్యా చ ప్రణవామ కృతాంజలిః

నత్వాఽ రురోహ యావం స మునేః ప్రాప్య శుభాశీషః

ఆరుహ్య చ నృపశ్రేష్ఠః స్వయానం హృష్టమానసః

నృప్తెస్సార్థం నృపశ్రేష్ఠశ్చిక్షేప మునిపుంగవే

అస్త్రం శస్త్రం గదాం శక్తిం జఘాన క్రీడయా మునీః

మునీశ్చిక్షేప దివ్యాస్త్రం చచ్చేదే లీలయా నృపః

శూలం చిక్షేప నృపతిస్తజ్జఘాన తదా మునిః

అపరం శరజాలం చ నిర్మమే మునిపుంగవః

శస్త్రాస్త్రైర్దుర్నివార్యైశ్చ ఖండం ఖండం చకార సః

నిబద్ధాశ్శరజాలేన న చ శక్తాః పలాయితుం

జృంభణాస్త్రేణ మునీనా తేచ సర్వే విజృంభితాః

హస్త్యశ్య రథ పాదాల సహితం సర్వసైన్యకం

రాజానం నిద్రితం దృష్ట్యా న జఘాన మునీశ్వరః

గృహీత్వా కపిలాం హృష్టో రుదంతీం శోకమూర్ఛితాం

బోధయిత్వాపురః కృత్వాస్వాశ్రమం గంతుముద్యతః

కార్తవీర్యుడు జమదగ్ని మహామునిని చూచి రథమునుండి దిగి తనతోటి రాజులతో కలిసి చేతులు జోడించుకొని అతనికి నమస్కరించెను. జమదగ్ని అతనికి ఆశీస్సుల నొసగిన పిమ్మట  కార్తవీర్యుడు తన రథమునధిరోహించి తనతోటి రాజులతో కలిసి ముని పైన బాణవర్షమును కురిపించెను. కార్తవీర్యుడు చేసిన అస్త్రశస్త్రములను గదను శక్తిని ముని అవలీలగా ఖండించి రాజాపై దివ్యాస్త్రమును వేయగా నతడుకూడ దానిని అవలీలగా ఖండించెను. రాజు విసిరిన శూలమును ముని ఖండించి మరియొక బాణపరంపరచే శత్రుసైన్యమును కప్పివేసెను, అట్లే శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రములను తన శస్త్రాస్త్రములచే ముక్కలు ముక్కలుగా చేసెను. కార్తవీర్యుని యొక్క సైన్యము జమదగ్ని ప్రయోగించిన బాణములను తప్పించుకొని పారిపోవుటకు కూడ వీలు లేక పోయను. ఆ తరువాత మహర్షి ప్రయోగించిన జృంభణాస్త్రము వలన కార్తవీర్యుడు అతని సైన్యము నిద్రలో మునిగినది. కార్తవీర్యుడు నిద్రలోనున్నందువలన జమదగ్ని అతనిని చంపక శోకమున మునిగియున్న కపిలను తన ఆశ్రమమునకు తీసికొనిపోవుటకు ప్రయత్నించెను.

ఏతస్మిన్నంతరే రాజా చేతనాం ప్రాప్య నారద

నివారయామాస మునిం గృహత్వా సశరం ధనుః

జగామ కపిలా త్రస్తా స్వస్థానం చ రణాంగణాత్

మునిశ్చ తస్థౌ నిశ్శంకో గృహీత్వా సశరం ధనుః

బ్రహ్మాస్త్రం చ నృపశ్రేష్ఠః స చిక్షేప మునౌ తదా

బ్రహ్మాస్త్రేణ మునీంద్రస్య సద్యో నిర్వాణతాం గతం

దీవ్యాస్త్రేణ మునిశ్రేష్ఠో నృపస్య సశరం ధనుః

రథం చ సారథిం చైవ చిచ్ఛేదే వర్మ దుర్వహం

అథ రాజా మహాకృద్దో దదర్శ స్వసమీపతః

దత్తేన దత్తాం శక్తిం తామేకపూరుషఘాతినీం

జగ్రాహ నత్వా దత్తం తం స న శక్తిముల్బణాం

చూర్ణయామాస తత్రైవ శతసూర్య సమప్రభాo

యత్తేజః సర్వదేవానాం తేజో నారాయణస్య చ

శంభోశ్చ బ్రహ్మణశ్చైవ మాయాయాశ్చైవ నారద

తత్రైవావాహయామాస స యోగీ మంత్రపూర్వకం

తేజసా ద్యోతయామాస గగనం చ దిశో దశ

దృష్ట్వా క్షిపంతిం తాం దేవా హాహాకారేణ చుక్రుశుః

ఆకాశస్థాశ్చ సమరం పశ్యంతో దుఃఖితా హృదా

చి క్షేమ తాం చూర్ణయిత్వా కార్తవీర్యార్జునః స్వయం

సద్యః పపాత సా శక్తిర్జ్వలంతీ మునివక్షసి

విదార్యోరో మునేః శక్తిర్జగామ హరీసన్నిధిం

దత్తాయ హరిణా దత్తా శస్త్రాస్త్రనిధయే సదా

మూర్చాం సంప్రాప్య స మునిఃప్రాణాంస్తత్యాది తత్క్షణం

తేజోఽoబరే భ్రమీత్వా చ బ్రహ్మలోకం జగామ హ

యుద్దే మునిం మృతం దృష్ట్యా రురోద కపిలా ముహుః

హేతాత తాతేఽత్యుచ్చార్య గోలోకం సాజగామహ

సర్వం సా కథయామాస గోలోకే కృష్ణమీశ్వరం

రత్నసింహాసనస్థం తం గోపైర్గోపీభిరావృతం

కృష్ణేన బ్రహ్మణా దత్తా బ్రహ్మణా భృగవే పురా

సా ప్రీత్యా పుష్కరే బ్రహ్మన్ భృగుణా జమదగ్నయే

నత్వా చ కామధేనూనాం సమూహం సా జగామ హ

తదశ్రుబిందునామర్త్యే రత్నసంధోబభూవహ

అథరాజా తం నిహత్య బోధయిత్వా స్వ సైన్యకం

ప్రాయశ్చిత్తం వినిర్వర్త్య జగామ స్వపురం ముదా

ఆసమయమున కార్తవీర్యుడు తెలివికి వచ్చి ధనుర్బాణములను తీసికొని మహర్షిని అడ్డగించగా కామధేనువు భయపడి తానుండిన ప్రదేశమునకు పోయెను. జమదగ్ని మహర్షికూడ నిర్భయముగా ధనుర్బాణములను తీసికొని నిలుచుండెను. అప్పుడు రాజు మునిపై బ్రహ్మాస్త్రమున వేయగా మహర్షి ఆ బ్రహ్మాస్త్రము చేతనే దానిని నివారించెను. పైగా రాజుయొక్క రథమును, సారథిని, కవచమును అన్నిటినీ ఛేదించెను. అందువలన రాజు పరమకృద్దుడై దత్తాత్రేయ మహర్షి తనకిచ్చిన ఏక పురుష సూతిని యగు శక్తిని ప్రయోగించెను. ఆ శక్తి నూరుగురు సూర్యుల కాంతిగలది. యోగియగు కార్తవీర్యుడు సమస్త దేవతల తేజస్సును, బ్రహ్మ, విష్ణు, శంకరుడు, మాయాదేవియొక్క తేజస్సును మంత్రపూర్వకముగా ఆ శక్తియందు ఆవాహనచేసి మహర్షిపై ప్రయోగించెను. ఆ శక్తి ఆకాశమును దశదిశలను ప్రకాశింప జేయుచుండెను. ఆ సమయమున ఆకాశమున నున్న దేవతలు దుఃఖించుచు హాహాకారములు చేయసాగిరి. ఆ శక్తి జ్వలించుచు మహర్షి రొమ్మునకు తగిలి ఆతని వక్ష స్థలమును భేదించుచు హరి సన్నిధికి పోయెను. ఆ శక్తిని శ్రీహరియే శస్త్రాస్త్ర విశారదుడగు దత్తాత్రేయునకిచ్చెను. అందువలన అది తిరిగి శ్రీహరిసన్నిధికి పోయినది. ఆ శక్తి తగిలినందువలన ముని మూర్చను పొంది వెంటనే ప్రాణములను వదిలెను. అతని ప్రాణములు ఆకాశమున క్షణకాలము తిరిగి బ్రహ్మలోకమునకు పోయినవి.

యుద్ధరంగమున మహర్షియగు జమదగ్ని చనిపోయిన వృత్తాంతమును తెలిసికొన్న కపిల తండ్రీ! తండ్రీ! యని పిలుచుచు గోలోకమునకుపోయి గోలోకమున గోపీగోపకులతో రత్న సింహాసనము పైనున్న శ్రీకృష్ణునితో జరిగిన విషయమునంతయు వివరించినది.

ఆ కామధేనువును శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకివ్వగా, అతడు భృగుమహర్షికిచ్చెను. ఆ భృగుమహర్షి పుష్కరక్షేత్రమున తన పుత్రుడగు జమదగ్ని మహర్షికిచ్చెను. ఆ కామధేనువు గోలోకమందలి కామధేనువులకు నమస్కరించి వాటివద్దకుపోయెను.

ఆ కామధేనువుయొక్క కన్నీళ్ళనుండి రత్నసంధుడను వాడు పుట్టగా, కార్తవీర్యుడు అతనిని కూడ సంహరించి తన సైన్యమును ఓదార్చి ప్రాయశ్చిత్తమును కూడ చేసికొని తన పట్టణమునకు తిరిగిపోయెను.

ప్రాణనాథం మతం శ్రుత్వా జగామ రేణుకా సతీ

మునీం వక్షసి సంస్థాప్య క్షణం మూర్చామవాప సా

తతః సా చేతనాం ప్రాప్య న రురోద పతివ్రతా

ఏహి వత్స భృగో రామరామ రామేత్యువాచ హా

ఆజగామ భుగుస్తూర్ణం క్షణాద్వై పుష్కరాదహో

ననామ మాతరం భక్త్యా మనోయాయీ చ యోగవిత్

దృష్ట్యా రామో మృతం తాతం శోకార్తాం జననీం సతీం

ఆకర్ణ్య రణవృత్తాంతం ప్రయాంతీం కపిలాం శుచా

విలలాప భృశం తత్ర తాత జననీతి చ

చితాం చకార యోగీంద్రశ్చందనైరాజ్యసంయుతాం

రేణుకా రామమాదాయ తూర్ణం కృత్వా స్వవక్షసి

చుచుంబ గండే శిరసి రురోదోచ్చైర్భృశం ముహుః

రామ రామ మహాబాహో క్వ యామీ త్వాం విహాయ చ

వత్స వత్సేతి కృత్వైవం విలలాప భృశం ముహుః

మత్ప్రాణాధిక హే వత్స మదీయం వచనం శ్రుణు

పిత్రోః శేషక్రియాం కృత్వా యాయా యుద్ధం న పుత్రక

గృహే తిష్ఠ సుఖం వత్స తపస్యాం కురు శాశ్వతీం

సమరం నైవ సుఖదం దారుణైః క్షత్రియైః సహ

మాతుర్వచన మశ్రుత్వా ప్రతిజ్ఞాం తాం చకార హ

త్రిస్సప్తకృత్వో నిర్భుపాం కరిష్యామి ధ్రువం మహీం

కార్తవీర్యం హనిష్యామి లీలయా క్షత్రియాధమం

పితృంశ్చ తర్పయిష్యామి  క్షత్రియక్షతజైస్తథా

తనభర్త చనిపోయేనను విషయమును విన్న రేణుకాదేవి జమదగ్నిని తన ఎదపైనుంచుకొని క్షణకాలము మూర్ఛపొందెను. ఆ దుఃఖమున ఓ భార్గవ రామా రమ్ము రమ్మని పిలవగా భార్గవ రాముడు తక్షణమే పుష్కర క్షేత్రము నుండి మనోవేగముతో అచ్చటకు వచ్చి భక్తితో తల్లికి నమస్కరించేను.

భార్గవ రాముడు తన తండ్రి చనిపోయిన విషయమును తెలుసుకొని తల్లియొక్క దుఃఖమును చూచి కపిల గోలోకమునకు పోవుచున్న వృత్తాంతమును తెలిసికొని అతిగా ఏడ్చెను. యోగీంద్రుడగు భార్గవరాముడు చందనపు కట్టెలతో, నేతితో తండ్రికి చితిని ఏర్పాటుచేసెను. తల్లియగు రేణుకాదేవి తన పుత్రుడగు రాముని అక్కునకు చేర్చుకొని అతని చెక్కిళ్ళను శిరస్సును ముద్దిడుకొని మాటిమాటికి ఏడ్చుచు ఇట్లు పలికెను.

ఓ భార్గవరామ నిన్ను వదలి నేనెక్కడికి పోయెదను నీవునాయొక్క ప్రాణములకంటే మిన్నయైనవాడవు. నాయనా నీతల్లియగు నామాటలు వినుము. నీవు నీపితరులయొక్క అంత్యక్రియను నిర్వర్తింపుము. యుద్దమును మాత్రము చేయవద్దు. ఇంటిలోనే ఉండి తపస్సును చేసికోనుచుండుము. క్రూరులైన క్షత్రియులతోడి యుద్ధము సుఖమున కలిగింపదు అని రేణుక ఏడ్చుచు పుత్రునితోననెను. కానీ భార్గవరాముడు తల్లిమాటలు వినిపించుకొనక ఈ భూమినీ ఇరువది యొక్క మార్లు క్షత్రియ రహితముగా తప్పక చేయుదునని క్షత్రియాధముడగు కార్తవీర్యుని సంహరింతునని, క్షత్రియుల రక్తముచే నా పితృదేవతలకు తర్పణమును చేయుదునని దృఢమైన ప్రతిజ్ఞచేసెను.

ఇత్యుదీర్య పురో మాతలు ర్విలలాప ముహుర్ముహుః

హితం తథ్యం నీతిసారం బోధయామాస మాతరం

భార్గవ రాముడీ విధముగా నని తల్లిముందు వెక్కి వెక్కి ఏడ్చుచు సత్యము, హితవు, నీతిసారమైన మాటలనిట్లు పలుకసాగెను.

రామ ఉవాచ - భార్గవరాముడిట్లు పలికెను –

పితుః శాసన హంతారం పితుర్వధవిధాయకం

యో నహంతీ మహామూడో రౌరవం సవ్రజేత్ధ్రువం

అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహః

క్షేత్రదారాపహారీ చ పితృబంధువిహింసకః

సతతం మందకారీ చ నించకః కటుజల్పకః

ఏకాదశైతే పాపీష్ఠా వధార్హ వేదసమ్మతాః

ద్విజానాం ద్రవిణాదానం స్థానాన్నిర్వాసనం సతీ

వపనం తాడనం చైవ వధమాహుర్మనీషిణః

తండ్రియొక్క ఆజ్ఞను తీరస్కరించువానిని, తండ్రిని చంపువానిని, చంపని మహా మూఢుడు రౌరవ నరకమునకు పోవును.

ఇంటికి నిప్పుపెట్టువాడు, విషమును పెట్టువాడు, శస్త్రమును ధరించువాడు, ధనమును అపహరించువాడు, భూమిని, భార్యను అపహరించువాడు, పితరులను, బంధువులను హింసించువాడు, జాడ్యముగా ప్రవర్తించువాడు, ఇతరుల నిందించువాడు, కటువుగా మాట్లాడువాడు అను పదకొండుమంది పాపులనియు, వారు మరణదండనకు అర్హులనియు వేదము సహితము చెప్పుచున్నది. ఈ సమయమున బ్రాహ్మణులీ వధార్హమైన పనిచేసినచో వారి ధనమును స్వాధీనము చేసికొనుట, ఊరినుండి. బహిష్కరించుట, తలకొరిగించుట, కొట్టుట, అనునవి వధతో సమానమైన శిక్షలని పెద్దలందురు.

ఏతస్మిన్నంతరే చాజగామ భృగుః స్వయం

అతిత్రస్తో మనస్వీ చ హృదయేన విదూయతా

దృష్ట్వా తం రేణుకారామౌ వినతౌ సంబభూవలు:

సతావువాత వేదోక్షం పరలోకహితాయ చ

ఆ సమయమున విజ్ఞాడగు భృగుమహర్షి బాధపడుచు అచ్చటకు వచ్చెను. అతనిని చూచి రేణుక, భార్గవరాముడు విసయముతో లేచి నమస్కరించిరి. వారిని చూచి భృగుమహర్షి పరలోకహితమునకై వేదసమ్మమైన మాటలను ఇట్లు పలికెను.

భృగురువాచ - భృగుమహర్షి ఇట్లు పలికెను –

మద్వంశజాతో జ్ఞానీ త్వం కథం విలపసే సుత

జలబుద్బుదవత్సరం సంసారే చ చరాచరం

సత్యసారం సత్యబీజం కృష్ణం చింతయ పుత్రక

యద్గతం తద్గతం వత్స గతం నైవాగమిష్యతి

యద్భవేత్తద్భవత్యేవ భవీణా యద్భవిష్యతి

పూర్వార్జితం స్వీయకర్మ ఫలం కేన నివార్యతే

భూతం భవ్యం భవిష్యం చ యత్కృష్ణేన నిరూపితం

నిరూపితం యత్తత్కర్మ కేనవత్స నీవార్యతే

మాయాబీజం మాయినాం చ శరీరం పాంచభౌతికం

సంకేతపూర్వకం నామ ప్రాతః స్వప్నసమం సుత

క్షుధానిద్రాదయా శాంతిః క్షమాకాంత్యాదయస్తథా

యాంతి ప్రాణా మనోజ్ఞానం ప్రయాతే పరమాత్మని

బుద్ధిశ్చ శక్తయస్సర్వా రాజేంద్రమివ కింకరాః

సర్వే తమనుగచ్ఛంతి తం కృష్ణం భజ యత్నతః

కేవా క్రేషాం చ పితరః కేవా కేషాం సుతాః సుత

కర్మభిః ప్రేరితాః సర్వే భవాబ్ధౌ దుస్తరే పరం

జ్ఞానినో మా రుదంత్యేవ మా రోదీః పుత్ర సాంప్రతం

రోదనాశ్రుప్రపతానాన్మృతానాం నరకం ధ్రువం

 సంకేతాభ్యోచ్చారణేన యద్రుదంతీ చ బాంధవః

శతవర్షం రుదీత్వా తం ప్రాప్నువంతి న నిశ్చితం

పార్టీవాంశం చ పృథివీ గృహ్ణోత్యస్థిత్వచాదికం

తోయాంశం చ తథాతోయం శూన్యాంశం గగనం తథా

వాయ్వంశం చ తథా వాయుః తేజస్తేజోఽoశకం తథా

సర్వేవిలీనాః సర్వేషు కోవాఽయాస్యతి రోదనాత్

నామశ్రుతియశః కర్మ కథామాత్రావశేషితః

వేదోక్తం చైవ యత్కర్మ కురు తత్పారలోకికం

స చ బంధుః స పుత్రశ్చ పరలోక హితాయ యః

భృగోస్తద్వచనం శ్రుత్వా శోకం తత్యాజ తత్క్షణం

రేణుకా చ మహాసాద్వీ తం వస్తుముపచక్రమే

ఓ భార్గవరామా! నీవు నావంశమున పుట్టినవాడవు. జ్ఞానవంతుడవగు నీ విట్లు ఏడ్వవచ్చునా? ఈప్రపంచమున చరా చర ప్రాణికోటి యంతయు నీటిబుడగవలె క్షణములోనే పుట్టును. క్షణములోనే నశించును. నీవిప్పుడు సత్యరూపుడైన కృష్ణుని మనస్సులో స్మరించుకొనుము.

జరిగినదేదియో జరిగిపోయినది. జరిగిన విషయము తిరిగిరాదు. అట్లే జరుగవలసినదీ తప్పక జరుగును. పూర్వ జన్మార్జితమైన తన కర్మ ఫలితము నెవ్వరు తప్పింపలేరు. భూత భవిష్యద్వర్తమానము లన్నియు శ్రీకృష్ణునివలన నిశ్చయింపబడినవి. అట్లు పరమాత్మచే నిర్ణయింపబడిన వాటిని ఎవ్వరు నివారింపగలరు?

మాయకు కారణమైన అశాశ్వతులయొక్క ఈ శరీరము పాంచభౌతికమైది. ఇది ఒక సంకేతమువంటిది కాని స్థిరమైనదికాదు. ఈ శరీరమునుండి పరమాత్మబయలుదేరగనే ఆకలి, నిద్ర, దయ, శాంతి, ఓర్పు, కాంతి, ప్రాణములు, మనస్సు, జ్ఞానము మొదలగునవన్నియు రాజును అనుచరులు అనుసరించిపోవునట్లు బయలుదేరిపోవును. ఇవన్నియు కృష్ణుననుసరించి శరీరమున ప్రవేశించును. కృష్ణుననుసరించి శరీరమునుండి వెడలిపోవును కావున నీవు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు సేవించుచుండుము. తండ్రి, కొడుకు అనుబంధము ఈ అగాధమైన సంసారసాగరమున కర్మలవల్ల ఏర్పడినది. అందువలన జ్ఞానవంతులు ఎన్నడును మృతిచెందిరనుబాధకు లోనుకారు. బంధువులు మృతునికొరకు ఏడ్చి కన్నీరు కార్చినందువలన ఆ మృతునికి నరకము తప్పక లభించును. బంధువర్గము మృతుని పేరుపెట్టి ఎన్ని సంవత్సరములేడ్చినను అతడు తిరిగిరాడు. మృతునియొక్క పార్థివాంశమైన చర్మము, ఎముకలు మొదలగువాటిని భూమీగ్రహించగా, జలాంశమును జలమును, ఆకాశాంశమును ఆకాశము, వాయ్వంశమ వాయువు, తేజోఽoశమును తేజస్సు గ్రహించును. ఈవిధముగా పంచభూతముల యందు విలీనమైన మృతునిగూర్చి దుఃఖించినచో అతడు తిరిగి వచ్చునా? మృతుని పేరు, కీర్తి, సత్కర్మలు మాత్రము మిగిలిపోవును? అందు వలన వేదోక్తమైన పారలౌకిక కర్మను నీవు విర్వహింపుము. పరలోకమునకు సంబంధించిన కర్మ చేయువాడే బంధువు, పుత్రుడు అని పలికిన భృగు మహర్షి మాటలు విన్న రేణుకాదేవి శోకమును వదిలి పెట్టి కుమారునితో ఇట్లనెను.

ఇతిశ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే జమదగ్నిసంహార పరశురామ ప్రతీఙ్ఞాది వర్ణనం నామ సప్తవింశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదైన గణపతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన జమదగ్నిమహర్షి సంహారము, పరశురాముని ప్రతిజ్ఞలు కల ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.