బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

18 - విఘ్నేశ విఘ్నకథనం, గజముఖ కారణము

నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను –

నారాయణ మహాభాగ వేదవేదాంగపారగ

పృచ్ఛామి త్వామహం కించిదతీసందేహవాన్యతః

సుతస్య త్రిదశేశస్య శంకరస్య మహాత్మనః

విఘ్ననిఘ్నస్య యద్విఘ్నమీశ్వరస్య కథం ప్రభో

పరిపూర్ణతమః శ్రీమాన్పరమాత్మా పరాత్పరః

గోలోకనాథః స్వాంశేన పార్వతీతనయః స్వయం

అహో భగవతప్తస్య మస్తకచ్ఛేదనం విభో

గ్రహదృష్ట్యా గ్రహేశస్య కథం మే వక్తుమర్హసి

వేదవేదాంగముల తత్త్వమంతయు తెలిసిన నారాయణ మహర్షికి ఒక చిన్న విషయమునడుగుచున్నాను. నేను ఎక్కువ సందేహములున్నవాడను కావున దయచేసి సందేహనివృత్తిసేయుము.

మహాత్ముడు, దేవతలకెల్ల అధిపతి. శంకరుని పుత్రుడగు విఘ్నరాజు స్వయముగా విఘ్నములనెల్ల పోగొట్టును. అట్టి వీఘ్నాధిపతికి విఘ్నమెట్లు కలిగినది? అట్లే పార్వతీపుత్రుడగు ఆ గణపతి శ్రీకృష్ణభగవానుని అంశచే జన్మించెను. గ్రహముల కన్నిటికీ అధిపతియగు ఆ గణపతి తల శని గ్రహము యొక్క చూపుపడినందువలన తెగిపోయినట్లు చెప్పితిరి. ఇదెట్లు సంభవమగునో విశదీకరింపుడని నారదుడు ప్రార్థించెను.

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు పలికెను –

సావధానం శ్రుణు బ్రహ్మన్నితిహాసం పురాతనం

విఘ్నేశస్య బభూవేదం విఘ్నం యేన చ నారద

ఏకదా శంకరస్సూర్యం జఘాన వరమష్టదా

సుమాలిమాలిహంతారం శూలేన బహువత్సలః

శ్రీసూర్యోఽమోఘశూలేనాశనితుల్యేన తేజసా

జహౌ స చేతనాం సద్యో రథాచ్చ నిపపాత హ

దదర్శ కశ్యపః పుత్రం మృతముత్తానలోచనం

కృత్వా వక్షసీ తం శోకాద్వీలలాప భృశం ముహూః

హాహాకారం సురాశ్చక్రుర్విలేపుర్భయకాతరాః

అంధీభూతం జగత్సర్వం బభూవ తమసాఽవృతం

ఓ నారదమహర్షి విఘ్ననాయకుని శిరస్సు తెగిపడుటకు కారణమైన కథయున్నది. అది చాలా ప్రాచీనమైనది.

ఒకప్పుడు సూర్యుడు సుమాలి, మాలి ఆనువారిని కొట్టుచుండగా పరమకారుణికుడైన శంకరుడు చూచెను. అప్పుడు అతడు కోపమును పట్టజాలక తన శూలముతో ఎనిమిదిమార్లు కొట్టెను. వజ్రమువలె అమోఘమైన శంకరుని శూలము తగులుటచేత సూర్యుడు స్పృహదప్పి రథము నుండి కింద పడి పోయెను. కండ్లు తేలవేసి పడిపోయిన పుత్రుని చూచి కశ్యప ప్రజాపతి తనపుత్రుని రొమ్ముపైనుంచుకొని దుఃఖముతో చాలాకాలము విలపించెను. దేవతలు కూడా భయముతో హాహాకారములు చేయుచు విలపింపసాగిరి. సూర్యుడు లేనందువలన ప్రపంచమంతయు చీకటితో నిండిపోయెను.

నిష్ర్పభం తనయం దృష్ట్యా చాశపత్కశ్యపః శివం

తేజస్వీ బ్రహ్మణః పౌత్రః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా

మత్పుత్రస్య యథా వక్షః ఛిన్నం శూలేన తేఽద్యపై

త్వత్పుత్రస్య శిరచ్ఛిన్నం భవిష్యతి న సంశయః

శివశ్చ గళితక్రోధః క్షణేనైవాశుతోషకః

బ్రహ్మజ్ఞానేన తత్సూర్యం జీవయామాస తత్క్షణాత్

బ్రహ్మవిష్ణుమహేశానామంశశ్చ త్రిగుణాత్మకః

సూర్యశ్చ చేతనాo ప్రాప్య సముత్తస్థౌ పితుః పురః

ననామ పితరం భక్త్యా శంకరం భక్తవత్సలం

విజ్ఞాయ శంభోః శాపం చ కశ్యపం స చుకోవ చ

మిక్కిలి తేజస్సుకలవాడు, బ్రహ్మదేవుని మనుమడగు కశ్యపప్రజాపతి బ్రహ్మ తేజో విరాజితుడై కాంతిలేక పడియున్న తన పుత్రుడగు సూర్యుని, అతని దురవస్థకు కారకుడైన శంకరుని చూచి కోపముతో నీ శూలముచే నా పుత్రుని రొమ్ము ఏవి ధముగా చేదింపబడెనో అట్లే నా శాపము వలన నీ పుత్రుని శిరస్సుకూడ తెగిపడుననీ శాపమిచ్చెను.

త్వరగా సంతోషపడు శంకరుడు కోపమును విడిచి తనయొక్క బ్రహ్మజ్ఞానమువలన సూర్యుని వెంటనే పునర్జీవితుని చేసెను. త్రిమూర్తులయొక్క అంశస్వరూపుడు, త్రిగుణాత్మకుడగు సూర్యుడు చైతన్యము నొంది తండ్రికి, భక్తవత్సలుడగు శంకరునకు భక్తితో నమస్కరించి తన తండ్రియగు కశ్యప ప్రజాపతి శంకరునకు శాపమిచ్చిన విషయమును తెలిసికొని తండ్రిని కోపించెను.

విషయాన్నైవ జగ్రాహ కోపేనైవమువాచ హా

విషయాంశ్చ పరిత్యజ్య భజే శ్రీకృష్ణమీశ్వరం

సర్వం తుచ్చమనిత్యం చ నశ్వరం చేశ్వరం వినా

విహాయ మంగళం సత్యం విద్వాన్నేచ్చేదమంగళం

ఈ ప్రపంచమున సమస్తము పనికిరానిది, నాశనమునొందునది. పరమాత్మ మాత్రము వీటికి అతీతుడు. విద్వాంసుడగువాడు మంగళస్వరూపమైన సత్యమును వదలి అమంగళమునెప్పుడు కోరుకొనడు. కావున నేనుకూడ విషయవాంఛను వదలి శ్రీ కృష్ణ పరమాత్మనెల్లప్పుడు సేవింతునని పలికెను.

దేవైశ్చ ప్రేరితో బ్రహ్మా సమాగత్య ససంభ్రమః

బోధయిత్వా రవీం తత్ర యుయోజ విషయేప్వజుః

తస్మై దత్వాఽశిషః శంభుర్భ్రహ్మా చ స్వాలయం ముదా

జగామ కశ్యపశ్చైవ స్వరాశీం రవిరేవ చ

ఆథమాలీ సుమాలీ చ వ్యాధిగ్రస్తౌ బభూవతుః

శ్విత్రౌ గళితసర్వాంగౌ శక్తిహీనౌ హతప్రభౌ

అప్పుడు దేవతలు పంపగా అచ్చటకు వచ్చిన బ్రహ్మదేవుడు సూర్యునకు జ్ఞానబోధ చేసి విషయముల యందు ప్రవర్తించునట్లు చేసెను. తరువాత బ్రహ్మదేవుడు శంకరుడు సూర్యునకు ఆశీస్సులనొసగి తమ తమ ఇండ్లకు పోయిరి. కశ్యప ప్రజాపతికూడ స్వస్థానమునకు వెళ్ళగా సూర్యుడు తామండవలసిన రాశిలో ఉండెను.

ఇక మాలి, సుమాలియను వారు శ్వేత కుష్టు రోగము వలన అవయములన్నిపోగా శక్తిహీనులు, కాంతిహీనులైరి.

తావువాచ స్వయం బ్రహ్మా యువాం చ భజతాం రవీం

సూర్యకోపేన మలినౌ యువామేవం హాతప్రభౌ

సూర్యస్య కవచం స్తోత్రం సర్వం పూజావిధిం విధిః

జగామ కథయిత్వా తౌ బ్రహ్మలోకం సనాతనః

తతస్తౌ పుష్కరం గత్వా సిషేవాతే రవీం మునే

స్నాత్వా త్రికాలం భక్త్యా చ జపంతౌ మంత్రముత్తమం

తతః సూర్యాద్వరం ప్రావ్య నిజరూపౌ బభూవతుః

బ్రహ్మదేవుడు మాలి, సుమాలీయను వారితో మీరు సూర్యుని కోపము వలన ఈ విధముగా రోగగ్రస్తులైతిరి, అందువలన మీ రుసూర్యుని సేవింపుడని సూర్యమంత్రమును, సూర్యస్తోత్రమును, కవచమును తెలిపి తన లోకమునకు వెళ్ళిపోయెను.

అటుపిమ్మట వారు పుష్కర క్షేత్రమునకు పోయి త్రిసంధ్యలయందు స్నానము చేయుచు సూర్యమంత్రమును భక్తితో జపించుచు సూర్యుని సేవింపసాగిరి, సూర్యుడు వారి భక్తికి మెచ్చి వారికి వరమునీయగా తిరిగి నిజరూపమును పొందిరి.

ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి

ఈవిధముగా విఘ్న నాయకునకు విఘ్నము కలుగుటకు కల కారణమునంతయు నీకు వివరించితిని. ఓ నారదమునీ! నీవింకను వినదలచినదేదైనా ఉన్నచో అడుగుమని నారాయణ ముని అనెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే

విఘ్నేశ విఘ్నకథనం నామాష్టాదశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాదమున పేర్కొనబడిన విఘ్నేశునికి విఘ్నము కలుగుటకు గల కారణమును తెలుపు పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.