బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

38 - పరశురామునకు శ్రీలక్ష్మీ కవచ వర్ణనం

నారాయణ ఉవాచ- నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను-

సుచంద్రే పతితే బ్రహ్మన్రాజేంద్రాణాం శిరోమణిః

అగమత్పుష్కరాక్షస్తు సేనాత్యక్షౌహాణీయుత:

సూర్యవంశోద్భవో రాజా సుచంద్ర తనయో మహాన్

మహాలక్ష్మీ సేవకశ్చ లక్ష్మీవావ్ సూర్య సన్నిభః

 మహాలక్ష్మ్యాశ్చ కవచం గళే యస్య మనోహరం

పరమైశ్వర్య సంయుక్త స్రైలోక్య విజయీ తతః

            ఓ నారద! రాజేంద్రులలో శ్రేష్ఠుడగు సుచంద్రుడు రణరంగమున పడిపోయినప్పుడు పుష్కరాక్షు డనువాడు మూడక్షౌహిణుల బలముతో రణరంగమునకు వచ్చెను.

పుష్కరాక్షుడు సూర్యవంశోద్భవుడగు సుచంద్రమహారాజు యొక్క పుత్రుడు. అతడు ఎల్లప్పుడు మహాలక్ష్మిని సేవించుచుండును. అతని కంఠమున నెల్లప్పుడు మహాలక్ష్మీదేవి యొక్క కవచముండును. ఆ కవచము వలన అతడెల్లప్పుడు అంతులేని ఐశ్వర్యములో ముల్లోకములను జయింప గలిగి యుండెను అని పలికెను.

తం దృష్ట్యా భ్రాతరః సర్వే రైణుకేయస్య ధీమతః

ఆయయుః సమరం కర్తుం నానాశస్త్రాస్త్రపాణయః

రాజేంద్ర; శరజాలేవ చేదయామాస తాం స్తథా

 చిచ్చుదుః శరజాలం చ తేవీ రాశ్చైవ లీలయా

చిచ్చుదుఃప్యందనం రాజ్ఞః తేవీరాః పంచబాణతః

 సారథిం పంచబాణీన రథం దశబాణతః

తద్దనుః సప్తబాణేవ చూర్ణం వై పంచబాణతః

 చిచ్చుదుస్తనుఃతృవర్గాన్ విప్రాః శంకరశూలతః

 తేచ త్ర్యక్ష్యైహిణీం సేనాం విజఘ్నుశ్చాపి లీలయా

హంతుం నృపేంద్రం తే వీరాః శివశూలం విచిక్షిపుః

గలే బభూవ తచ్ఛూలం రాజ్ఞః పుష్కరమాలికా

శక్తిం చ పరిఘం చైవ భుశుండీం ముద్గరం తథా

గదాంచ చీక్షిపుర్విప్రా: కోసేన జ్వలదగ్నయః

తాని శాస్త్రాణి చూర్ణానీ క్ష్మాభృతో దేహయోగతః

విస్మితా భ్రాతర: సర్వే భృగో రేవ మహామునే

రథం ధమశ్చ శస్త్రాణి చాస్త్రాణి వివిధాని చ

సేనాం ప్రస్థాపయామాస కార్తవీర్యార్జునః స్వయం

 రాజా ప్యందనమారుహ్య పుష్కరాక్షో మహాబలః

చకార శరజాలం చ మహాఘోరతరం మునే

చిచ్చుదుః శరజాలం తే వీరాః శస్త్రాస్త్రపాణయః

 రాజా ప్రస్వాపవేనైవ విధ్రితాంషాంశ్చకార హ

భాతౄంశ్చ నిద్రితాన్ దృష్ట్వా జామదగ్న్యో మహాబలః

 క్షత వీక్షిత సర్వాంగాన్ బోధయామాప తత్త్వతః

బోధయిత్వా తన్నివార్య జగామ రణమూర్డని

చిక్షేపీ పర్శుం కోసేన శీఘ్రం రాజ జిఘాంపయా

 ఛిత్వా రాజ్ఞః కిరీటం చ పర్శుర్భూమౌ పపాత హ

 జగ్రాహ పరశుం శీఘ్రం జమదగ్ని మహాబలః

తదా శంకర శూలం చ చిక్షిపే మంత్ర పూర్వకం

 నృపస్య కుండలం చిత్వా జగామ శివ సన్నిధిం

రాజా నిహంతుం తం రామం శరజాలం చకార హ

చిచ్చేద శరజాలం చ రైణుకీయశ్చ లీలయా

క్రమేణ రాజా నానాస్త్రం చిక్షిపే మంత్రపూర్వకం

 తచ్ఛిచ్ఛేద క్రమేణైవ భృగుః శస్త్రభృతాం వరః

భృగుశ్చిక్షేప నానాస్త్రం మహాసంధాన పూర్వకం

తచ్చిచ్ఛేద మహారాజః సంధావేనైవ లీలయా

రామశ్చిక్షేప పందాయ బ్రహ్మాస్త్రం మంత్ర పూర్వకం

రాజా నిర్వహాణం చక్రే సంధానేనైవ లీలయా

 సర్వాణ్యస్త్రాణి శస్త్రాణి రామః పాశుపతం వినా

 చిక్షేప కోప విభ్రాంతో భూపశ్చిచ్చేద తాని చ

రామః స్తుత్వా శివం వత్వాఽదదే పాశుపతం మునే

 నారాయణశ్చ భగవావవోచద్విప్రరూపధృక్

రణరంగమునకు వచ్చిన పుష్కరాక్ష మహారాజును చూచి భార్గవరాముని సోదరులందరు అనేక శస్త్రాస్త్రములను ధరించి అతనితో యుద్ధము చేయుటకై బయలుదేరిరి. అప్పుడు పుష్కరాక్షుడు తన బాణములచే భార్గవరాముని సోదరులను వేధించసాగెను. భార్గవరాముని సోదరులు పుష్కరాక్ష మహారాజు ప్రయోగించిన బాణ జాలమున అవలీలగా ఛేదించిరి. అట్లే ఐదు బాణములు వేసి ఆ మహారాజయొక్క రథమును భగ్నము చేసిరి. ఇంకను ఐదు బాణములు వేసి ఆ మహారాజు యొక్క సారథిని పది బాణములతో ఆతని రథాశ్వములను చంపివేసిరి. అట్లే ఏడు బాణములతో ఆ మహారాజుయొక్క ధమస్సును ఐదు బాణములతో ఆతని అమ్ముల పొదిని భగ్నము చేసి శంకరుని యొక్క శూలమును ప్రయోగించి పుష్కరాక్షుని సోదరులను, ఆతని యొక్క మూడక్షౌహిణీల సైన్యమును సంహరించిరి. భార్గవరాముని సోదరులు ప్రయోగించిన శక్తి, పరిఘమును, భుశుండి, ముద్గరము, గద మొదలగు ఆయుధములన్నియు ఆ మహారాజ యొక్క శరీరమును తగులగనే పిండియై పోయినవి. దానిని చూచి పరశురాముని సోదరులందరు ఆశ్చర్యపోయిరి.

అప్పుడు కార్తవీర్యార్జునుడు తన రథమునెక్కి ధనువు, అస్త్రశస్త్రములను ధరించి తన సేనను వెంటనిడుకొని రణరంగమునకు బయలుదేరేను. ఆస మయమున పుష్కరాక్ష మహారాజు రథమునెక్కి బాణములచే మహాభయంకరమైన యుద్దమును చేసెను. భార్గవరాముని సోదరులు శస్త్రాస్త్రములను ధరించి పుష్కరాక్షుని బాణములన్నింటిని భగ్నము చేసిరి. అప్పుడు పుష్కరాక్షుడు నిద్రాస్త్రమును వేసి వారినందరును నిద్రపోవునట్లు చేసెను. తన తమ్ములందరు పుష్కరాక్షుని బాణములచే దెబ్బలుతిని నిద్రపోవుచుండగా మహాబలుడగు భార్గవరాముడు చూచి వారిని తత్త్వజ్ఞానముచే మేల్కొల్పి వారిని యుద్ధ రంగమునకు వెళ్ళకుండా నిరోధించి పుష్కరాక్షుని చంపుటకై తాను స్వయముగా బయలు దేరెను, పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగింపగా అది రాజుయొక్క కిరీటమును క్రింద పడవేసి భూమిపై పడిపోయినది. పరశురాముడు తన గండ్రగొడ్డలివి తిరిగి తీసికొని శంకరుని యొక్క త్రిశూలమున మంత్ర పూర్వకముగా ప్రయోగించేను. ఆది రాజుయొక్క కుండలములను చేదించి శివుని సన్నిధికి చేరుకొనెను.

పుష్కరాక్షుడు భార్గవ రాముని చంపుటకు బాణములను ప్రయోగింపగా భార్గవరాముడు వాటిని అవలీలగా ఛేదించెను. అప్పుడు రాజు మంత్ర పూర్వకముగా అనేకాస్త్రములను ప్రయోగించేను. అస్త్రశస్త్ర ప్రయోగ విశారదుడగు భార్గవరాముడు వాటినన్నీటిని అవలీలగా ఛేదించెను. అట్లే భార్గవ రాముడు మంత్రపూర్వమకముగా ప్రయోగించిన ఆ అస్త్రశస్త్రములను నన్నిటిని మహారాజు కూడ అవలీలగా శాంతింపజేసెను. అప్పుడు భార్గవరాముడు బ్రహ్మాస్త్రమును ప్రయోగింపిగా పుష్కరాక్షుడు దానిని, శాంతింపజేసెమ. భార్గవరాముడు పాశుపతాస్త్రముమ తప్ప మిగిలిన అస్త్రములను ప్రయోగింపగా మహారాజు వాటినన్నిటిని శాంతింపచేసెను. చివరకు, పరశురాముడు శివునకు నమస్కరించి పాశుపతాస్త్రమును ప్రయోగింప బూనగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణుని యొక్క రూపమును ధరించి అచ్చటకు వచ్చెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లు పలికెను-

కిం కరోషి భృగో వత్స త్వమేవ జానినాం వరః

 నరం హంతుం పాశుపతం కోపాతం క్షిపసి భ్రమాత్

 విశ్వం పాశుపతే నైవ భవేద్బస్మ చ సత్వరం

 సర్వఘ్నం స్యాచ్ఛస్త్ర మిదం వినా శ్రీకృష్ణ మీశ్వరం

అహో పాశుపతం కేతుం వాలమేవ సుదర్శనం

హరేః సుదర్శవం చైవ సర్వాస్త్ర పరిమర్ధకం

 ఖట్వాంగినః పాశుపతం హరేరివ సుదర్శనం

ఏతే ప్రధానే సర్వేషామ స్త్రాణాం చ జగత్త్రయే

త్యజ పాశుపతం బ్రహ్మన్ మదీయం వచనం శ్రుణు యథా దేష్యపి

రాజావం పుష్కరాక్షం మహాబలం

కార్తవీర్యమజేతారం యధా జేష్యసి సాంప్రతం

శ్రూయతాం సావధానేన తత్పర్వం కథయామి తే

ఓ భార్గవ రామా! నీవు మిక్కిలి జ్ఞానము కలవాడవు, ఆట్టినీవు ఇప్పుడు ఏమి చేయబోవుచున్నావు. నీవు కోపముతో ఒక సాధారణ మానవుని చంపుటకై పాశుపతాస్త్రమును ప్రయోగింపనున్నావు. ఈ పాశుపతాస్త్రము వలన సమస్త ప్రపంచము క్షణములో భస్మము కాగలదు. ఈ అస్త్రము పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని తప్ప మిగిలిన ప్రపంచమునంతయు నాశనము చేయును, ఈ పాశుపతాస్త్రమును ప్రయోగించు తలపున మానుకొమ్ము,

నీకు పుష్కరాక్ష మహారాజును, కార్తవీర్యార్జునుని జయించు ఉపాయమున చెప్పెదను. సావధానముగా వినమని పలికేను.

మహాలక్ష్యాశ్చ కవచం త్రిషు లోకేషు దుర్లభం

భక్త్యాచ పుష్కరాక్షేణ ధృతం కం ఠే విధానతః

 పరం దుర్గతినాశిన్యాః కవచం పరమాద్భుతం

ధృతం చ దక్షిణే బాహౌ పుష్కరాక్షసు తేన చ

కవచస్య ప్రభావేణ విశ్వం జేతుం క్షమౌ చ తౌ

కో జేతా చ త్రిభువనే దేహే చ కవచే స్థితే

బ్రాహ్మణస్య వచః శ్రుత్వా రామః సంత్రస్తమానసః

ఉవాచ బ్రాహ్మణం వృద్దం హృదయేన విదూయతా

ఓ పరశురామా! ముల్లోకముల యందు లభింపని మహా లక్ష్మీ దేవి యొక్క కవచము పుష్కరాక్ష మహారాజుయొక్క కంఠమున కలదు. అట్లే దుర్గతినీ నాశనము చేయు దుర్గాదేవి కవచము పుష్కరాక్షని పుత్రుని కుడి భుజమునకు కలదు. ఈ కవచముయొక్క ప్రభావము వలన వారు ఈ ప్రపంచమును జయింపగలరు. శరీరమందు ఎచ్చటనైనను ఈ కవచములుండగా ముల్లోకములలో ఎవ్వరుకూడ వారిని జయింపలేరు.

అందువలన నీ ప్రతిజ్ఞను పూర్తి చేయుటకు నేను వారి దగ్గర భిక్షమెతుకొందును అను బ్రాహ్మణ వృద్ధుని మాటలను విని భార్గవ రాముడు భయపడుచు ఆతనితో ఇట్లు పలికెను.

పరశురామ ఉవాచ: సరశురాముడిట్లు పలికెను.

న జానామీ మహాప్రాజ్ఞ కస్త్యం బ్రాహ్మణ రూపధృక్

శ్రీఘ్రం చ భ్రూహి మాం మూడం తదా గచ్చ నృపాంతికం

జామదగ్న్య వచః శ్రుత్వా, ప్రహస్య బ్రాహ్మణః స్వయం

ఉక్త్వా చాహం విష్ణురీతి యయౌ భిక్షితుమీశ్వరః

గత్వా తయోః సన్నిధానం యయాచే కవచం చ తౌ

దదతుస్తే చ కవచే విష్ణవే విష్ణుమాయయా

గృహీత్వా కవచే విష్ణు వైకుంఠం నిర్జగామ సః

ఓపండితుడా! నీవెవరవో నాకు తెలియదు. బ్రాహ్మణ వేషమును ధరించిన నీవెవరవు? ఈ విషయమును వెంటనే తెలుపుము. అటు పిమ్మట పుష్కరాక్షుని దగ్గరకు వెళ్ళుము అని పరశురాముడనగా బ్రాహ్మణుడు నవ్వి నేను స్వయముగా విష్ణుమూర్తినని చెప్పి ఆమహారాజును యాచించుటకు పోయేను.

ఆ బ్రాహ్మణుడు పుష్కరాక్షుడు, అతని పుత్రుని సమీపమునకు పోయి కవచములనిమ్మని వారిని యాచించెను.

విష్ణుమాయ వలన వారిద్దరు తమ కవచముల నీయగా వాటిని స్వీకరించి శ్రీమహావిష్ణువు వైకుంఠమునకు పోయెను.

నారద ఉవాచ- నారద మహర్షి నారాయణమునితో ఇట్లనెను-

మమహాలక్ష్యాశ్చ కవచం కేవదత్తం మహామునే

పుష్కరాక్షాయ భూపాయ తుం కౌతూహలం మమ

కవచం చాపి దుర్గాయాః పుష్కరాక్షషణాయ చ

దుర్లభం కేన వా దత్తం తద్భవావ్వకు మర్హసి

 ఈ కవచం చాది కిం భూతం తయోర్వా తస్యకిం ఫలం

మంత్రా తు కిం ప్రకారౌ చ తన్మే బ్రూహి జగద్గురో

ఓ నారాయణ మునీ! పుష్కరాక్షభూపతికి మహాలక్ష్మీ కవచమును ఎవరుపదేశించిరి. అట్లే అతని పుత్రునకు దుర్గాకవచమును ఎవరుపదేశించిరి? ఈకవచముల స్వరూపమెట్లుండును? వాటి ఫలితమెట్లుండును? ఆయా మంత్రముల స్వరూపమెట్లుండునను విషయము లన్నిటిని నాకు తెలుపుమని కోరిను.

నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-

దత్తం సనత్కుమారేణ పుష్కరాక్షాయ ధీమతే

మహాలక్ష్మాశ్చ కవచం మంత్ర శ్చాపి దశాక్షరః

స్తవనం చాపి గోప్యం వై ప్రోక్తం తచ్చరితం చ యత్

 ధ్యాసం చ సామవేదోక్తం పూజాం చైవ మనోహరాం

దుర్గాయాశ్చాపి కవచం దత్తం దుర్వాస సాపురా

స్రవనం చాపి గోప్యం చ మంత్రశ్చాపి దశాక్షరః

పశ్చాచ్చ్రోష్యసి తత్పర్వం దేవ్యాశ్చ పరమాద్భుతం

మహాయుద్ధ సమారంభ దత్తం ప్రార్థనయా చ యత్

ఓ నారదా! పుష్కరాక్షభూపతికి మహాలక్ష్మీ కవచమును, దశాక్షరమైన తన్మంత్రమును, పూర్వము సనత్కుమారుడు ఉపదేశించెను. మహాలక్ష్మీ స్తోత్రము, ధ్యానము పూజ ఇవన్నియు చాల రహస్యమైనవి. ఇవి సామవేదమున చెప్పబడినవి.

అట్లే పుష్కరాక్షభూపతి పుత్రునకు దుర్గాకవచమును, దుర్గాస్తోత్రమును, దశాక్షరమైన దుర్గామంత్రమును, దుర్వాసమహర్షి ఉపదేశించెను. దేవాసుర మహా సంగ్రామ సమయమున ఉపదేశింపబడిన, అత్యద్భుతమైన ఈ దుర్గాకవచమును, స్తోత్రమును, మంత్రముల తరువాత నీకు వివరించెదను.

మహాల క్ష్మశ్చ మంత్రం చ త్రుణు తం కథయామి తే

ఓం శ్రీం కమల వాసిన్యై స్వాహేతి పరమాద్భుతం

ధ్యానం చ పామవేదోక్తం శ్రుణు పూజావిధిం మునే

దత్తం తస్మై కుమారేణ పుష్కరాక్షాయ ధీమతే

సహస్రదళపద్మస్థాం పద్మనాభప్రియాం పతిం

పద్మాలయాం పద్మవక్త్రాం పద్మపత్రాభలోచనాం

 పద్మపుష్పప్రియాం పద్మ పుష్ప తల్పాధీశాయివీం

పద్మినీం పద్మహస్తాం చ పద్మమాలా విభూషితాం

 పద్మభూషణభూషాడ్యాం పద్మశోభా వివర్ధివీం

పద్మాటవీం ప్రవశ్యంతీం పస్మితార తార భటే ముదా

ఓ నారదా! నీకు మహాలక్ష్మీ మంత్రమును చెప్పెదను వినుము.

“ఓం శ్రీం కమలవాసిన్యై స్వాహా” అనునది మహాలక్ష్మీదేవి యొక్క దశాక్షర మంత్రము.

ఆమె యొక్క ధ్యానము, పూజా పద్ధతి సామవేదమున చెప్పబడినవి. వీటినన్నిటిని సనత్కుమారుడు పుష్కరాక్ష మహారాజునకుపదేశించెను.

వేయి రేకులు గల పద్మమున నున్నదియు, శ్రీహరి సతియు, పద్మమున నివసించునదియు, పద్మము వంటి ముఖము కలదియు, తామర రేకులవంటి కన్నులు కలదియు, పద్మములన్న మిక్కిలి మక్కువను చూపునదియు, పద్మముల శయ్యపై పరుండునదియు, చేతిలో పద్మములు ధరించునదియు, పద్మముల మాలకలదియు, పద్మ పుష్ప భూషణములు కలదియు, పద్మములకు శోభన కలిగించునదియు, పద్మవనమును చూచుచున్నదియు, చిరునవ్వుతోనున్న మహాలక్ష్మిని నేను సేవింతును. (ఇవి ధ్యాన శ్లోకములు)

చందనాష్టదళే పద్మే పద్మ పుష్పేణ పూజయేత్

 గణం సంపూజ్య దత్వా శైవోపచారాంశ్చ షోడశ

తతః స్తుత్వా చ ప్రణమేత్పాధకో భక్తి పూర్వకం

కవచం శ్రూయతాం బ్రహ్మనర్వసారం దదామి

మహాలక్ష్మీ దేవిని అష్టదళపద్మమున పద్మ పుష్పములచే పూజించి ఆమె గణమును కూడ పూజించి షోడశోపచారములను సమర్పించి అర్చింపవలెను. అటు పిమ్మట ఆదేవిని స్తుతించి భక్తితో నమస్కరించవలెను.

ఇక సర్వకవచసారమగు మహాలక్ష్మీ కవచమును నీకు చెప్పు చున్నాను వినుము అని నారాయణుడు పల్కెను.

శ్రుణు విప్రేంద్ర పద్మాయా కవచం పరమం శుభం

పద్మనాభేన యద్దత్తం బ్రహ్మణే నాభి పద్మకే

 సంప్రాప్య కవచం బ్రహ్మా తత్పద్మే ససృజే జగత్

పద్మాలయా ప్రసాదేవ సలక్ష్మీకో బభూవ సః

పద్మాలయావరం ప్రాప్య పాద్మశ్చ జగతాం ప్రభుః

పాద్మేన పద్మ కల్పే చ కవచం పరమాద్భుతం

దత్తం సనత్కుమారాయ ప్రియ పుత్రాయ ధీమతే

 కుమారేణ చ యద్దత్తం పుష్కరాయ చ నారద

 యద్దృత్వా పఠనాద్భ్రహ్మా సర్వసిద్దేశ్వరో మహాన్

పరమైశ్వర్య సంయుక్త సర్వ సంపత్సమన్వితః

యద్దృత్వా చ ధనాధ్యక్షః కుబేర ధనాధిపః

స్వాయంభువో మనుః శ్రీమాన్ఫ ఠనార్ధారణాద్యతః

 ప్రియవ్రతోత్తానపాదౌ లక్ష్మీనంతౌ యతో మునే

 వృథుః పృద్వీపతిః సద్యోహ్యభవద్ధారణాద్యతః

కవచస్య ప్రపాదేవ స్వయం దక్షః ప్రజాపతిః

ధర్మ కర్మణాం పాక్షి పాలా యస్య ప్రసాదతః

 యద్ధగా దక్షిణి బావా విష్ణుః క్షీరోదయితః

 భక్త్యా వీధత్తే కంఠే శేషో నారాయణాంశకః

యద్ధృత్వా వామవం లేభే కశ్యప్ప ప్రజాపతి

పర్వ దేవాధిపః శ్రీమాన్మహేంద్రో ధారణాద్యతః

 రాజా మరుత్తో భగవావభపద్ధారణాద్యతః

 త్రైలోక్యాధిపతిః శ్రీమాన్నహుషో యస్య ధారణాత్

 విశ్వం విజిగ్యే ఖట్వాంగః పఠనార్ధారణాద్యతః

ముచుకుందో యతః శ్రీమానాంధాతృతనయో మహాన్

ఓ నారదా! మహాలక్ష్మీ కవచము అధిక శుభములను కలిగించును. దీనిని శ్రీమహావిష్ణువు నాభిపద్మమున నున్న తన పుత్రుడగు బ్రహ్మదేవునకు తొలుత ఉపదేశించెను. బ్రహ్మదేవుడీ కవచమును పొందిన తరువాత ఈ జగత్తునంతయు సృష్టింపగల్గెను. అతడు లక్ష్మీదేవియొక్క అనుగ్రహమువలన లక్ష్మీవంతుడయ్యెను. మహాలక్ష్మీ దేవి యొక్క అనుగ్రహమును పొందిన పద్మభవుడు పద్మకల్పమున ఈ కవచమును బుద్ధిమంతుడు, తన పుత్రుడగు సనత్కుమారునకప ఉపదేశించేనప, సనత్కుమారుడీ కవచమును పుష్కర మహారాజునకు ఉపదేశించెను.

ఈ కవచమును ధరించి పఠించుచున్నందువలననే బ్రహ్మదేవుడు సమస్త సిద్దిసమన్వితుడు, పరమైశ్వర్యము, సమస్త సంపదలు కలవాడయ్యెను. కుబేరుడు దీనిని ధరించి పఠించుచున్నందువలన ధనాధిపతి కాగలెను, స్వాయంభువుడు ఈ కవచము వలననే మనువయ్యెను. అట్లే దీని ప్రభావము వలననే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అధిక సంపత్సమేతులైరి. పృథు మహారాజు ఈ కవచము యొక్క ప్రభావము వలననే పుద్వీపతియయ్యెను. అట్లే దక్షుడు ప్రజాపతియయ్యెను. ఆదేవిధముగ ధర్మదేవత సమస్త కర్మలకు సాక్షిగా, సమస్త జీవులకు రక్షకుడుగా ఏర్పడినది. శ్రీమహావిష్ణువు కూడ ఈ కవచమును తన దక్షిణ భుజమునకు కట్టుకొని క్షీరసాగరశాయి అయ్యెను. శ్రీమన్నారాయణాంశ వలన సంభవించిన ఆదిశేషుడు. దీనిని భక్తితో ఎల్లప్పుడు తన కంఠమును ధరించును, కశ్యప ప్రజాపతి ఈ కవచమును, మహేంద్రుడు దీని వలననే సమస్త దేవతలకు ఆధిపతియయ్యెను. రాజగు, మరుతు దీనివలననే భగవంతుడయ్యెను. నగుషుడు ఈ కవచమును ధరించినందువలననే ముల్లోకములకు అధిపతియయ్యెను. ఆదేవిధముగా శంకరుడు త్రిపురములను జయించెను. మాంధాత చక్రవర్తి పుత్రుడగు ముచికుందుడు ఈ కవచమును ధరించి పఠించినందు వలననే గొప్పవాడయ్యెను అని నారాయణముని పలికెను.

సర్వ సంపత్ర్పదస్యాస్య కవచస్య ప్రజాపతిః

ఋషించ్చ బృహతీ దేవి పద్మాలయా స్వయం

ధర్మార్థ కామ మోక్షేషు వినియోగః ప్రకీర్తితః

పుణ్యబిజం చ మహతాం. కవచం పరమాద్భుతం

ఓ హ్రీం కమల వాసిన్యై స్వాహా మే పాతు మస్తకం

శ్రీం మే పాతు కపాలం చ లోచనే శ్రీం శ్రీ నమః

ఓం శ్రీం శ్రీ స్వాహిలీచ కర్ణయుగ్మం సదావతు

ఓం శ్రీ మహాలక్ష్యై స్వాహా మే పాతు వాసికాం

ఓం శ్రీం పద్యాలయాయైచ స్వాహా దంతాన్నదాఽతు

ఓం శ్రీం కృష్ణప్రియాయై చ దంత రంధ్రం సదాఽవతు

ఓం శ్రీం నారాయణియై మమ కంఠం సదాఽవతు

ఓం శ్రీం కేశవ కాంతాయై నమస్కంధం సదాఽవతు

ఓం శ్రీం పద్మనివాసిన్యై స్వాహా నాభిం సదాఽవతు

ఓ హీం శ్రీం సంసారమాత్ర మమపక్షః సదాఽవతు

 ఓం శ్రీం మోరి కృష్ణకాంతాయై స్వాహా పృష్ఠం సదాఽవతు

ఓం హ్రీం శ్రీం క్లీం క్రియొస్వాహా చ మమహరీ సదాఽవతు

 ఓ శ్రీనివాసి కాంతాయై  మమ పాదే సదాఽవతు

ఓం హ్రీం శ్రీం క్లీం స్వాహా సర్వాంగ మే సదాఽవతు

ప్రాచ్యాం పాతు మహాలక్ష్మీ రాగ్నేయ్యాం కమలాలయా

పద్మా మారి దక్షిణీ పాతు వైఋత్యాం శ్రీహరి ప్రియా

 పద్యాలయా పూల పశ్చిమే వాయవ్యా పాతు సా స్వయం

 ఉత్తరే కమలా పాలు కావ్యం పింధు కన్యకా

నారాయణీ పాత్భూమధో విష్ణుప్రియాయలు

 సంతతం పర్వతః పాతు విష్ణు ప్రాణాధికా మమ

సమస్త సంపదలనొసగు ఈ మహాలక్ష్మీ కవచమునకు ఋషి ప్రజాపతి, చందస్సు బృహతీఛందము, మహాలక్ష్మియే దానికి దేవత, చతుర్వర్గ ప్రాప్తికి దీనిని పఠింపవలెను. మహాపురుషులకు సైతము కవచమనదగిన ఈ కవచము పుణ్యమున కలిగించును.

 ఓం హ్రీం కమలవాసిన్యై స్వాహా అమ మంత్రము నాశిరస్సును రక్షించుగాక!

శ్రీం అనునది నా కపాలమును శ్రీం శ్రియైనమః అనునది నా కండ్లను రక్షించుగాక! ఓం శ్రీం శ్రీయై స్వాహా అను మంత్రము నా కర్ణములను రక్షించుగాక!

ఓం క్లీం మహాలక్ష్యై స్వాహా అను మంత్రము నా నాసికను రక్షించుగాక!

ఓం శ్రీం పద్మాలయాయై స్వాహా అను మంత్రము నాదంతముల రక్షించుగాక! ఓం శ్రీం కృష్ణ ప్రియాయై అను మంత్రము నా దంత రంధ్రముల రక్షించుగా!

ఓం శ్రీం నారాయణి అను మంత్రము నా కంఠమును రక్షించుగాక!

ఓం శ్రీం కేశవ కాంతాయై అను మంత్రము నా స్కంథములను రక్షించుగాక!

ఓం శ్రీం పద్మ నివాసిన్యై స్వాహా అను మంత్రము నానాభిని రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం సంసారమాత్రే అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక!

ఓం శ్రీం మోం కృష్ణకాంతాయై స్వాహా అనునది నా పృష్టభాగమును రక్షించుగాక!

 ఓం హ్రీం శ్రీం శ్రీయై స్వాహా అను మంత్రము నా హస్తముల రక్షించుగాక!

ఓం శ్రీనివాస కాంతాయై అను మంత్రము నాపాదముల రక్షించుగాక!

 ఓం హ్రీం శ్రీం క్లీం శ్రియై స్వాహా అను మంత్రము నా సర్వాంగములను ఎల్లప్పుడు రక్షించుగాక!

మహాలక్ష్మి నా తూర్పు భాగమును కమలాలయ నా ఆగ్నేయ భాగమును, పద్మ నా దక్షిణ భాగమును, శ్రీహరి ప్రియ నా నైఋతీ భాగమును, పద్మాలయ నా పశ్చిమ భాగమును, మహాలక్ష్మి నా వాయవ్యభాగమును, కమల నా ఉత్తర భాగమును, సింధు కన్యక నా ఈశాన్య భాగమును, నారాయణి నా ఊర్ధ్వభాగమును, విష్ణుప్రియ నా యొక్క ఆధోభాగమును, విష్ణుప్రాణాధిక యగు మహాలక్ష్మి నన్ను అన్ని దిక్కులనుండి ఎల్లప్పుడు కాపాడుచుండుగాక!

 ఇతి తే కథతం వత్స సర్ప మంత్రౌషు విగ్రహం

సర్వైశ్వర్య ప్రదం నామ కవచం పరమాద్భుతం

సువర్ణ పర్వతం దత్వా మేరుతుల్యం ద్విజాతయే

యత్ఫలం లభతే ధర్మీ కవచేన తలోఽదికం

 గురుమభ్యర్చ్య విధివత్కవచం ధారయేతు యః

కంతే వా దక్షిణి బాహో స శ్రీమాన్ ప్రతి జన్మని

 ఆస్తి లక్ష్మీర్గృహే తస్య నిశ్చలా శతపూరుషం

దేవేంద్రైసురేంద్రైశ్చ సోఽవద్యో నిశ్చితం భవేత్

 స సర్వపుణ్యవాన్ధీమాన్ పర్వయక్షేషు దీక్షితః

స స్నాతః పర్వ తీర్ధేషు య ప్యేదం కవచం గతే

 యస్మి కస్మై న దాతవ్యం లోభమోహ భయైరపి

 గురుభక్తాయ శిష్యాయ శరణ్యాయ ప్రకాశయేత్

 ఇదం కవచమజ్ఞాత్వా జపిల్లక్ష్మీం జగత్ర్పసూరి

కోటి సంఖ్యం ప్రజస్తోఽపి న మంత్రః సిద్ధిదాయకః

ఓ నారదా! సమస్త మంత్రస్వరూపమైనది, సర్వైశ్వర్య ప్రదమను పేరు కలదియగు శ్రీ మహాలక్ష్మీ కవచము చాల శ్రేష్టమైనది.

బ్రాహ్మణునకు మేరు పర్వతమంత బంగారమును దానము చేసినచో లభించు పుణ్యముకంటె ఈకవచము వలన ఎక్కువ పుణ్యము లభించును. గురువును శాస్త్ర పద్దతిననుసరించి పూజించి ఆతనిచే నుపదేశము పొంది ఈ కవచమును కంఠమందున లేక కుడిరెట్టకైన కట్టుకొనువాడు ప్రతి జన్మలో శ్రీమంతుడగును. వాని ఇంట్లో లక్ష్మీదేవి నూరు తరముల వరకు సుస్థిరముగా నుండును. అతనిని దేవతలు గాని రాక్షసులుగాని సంహరింపలేరు. ఈ కవచమును ధరించువాడు సమస్త పుణ్యములను చేసిన వాడగును. సమస్త యజ్ఞములు చేసిన వాడగును, అట్లే సమస్త తీర్థములను సేవించిన వానితో సమానుడగును.

ఇట్టి కవచమును ఎట్టి పరిస్థితిలోను గురుభక్తిలేని వానికి శిష్యుడు కాని వానికి, శరణు కోరని వానికి ఇవ్వకూడదు. ఈ కవచము లేకుండ మహాలక్ష్మీ మంత్రమును కోటి పర్యాయములు జపము చేసినను ఆ మంత్రము సిద్ధిని కలిగించదని నారాయణముని నారద మహర్షికి తెలిపెను.  

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాది శ్రీలక్ష్మీ కవచ వర్ణనం నామాష్ట్రత్రింశఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన శ్రీలక్ష్మీ కవచమను ముప్పయి యెనిమిదవ అధ్యాయము సమాప్తము.