11 - శనైశ్చరుని అధోదృష్టికి కారణకథనం

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను.

హరిస్తమాశిషం కృత్వా రత్నసింహాసనే వరే ।

దేవైశ్చ మునిభిస్సార్థ మహాసత్తత్రసంపది ॥

దక్షిణి శంకర సస్య వామే బ్రహ్మా ప్రజాపతిః ।

పురతో జగతాం సాక్షి ధర్మో ధర్మపతాం వరః ॥

తథా ధర్మసమీపే చ సూర్యః శక్రః కళానిధిః ।

 దేవాశ్చ మునయో బ్రహ్మనూషుః శైలాః సుఖాసనే॥

ననర్త నర్తకశ్రేణీ గుర్గంధర్వకిన్నరాః ।

శ్రుతిసారం శ్రుతిసుఖం తుష్టువుః శ్రుతయో హరిం ॥

శ్రీహరి శిశురూపియైన గణపతి నాశీర్వదించి, దేవతలు మునులు పరివేష్టింప సభాస్థలమున రత్న సింహాసనముపై ఆసీనుడయ్యెను. ఆ శ్రీహరి యొక్క కుడిభాగమున శంకరుడు, ఎడమవైపు బ్రహ్మదేవుడు ఆసీనులైరి. ఆతని ముందు కర్మసాక్షి ధర్మవిదులలో శ్రేష్టుడైన ధర్మదేవతయుండెను. ధర్మదేవతయొక్క సమీపమున సూర్యుడు, దేవేంద్రుడు, చంద్రుడు కూర్చొనియుండిరి. దేవతలు, మునులు, శైలములు సుఖముగా కూర్చొనియున్న సభలో నర్తకీ మణులు నాట్యము చేయుచుండగా గంధర్వ కిన్నరాదులు శ్రీహరిగుణములను చక్కగా పాడసాగిరి. వేదములుకూడ శ్రీహరినిగూర్చి చెవులకింపుగా స్తోత్రము చేయసాగినవి.

ఏతస్మిన్నంతరే తత్ర ద్రష్టుం శంకరనందనం ।

 ఆజగామ మహాయోగీ సూర్యపుత్రః శనైశ్చరః ॥

అత్యంత నమ్రవదన ఈషన్ముద్రితలోచనః ।

ఆంతర్బహిః స్మరన్ కృష్ంణ కృష్ణైకగతమానసః॥

తపఃఫలాశీ తేజస్వీ జ్వలదగ్ని శిఖోపమః ।

 ఆతీపసుందరః శ్యామః పీతాంబరధరో వరః ॥

 ప్రణమ్య విష్ణుం బ్రహ్మాణం శివం ధర్మం రవీం సురాన్ ।

మునీంద్రాన్ బాలకం ద్రష్టుం జగామ తదనుజ్ఞయా ॥

ఆ సమయమున సూర్యుని కుమారుడగు శనైశ్చరుడు శంకరుని పుత్రుడగు గణపతిని చూడవలెనని అచ్చటకు వచ్చెను. ఆతడు వినయముచే పూర్తిగా శిరస్సువంచుకొనియుండెను. శ్రీకృష్ణుని మనసా వచసా స్మరించుచుండుటచే ఆరవిరిసిన నేత్రకమలములతో మంచి తేజః సంపన్నుడై, తాను శ్రీకృష్ణునిగూర్చి చేసిన తపః ఫలితమును అనుభవించుచుండెను. మండుచున్న ఆగ్నిశిఖలవంటి కాంతిగల ఆ శనైశ్చరుడు నల్లనిరూపుతో, పీతాంబరమును ధరించి ఆందముగా కనిపించుచుండెను. అతడు శ్రీహరిని, బ్రహ్మదేవునీ, శంకరునీ, ఇంకను ఆ సభలోనున్న ధర్మదేవతను, సూర్యుని, దేవతలను, మునులనందరినీ నమస్కరించి వారియొక్క అనుమతి తీసికొని శిశురూపముననున్న గణపతిని చూచుటకుపోయెను.

ప్రధానద్వారమాసాద్య శివతుల్యపరాక్రమం ।

 ద్వాస్థం వై బాలహస్తం చ విశాలాక్షమువాచ హ॥

అంతఃపురముయొక్క ప్రధాన ద్వారమున శూలహస్తుడు శివునితో సమానమైన పరాక్రమము కల విశాలాక్షుడను శివకింకరుని చూచి అతనితో నిట్లనెను.

శనైశ్చర ఉవాచ - శనైశ్చరు డిట్లనెను.

శివాజ్ఞయా శిశుం ద్రష్టుం యామి శంకర కింకర ।

 విష్ణు ప్రముఖదేవానాం మునీనామనురోధతః ॥

ఆజ్ఞాo దేహి చ మాం గంతుం పార్వతీసన్నిధిం బుధ ।

 పునర్యామి శిశుం దృష్ట్యా విషయాసక్త మానసః॥

ఓ శంకరునియొక్క కింకరుడా! నేను శివుని ఆజ్ఞకొని, విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షుల సమ్మతిని తీసికొని పార్వతీపుత్రుని చూచుటకు పోవుచున్నాను. శిశువును చూచిన తరువాత తిరిగి వెళ్ళిపోదును కావున పార్వతీదేవి దగ్గరకు పోవుటకు నాకు అనుమతినిమ్మని శనైశ్చరుడడిగెను.

విశాలాక్ష ఉవాచ - విశాలాక్షుడిట్లు పలికెను.

 ఆజ్ఞానహో న దేవానాం నాఽహం శంకరకింకరః ।

మార్గం దాతుం నశక్రోహం వినా మన్మాతురాజ్ఞయా ॥

 ఇత్యుక్త్వాఽభ్యంతరభ్యేత్య ప్రేరితః స శివాజ్ఞయా ।

 దదౌ మార్గం గ్రహేశాయ విశాలాక్షో ముదా తతః ॥

ఓ శనైశ్చరా! నేను దేవతలయొక్క ఆజ్ఞను శిరసావహించెదను. అట్లే శంకరుని ఆజ్ఞను కూడ నేను అనుష్ఠింతును.

శనిరభ్యంతరం గత్వా చానమన్నమ్రకంధరః ।

 రత్నసింహాసనస్థాం చ పార్వతీం సస్మితాం ముదా ॥

 సఖిభిః పంచభిః శశ్వత్సేవితాం శ్వేతచామరైః ।

 సఖిదత్తం చ తాంబూలముపభుజ్య సువాసితం ॥

వహ్నిశుద్ధాంశుకాధానం రత్నభూషణ భూషితాం ।

 పశ్యంతీం నర్తకీనృత్యం పుత్రం ధృత్వా చ వక్షసి ॥

 నతం సూర్యసుతం దృష్ట్యా దుర్గా సంభాష్య సత్వరం ।

 శుభాశీషం దదౌ తస్మై పృష్ట్యా తన్మంగళం శుభం ॥       

 పార్వతీదేవియొక్క సేవకుడగు విశాలాక్షుడు శనైశ్చరుని అంతః పురములోనికి పంపగా వినయముచే తలవంచుకొనియున్న శనైశ్చరుడు రత్నసింహాసనముపైనున్న పార్వతీదేవిని చూచెను. ఆ దేవి రత్నసింహాసనముపై గూర్చుండి, ఐదుగురు పరిచారికలు తెల్లని చామరములు వీచుచూ సేవింపుచుండగా పరిశుద్దమైన వస్త్రమును ధరించి, రత్నభూషణములను అలంకరించుకొని తన పుత్రుని రొమ్మునకు హత్తుకొని నర్తకీమణుల నృత్యమును చూచుచుండెను. పార్వతీదేవి తలవంచుకొనియున్న శనైశ్చరుని యోగక్షేమములు విచారించి ఆశీర్వదించి ఇట్లు పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

 కథమానమవక్త్రస్వo శ్రోతుమిచ్ఛామీ సాంప్రతం ।

 కిం న పశ్యసి మాం సాధో బాలకం వా గ్రహేశ్వర॥

ఓ శనైశ్చరా! నీవెందులకు తలవంచుకొని నిలబడినావు. నన్ను కాని, నా పుత్రునికాని నీవెందుకు చూడకున్నావో దానిని నాకు వివరముగా తెలువుము.

శనిరువాచ - శనైశ్చరుడిట్లు పలికెను.

సర్వే స్వకర్మణా సాద్వి భుంజతే తపసః ఫలం ।

 శుభాశుభం చ యత్కర్మ కోటి కల్పైర్న లభ్యతే ॥

 కర్మణాజాయతే జంతుర్బ్రహ్మేంద్రార్యమమందిరే ।

 కర్మణా నరగేహేషు పశ్వాదిషు చ కర్మణా ॥

కర్మణా నరకం యాతి వైకుంఠం యాతి కర్మణా ।

 స్వకర్మణా చ రాజేంద్రో భృత్యశ్చాపి స్వకర్మణా ॥

 కర్మణా సుందరః శశ్వద్వ్యాధియుక్తః స్వకర్మణా ।

కర్మణా విషయీ మాతర్నిర్లిప్తశ్చ స్వకర్మణా ॥

కర్మణా ధనవాన్ లోకో దైన్యయుక్తః స్వకర్మణా ।

 కర్మణా సత్కుటుంబీ చ కర్మణా బంధు కంటకః ॥

 సుభార్యశ్చ సుపుత్రశ్చ సుఖీ శశ్వత్ స్వకర్మణా ।

ఆపుత్రకశ్చ కుస్త్రీకో నిస్త్రీకశ్చ స్వకర్మణా ॥

ఓ పార్వతీదేవీ! ఈ లోకముననున్న ప్రాణులన్నియు తాము చేసికొన్న కర్మలననుసరించి శుభా శుభ ఫలితములను పొందుచున్నారు. కర్మవలననే ప్రాణి బ్రహ్మేంద్రాదుల గృహములలో మానవ గృహములలో పశువులు మొదలగు వాటియొద్ద జన్మనెత్తుచున్నాడు. కర్మవలననే వైకుంఠమునుగాని నరకమునుగాని ప్రాణులు పొందుచున్నారు. ఆకర్మవలననే ప్రాణి మహారాజుగా, సేవకుడుగా జన్మనెత్తుచున్నాడు. ఆకర్మవలననే కొందరు వ్యాధులచే బాధపడుచున్నారు. కొందరు ధనవంతులగుచున్నారు. దీనులుగా, బ్రతుకుచున్నారు. బంధువులలో మంచి పేరునుగాని చెడు పేరును గానీ పొందు చున్నారు. ఆట్లే మానవుడు తాను చేయు కర్మప్రభావమువలననే మంచిభార్యను, సత్పుత్రులను, లేక చెడుభార్యను, చెడుపుత్రులను పొందుచున్నాడు. అట్లే కర్మ ప్రభావమువలననే భార్యా రహితుడుగను, పుత్ర రహితుడుగను ఆగుచున్నాడని చెప్పెను.

ఇతిహాసం చాతిగోప్యం శ్రుణు శంకరవల్లభే ।

ఆకథ్యం జననీపారే లజ్జాజనక కారణం ॥

ఆబాలకృష్ణభక్తాహం కృష్ణద్యానైక మానసః ।

తపస్యాసు రతశ్శత్వత్ విషయేరతఃసదా ॥

పితా దదౌ వివాహే తు కన్యాం చిత్రరథస్య చ ।

 ఆతితేజస్విని శశ్వత్తపస్యాసు రతా సతి ॥

ఏకదా నీ తతుస్నాతో సువేషం స్వం విధాయ చ ।

రత్నాలంకారసంయుక్తా మునీమానసమోహినీ ॥

 హరేః పదం ధ్యాయమానం పశ్యంతీ మదమోహితా ।

 మత్సమీపం సమాగత్య సుస్మితాలోలలోచనా ॥

శశాప మామపశ్యంతం ఋతునాశాచ్చ కోపతః ।

 బాహ్యజ్ఞాన విహీనం చ ధ్యానసంలగ్నమానసం ॥

న దృష్టాంఽహం త్వయాహ్యేన న కృతం హ్రృతురక్షణం ।

 త్వయా దృష్టం చ యద్వస్తు మూడ సర్వం వినశ్యతి ॥

ఆహం చ వీరతో ధ్యానాతోషమంస్తాం తదా సతీం।

శాపం మోక్తుం న శక్తా సా పశ్చాత్తాపమపాప హ ॥

తేన మాతర్నపశ్యామి కించిద్వస్తు స్వచక్షుషా ।

తతః ప్రభృతీ నమ్రాస్యః ప్రాణిహింసా భయావహం ॥

ఓపార్వతీదేవీ నేను ఎల్లప్పుడు తలవంచుకొనీయుండుటకుగల కథను వినుము. ఇది మిక్కిలి రహస్యమైనది. మాతృస్వరూపిణివైన నీకు చెప్పతగనిది. సిగ్గుకు కారణమైనది.

నేను చిన్నప్పటినుండియే శ్రీకృష్ణుని యందు పరమ భక్తి కలవాడను. అనేకవిధములైన తపస్సులు చేసికొనెడివాడను. ఐనను విషయవాంఛలను వదలుకొనలేదు. అట్టి నాకు మా తండ్రియగు సూర్యుడు చిత్రరథుని పుత్రికనిచ్చి వివాహము చేసెను. ఆమెకూడ ఎల్లప్పుడు తపస్సు చేసికొనెడిది. చక్కని తేజస్సంపన్నురాలు.

ఒకదినము నా భార్య ఋతు స్నాతయై రత్నా భరణములను ధరించి మునుల మనస్సులను మోహింపచేయు వేషమును ధరించి నా సమీపమునకు వచ్చెను. ఆ సమయమున నేను శ్రీహరిపదధ్యానము చేసికొనుచు బాహ్య జ్ఞానము లేక నా మనస్సునంతయు ధ్యానము నందు మగ్నముచేసియుంటిని. కాని నాభార్య కామమోహితయై చిరునగవుకల కళ్ళతో నన్ను సమీపించి శ్రీహరిపదములను ధ్యానింపుచున్న నన్నిట్లు శపించెను.

ఓ శనైశ్చరా! నీవు నాపై కన్నెత్తి చూడక నా ఋతు రక్షణమును చేయనందువలన నీవు చూచిన ప్రతీ వస్తువు నశించిపోవునని శపించెను. నేను ధ్యానము చేసికొని లేచిన తరువాత నా భార్యను సంతోషపెట్టినను ఆమె తన శాపమును మాత్రము ఉపసంహరింపలేకపోయినది. అందు వలన నేను ఏ వస్తువు నైననప నాకంటితో చూడ లేక పోవుచున్నాను. నాటినుండి నా దృష్టి సోకి ఏ ప్రాణి హింసకు గురియగునోయని తలవంచుకొని తిరుగుచున్నానని  శనైశ్చరుడు చెప్పెను.

శనైశ్చరవచః శ్రుత్వా చాహసత్ఫార్వతీ మునే ।

ఉచ్చైః ప్రజహసుః సర్వే నర్తకీ కిన్నరీగణాః ॥

శనైశ్చరుడు తనగాథను వివరింపగా విని పార్వతీదేవి ఆమె సఖిగణము. అచ్చటనున్న నాట్యకత్తెలు, గాయకీ గణమంతయు ఫక్కున నవ్విరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయ గణపతిఖండే నారద నారాయణసంవాదే శనిపార్వతీసంవాదే శనే రధోదృష్టౌ కారణకథనం నామ ఏకాదశోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదగు గణపతి ఖండమున శని పార్వతీ దేవుల సంభాషణ సమయమున చెప్పబడిన శనైశ్చరుని ఆధోదృష్టికి కారణముగల పదునొకటవ అధ్యాయము సమాప్తము.