8 - గణపతి జననము

నారాయణ ఉవాచ - నారాయణమహర్షి ఇట్లనెను-

పార్వత్యాః స్తవనం శ్రుత్వా శ్రీకృష్ణ కరుణానిధీః ।

స్వరూపం దర్శయామాప పర్వాదృశ్యం సుదుర్లభం॥

స్తుత్వా దేవీ వ్రతపరా కృష్ణసంలగ్నమానసా ।

దదర్శ తేజసాం మధ్య స్వరూపం సర్వమోహనం ॥

సద్రత్నసారరచితే హీరకేణ పరిష్కృతే ।

యుక్తే మాణిక్యమాలాబీ రత్నపూర్ణే మనోహారే॥

 పీతాంశుకం వహ్నిశుద్ధం వరం వంశకరం పరం ।

 వనమాలాగళం శ్యామం రత్నభూషణభూషితం ॥

 కిశోరవయసం చిత్రవేషం వై చందనాంకితం ।

చారుస్మితాస్యమీడ్యం తచ్ఛారదేందువినిందకం ॥

 మాలతీమాల్యసంయుక్తం కేకి పిచ్చాపచూడకం ।

గోపాంగనాపరీవృతం రాధావక్షఃస్థలోజ్వలం॥

కోటికందర్పలావణ్యలీలాధాన మనోహరం ।

ఆతీవ హృష్టం  సర్వేష్ఠం భక్తానుగ్రహకారకం ॥

దృష్ట్వా రూపం రూపవతీ పుత్రం తదనురూపకం।

 మనసా వరయామాస  వరం సంప్రాప్య తత్ క్షణం ॥

పార్వతీదేవి చేసిన స్తోత్రమును విని దయామయుడగు శ్రీకృష్ణుడు అందరకు కనిపించనిది, దుర్లభమైనది అయిన తన రూపమును ఆమెకు చూపించెను.

పుణ్యకవ్రతము నాచరించు ఆపార్వతి శ్రీకృష్ణుని పై మనసుంచి ధ్యానింపగా, తేజః పుంజ మధ్యమున సర్వ సమ్మోహానమైన ఆతని రూపు కనిపించినది. ఆ శ్రీకృష్ణుని మెడలో వనమాల శోభించుచుండెను. అతడు శ్యామసుందరుడు, రత్నాలంకార సుశోభితుడు, బాలుడు, చిత్రవేషధరుడు, చందన చర్చితగాత్రుడు. శరత్కాల చంద్రునికంటె మిన్నయగు ఆతని ముఖమున చిరునవ్వు ప్రకాశించుచుండెను. అతని శిరస్సున నెమిలిపింఛము శోభించుచుండెను. గోపస్త్రీలచే పరివృతుడు, కోటిమన్మథుల లావణ్యము కలవాడు భక్తులననుగ్రహించువాడు ఆ శ్రీకృష్ణుని రూపమును పార్వతీదేవి చూచి ఆతనివంటి పుత్రుడు కావలయుననీ మనస్సులో కోరుకొనెను.

వరం దత్వా వరేశస్తు యద్యన్మనసి వాంచితం ।

దర్వాజిబిష్టం సురేభ్యశ్చ తత్తేజోంతరధీయత ॥

శ్రీకృష్ణపరమాత్మ పార్వతీదేవి తన మనసులో కోరుకున్న కోరికను అనుగ్రహించి దేవతలకు సహితము అభీష్టవరముల నొసగి తన తేజో రూపమును అంతర్ధానము చేసెను.

కుమారం బోధయిత్వా తు దేవదేవ్యై దిగంబరం।

దదుర్నిరుపమం తత్ర ప్రహృష్టాయై కృపాన్వితాః ॥

దయగలిగిన దేవతలు సనత్కుమారునకు నచ్చజెప్పి దేవదేవియగు పార్వతికి సాటి లేని వాడును, దిగంబరుడునప, ఆగు పరమేశ్వరుని అప్పగించిరి.

బ్రాహ్మణేభ్యో దదౌ దుర్గా రత్నాని వివిధాని చ ।

సువర్ణాని చ భిక్షుభ్యో వందిభ్యో విశ్వవందితా॥

బ్రాహ్మణాన్ భోజయమావ దేవాన్యై సర్వతాంస్తథా ।

శంకరం పూజయామాప చోపహరై రనుత్తమైః॥

దుందుభిం వాదయామాస కారయామాస మంగళం ।

సంగీతం గాయామాసి హరీసంబంధీ సుందరం ॥

 వ్రతం సమాప్య సా దుర్గా దత్వాదానాని సస్మితా ।

సర్వాంశ్చ భోజయిత్వా తు బుభుజో స్వామినో సహ ॥

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాదీసువాసితం ।

క్రమాత్ర్పదాయ సర్వేభ్యో బుభుజే తేన కౌతుకాత్ ॥

పార్వతీదేవి పుణ్యక వ్రతావసానమున బ్రాహ్మణులకు అనేక విధములైన రత్నములను దానము చేసెను. అట్లే భిక్షుకులకు స్తోత్ర పాఠకులకు అనేకములైన బంగారు నాణెములను దానమిచ్చెను.

అటుపిమ్మట బ్రాహ్మణులకు, దేవతలకు, పర్వతములకు మృష్టాన్న భోజనమును పెట్టి భర్తయగు శంకరుని. గొప్పవైన ఉపహారములతో సంభావించినది. తర్వాత దుందుభివాద్యమును మోగించుచు మంగళవాద్యమును చేసినది. అట్లే శ్రీహరికి సంబంధించిన పాటలను పాడించినది.

 ఇట్లు పుణ్యకవ్రతమును పూర్తిచేసి అందరకు దానములనొసగి అందరకు భోజనము నొసగి తాను తన భర్తతో కలసి, భుజించెను. తరువాత కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములు కల ఇంపైన తాంబూలమును క్రమముగా అందరకునొసగి తాను సంతోషముతో భుజించినది.

పయః పేనవిభాం శయ్యాం రమ్యాం సద్రత్నమంచకే ।

పుష్పచందన సంయుక్తాం కస్తూరీ కుంకుమాన్వితాం ॥

రహసి స్వామినా సార్థం సుష్వాప పరమేశ్వరీ ॥

కైలాసస్యైక దేశ చ రమ్యే చందన కాననే ।

సుగంధికుసుమాడ్యేన వాయునా సురభికృతే॥

భ్రమరధ్వని సంయుక్తే పుంస్కోకిలరుతాశ్రయే ।

వ్యహర్షీత్సా సురపికా తత్ర తేన పహాంబికా ॥

కైలాసపర్వతముననున్న చందన వనమున చక్కనివాసనగల కుసుమములున్నవి. ఆ పుష్పములకు తగులుటవలన అచ్చటి వాయువు పరిమళములను వెదజల్లుచున్నది. తుమ్మెదల ఝుంకారములు గండుకోయిలల కూతలచే ఆప్రదేశము మీక్కిలి రమ్యముగామన్నది. అచ్చట రహస్యమైన ప్రాంతమున రత్నములచే నిర్మితమైన మంచముపై పాల నురుగు వంటి వస్త్రముకల శయ్యపై పార్వతీదేవి తన భర్తతో కలసిపడుకొనెను.

రేతఃపతనకాలేచ స విష్ణుర్విష్ణుమాయయా ।

 వీధాయ విప్రరూపం తదాజగామ రతేర్గృహం ॥

జటవంతం వినా తైలం కుచేలం భిక్షుకం మునె ।

ఆతీవ శుక్లదశనం తృష్ణయా పరిపీడితం ॥

అతివ కృశగాత్రం చ బిభ్రత్తిలకముజ్వలం ।

బహుకాకుస్వరం దీనం దైన్యాత్కుత్సితమూర్తిమత్ ॥

ఆజుహావ మహాదేవమతివృద్దోప్నయాచకః ।

దండావలంబనం కృత్వా రతీద్వారేతిదుర్బలః ॥

పరమేశ్వరుని రేతస్సు పడు సమయమున అచ్చటకు విష్ణుమూర్తి తన మాయవల్ల వృద్ధ బ్రాహ్మణ వేషములో ఆకలివల్ల ఆహారమును యాచించు మిషతో అచ్చటకు వచ్చామ. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తైల సంస్కారములేని జడలతో, చిరిగిపోయిన, మురికిపట్టిన గుడ్డలతో మిక్కిలి కృశించిన శరీరముతో ఉజ్వలమైన తిలకమును ధరించి అతి దుర్బలుని వలె చేతిలో కట్టె పట్టుకొని మహాదేవుని అన్నము పెట్టుమని యాచించెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు శివునితో పలికెను-

 కిం కరోషి మహాదేవ రక్ష మాం శరణాగతం ।

సప్తరాత్రి ప్రతేతీత పారణాకాంక్షిణం క్షుధా ॥

కిం కరోషి మహాదేవ హే తాత కరుణానిదే ।

వశ్య వృద్దం జరిగ్రస్తం తృషయ పరిపీడితం॥

మాతరుత్తిష్ఠ మేన్నం త్వం ప్రయచ్ఛాద్య శివం జలం ।

అనంతరత్నోద్భవజే రక్ష మాం శరణాగతం ॥

మాతస్మాతర్జగవ్మాతరేహి వాహం స్థితో బహిః ।

సీదామి తృషయా కప్మాల్ స్థితాయామాత్మసతరి ॥

 ఇతి కాకుస్వరం శ్రుత్వా శివస్యోతీష్ఠతో మునే ।

పపాత వీర్యం శయ్యాయాం వయోవా ప్రకృతేస్తదా॥

ఉత్తస్థౌ పార్వతి త్రస్తా సూక్ష్మవస్త్రం పిధాయ చ ।

ఆజగామ బహిర్ద్వారం పార్వత్యా సహ శంకరః ॥

కరుణానిధియగు మహాదేవా! నీవేమి చేయుచున్నను నేను అతి వృద్దుడను ఆకలిదప్పులచే బాధపడుచున్నాను, ఓతల్లీ! పార్వతీ! నేను నీ శరణు పొందితిని. నీవే లేచి నాకు అన్నమును మంచినీళ్ళను ఇమ్ము, ఓ జగన్మాతా! నేను బయట నిలువ లేక పోవుచున్నాను. నా తల్లి దగ్గర నుండగా నేను దప్పితో అలమటింపవలసిన పనిలేకున్నను బాధపడుచున్నాము. ఓమహాదేవా! నేను నిన్ను శరణు పొందితిని. సప్త రాత్రీ వ్రతమును చేసినాను. ఇక నేను పారణ చేయవలసియున్నది అందువలన మిక్కిలి బాధపడుచున్నాను అని అరచెను.

ఇట్లు ఆవృద్ధ బ్రాహ్మణుడు ఉచ్చ స్వరమున పలుకుచుండగా విని మహాదేవుడు రతినుండి లేచెను. ఆసమయమున అతనికి రేత స్ఖలన మగుచుండెను. రతికార్యమును విరమించుకొన్నందువలన మహాదేవుని వీర్యము శయ్యపై పడిపోయినది. పార్వతీదేవి భయముతో సన్నని వస్త్రమును ధరించి లేచి నిలబడి తన భర్తతో కలసి బయటకు వచ్చినది.

దదర్శ బ్రాహ్మణం దీనం జరయా పరిపీడితం ।

వృద్దం పలితగాత్రం చ బిభ్రతం దండమానతం॥

తపస్విసమశాంతం చ శుష్కకంఠౌస్తతాలుకం।

కుర్వంతం పరయా భక్త్యా ప్రణామంస్తవనం తయోః॥

శ్రుత్వ తద్వచనం తత్ర నీలకంఠః సుధోపమం ।

ఉవాచ పరయా ప్రీత్యా ప్రసన్నపం ప్రహస్య చ॥

అచ్చట దీనుడు, వృద్ధుడు, ముడుతలు పడిన శరీరము కలవాడు, వంగిపోయినవాడు, చేతిలో కఱ్ఱను ఊతగా ధరించినవాడు, పెదవులు, నాలుక, గొంతు ఎండు కొని పోయినవాడు,తపస్వియైన బ్రాహ్మణుడు కనిపించెను. ఆతడు వారిని భక్తితో నమస్కరించి కొనియాడగా మహాదేవుడు ప్రసన్నుడై అమృతమువంటి మాటలనిట్లు పలికెను.

శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను.

 గృహం తే కుత్ర విప్రర్షే వద వేదవిదాం వర।

కిం నామ భవతః క్షిప్రం జ్ఞాతు మిచ్ఛామి సాంప్రతం॥

వేదవేదాంగములు తెలిపినవారిలో, శ్రేష్టుడవగు ఓ విప్రుడా నీపేరేమి? మొదలగు విషయములను నాకు వెంటనే తెలుపుమనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

ఆగతోఽసి కులో విప్ర మమభాగ్యాదుపస్థితః ।

ఆద్య మే సఫలం జన్మ బ్రాహ్మణోమద్గృహేతిధిః ॥

 అతిథిః పూజితోయిన త్రిజగత్తెన పూజితం।

తత్రైవాధిష్ఠిగా దేవా బ్రాహ్మణా గురవోద్విజ ॥

 తీర్థావ్యతిథిపాదేషు శశ్వత్తిష్ఠంతి నిశ్చితం ।

తత్పాద రౌత తోయేన  సుశ్రీతాని లభేత్ గృహీ ॥

స స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః ।

అతిథిః పూజీ యేన స్వాత్మశక్త్యా యథోచితం॥

మహాదానానీ పర్వాణి కృతాని తేన భూతలే ।

అతిథి పూజితో టీన భారతే భక్తిపూర్వకం ॥

 నావాప్రకారపుణ్యాని వేదోక్తాని చ యాని వై ।

 అన్యచాతీథిపేవాయాః కలాం నార్హంతి షోడశిం॥

అపూజితోతిధిర్యస్య భవనాద్వినివర్తతే ।

పితృదేవాయః పశ్చాద్దురపో యాంత్యపూజిః ॥

యావి కాని చ పాపాని బ్రహ్మహత్యాది కాని చ ।

లాని సర్వాణి లభతే నాభ్యర్చ్యాతిథిమిప్పితం ॥

ఓబ్రాహ్మణుడా! నీవెచ్చటినుండి వచ్చితివి. నీవు నా అదృష్టమువలన ఇచ్చటికి వచ్చితివి. నా ఇంటికి బ్రాహ్మణు డతిథిగా వచ్చినందువలన నా జన్మ సఫలమైనది. అతిథిని గౌరవించినచో ముల్లోకములను గౌరవించినట్లే, అతిథి గౌరవముండుచోట దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, సమస్త పుణ్య తీర్థములెల్లప్పుడు ఉండును. అతిథి యొక్క పాదములను కడిగినచో సమస్త పుణ్యములు లభించును. అతిథిని తన శక్తి కొలది పూజించువాడు సమస్త తీర్థములందు గ్రుంకులిడిన పుణ్యమును సమస్త యజ్ఞములాచరించిన పుణ్యమును పొందును. అట్లే ఆతడు సమస్త దానములు చేసిన పుణ్యమున పొందగలడు.

వేదములందు పేర్కొనబడిన, పుణ్యములన్నియు ఇతర పుణ్యములు సైతము అతిథి సేవయొక్క పదునారవ అంశమైన కాజాలవు. అతిథికి మర్యాద జరుగని ఇంటిలో పితృదేవతలు, అగ్నులు, గురువులు పూజలు పొందనట్లు వెళ్ళిపోవుదురు. అతిథి సేవచేయనివానికి బ్రహ్మహత్యాది సమస్తపాపములన్నియు లభించునని పార్వతీ పలికెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లు పలికెను-

వ్యాధియుక్తో వీరాహారో యదా వానశప్రతీ ।

 మనోరథేనోపహారం భోక్తుమిచ్ఛతి మానవః ॥

బాహసి వేదాన్వేదజ్ఞే వేదోక్తం కురు పూజనం ।

క్షుత్తృడ్బ్యాం పీడితో మాతర్వచనం చ శ్రుతౌ శ్రుతం ॥

వేదవేదాంగములన్ని తెలిసిన ఓపార్వతీ! వేదమునందు చెప్పబడినట్లు అతిథిపూజసేయుము. ఆకలిదప్పులతో బాధపడు మానవుడు తాను రోగముచే బాధపడుచున్నను నిరాహారుడైనను, నిరాహారమే వ్రతముగా స్వీకరించినను,  గృహస్థు ఇచ్చిన ఉపహారమును మనస్సులోనైనను స్వీకరించును.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లనెను.

 భోక్తుమిచ్ఛపీ కిం విప్ర త్రైలోక్య చ సుదుర్లభం ।

దాస్యామి భోక్తుం త్వామద్య మజ్జన్మ సఫలం కురు ॥

ఓ బ్రాహ్మణుడా! నీవు ఆకలిగొన్నావా? నీకు ఎట్టి భోజనము పెట్టవలెను? ముల్లోకములందు దొరుకని భోజనము నీకు పెట్టెదను, అతిథి సేవ చేయుట ద్వారా నాజన్మము సఫలము చేయుమనెను.

 బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లు పలికెను-

వ్రతే సువ్రతయా సర్వముపహారం సమాహృతం ।

నానావిధం మిష్టమిష్టం భోక్తుం శ్రుత్వా సమాగతః ॥

సుప్రతే తవపుత్రోపోమగ్రే మాం పూజయిష్యసి ।

దత్వామిష్టాని వస్తూవీ త్రైలోక్య దుర్లభాని చ ॥

తతాః పంచవిధాః ప్రోక్త మాతరో వివిధాఃస్మృతాః ।

 పుత్రః పంచవీధః సాధ్వి కథతో వేదవాదిభిః॥

విద్యాదాతాన్నదాతా చ భయభ్రాతా చ జన్మదః ।

కన్యాదాతా చ వేదోక్త సరాణాం. పితరః స్మృతాః ॥

 గురుపత్ని గర్భదాత్రీ స్తనదాత్రి పితుఃస్వపా।

స్వపామాతుః సపత్నీచ పుత్రభార్యాన్నదాయికా ॥

 భృత్యః శిష్యశ్చ పోష్యశ్చ వీర్యజః శరణాగతః ।

ధర్మపుత్ర్చా రబ్విలో వీర్యజో ధవభాగితి ॥

 క్షుత్రుడ్బ్యాం పీడితో మాతః వృద్దోహం శరణాగతః ।

సాంప్రతం తప సంధ్యాయాః ఆనాథః పుత్ర ఏవ చ॥

ఓదేవి! నీవు చక్కగా పుణ్యకవ్రతము చేసి ఆవ్రతమున అనేకవిధములైన ఉపహారములను సమకూర్చినట్లు తెలిసికొని, నాకు ఇష్టమైన మృష్ట పదార్థములను సేవింపవలెనని ఇచ్చటకు వచ్చితిని.

ఓ సువ్రతా! నేను నీకు పుత్రునివంటివాడను ముల్లోకములలో దుర్లభమైన వస్తువులను నాకొసగి తొలుత నన్ను పూజింపుము.

వేదవేదాంగకోవిదులు తల్లి, తండ్రి, పుత్రులు అనేక విధములుగా ఉందురని చెప్పుదురు. వారిలో చదుపునేర్పువాడు, అన్నము పెట్టువాడు, భయమున పోగొట్టువాడు, జన్మనిచ్చినవాడు, పిల్లనిచ్చినవాడు అను ఐదుగురు తండ్రులవంటివారు, అట్లే గురువుయొక్క భార్య జన్మనిచ్చినస్త్రీ చనుపాలిచ్చిన స్త్రీ, మేనత్త, తల్లికి సోదరి మరియు సవతి, కోడలు, అన్నము పెట్టిన స్త్రీ వీరందరు మాతృ తుల్యలు. ఆట్లే సేవకుడు, శిష్యుడు, తన పోషణలో ఉండు వాడు, తన పుత్రుడు, శరణువేడినవాడు, వీరందరు పుత్రతుల్యులు, వీరిలో వీర్యజడైన పుత్రుడు తండ్రి ఆస్తిని పొందును, మిగిలిన నలుగురు ధర్మపుత్రులని పెద్దలు చెప్పుదురు.

ఓతల్లీ! ఆకలిదప్పులచే బాధపడుచున్న నేను నిన్ను శరణువేడితిని. అందువలన నేను నీకు పుత్రునివంటివాడనని బ్రాహ్మణుడు పలికెను.

పిష్టకం పరమాసం చ సుపక్వాని ఫలాని చ।

నానావిధానీ పిష్ణాది కాలదేశోద్భవానీ చ ॥

పక్వాన్నం స్వస్తికం క్షీరమిక్షుమిక్షు వికారజం ।

ఘృతం దధి చే శాల్యన్నం గృతపక్వం చ వ్యంజనం॥

లడ్డుకాని తిలానాం చ మిష్టాన్నం సగుడాని చ ।

సమాజ్ఞాతాని వస్తూని సుధయా తుల్యకాని చ ॥

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం ।

జలం సునిర్మలం స్వాదు ద్రవ్యాణ్యేతాని వాసితం॥

ద్రవ్యాణి యాని భుక్త్యా మే చారు లంబోదరం భవేత్ ।

 అసంతరత్నోద్భవజే తాని మహ్యం ప్రదాస్యసి॥

ఆనంతరత్నుడగు హిమాలయము యొక్క పుత్రికయగు పార్వతీ! నీవు నాకు పిష్టకమను పిండివంటను, పరమాన్నమును, దోరమాగిన పండ్లను, ఆయాదేశములయందు, ఆయాకాలములందు చేయు పిండివంటలను, పక్వాన్నమున, స్వస్తికమను వంటకమును, పాలమ, చెరుకుపాలను, చెరుకుపాలతో చేయబడిన వంటను, నేతిని, పెరుగును, మంచిబియ్యపన్నమును, నేతిలో వేయించిన వంటకమును, బెల్లము, నూవులచే చేయబడిన లడ్డూలను. ఇంకను నాకు తెలియని అమృతోపమానములగు వంటకములను నాకు భోజనమున పెట్టుము. తరువాత కర్సూరాది సుగంధ ద్రవ్య భరితమైన తాంబూలమును, నిర్మలమైన మంచినీళ్ళను నాకిమ్ము, వీటిని భుజించినచో నాకు కడుపుబ్బినట్లగును. అందువలన ఓ పార్వతి ! నాకు వీటినన్నిటిని ఇమ్మని బ్రాహ్మణుడడిగెను.

స్వామి తే త్రిజగత్కర్తి ప్రదాతా సర్వసంపదాం ।

మహాలక్ష్మీ స్వరూపా త్వం సర్వైశ్వర్యప్రదాయినీ॥

రత్నసింహాసనం రమ్యమూల్యం రత్నభూషణం।

వహ్నిశుద్దమంశుకం చారు ప్రదాస్యసి సుదుర్లభం ॥

సుదుర్లభం హరేర్మంత్రం హరౌ భక్తిం దృఢమ్మ్ సతి ।

హరేః ప్రియా హరేః శక్తిః త్వమేవ సర్వదా స్థితా॥

జ్ఞానం మృత్యుంజయం నామ దాతృశక్తిం సుఖప్రదాం ।

సర్వసిద్ధిం చ కిం మాతరదేయం స్వసుతాయ చ ॥

మనః పునీర్మలం కృత్వా ధర్మే తపసి సంతతం।

శ్రేష్టే సర్వం కరిష్యామి న కామే జన్మలుకి ॥

స్వకామాత్కురుతే కర్మ కర్మణో భోగ ఏవ చ ।

భోగౌ శుభాశుభౌ జ్ఞేయా తౌ హేతూ సుఖ దుఃఖయోః॥

దుఃఖం న కస్మాద్భవతి సుఖం వా జగదంబికే।

సర్వం స్వకర్మణా భోగః తేన తద్విరతో బుధః ॥

కర్మ నిర్మూలయంత్యేవ సంతో హి సతతం ముదా ।

హరిభావవబుధ్యా తత్తపసా భక్తపంగతాః ॥

ఓపార్వతీ! నీభర్త ముల్లోకములకు కారణభూతుడు, అట్లే సమస్త సంపదల నొసగువాడు. నీవు సమస్తైశ్వర్యముల నొసగు మహాలక్ష్మీ రూపిణివి.

అందువలన నీవు నాకు అందమైన రత్నసింహాసనమును, అమూల్యములైన రత్నభూషణములను, పరిశుద్ధమైన వస్త్రములను ఇమ్ము. ఆట్లే ఎవరికీ లభ్యముకాని శ్రీహరిమంత్రమును, దృడమైన శ్రీహరిభక్తిని, మృత్యుంజయమను జ్ఞానమును, సుఖమున కలిగించు దాతృశక్తిని, సమస్తసిద్దులనొసగుము, నీవు శ్రీహరికి ఇష్టమైనదావు, శ్రీహరియొక్క శక్తివి నీవే. అట్టి నీవు నీపుత్రునకు ఇవ్వలేనిది ఏదీలేదు.

మనస్సును నిర్మలముగానుంచుకొని ధర్మమును, తపస్సును అనుష్టింతును. నాకు జన్మకారణమైన కోరిక లేవియూ లేవు.

మానవుడు తన కోరికననుసరించి కర్మననుసరించును. ఆ కర్మ భోగమునకు కారణమగుచున్నది. శుభాశుభములుగా భోగము రెండువిధములుగా కలదు. ఆరెంటిలో ఒకటి సుఖమును కలిగించుమ. రెండవది దుఃఖమును కలిగించుచున్నది. తాను చేసిన కర్మననుసరించి భోగానుభవము కలగుచున్నందు వలన జ్ఞానియగు వాడు కర్మకు దూరముగా నుండును. ఇంకను సత్పురుషులు కర్మ నిర్మూలనము చేయుటకు శ్రీహరి భక్తులతో సాంగత్యమును పెంచుకొని శ్రీహరిని సంతతము ధ్యానించుటలో ప్రయత్నింతురు.

ఇంద్రియ ద్రవ్యసంయోగ సుఖం విధ్వంసనావధి ।

హరిసంతాపరూపం చ సుఖం తత్పర్వకాలికాం॥

హరిస్మరణ శిలానాం వాయుర్యాతి సతాం సతి ।

న తేషామీశ్వరః కాలో న చ మృత్యుంజయో ధ్రువం ॥

చిరం జీవంతి తే భక్తా భారతే చిరజీవినః ।

సర్వసిద్ధిం చ విజ్ఞాయ స్వచ్చందం స్వర్గగామినః ॥

 జాతిస్మరా హరేర్భక్తా జానతే కోటిజన్మనః ।

కథయంతి కథాం జన్మ లభంతే స్వచ్ఛయాముదా ॥

పురం పువంతి తే పూతాస్తీర్ణాని స్వీయలీలయా।

పుణ్యక్షేత్రేఽత్రసేవాయై పరార్థం చ భ్రమంతి తే॥

వైష్ణవానాం పదప్పర్శాత్పద్యం పూతా వసుంధరా ।

కాలం గోదోహమాత్రం తు తీర్థ యత్ర వసంతి తే ॥

గురోరాస్యాద్విష్ణుమంత్రో యస్య కర్ణే ప్రవిశ్యతి।

 తం వైష్ణవం తీర్థపూతం ప్రవదంతి పురావీదః॥

పురుషాణాం శతం పూర్వయుద్ధరంతి శతం పరం ।

లీలయా భారతే భక్త్యా పోదరాన్మాతరం తథా ॥

మాతామహానాం పురుషాన్ దశపూర్వాన్ దశాపరాన్ ।

 మాతుఃప్రసముద్ధరంతి దారుణాద్యమతాడనాత్॥

 భక్తదర్శనమాశ్లేషం మానవాః ప్రాప్నువంతి యే ।

తే యాః సర్వతీర్ధిషు సర్వయజ్ఞేషు దీక్షితాః ॥

ప లిప్తః పాతకైర్భక్తాః పంతతం హరిమానసా ।

యథాగ్నయః సర్వభక్షాః యథా ద్రవ్యషు వాయవః॥

 త్రికోటి జన్మనామంతే ప్రాప్నోతి జన్మ మానవం ।

 ప్రాప్నోతి భక్తసంగం స మానుషే కోటి జన్మతః ॥

భక్త సంగాద్భవద్భక్తి రంకురో జీవితః పతి ।

ఆభక్త దర్శనాదేవ న చ ప్రాప్నోతి శుష్కతాం॥

పునఃప్రపుల్లతాం యాతి వైష్ణవాలాపమాత్రతః ।

అంకుర్చావిహితీ చ వర్ధతే ప్రతిజన్మని॥

తత్తరోర్వర్తమానస్య హరిదాస్యం ఫలం సతి ।

పరిణామే భక్తిపాకే పార్షదశ్చ భవేద్ధరే ॥

 మహతీ ప్రళయే నాశో న భవేత్తస్య నిశ్చితం ।

సర్వసృష్టేశ్చ సంహారే బ్రహ్మలోకప్య వేధసః ॥

ఇంద్రియములు ద్రవ్యములతో కలిసినందువలన కలుగు సుఖము దుఃఖమును కలిగించును. అది అశాశ్వతమైనది. శ్రీహరి ఆలాపన చేయుచున్నందు వలన కలుగు సుఖము. శాశ్వతమైనది.

శ్రీహరిని సంతతము స్మరించువారికి మృత్యువులేదు. వారిని కాలుడైనను, మృత్యుంజయుడైనను సంహరింపజాలడు. శ్రీహరిభక్తులు చిరంజీవులై మనియెదరు. వారికి సమస్తసిద్ధులు లభించును. వారు. స్వచ్ఛందముగా స్వర్గలోకమునకు పోయెదరు. శ్రీహరి భక్తులకు తమ గతజన్మలన్నియు తెలియుటచే తమయొక్క గతజన్మలన్నిటిని కథలుగా చెప్పుదురు. అట్లే వారు కోరుకొన్న జన్మము పొందగలరు. జన్మతః పవిత్రులైన శ్రీహరిభక్తులు తాము అడుగిడిన మాత్రమున పుణ్యక్షేత్రములను పవిత్రము చేయుదురు. వారు, ఇతరుల కొరకు ప్రతిక్షేత్రమును సందర్శింతురు. శ్రీ వైష్ణవుల పాదస్పర్శవల్ల ఈభూమియంతయు పవిత్రమగును. వారు ప్రతీ పుణ్య క్షేత్రమున గోదాహ కాల మాత్రముందురు.

ఆచార్యుని ముఖతః విష్ణు మంత్రము నుపదేశము గాపొందిన వానిని  వైష్ణవుడని ప్రాచీనులు పేర్కొందురు. అట్టి వైష్ణవుడు తనకు పూర్వమున్న నూరు తరముల వారిని తన తరువాత, రాబోవు నూరు తరముల వారిని తన సోదరులను, తల్లిని నరకమునుండి ఉద్ధరించును. అట్లే ఆతడు గత పది తరములు. రాబోవు పది తరములవారగు తల్లి వంక వారిని నరకము నుండి ఉద్ధరించును.

ఎట్టి మానవులు శ్రీహరిభక్తుల దర్శనమును, వారి ఆశ్లేషమును పొందుదురో వారు సమస్త పుణ్య తీర్థములు దర్శించినవారగుదురు. అట్లే సమస్తయజ్ఞములు చేసిన పుణ్యమును కూడ పొందుదురు. శ్రీహరిని ఎల్లప్పుడు స్మరించు భక్తులు పాపములనెన్నడు పొందజాలరు.

ప్రాణి మూడుకోట్ల జన్మనెత్తిన తరువాత మానవజన్మనెత్తును. అట్టి మానవజన్మలు కోటి పర్యాయములెత్తిన తరువాత శ్రీహరి భక్తుల సమాగమమును పొందును. శ్రీహరి భక్తులతో కలసి తిరుగుచున్నందువలన శ్రీహరిభక్తి కలుగును. శ్రీహరి భక్తిహీనులతోట సమాగమమువలన ఆ భక్తి శుష్కించిపోవును. శ్రీహరి భక్తులతో కలిసి యున్నందువలన ఆభక్తి మరల చిగురించును. ఇట్టి శ్రీహరిభక్తి ప్రతి జన్మయందు వృద్ధియగుచుండును. దానికి చివరిఫలము శ్రీహరి దాస్యమే. అది సంపూర్ణముగా ఫలించినపుడు శ్రీహరి దాసుడగును. అట్టి భక్తి ఎంతటి ప్రళయము వచ్చినా, బ్రహ్మదేవుని సమస్త సృష్టి నశించిననూ నశించిపోదు అని వృద్ధ బ్రాహ్మణుడనెను.

తస్మాన్నారాయణే భక్తిం దేహి మామంబికే సదా ।

న భవేద్విష్ణు భక్తిశ్చ విష్ణమాయే త్వయా వినా ॥

తద్వంతం లోకశిక్షార్థం స్వతపస్తవ పూజనం ।

సర్వేషాం ఫలదాత్రీ త్వం నిత్యరూపా సనాతనీ ॥

గణేశరూపః శ్రీకృష్ణః కల్పే కల్పే తవాత్మజః ।

త్వత్క్రోడమాగతః క్షిప్రమీత్యుక్త్యాంతరధీయత॥

అందువలన ఓతల్లీ నీవు నాకు శ్రీమన్నారాయణునిపై భక్తి కలుగునట్లు చేయుము. విష్ణుమాయమగు నీయొక్క అనుగ్రహములేనిచో ఎవరికి విష్ణుభక్తి కలుగజాలదు. నీవు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయుచున్నచో పూజచేసినచో ఇవి అన్నియు ప్రపంచమునకు వీటిని నేర్పించుటకొరకేకాని వేరు కాదు.

నీవు ఆందరికోరికలను తీర్చుదానపు విత్యస్వరూపిణివి, పవాతవి. అట్టి నీకు ప్రతికల్పమున శ్రీకృష్ణుడు గణపతియై నీపుత్రుడుగా పిఒడిలోనికి చేరునని చెప్పి అదృశ్యమయ్యెను.

కృత్వాంతర్ధానమీశశ్చ బాలరూపం విధాయ సః ।

జగామ పార్వతితల్పం మందిరాభ్యంతరస్థితం ॥

తల్పస్థే శివవీర్యే చ మిశ్రితః స బభూవ హ ।

దదర్శ గేహశిఖరం ప్రసూతే బాలకే యథా॥

శుద్ధచంపవర్ణాభః కోటిచంద్రపమప్రభః ।

సుఖదృశ్యః సర్వజనిశ్చక్షరశ్మి వివర్ధకః ॥

అతీతసుందరతమః కామదేవవిమోహనః ।

ముఖం విరుపమం బీభ్రచ్చారదేందు  వినిందకం ॥

సుందరీలోచనే బిభ్రచ్చారుపద్మవినిందకే ।

ఓష్టాధరపుటం బిభ్రత్సక్వబింబవినిందకం ॥

కపాలం చ కపోలం చ వరమం మమనోహరం ।

నాసాగ్రం రుచిరం బిభ్రద్వీంద్రచంచువీవకం ॥

త్రైలోక్యే వై నిరుపమం సర్వాంగం బిభ్రదుత్తమం ।

శయానః శయనే రమ్యే ప్రేరయన్ హస్తపాదకం ॥

వృద్ధబ్రాహ్మణ రూపములో ఉన్న విష్ణుమూర్తి శిశువుగా మారి పార్వతీపరమేశ్వరులున్న మందిరములోని శయ్యపై ఉండెను. పార్వతీదేవి పవళించిన శయ్య పైనున్న శిశువు ఆ శయ్యపైనున్న శివ వీర్యముతో కలిసిపోయెను.

ఆ శిశువు చంపక పుష్పవర్ణముతో, కోటిచంద్రులవంటి కాంతిగలిగి, మిక్కిలి సుందరుడై, మన్మథునే మోహింపచేయుచుండెను. అతని ముఖము శరత్కాలచంద్రుని మించిపోవు కాంతితోమండెను. అతని కళ్ళు పద్మములకంటె ఆందముగానుండెను. పెదవులు దొండపండుకంటే గొప్పగానుండెను. తల, చెక్కిళ్ళు చాలా ఆందముగానుండినవి. ముక్కు గరుత్మంతుని ముక్కుకంటే అందముగానుండెను. ఈవిధముగా ఆ శిశువు పార్వతీదేవియొక్క శయ్యపై చేతులు కాళ్ళు ఆడించుచు ముల్లోకములందులేని అందమైన రూపుతోనుండెను.

ఇతిశ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయ గణేశఖండే నారద నారాయణసంవాదే గణేశోత్పత్తి వర్ణనం నామాష్టమాధ్యాయ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదైన గణేశఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన శ్రీగణేశోత్పత్తియను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.