2 - గరుడ పురాణము - ప్రేత కాండము
47 - వైతరణి వర్ణన విష్ణు, గంగ, బ్రాహ్మణ మహిమ
గరుడా ! దానమహిమను గూర్చి వైతరణిని గురించి అడిగావు కదా! విను. యమలోక మార్గంలో వైతరణియను మహానది వుంది. అది అగాధమై, దుస్తరమై పాపులకు మహాభయ భీతికరంగా వుంటుంది. అందులో సామాన్య జలాలకు బదులుగా ఈ పాపులకు చీమూ నెత్తరూ కనిపిస్తాయి. మాంసపు బురద దాని తటానికి వచ్చి నిలిచే పాపులకు కనిపించి’ మీ మాంసమూ ఇలాగే బురదగావచ్చు’ అని హెచ్చరిస్తున్నట్లుగా వుంటుంది. అది నిముషానికొక భయంకరాకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గుబులు రేపుతుంటుంది. పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్లు ఈ నది అక్కడక్కడ సలసలకాగుతున్నట్లు కనిపిస్తుంది. దానిని దాటుకొని మనం వెళ్లాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపుల గుండెలవిసిపోతాయి. ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా వున్న కీటకాలు తేలుకొండి వంటి వజ్రసదృశమైన తొండాలతో ‘రండి మీ పని పడతాం’ అన్నట్లుగా ఈ పాపుల వైపు చూస్తుంటాయి. మొసళ్ళవంటి పరమ హింసక జల జంతువులా వైతరణి నిండా వుంటాయి. ప్రళయంలో పన్నిద్దరు సూర్యులొకేమారు నింగి నడినెత్తిన చేరి మొత్తం విశ్వాన్ని మండించేస్తారని విన్నావు కదా! ఈ వైతరణిలో కూడ అంతటి వేడి పాపులను వేపుతుంటుంది. వారు ఈ వేడిని తట్టుకోలేక వైతరణి లోకి దూకుతారు. గోదానం చేసి యున్నవారు సామాన్య జలాలలో పడ్డట్టే వుంటారు, వారికోసం నావ కూడా వస్తుంది. ఇతరులు మాత్రం ఆ చీము నెత్తుటేరులో మునుగుతూ తేలుతూ కర్మఫలం కడముట్టేదాకా అందులోనే వుంటారు.
ఎలాంటి పాపాలు చేసిన వారు వైతరణిలోనే ఉండిపోతారో విను. నన్నూ, ఆచార్యునీ, మాతా పితలనూ, వృద్ద జనులనూ దూషించి అవమానించిన వారూ, తన పతివ్రతా, సుశీలా, ధర్మ పరాయణాయైన పత్నిని వదిలేసిన వాడూ, తనను నమ్మి నిద్రలోకి జారుకున్నవారిని హత్య చేసిన వాడూ, శాంతుడు, క్షుధాతుధుడనగు బ్రాహ్మణుని జీవికకు భంగం కలిగించిన వాడూ, దానమిస్తానని చెప్పి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని తీరా ఆయన వచ్చాక ‘లేదు పొ’మ్మని కసిరికొట్టిన వాడూ, ఇతరుని పత్నిని ఆకర్షించి లోబఱచుకొనేవాడూ, పొలాలను పాడు చేయువారూ, వంతెనను విరగొట్టువారూ, మాంసాన్ని తినే బ్రాహ్మణుడూ, గర్భపాతం చేయువాడూ కనీసం ప్రళయందాకానైనా వైతరణిలోనే, పైన చెప్పిన ప్రాణులన్నిటి చేతా హింసింపబడుతూ, తీవ్రవేదనను అనుభవిస్తూ ఉండిపోతారు. ఈ వైతరణీ నివాసాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఎంత మహాపాపియైనా పశ్చాత్తాపపడి మహాదానం (అనగా తనకున్నదంతా ఇచ్చేయడం) చేసి చెట్టుకింద బతికి శేషజీవితమంతా భగవన్నామ స్మరణం చేయాలి. అప్పుడు వైతరణి కరుణిస్తుంది కాని యముడు తన పని తాను చేసుకుపోవచ్చు.
మహాదాన ప్రసక్తి వచ్చింది, కాబట్టి చెబుతున్నాను. శరీరం అనిత్యం. ధనమూ అంతే. కాబట్టి ఆ రెంటిమీదా మోహం పెంచుకోకుండా నిత్యం సమీపంలోనే వుండే మృత్యువుని నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత వేగం ధర్మసంగ్రహం చేయడం తెలివైన పని.
అనిత్యాని శరీరాణి
విభవో నైవ శాశ్వతః ।
నిత్యం సంనిహితో మృత్యుః
కర్తవ్యో ధర్మ సంగ్రహః ॥
నల్లని లేదా ఎఱ్ఱని, శుభలక్షణాలున్న, వైతరణీ గోవుని బంగారంతో కొమ్ములనూ, వెండితో గిట్టలనూ అలంకరించి, రెండు నల్లని వస్త్రాలను కప్పి, పాలు పితకడానికి రాగి పాత్రను సప్తధాన్యాలతో నింపి బ్రాహ్మణునికి దానం చేయాలి. పత్తితో చేసిన ద్రోణాచలం శిఖరం పై రాగిపాత్రలో ఇనుప దండాన్ని పట్టుకొని కూర్చున్నట్లున్న యమధర్మరాజు ప్రతిమను స్థాపించాలి. చెఱుకు గడలతో, గట్టి బంధనాలతోనొక నౌకను తయారుచేసి గోవును సూర్యపుత్రిగా సంభావించి ఆ నౌకలో నిలబెట్టాలి. తరువాత గొడుగు, పాదుకలు, ఉంగరం, వస్త్రాదులతో పూజ్య శ్రేష్ఠ బ్రాహ్మణునొకని సంతుష్ట షఱచి జలాన్నీ కుశలనూ చేతబట్టుకొని ఈ క్రింది మంత్ర శ్లోకాలను చదువుతూ ఆ వైతరణీ గోవును ఆ బ్రాహ్మణోత్తమునికి దానం చేయాలి.
యమద్వారే మహాఘోరే శ్రుత్వా వైతరణీ నదీం ।
తర్తుకామో దదామ్యేనాం తుభ్యం వైతరణీం నమః ॥
గావో మే అగ్రతః సంతు గావో మే సంతు పార్శ్వతః ।
గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం ॥
విష్ణురూప ద్విజ శ్రేష్ఠ మాముద్ధర మహీసుర ।
సదక్షిణా మయాదత్తా తుభ్యం వైతరణీ నమః ॥
తరువాత సర్వులకూ స్వామియైన యమధర్మరాజు ప్రతిమను ఆ బ్రాహ్మణునికి దానం చేసి గోవుకి ప్రదక్షలు చేసి దానిని ఆయన వెంట పంపిస్తూ దానితోకను చేతితో పట్టుకొని ఇలా అనాలి :
ధేనుకేత్వం ప్రతీక్ష స్వ యమద్వారే మహాభయే ।
ఉత్తారణాయ దేవేశి వైతరణ్యై నమోఽస్తుతే ॥
తరువాత ఆ బ్రాహ్మణునీ ఈ గోవునీ అయన ఇంటిదాకా దిగబెట్టాలి. ఇలా చేసిన వాడు దేహాంతంలో వైతరణిని సుఖంగా దాటగలడు. ఈ భూమిపై గోదానం చేసినవాడు సమస్తాభీష్టసిద్ధి నొందగలడు.
సమస్తవేళల్లోనూ మనిషి మంచిపనులే చేయాలి, మంచిగానే ఆలోచించాలి. ఇదే సుకర్మ ఈ సుకర్మ వల్ల ప్రాణికి ఐహిక - అంటే ‘ఇక్కడ’, పారలౌకిక అంటే అక్కడ, అన్ని సుఖాలూ లభిస్తాయి. ఒక మనిషిచేసే దానమే వాని పుణ్యంగా లెక్కింపబడుతుంది. పనిచేయడం శ్రమదానమవుతుంది. ‘నా పుత్రులు నా పేర ఎలాగూ దానం చేస్తారులే’ అనుకొని ఊరుకోకూడదు. తన చేతితో తానిచ్చే దానం ఉత్తమం. మనిషి షోయాక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన పనిని చేయించడం తెలివైన పని కదా! ఈ శరీరంలో ఈ ప్రాణం అతిథిలాగే వుంటుంది. ఇవాళ వున్నది, రేపు పోనున్నది ప్రాణం.’
ఇంతవఱకు చెప్పి సూతమహర్షి తనదైన వ్యాఖ్యానాన్ని నైమిశారణ్యంలోని ఋషులకిలా వినిపించసాగాడు.
“విప్రవరులారా! పరమతేజస్వియైన మహా విష్ణువు ద్వారా ప్రేతచరితను విన్న గరుడుడత్యంత సంతుష్టుడైనాడు. జీవ జంతువుల జన్మాదిక విధానాలింతే. ఇవే జనన, మరణ, ప్రేతత్వ, ఔర్ధ్వ దైహిక కృత్యాల నియమాలు. మోక్షానికి కారకాలు, కారణాలు కూడా ఇవే.
ఎవరి హృదయంలోనైతే నీలకమల సమాన శ్యామవర్ణుడైన భగవానుడు జనార్దనుడు తేజః పుంజంగా వెలుగుతుంటాడో వారికే అన్ని లాభాలూ విజయాలూ సమకూరతాయి. అట్టి మహాత్ములకు అపజయమెక్కడిది? విష్ణువే మాత విష్ణువే పిత విష్ణువే స్వజన బాంధవుడు. ఎవని బుద్ధిలో ఈ విషయం స్థిరంగా నిలబడి వుంటుందో వానికెట్టి దుర్గతీ వుండదు. విష్ణుభగవానుడే సర్వమంగళుడు. ఆయనే గంగ, ఆయనే బ్రాహ్మణశక్తి. ఆయనే ఈ త్రిలోకసారం.
మహాప్రోక్తం వైతే ముక్త్యై నిదానం చైవ సర్వశః ॥
లాభస్తే షాం జయస్తే షాం కుతస్తే షాం పరాజయః ।
యేషా మిందీ వరశ్యామో హృదయస్థో జనార్దనః ॥
ధర్మోజయతి నా ధర్మః
సత్యం జయతి నా నృతం ।
క్షమాజయతి నక్రోధో
విష్ణుర్జయతి నాసురః ॥
విష్ణుర్మాతా పితా విష్ణుః విష్ణుః స్వజన బాంధవాః ।
యేషామేవ స్థిరాబుద్ధిః న తేషాం దుర్గతిర్భవేత్ ॥
మంగళం భగవాన్ విష్ణర్మంగళం గరుడధ్వజః ।
మంగళం పుండరీకాక్షో మంగళాయతనం హరిః ॥
హరిర్భాగీరథీ విప్రా విప్రా భాగీరథీ హరిః ।
భాగీరథీ హరిర్విప్రాః సారమేతజ్జగత్త్రయే ॥
అమృతోపమానములైన హరి ప్రవచనాలనూ, సూతమహర్షి నుడులనూ, వింటున్న శౌనకాది మహామునులత్యంత ప్రసన్నులైనారు. ప్రాణి పవిత్రుడైనా కాకున్నా, ఏ దశలో వున్నా, ఏ దిశలో వెళుతున్నా హారిస్మరణ చేస్తుంటే లోపలా బయటా కూడా పవిత్రుడవుతాడు.
