2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

31- అపరకర్మలలో వివిధ దానాల ఫలాలు

గరుడా! పాపాచారంలోనే బతుకంతా గడిపేసినవాడు ఎలాగూ నరకానికి పోతాడు. అలా కాకుండా కొన్నైనా మంచి పనులు చేస్తే కొంతైనా మంచి జరగవచ్చు.

నన్ను సాక్షిగా వుంచుకొని మనిషి ద్వారానో, తనంత తానుగానో ప్రాణి చేసిన దానం విశేష ఫలాన్నిస్తుంది. భూదానమిచ్చిన వాడు ఆ భూమిలో ఎన్ని రజకణాలున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తాడు. చెప్పులను దానమిచ్చిన వారు నారకీయ మార్గంలో నడువనవసరం లేకుండా గుఱ్ఱాలపై పోగలరు. గొడుగులను దానమిచ్చినవారు అదే మార్గంలో ఎండలో ఒళ్ళు కాలకుండా వెళ్ళగలరు. ఎవరిని ఉద్దేశించి అన్న దానం చేయబడుతుందో వారు కడుపు నిండగా సంతుష్టి చెందుతారు. యమలోక మహాపథంలో ఒకస్థానం వుంది. అక్కడ ఎప్పుడూ చిక్కటి చిమ్మచీకటి అలముకొని వుంటుంది. పాము బుసలూ, సింహాదిహింసక మృగాల గర్జనలూ వినిపిస్తుంటాయి. ఈ మర్త్య లోకంలో దీపదానం చేసిన వారిని ఆ చీకటి బాధింపదు. మార్గం తేజోవంతమై కనిపిస్తుంది. మృతుని పేర మృత తిథి నాడూ, అశ్వయుజ కార్తిక మాఘ చతుర్దశులలోనూ చేసే దానాలు సుఖకారకాలవుతాయి. దీపదానం చేసేవాడు స్వయంగా పుణ్యుడై ప్రకాశిస్తాడు.

దీపదానం లేదా దీపాదానం మిక్కిలి పుణ్యప్రదమైనది. ఏదో దీపం పెట్టేద్దామని కాకుండా శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా దేవాలయంలోనైతే తూర్పువైపూ, బ్రాహ్మణుల కోసమైతే ఉత్తరం వైపూ, ప్రేతం కోసమైతే దక్షిణం వైపూ నిలబడి దీపాన్ని వెలిగించి జలాన్ని తీసుకొని ధారపోయాలి. మృతవ్యక్తి కోసమిచ్చే పదమూడు పద దానాలూ ప్రేతాన్ని అన్ని విధాలా సుఖపెడతాయి.

మృతవ్యక్తి నుద్దేశించి గానీ, స్వంతానికి సంకల్పించి గానీ ఏ దానమిస్తే, ఆ సుఖం కలుగుతుంది. అశ్వము, నౌక, ఏనుగు మున్నగువాటిని దానమిస్తే మహాపథంలో వారు వాటిపై ప్రయాణిస్తారు. తాంబూలాలనూ పుష్పాలనూ బ్రాహ్మణులకు, మృతుని పేర, దానమిస్తే యమదూతలు సంతోషించి అనవసర బాధలను పెట్టకపోవచ్చు. మృతప్రాణి పేర నీటితో నిండిన మట్టికుండలను దానమిచ్చిన వారికి సహస్రఘటదాన ఫలం దక్కుతుంది. సాధారణంగా మహాపథంలో ఆకలి, శ్రమ, దాహాలతో అలమటించే మృతులకు, వారి పేర భూలోకంలో అన్నంతో, నీటితో నింపిన కుండలను పుత్రులు దానం చేస్తే, యమమార్గం శ్రమాదులు లేకుండానే ఉద్దరించబడుతుంది. ఇలాగే శయ్యా, విష్ణుప్రతిమా దానాలు కూడ ఫలిస్తాయి

గరుడా! జీవాత్మ ఇలా నిష్క్రమిస్తుంది.

జాతస్య మృత్యులోకే వై ప్రాణినో మరణం ధ్రువం ।

మృతిః కుర్యాత్ స్వధర్మేణ యాస్యతశ్చ పరంతప ॥

పూర్వకాలే మృతానాంచ ప్రాణినాంచ ఖగేశ్వర ।

సూక్ష్మో భూత్వాత్వసౌ వాయుర్నిర్గచ్ఛత్యా స్యమండలాత్ ॥

నవద్వారై రోమాభిశ్చ జనానాం తాలురంధ్రకే ।

పాపిష్ఠానామ పానేన జీవోనిష్క్రామతిధ్రువం ॥ 31.ఽ7

 (దీని భావమీది వఱకే చెప్పబడింది)

ప్రాణవాయువెగిరి పోగానే మానవ శరీరం పిడుగుపాటుకి చెట్టులాగ కూలిపోతుంది. అంతట అందులోని పంచభూతాలూ పంచభూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ (అలాగే వుండి దాని) తత్త్వం మాత్రం శివునిలో కలిసిపోతుంది. సర్వవ్యాపియైన ఆత్మతత్త్వం సర్వ లయకారకుడైనవాడు కాబట్టి శివునిలో లీనమై పోతుంది.

ప్రతి మనిషిలోనూ జ్ఞానమనే రత్నముంటుంది. దాని నపహరించడానికి పంచేంద్రియాల కోరే విషయ వాంఛల కామక్రోధాలూ అనే దొంగలు కూడా ఆ మనిషిలోనే వుంటారు. వీరికి నాయకుడు మనసు. అహంకార, పుణ్య, పాప సంయుక్తమైన కాలము సంహారకమై మనిషిని కూల్చివేస్తుంది. అంతట మనిషి (ఆత్మ) తన కర్మల ప్రభావం వల్ల వేరొక శరీరంలోకి వెళ్ళవలసి వస్తుంది. పాత ఇల్లు కాలినా కూలినా వ్యక్తి కొత్త ఇంట్లోకి వెళ్ళినట్లు జీవుడు మరో శరీరాన్నాశ్రయిస్తాడు. శరీరంలో నుండే ధాతువులన్నీ మాతా పీతల ప్రసాదాలే. త్వచ, రక్తం, మాంసం, కొవ్వు, మూలుగ, ఎముక అను ఆరు ధాతువులతో ఏర్పడి వుంటుంది కాబట్టి ఈ శరీరాన్ని ‘షట్కౌశిక’ మంటారు.