2 - గరుడ పురాణము - ప్రేత కాండము
6 - వృషోత్సర్గ మహిమ, వీరవాహన మహారాజు కథ, నారదుని పూర్వ జన్మ వృత్తాంతం
‘హే జగన్నాయకా! జ్ఞానసాగరా! వృషోత్సర్గం చేయకపోతే పరలోకంలో సద్గతి ప్రాప్తించదని విన్నాను. అందువల్ల దానిని గూర్చి తమ నుండి వివరంగా వినాలనే కోరిక కలిగినందున వినిపించుమని తమకు విన్నవించుకుంటున్నాను’ అని ఖగేంద్రుడు ఉపేంద్రునడుగగా ఆయన సంతోషించి ఇలా ఉపదేశించసాగాడని సూతమహర్షి శౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు.
‘వైనతేయా దీనికి సంబంధించి ఒక ఇతిహాసమున్నది వినుము. దీనినొకప్పుడు బ్రహ్మపుత్రుడైన వసిష్ఠుడు వీరవాహనుడను రాజుకి చెప్పాడు.
ప్రాచీన కాలంలో విరాధ నగరాన్ని వీరవాహనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప దానశీలి, ధర్మాత్ముడు, సత్యవాది. ఒకనాడాయన వేటకై వనానికి వెళ్ళి అక్కడికి దగ్గరలోనే వసిష్ట మహర్షి ఆశ్రమ ముండటంతో ఆయన దర్శనం చేసుకొని ఏవో నాలుగు మంచి మాటలు విందామని అక్కడకు పోయాడు. మునులచే, జ్ఞానులచే పరివేష్టింపబడియున్న మహర్షిని గాంచి పులకిత శరీరుడై ఆయనకు పాదాభివందనం గావించి సన్నిధిలో కూర్చుని ఇలా అర్థించాడు:
“మునీంద్రా! నేను యథాశక్తి ప్రయత్నపూర్వకంగా, ఎన్నో ధార్మిక కృత్యాలు చేశాను. అయినా నాకింకా నారకీయ భయం తగ్గలేదు. యమధర్మరాజెటువంటి తీర్పు చెపుతాడోనని ఆందోళనగా వుంది. యమధర్మరాజునీ నరకాన్ని చూడకుండాగాని మరొక విధంగా నరకబాధలు లేకుండా గాని, నా మరణానంతర జీవనం గడిపే అవకాశం వుందా?”
మహారాజా! మనది శాస్త్ర సుసంపన్నమైన జాతి. శాస్త్రవేత్తలెన్నో ప్రకారాల ధర్మాలను వర్ణిస్తూనే వున్నారు గాని కర్మమార్గ విమోహితులైన జనులు వారినీ, వాటినీ పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, సన్యాసం, పితృక్రియాది ధర్మాలలో వృషోత్సర్గం చివరి ధర్మంలో భాగంగా గొప్ప మాహాత్మ్యాన్ని కలిగి వుంటుంది. పురుషుడు అనేకులైన పుత్రులను కనాలి. వారిలో నొక్కడు గయాతీర్థానికి పోయి కర్మ చేసినా, అశ్వమేధం చేసినా, నల్ల ఆబోతు లేదా ఎద్దును యథావిథి వదిలినా అతనికీ, అతని తండ్రికీ తెలిసి గాని తెలియకగాని చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయి. వృషోత్సర్గాన్ని పదకొండవ రోజున అపరకర్మలో భాగంగా పుత్రులుగాని ఇతరులు గాని చేయకపోతే ఆ మృతవ్యక్తి ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి ఏమి లాభము? ఏదో ఒక విధంగా ఎంత బాధపడైనా సరే, ఒక ఆబోతును నగరంలోనో, తీర్థంలోనో అవశ్యం వదలాలి.’
ఖగేశా! దీనిని వృష - యజ్ఞమని కూడా అంటారు. ప్రేతత్వం నుండి ముక్తిని ప్రాప్తింపజేయు సాధనం మరేదీ లేదు. దీనినెలా చేయాలంటే అన్ని శుభలక్షణాలూ కలిగి నల్లని కంఠమూ, గంగడోలూ గల వృషభాన్ని రెండు లేదా ఒక దూడ(ల) కిచ్చి పెండ్లి చేయాలి. తరువాత మాంగలిక ద్రవ్యాలతో మంత్రాలతో వాటిని గోచార భూమిలోగాని మరొక మైదానంలో గాని ఆవులెక్కువగా తిరుగాడు చోట వదలివేయాలి. ఈ క్రింది యజుర్వేద మంత్రాలను పఠిస్తూ అగ్నిదేవునికి ఆహుతులనివ్వాలి:
ఓం ఇహరతిః స్వాహా ఇదమగ్నయే ।
ఓం ఇహరమధ్వం స్వాహా ఇదమగ్నయే ।
ఓం ఇహద ధృతిః స్వాహా ఇదమగ్నయే ।
ఓం ఇహస్వధృతిః స్వాహా ఇదమగ్నయే ।
ఓం ఉపసృజన్ ధరుణం మాత్రే ధరుణోమాతరం ధ్యన్ స్వాహా ఇదమగ్నయే ।
ఓం రాయ స్పోష మస్మాసు దీధరత్ స్వాహా ఇదమగ్నయే ॥ యజుర్వేదం 08.51
మృతక సందర్భంలోనే కాక ఇతర కల్యాణ ఘడియలలో కూడా వృషోత్సర్జనము చేయవచ్చు. కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలలో, సంక్రాంతి, వ్యతీపాత దినాల్లో, తీర్థాలలో, పితృదేవుని క్షయతిథినాడు చేయబడు వృషోత్సర్గం విశేష రూపంలో ప్రశస్తంగా భావింపబడుతుంది. నీల వృషభమనగా నల్లని ఎద్దే కానక్కర లేదు. ఎఱ్ఱరంగులో వుండి మూతి, తోక తెల్లగా నుండి, గిట్టలు, కొమ్ములు పచ్చగా వున్న ఎద్దునూ నీల వృషభమంటారు.
లోహితో యస్తు వర్ణేన ముఖే పుచ్ఛే చ పాండురః ॥
పీతః ఖుర విషాణేషు స నీలో వృష ఉచ్యతే ।
తెల్లయెద్దును బ్రాహ్మణ యెద్దనీ, ఎఱ్ఱ, పచ్చ, నల్ల వాటిని క్రమంగా క్షత్రియ, వైశ్య, శూద్ర వృషాలనీ అంటారు. ఏ వర్ణం వారు ఆ వర్ణపుటెద్దుని వదలడం మంచిది. ఎఱ్ఱటి ఎద్దుని ఏ వర్ణం వారైనా ఉత్సర్జనం చేయవచ్చును. పితరులు ఈ వృపోత్సర్గాన్ని ఆనందంగా తిలకిస్తుంటారు. కర్మ చేయువారు వృషాన్ని ధర్మ స్వరూపంగా భావించి దాని ద్వారా ధర్మాన్ని ఇలా ప్రార్థించాలి.
ధర్మస్త్వం వృషరూపేణ జగదానందదాయకః ॥
అష్టమూర్తే రధిష్ఠానమతః శాంతిం ప్రయచ్ఛమే ।
గంగాయమున యోః పేయమంతర్వేది తృణం చర ॥
ధర్మరాజస్యపురతో వాచ్యం మే సుకృతం వృష । ఽ5
ఇలా యమధర్మరాజుకి తన పుణ్యకర్మలను విన్నవించుమని ధర్మదేవతకు నివేదించిన పిమ్మట దాత ఆ ఎద్దు యొక్క కుడిభుజంపై త్రిశూల చిహ్నాన్నీ, ఎడమ ఊరు భాగంపై చక్రాంకిత చిహ్నాన్నీ వేయించి గంధ, పుష్పాక్షతాదులతో దానిని దూడతో సహా కట్టువిప్పి వదిలెయ్యాలి.
వసిష్ఠుడింకా ఇలా అన్నాడు. ‘మహారాజా! మీరు కూడా పద్ధతి ప్రకారం ఎద్దును వదలండి. లేకుంటే అన్య సాధనాలన్నీ సంపన్నం చేసినా కూడా సద్గతి కలగకపోవచ్చు. ఒకప్పుడు త్రేతాయుగంలో విదేహ నగరంలో ధర్మవత్సుడని ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన తన వర్ణానుసారం చేయవలసిన కర్మలన్నీ అవసరమైతే కూర్చుని అహర్నిశలూ గావించేవాడు; గొప్ప విద్వాంసుడు, విష్ణు భక్తుడు, అత్యంత తేజస్వి, లోభి కాకుండా వచ్చిన దానితోనే సంతుష్టి చెందేవాడు. ఒకమారు ఆయన పితృకార్యానికై కుశల కోసం పలాశ పత్రాల కోసం వనంలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకో సాగాడు. ఉన్నట్టుండి నలుగురు సుందరులైన పురుషులు ఆకాశం నుండి ఊడిపడి ఈ బ్రాహ్మణుని పట్టుకొని ఆకాశమార్గాన సాగిపోయి ఆ దీన, వ్యథిత బ్రాహ్మణుని దట్టమైన అడవులూ, పర్వతదుర్గాలూ దాటించి ఒక విశాల వన మధ్యంలో గల ఒక నగరంలో దింపారు. ఆ నగరం బ్రహ్మాండమైన ముఖ్యద్వారంతో, ఎత్తయిన ప్రాసాదాలతోనూ శోభిల్లుతున్నది. అరుగులు, బజార్లు, వస్తు బాహుళ్యమూ, సర్వాలంకృతులై సంభ్రమంగా సంబరంగా తిరుగుతున్న స్త్రీ పురుషులూ, తూర్యారావాలూ ఇతర వాద్యాల (వీణ, నగారాల) ధ్వనులూ - వీటన్నిటితో గొప్ప ధనికంగా, సుఖాల నిలయంలా కన్పట్టుతున్న ఆ నగరిలోనే రెండు విభిన్న రకాల మనుష్యలాతనికి కనిపించారు.
కొందరు ఆకలిబాధతో రోదిస్తూ, దీనులై, హీనులై, పురుషార్థరహితులై, చిరిగిన మాసిన బట్టలు కట్టుకొని ఎందుకు బతికున్నామురా దేముడా అన్నట్లుండగా మరికొందరు హృష్ట పుష్ట మనశ్శరీరులై స్వర్ణ భూషణాలంకృతులై సుందర వస్త్రాలను ధరించి నవ్వుతూ తుళ్ళుతూ ఎంత మంచి బతుకిచ్చావు దేవుడా అన్నట్లున్నారు. వారి రూపురేఖలూ అలంకారాలు కూడా దైవత్వం తొణికిసలాడుతున్నట్లుండడం చూసి అతడు ఆశ్చర్య చకితుడైనాడు. ‘నేనేమైనా కలగంటున్నానా, లేక ఇదేదో మాయాజాలమా, కాక నా చిత్త భ్రమయా’ అనుకోసాగాడు. ఈలోగా ఆ నలుగురు పురుషులూ ఆ బ్రాహ్మణుని రాజు వద్దకు గొనిపోయారు. స్వర్ణజటితమైన రాజ ప్రాసాదంలో నొక మహా దివ్య సింహాసనం పై విరాజిల్లుతున్న ఆ మహా రాజు వైభవం చూసి అతనికి మతిపోయినంత పనైంది. ఆ రాజుగారివైపే అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. ఛత్ర చామరాలు, స్వర్ణ నిర్మిత ముకుటం, వందీజన గుణగానాలు - అతనిని అవాక్కు పఱచాయి.
అంత గొప్ప మహారాజూ ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవసూచకంగా లేచి నిలబడి, అతనిని ఆసనంలో కూర్చోబెట్టి మధుపర్కాలతో కప్పాడు. అత్యంత ప్రసన్నచిత్తుడై ఆ విప్రవరునితో ఇలా అన్నాడు, ‘ప్రభో! మీ వంటి ధర్మపరాయణుని, విష్ణుభక్తుని చూసినందుకు నేడు నా జన్మ సఫలమైంది. నా వంశము పవిత్రమైంది.’ అంటూ ప్రణమిల్లి మరిన్ని మంచి మాటలతో చేతల ద్వారా అతనిని సంతుష్టున్ని చేసి తన వారితో ‘ఓ దూతలారా! ఈ బ్రాహ్మణదేవుని ఆయనను మీరు దర్శించిన చోట చేర్చిరండి” అన్నాడు.
బ్రాహ్మణుడప్పటికి పూర్తిగా తేఱుకొని ఆ రాజుతో ఇలా అన్నాడు, ‘మహారాజా! ఇది ఏ దేశము? ఒకేచోట ఉత్తమ, మధ్యమ, అధమ జీవనులెలా కనబడుతున్నారు? మీరు దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవశాన ఇలా రాజిల్లుతున్నారు? నన్నిక్కడికెందుకు తీసుకొచ్చారు? మరల వెంటనే ఎందుకు పంపించి వేస్తున్నారు? ఇదంతా ఏదో కల లాగుంది గాని కల కాదని మాత్రం తెలుస్తోంది. దయచేసి నా అజ్ఞానాన్ని దూరం చెయ్యండి.
‘ఓ విప్రదేవా! తమవలె ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ నిత్యమూ విష్ణుభక్తి పరాయణులై జీవిస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగియుండి, విషయవాంఛల కతీతులుగా జీవించు మహానుభావులని ఇక్కడికి గొని వచ్చి పూజించి సత్కరించి పంపడాన్ని కర్తవ్యంగా భావించే భక్తుడను నేను. తీర్థయాత్రాసక్తులై, వృషోత్సర్గ మాహాత్మ్య జ్ఞానాన్ని కలిగినవారై, సత్యవ్రతులై, దానరతులై మొలగువారు నాకు పూజ్యులు. దేవతలు కూడా వారికి ప్రణామం చేస్తారు. పరంతపులు, పూజార్హులునగు మీ దర్శనభాగ్యాన్ని నాతోబాటు నా వారందరికీ కలిగింపజేయడానికే మిమ్మల్నిక్కడికి రప్పించాను. హే భూదేవా! మీరు నా పట్ల ప్రసన్నులై నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి. నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పే సామర్థ్యంగాని అర్హతగాని నాకు లేవు. ఈ వృత్తాంతాన్ని విపశ్చిన్నామధారులైన మా మంత్రిగారే మీకు విన్నవించగలరు’ అని మౌనం వహించాడా మహారాజు.
అపుడు సర్వవేదవిదుడు, సకల విద్యాపారంగతుడునగు మహామంత్రి విపశ్చిత్తు తన రాజు గారి మనసులోని మాటను గ్రహించినవాడై ఇలా చెప్పసాగాడు : ‘విప్రోత్తమా! మా మహారాజు గారు పూర్వ జన్మలో ద్విజులూ దేవతలూ ఇష్టపడి నివసించే విరాధనగరిలో వైశ్యునిగా జన్మించారు. అప్పట్లో ఆయన పేరు విశ్వంభరుడు. వైశ్యవృత్తితో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటుండే వారు. నిత్యమూ గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవారు. సత్పాత్రదానము, అతిథి సేవ, అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్యధర్మాలై వుండేవి. ధర్మపత్నియగు సత్యమేధాదేవి సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించారు. స్మార్తకర్మానుష్ఠానం, శ్రౌతకర్మల ద్వారా ఆయన లోకాలనూ, దేవతలనూ కూడా మానసికంగా గెలుచుకోగలిగారు.
ఒకప్పుడాయన సోదరసమేతుడై పెద్దయెత్తున తీర్థ యాత్రలను చేసుకొని ఇంటికి మరలి వస్తుండగా దారిలో ఆయనకు లోమశ మహర్షి దర్శనమైనది. వెంటనే విశ్వంభరుడాయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమశమహర్షి కరుణాసాగరుడై ‘ఎక్కడి నుండి రాక ఇటకు’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు.
‘మునివరా! మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నశ్వరమనీ మృత్యువు మనకెదురుగనే నిలబడి వుంటుందనీ తెలుసుకున్నాను. అందుకే పుణ్యసముపార్జనకై సమయం మించి పోరాదని ధర్మపరాయణయైన నా పత్నితోనూ, ఆత్మ
బంధువులతోనూ కలసి తీర్థములను విధివత్తుగా దర్శించి ధనాది దానాలతో వీలైనంతమందిని తృప్తిపఱచి యాత్రను ముగించి ఇంటికి మరలి వస్తున్నాను. యాత్రల పుణ్యఫలం వెంటనే కనిపించింది. మీరు దర్శనమిచ్చారు’ అన్నారు విశ్వంభరులు.
‘ఓయి భద్రపురుషా! ఈ భారతవర్షం అనే పుణ్యభూమిలో ఎన్నో పావన తీర్థాలున్నాయి. నీవేమి చూశావో చెప్పి నన్నానందింపజేయి”
‘మునీశ్వరా! ఇలా మీతో మాట్లాడ గలగడమే నా పూర్వజన్మ సుకృతమనుకుంటాను. ఎక్కడైతే గంగా యమునా సరస్వతీ నామక పరమ పవిత్ర నదీమతల్లులు సంగమిస్తాయో, ఎక్కడ బ్రహ్మా ఇంద్రుడూ దశాశ్వమేధ యజ్ఞాలను గావించారో, ఆ ప్రయాగయను తీర్థరాజాన్నీ, కరుణా నిధానమూ, దే వదేవేశ్వరుడూనైన శివుడు ఏ క్షేత్రంలో నైతే ప్రాణుల చెవులలో తారక మంత్రాన్నుపదేశిస్తాడో ఆ మోక్షదాయిని కాశీ క్షేత్రాన్నీ, పులహాశ్రమాన్నీ, ఫల్గుతీర్థ, గండకి, చక్రతీర్థ, నైమిషారణ్య, శివతీర్థ, అనంతక, గోద్రతారక, నాగేశ్వర, బిందు సరోవర, మోక్షదాయకుడూ రాజీవ లోచనుడూ కరుణా పయోనిధి యైన శ్రీరాముని పుట్టుకచే సుశోభితమైన అయోధ్య, అగ్ని, వాయు, కుబేర, కుమార తీర్థాలనూ, సూకర క్షేత్రం, శ్రీకృష్ణుని జన్మచే పవిత్రమైన మథుర, పుష్కర, సత్యతీర్థం, జ్వాలా, దినేశ్వర, ఇంద్రతీర్థాలూ, పశ్చిమ వాహినియైన సరస్వతీ, కురుక్షేత్రాలను దర్శించాను.
తరువాత తాప్తీ, పయోష్ణీ, నిర్వింధ్యా, మలయ, కృష్ణవేణీ, గోదావరీ, దండకవన, తామ్రచూడ, సదోదక, ద్యావాభూమీశ్వర తీర్థాలను దర్శించి పర్వతరాజమైన శ్రీశైలాన్ని చేరుకున్నాను. ఆపై మహాతేజస్వియైన విష్ణుభగవానుడు శ్రీరంగ నామమును ధరించి వెలసిన మహాక్షేత్రాన్నీ, మహిషాసురమర్దిని దుర్గమ్మ, వేంకటి అను పేర వెలసిన వేంకటాచలాన్నీ దర్శించారు. అనంతరం చంద్రతీర్థ, భద్రవట, కావేరీ, కుటి లాచల, అవటోదా, తామ్రపర్ణీ, త్రికూట, కోల్లకగిరి, వసిష్ఠతీర్థ, బ్రహ్మతీర్థ, జ్ఞానతీర్థ, మహోదధి, హృషీకేశ, విరాజ, విశాల, నీలాద్రి (జగన్నాథపురి), భీమకూట, శ్వేతగిరి, రుద్రతీర్థ, పార్వతమ్మ తపస్సు చేసి శివయ్యను పొందిన ఉమావనాదులను చూశాను. అలాగే వరుణ, సూర్య, హంస, తీర్థాలనూ మహోదధినీ చూశాను. వీటిలో స్నానం చేస్తే అడవి కాకి కూడా వచ్చే జన్మలో హంసగా పుడుతుందంటారు. అక్కడొక రాక్షసుడు స్నానం చేసి దేవత్వాన్ని పొందాడని వినికిడి. తరువాత విశ్వరూప, వంది, తీర్థ, రత్నేశ, కుహకాచల తీర్థాలకు వెళ్ళాను. అక్కడి శ్రీమన్నారాయణుని దర్శించిన వారికి కోటి పాపాలు దగ్దమవుతాయి. వృషద్వతి, యమున అనే నదులు మానవ కల్యాణ కారకాలు. వాటిలో స్నానం చేసి అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాను. మహాకాళ, నీలకంఠ, అమరకంటక, చంద్రభాగ, వేత్రవతి, వీరభద్ర, గణేశ్వర, గోకర్ణ, బిల్వ, కర్మకుండ, సతారక తీర్థాలలో స్నానం చేసి ఈ స్నానాల వల్ల మనిషి కర్మ బంధనాల నుండి ముక్తుడవుతాడని విని సంతోషించాను. మునీంద్రా! మీ దయ వల్ల ఈ యాత్రలను చేసి ఇలా వెనుకకు వెళుతున్నాను. సాధుజనుల కృప ప్రాణులలో కల్యాణకారిణియైన బుద్ధికి జన్మనిస్తుంది. ఒకవైపు తీర్థాలూ, మరొకవైపు మీవంటి సత్పురుషులూ లోకకల్యాణానికి పరమోపకారులు.
ఉత్పద్యతే శుభాబుద్ధిః సాధూనాం యదనుగ్రహః ।
ఏకతః సర్వతీర్థాని కరుణాః సాధవోఽన్యతః ॥ 77
అనుగ్రహాయ భూతానాం చరంతి చరితవ్రతాః । 78
మహర్షి పుంగవా! మీరు అన్ని వర్ణముల వారికీ గురుదేవులు. విద్యలోనూ వయసు లోనూ శ్రేష్టులు. కాబట్టి చిరంతన కాలం నుండీ వస్తున్న ఒక విషయం గూర్చి ఇంకెవరి నడగను? మిమ్మల్నే అర్థిస్తున్నానను. నా మనస్సు అత్యంత చంచలమై పోవుచున్నది. అది బ్రహ్మ విషయం అర్థం కాక వ్యాకులపడుతున్నది. కాబట్టి నాకు జ్ఞాన సంపన్న వ్యక్తి వద్ద వుండే శాంతినీ, వివేకవంతుడైన శ్రేష్ఠ మనుష్యునికి అంతర్బాహ్య స్థితులు రెండిటా ఒకేలా వుండే శుద్ధతనీ సంపాదించి పెట్టే సాధనను తెలపండి అని ప్రార్థించాడు విశ్వంభర వైశ్యుడు. సహజంగా బుద్ధిమంతుడు, విద్యావేత్త. పైగా అన్ని యాత్రలు చేసినవాడు కాబట్టి అతనికి ఏం కావాలో తెలిసింది. ఎవరి నడగాలో కూడా తెలిసింది. ఈ విషయం లోమశ మహర్షికి కూడా తెలిసింది. కాబట్టి ఆయన ప్రసన్న దృక్కుల నా వైశ్యశిఖామణి పై ప్రసరిస్తూ ఇలా ప్రవచింపసాగాడు.
‘హే వైశ్యవర్య! ఈ మనస్సత్యంత బలీయం. దీనికి వీకార యుక్తతే నిత్య స్వభావం, మిక్కిలి బలము గల ఏనుగు పీలగా బక్కగా నుండే మావటికి లొంగిపోయి నడచుకొనే విధంగా, ఇంత బలమైన మనస్సూ కూడా మన చెప్పుచేతల్లో వుండాలంటే, సత్సంగతి, ఆలస్య రహితమైన సాధన, తీవ్ర భక్తి వియోగం, సద్విచారం అనే వాటి ద్వారా దానిని స్వాధీనం చేసుకోవాలి. ఈ సందర్భంలో నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం మంచి జ్ఞానాన్నిస్తుంది. ఆయనే నాతో ఇలా చెప్పారు.
‘ఓ మునీ! ప్రాచీన కాలంలో నేనొక శ్రేష్ఠ బ్రాహ్మణుని దాసీపుత్రుడను. ఆ బ్రాహ్మణ గృహంలోనే నాకు (అనగా నారదునికి) ఎందరో మహానుభావులతో పుణ్యాత్ములతో సత్సంగతి లభించింది. ఒకమారు వర్షా కాలంలో కొందరు సాధుజనులు ఆ యింట నుండుట తటస్థించింది. నేను వారికి మనఃపూర్తిగా వినమ్రంగా సకల సేవలూ చేయడంతో వారు అత్యంత సంతుష్టులై నాకొక మంత్రోపదేశం చేస్తూ ఇలా అన్నారు. ‘వత్సా! ఈ మంత్రోపదేశ ప్రభావం వల్ల నీ బుద్ధి అత్యంత నిర్మలమై లోక కల్యాణకారి అయిపోతుంది. అప్పుడు నీకు నీలోనూ ఇతరులలోనూ కూడా మహావిష్ణువే కనిపిస్తాడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనంతమైన ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ విశ్వంలో అనేక ప్రకారాల దేవతా, పక్షి, మనుష్యాది జన్మలున్నాయి కదా! అవి కర్మ చేత బంధింపబడి వుంటాయి. కర్మపాశబద్ధులై జన్మించినా మరల వేరు వేరు కర్మలను ఎవరికి వారుగా చేసి ఆ కర్మఫలములను భోగిస్తూ సత్త్వగుణం వల్ల దేవతాయోనిలోనూ, రజోగుణం వల్ల మనుష్య యోనిలోనూ, తమోగుణం వల్ల ఇతరేతర యోనుల్లోనూ జన్మిస్తుంటారు. విషయవాంఛలచే, వాసనలచే చివరికంటా కట్టబడి వాటికే కట్టుబడి జీవించిన ప్రాణి దేహాంతంలో మరల జన్మించడం, మరల మృతి చెందడం జరుగుతుంటుంది. ఈ జన్మల్లో ఎక్కడో ఎప్పుడో చేసిన పుణ్యం దైవయోగం కలియడం వల్ల మనుష్యజన్మ ప్రాప్తిస్తుంది. ఈ జన్మ ఆ ప్రాణికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం. ఆ అవకాశాన్నంది పుచ్చుకొని మహాత్ములను సేవించి వారి కృప వల్ల భగవానుడైన హరిని తెలుసుకోవాలి. అప్పుడు తాను అపార భవసాగరానికి రోగమనే, మోహమనే త్రాళ్ళతో కట్టబడియున్నట్టు తెలుస్తుంది. ఆ పాశాలను ఛేదించుకొని ముక్తి ఎలా పొందాలో కూడా తెలుస్తుంది. ఈ భవసాగరాన్నుండి బయట పడదలచుకొన్న వారికి భగవన్నామ స్మరణను మించిన సాధనం మాకు కనబడలేదు. పాలను చిలకడం వల్ల నవనీతమూ, చెక్కను ఱాపిడి చేయడం వల్ల అగ్నీ పుట్టినట్లే మనసును మథనం చేస్తే అందులోనే దేవుడు పుడతాడు. అక్కడే ఆ ప్రాణిలోనే వుండిపోతాడు. ఇలా పరమాత్మను చూసినవాడే సుఖి.
ఈ ఆత్మ నిత్యము, అవ్యయము, సర్వగామి, సర్వప్రాణి నివాసి. ఇది అప్రమేయం. ఇదీ స్వయంగానే జ్యోతిస్వరూపమై ప్రతి మనసులో వెలుగుతుంటుంది. కానీ ఆ మనసుకీ దాని చేతికీ దొరకదు. దీనికి నాశనం లేదు. పంచ భూతాల లాగే ప్రపంచమంతటా వుంటుంది. వాటితో కలసి ప్రాణిలోనూ వుంటుంది. అన్ని ప్రాణుల కన్న ఒక మెట్టు పైనే వున్న ఆత్మకన్నా ఎన్నో మెట్టుపైన వుంటాడు పరమాత్మ. అయినా ఆయన సాధు జనాన్ని రక్షించడానికి దిగి వస్తుంటాడు అనగా అవతరితుడవుతుంటాడు. స్వతః నిర్గుణుడైనా అజ్ఞానులకు త్రిగుణాత్మికునిగా కనిపిస్తాడు. ఎవరైతే భక్తి యోగం ద్వారా పరమాత్మను సంతుష్టపఱచ గలరో వారికాయన దర్శనమిస్తాడు. అప్పుడా భక్తులు కృతార్థులవుతారు. ఆ పిమ్మట సర్వదా, సర్వత్ర నిష్కామభావంతోనే జీవిస్తారు. బంధన యుక్తమైన ఈ శరీరంతోనే వుంటూ అహంకారమును పరిత్యజించి, స్వప్న ప్రాయమైన ఈ జీవితంపై అప్పటిదాకా పెంచుకొన్న మమతాసక్తులను పూర్తిగా తెగగొట్టుకొనే శక్తి వారికీ లభిస్తుంది. ఓ వత్సా! కలలో వచ్చే సంపద కాని ధైర్యం కాని స్థిరంగా వుంటుందా? ఇంద్రజాలంలో నిజమెంత, శరత్కాల మేఘంలో సత్యమెంత, శరీరంలో నిత్యత ఎంత? ఈ దృశ్యమాన సమస్త చరాచర జగత్తూ అవిద్యాకర్మజనితమే. ఇది తెలిసికొని నీవు మహా యోగివి కావలసియున్నది. నీవు సిద్ధిని పొందగలవు.
అవి నావంటి దీన హీన ప్రాణిపై వాత్సల్యం కురిపించి ఆ సాధువులు వెళ్ళిపోయారు. అ తరువాత నేను (నారదుడు) వారు చెప్పిన మార్గంలో ప్రతిదినమూ సాధన చేశాను. అచిరకాలంలోనే నేను నా అంతఃకరణలోనే ఒక అశ్చర్యజనక దృశ్యాన్ని (మనో నయనాలతో) చూడగలిగాను. శరత్కాలీన చంద్రుని వలె నిర్మలంగా, ప్రతి క్షణమూ ఆనందాన్ని ప్రసాదించు ప్రకాశ పుంజంగా, చల్లగానుండి కూడా ప్రజ్వలితమగుతున్నట్లుగా నున్న ఒక మహాతేజం నాకు కనిపించి వెంటనే ఆకాశంలోని మెరుపులాగ మాయమై పోయింది. అప్పటి నుండి నేనా జ్యోతిపుంజాన్నే ధ్యానించడం, అది అలాగే కనబడు తుండడం, నేను వేరే ధ్యాస లేకుండా ఆ ధ్యాన, దర్శనాలతోనే జీవించడం జరిగాయి. నా భూలోకవాసం పూర్తి కాగానే ఆ శరీరాన్ని విడచి విష్ణులోకాన్ని చేరుకున్నాను.
ఓ లోమశ బ్రాహ్మణోత్తమా! ఆ మహా ప్రభువు సంకల్పం మేరకే నా జన్మము బ్రహ్మ ద్వారా తటస్థించింది. ఆ దేవాధిదేవుని కృప వల్లనే నేనీనాడు లోక కల్యాణాసక్తి తప్ప ఇతరత్ర అనాసక్తుడనై మూడు లోకాలలో మాటిమాటికీ వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగ గలుగుతున్నాను. నా స్వామీ చేయించే పనులకొక సాధనంగా మనగలుగుతున్నాను.’
అని తన అనుభవాన్ని మాకందించి దేవర్షి నారదుడు మమ్ము కృతార్థులను చేశాడు. ఆహా ఇదా సత్సంగతి వల్ల లాభము, సత్సాంగత్య ఫలము అని నేను (లోమశ మహర్షి) ఆశ్చర్యపోయాను. ఓ వైశ్య సత్తమా! నీ మనసిప్పటికే విశుద్ధమై, నిర్మలమై, శాంత స్వభావయుక్తమై వుంది. ఇక నీకు కావలసినది సత్సంగతి, అచంచలమైన భక్తి. ఓ ధర్మజ్ఞా! సాధు సంగతి వల్ల అనేక జన్మలలో చేసిన పాపాలు, శరత్కాలం రాగానే వర్షాలు కడముట్టినట్లు, ఇంకిపోతాయి.
అతస్తే సాధు సంగత్యా భక్త్యాచ పరమాత్మనః ॥ 111
విశుద్ధం నిర్మలం శాంతం మనో నిర్వృతి మేష్యతి ।
అనేక జన్మజనితం పాతకం సాధు సంగమే ॥ 11ఽ
క్షిప్రం నశ్యతి ధర్మజ్ఞ జలానాం శరదో యథా । 113
అపుడా వైశ్య శిఖామణికి లోమశ మహర్షి వృషోత్సర్గం చేయనిదే ధర్మార్థ కామాలలో ఏ పురుషార్థమూ రాణించదనీ, మంచు బిందువులు గాని వడగళ్ళుగాని నేలపై బడి దండగై పోయినట్లు వృషోత్సర్గ సహితం కాని కర్మలన్నీ వ్యర్థమై పోతాయనీ, వృషోత్సర్గం అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యాన్నిస్తుందనీ, నిజానికి వృషోత్సర్గం వంటి హితకారి వేరొకటి లేనేలేదని, ఇంద్రదేవుని సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలదనీ చెప్పాడు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి వృపోత్సర్గ కర్మను సంపన్నం చేసి ఆ తరువాతే ఇంటికి వెళ్ళుమని ఆదేశించాడు.
విపశ్చిత్తు తన రాజుగారి కథను ఇంకా ఇలా చెప్పసాగాడు. తరువాత ఆ వైశ్వోత్తముడు అన్ని యజ్ఞాలనూ సంపూర్ణం చేయు వరాహ స్వామి వెలసిన పుష్కర క్షేత్రానికి పోయి అక్కడ సలక్షణంగా వృపోత్సర్గ - కర్మ సంపన్నం చేశాడు. తదనంతరం లోమశ మహర్షి ఆదేశం మేరకు, ఆయన సాంగత్యంలోనే మరిన్ని తీర్థాలను దర్శించాడు. నీల వృషభానికి వివాహం చేశాడు. ఇలా ఎంతో పుణ్యాన్నార్జించి దేహాంతంలో శ్రేష్ట విమానాన్నెక్కి దివ్యలోకాలలో పెద్ద కాలం పాటు అన్ని భోగాలూ అనుభవించి మరల పుడమిపై పుట్టవలసి వచ్చినపుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజైనాడు. మంత్రిగారి ప్రసంగాన్ని విని బ్రాహ్మణుడాశ్చర్య చకితుడైనాడు. ఆ తరువాత రాజుని మనసారా దీవించి రాజసేవకులు వెంటరాగా తన ఇంటికి వెళ్ళాడు.’
ఇంతవఱకు వీరవాహన మహారాజుకి వినిపించిన వసిష్ట ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు. ‘ఓ రాజా! అన్ని కర్మలలోకీ శ్రేష్ఠ కర్మ, (శ్రేష్ఠతమ కర్మ) వృషోత్సర్గ కర్మయే. ఈ కర్మను చేసిన వారు యమరాజుకి భయపడనవసరము లేదు. అలాగే స్వర్గప్రాప్తికి కూడా వృషోత్సర్గమే చక్కటి మార్గము.
వృషోత్సర్గ సమంకించిత్
సాధనం నదివః పరం । 130
ఒక్క అపవాదం మాత్రం వుంది. పుత్రుడు, భర్త అంతా వుండగా మరణించిన స్త్రీకి కర్మ చేసినపుడు వృషోత్సర్గం చేయరాదు. పాలిచ్చే ఆవుని దానమివ్వాలి.
గరుడా! వసిష్ఠుని వచనాలను విని వీరవాహనుడు మథురకు మరలి వచ్చి వృషోత్సర్గాన్ని చేశాడు. అతడు మరణించాక యమదూతలు వచ్చి కాల పురి వైపు సగౌరవంగా గొనిపోతున్నపుడతడు ‘ఇక్కడేదో శ్రాద్ధ దేవ నగరముంటుందని విన్నాను, ఎక్కడా కనిపించదేం?’ అని వారినే అడిగాడు. వారు వెంటనే అది పాపాత్ములను పాపశుద్ది కోసం గొనిపోయే చోటనీ, ధర్మాధర్మ వివేచన చేసి, యమధర్మరాజు, శిక్షలు వేసే ప్రదేశమదేననీ, కానీ, వీరవాహనుని వంటి పుణ్యాత్ములకా నగరంతో పని వుండదు కాబట్టి అది కనబడదనీ, అసలా దారిలో తగలదనీ వినమ్రంగా బదులిచ్చారు. మరు క్షణంలో దేవ, గంధర్వ పరివేష్టితుడై దివ్యరూప ధారియై ప్రశాంత కాంతులను వెదజల్లుతూ యమధర్మరాజే అతనికీ దర్శనమిచ్చాడు. వెంటనే ఆ రాజు చేతులు జోడించి ప్రణామం చేసి ఆయనను అనేక విధాల కీర్తించి సంతుష్ట పఱచాడు. యమధర్మరాజు కూడా రాజుతో మర్యాదగా మాట్లాడి తన దూతలతో ఆ రాజును సర్వభోగాలూ సుఖాలూ సులభంగా లభించే దేవలోకానికి గొనిపొమ్మని ఆదేశించాడు.
వీరవాహన మహారాజు మరింత వినమ్రుడై ‘ఓ దేవా! మీ దర్శనాన్నీ విధంగా పొందడానికీ ఆపై స్వర్లోక సౌఖ్యాల నందడానికీ నేనేయే పుణ్యకార్యాలనాచరించి అర్హతను సంపాదించానో నాకు తెలియరావటం లేదు’ అన్నాడు.
యమధర్మరాజు కూడా మరింత ప్రసన్నుడై ‘ఓ రాజా! నువ్వు దాన యజ్ఞాద్యనేక పుణ్యకార్యాలను శ్రద్ధాభక్తులతో నిర్వర్తించడమే కాక వసిష్ఠ దేవుని దయ వల్ల మథురలో పెద్ద యెత్తున వృషోత్సర్గం కూడా చేశావు. మహారాజా! మానవులు ఏ పాపమూ చేయకుండా కాసింత ధర్మాన్ని సమ్యగ్రూపంతో పాలించినా బ్రాహ్మణుల, దేవతల కృప వల్ల ఆ పుణ్యం అధికాధికమై పోతుంది.
ధర్మః స్వలోఽపి నృపతే యది సమ్యగుపాసితః -
ద్విజదేవ ప్రసాదేన సయాతి బహువిస్తరం ॥ ధర్మ 6.14ఽ
“నువ్వు బహు పుణ్య కార్యాలే చేశావు. నీకు నా ఆశీస్సులు’ అంటూ యమధర్మరాజు అంతర్థానం చెందాడు. వీరవాహనుడు స్వర్గలోకానికీ గొనిపోబడ్డాడు.
పక్షిరాజా! వృషోత్సర్గ నామకయజ్ఞ మాహాత్మ్యాన్ని విస్తారపూర్వకంగా విన్నావు కదా! ‘ప్రాణుల పాపకర్మలను సమాప్తం చేసే ఈ ఆఖ్యానాన్ని చదివినవారు విన్నవారు పాప ముక్తులవుతారు’ అని శ్రీహరి గరుత్మంతునికుపదేశించాడని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు.
