2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

22 - ప్రేతయోనిలో పడవేయు నిందిత కర్మలు మొదలగునవి

‘భగవన్! ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అవి ఎలా తిరుగుతాయి? వాటి రూపురేఖలు భోజనాదులు ఎలావుంటాయి? అవెక్కడుంటాయి? వాటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? ప్రసన్న చిత్తుడవై నాకీ జ్ఞానాన్ని ప్రసాదించు’ అని కోరాడు అండజకుల మండనుడు.

చెప్పసాగాడిలా బ్రహ్మాండాధి నాయకుడు :

‘కశ్యపాత్మజా! పూర్వ పాపఫలం వల్ల మరికొన్ని పాపాలు చేయాలనే కోరిక పుట్టి దాని నణచుకోకుండా అదుపు లేని చిత్తవృత్తితో వర్తించి మానవజన్మను తగలబెట్టుకొనే పాపాత్ములు ప్రేతాలవుతారు. ఇలా :

పాపకర్మరతా యేవై పూర్వ కర్మవశానుగాః ।

జాయంతే తే మృతాః ప్రేతా స్తాంఛృణుష్వ వదామ్యహం ॥

వాపీకూప తడాగాంశ్చ ఆరామం సురమందిరం ।

ప్రపాం సద్మ సువృక్షాంశ్చ తథాభోజన శాలికాః ॥

పితృపైతా మహం ధర్మం విక్రీణాతి సపాపభాక్ ।

మృతః ప్రేతత్వ మాప్నోతి యావదాభూత సంప్లవం ॥

గోచరం గ్రామ సీమాంచ తడాగారా మగహ్వరం ।

కర్షయంతి చయే లోభాత్ ప్రేతాస్తే వైభవంతి హి ॥ ఽఽ.6

పాపాత్ముల మృతి సాధారణంగా చండాలాయుధం, పాముకాటు, నీటమునక, అగ్ని, పంటి కాటు, బ్రాహ్మణశాపం, పశువు దాడి, విద్యుత్తు వంటి వాటి వల్ల జరుగుతుంది. అలాగే, పై మృతులతో బాటు ఆత్మహత్య చేసుకున్నవారు, ఉరిశిక్ష విషప్రయోగం, విషూచిక, శస్త్రపు దెబ్బలవల్ల పోయినవారు, దొంగల చేతిలో చనిపోయిన వారు, అపర కర్మ జరుపబడనివారు, వృషోత్సర్గ మాసిక పిండాదులు అందనివారు, ఆకాశంలో మరణించినవారు, కొండ మీది నుండి జారిపడి పోయినవారు, విష్ణువుని స్మరించకుండా మృతి చెందినవారు, కుక్క కాటు వల్ల దుర్మరణం పాలైనవారు - వీరంతా ప్రేతాలై పోతారు. ప్రమాదాల పాలై మృతి చెందినవారు ప్రేతాలై శ్మశానంలోనే తిరుగుతుంటారు. ఏ స్త్రీనైనా దోషం లేకుండా శిక్షించువాడు, హింసించువాడు, త్యజించువాడు అలాగే మహాపాతకులు ప్రేతాలవుతారు. పండిత గృహాలలో జన్మించి కూడా విద్య నేర్వక, సదాచార హీనుడై తండ్రిని బాధించువాడు ప్రేత యోనిలో పడతాడు. ఇంకా.

మాతరం భగినీం భార్యాం స్నుషాందుతరం తథా ।

అదృష్ట దోషాం త్యజతి స ప్రేతో జాయతే ధ్రువం ॥

భ్రాతృధగ్ బ్రహ్మ హా గోఘ్నః సురాపోగురుతల్పగః ।

హేమ క్షౌమ హరస్తార్ క్ష్య సవై ప్రేతత్వ మాప్నుయాత్ ॥

న్యాసాపహర్తా మిత్ర ధ్రుక్ పరదార రతస్తథా ।

విశ్వాస ఘాతీ క్రూరస్తు స ప్రేతో జాయతే ధ్రువం ॥

కులమార్గాం శ్చ సంత్యజ్య పరధర్మ రతస్తథా ।

విద్యావృత్త విహీనశ్చ సప్రేతో జాయతే ధ్రువం ॥ ఽఽ.17

ఒకప్పుడు యుధిష్ఠిరుడు భీష్మ పితామహుని ఇలా అడిగాడు, ‘తాతగారూ! ప్రాణీ ఏ కర్మ ఫలం వల్ల ప్రేతమై పోతాడు? వానికి ముక్తి ఎలా లభిస్తుంది?

భీష్ముడిలా చెప్పసాగాడు :

ధర్మజా! నీవిదివఱకే విన్న సంతప్తక బ్రాహ్మణుని కథలోనే వీటి వివరాలున్నాయి. ఇది పంచప్రేతోపాఖ్యానమను పేరిట సుప్రసిద్ధం. శుభప్రదం. ఈ కథలో ప్రేతయోనిలో పడకుండా వుండాలంటే నరుడేం చేయాలో ఇలా చెప్పబడింది :

ఉపవాస పరోనిత్యం కృచ్చ్ర చాంద్రాయణే రతః ।

వ్రతైశ్చ వివిధైః పూతో న ప్రేతో జాయతే నరః ॥

ఏకాదశ్యాం వ్రతం కుర్వం జాగరణే సమన్వితం ।

అపరైః సుకృతైః పూతో న ప్రేతో జాయతే నరః ॥

ఇష్ట్వావై వాశ్వమేధాదీన్ దద్యాద్ దానాని యోనరః ।

ఆరామోద్యానవాప్యాదేః ప్రపాయాశ్చైవ కారకః ॥

కుమారీం బ్రాహ్మణానాంతు వివాహయతి శక్తితః ॥

విద్యాఽదో భయదశ్చైవ న ప్రేతో జాయతే నరః ॥ ఽఽ.68

గరుడా! మానవ జన్మనొందిన వారు దానిని సద్వినియోగం చేసుకుంటే ప్రేతజన్మే పుండదు’.