2 - గరుడ పురాణము - ప్రేత కాండము
30 – దాన ధర్మాల మహిమ - ఆతుర కాలదాన వైశిష్ట్యం, వైతరణీ - గోదాన మహిమ
తార్క్ష్యా! చాలా మందికి తెలియదు గానీ పత్తి దానం ఉత్తమ దానం. పత్తి లేదా దూదిని దానం చేయడం వల్ల భూః, భువః, స్వః - అనగా పృథ్వీ, అంతరిక్షం, స్వర్గం - ఈ మూడూ ప్రసన్నమవుతాయి. బ్రహ్మాది దేవులంతా ఆనందిస్తారు. ప్రేతాన్ని ఉద్దరించడానికి దానం గొప్ప సహాయకారి. ఇట్టి మహాదానము నిచ్చిన దాత చిరకాలం పాటు రుద్ర లోకంలో నివసించి మరల పుడమిపై పుట్టాల్సి వచ్చినపుడు రూప సంపన్నుడు, సౌభాగ్యశాలి, వాక్చతురుడు, లక్ష్మీవంతుడు, అప్రతిహత పరాక్రమవంతుడునగు రాజుగా పుడతాడు. మరల తన సుకృతాల ద్వారా యమలోకాన్ని జయించి స్వర్గలోకనివాసి అవుతాడు.
బ్రాహ్మణునికి గోవునూ, నువ్వులనూ, భూమినీ, స్వర్ణాన్నీ దానం చేసి ఆ తరువాత పవిత్ర జీవితాన్ని గడిపినవారికి జన్మ జన్మార్జిత పాపాలన్నీ దగ్ధమై పోతాయి. రుగ్ణావస్థలోనూ, సూర్య లేదా చంద్ర గ్రహణ సమయాల్లోనూ చేసే దానములకు విశేష ఫలాలుంటాయి. కుటుంబంలో, పోష్య వర్గములో నున్న రోగులకు స్వస్థతను కోరి దానాలిస్తే ఆ రోగాలు తగ్గడమే కాకుండా దానమిచ్చినవానికి కూడా పుణ్యలోక ప్రాప్తి వుంటుంది. పుత్రుడు తన తండ్రి సుఖ సంతోషాలను కోరుకుంటూ సత్పాత్రులైన సద్భ్రాహ్మణులకు చేసే దానాల వల్ల తండ్రీ కొడుకులిద్దరి జీవనాలూ సుఖమయాలవుతాయి. వికలేంద్రియాలూ బాగుపడాలని కోరుకొని ఇచ్చే దానాలూ కూడా ఫలిస్తాయి. తన తండ్రి జీవించియున్నంత కాలమూ ఆయన ఆరోగ్యం కోసం కొడుకు చేసే దానాలు ప్రశస్తమైనవి. అవి తండ్రి కొడుకుల జీవితాలను సంతోషంతో నింపడమే కాకుండా ఆవాహిక ప్రేతాల భోగాలకు పోయి, పరలోకాన్నీ బాగు చేస్తాయి.
మృత్యువాసన్నమైన వాని పేర ప్రతి దశలోనూ కటిక దరిద్రులకూ వికలాంగులకూ దానాలిస్తుంటే ఆవాహిక శరీరానికి ప్రీతి కలుగుతుంది. మనిషి పోయిన తరువాత చేయవలసిన దానాలిది వఱకే చెప్పబడ్డాయి కదా!
నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు - ఇవి క్రమంగా ఒక దానిని మించి మరొకటి పవిత్రాలు. నువ్వులు అందరు దేవతలనూ, ఇనుము యమరాజును ప్రసన్నం చేయగలవు. అంటే వాటిని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ దేవతలు ఈ దాత పట్ల ప్రసన్నులవుతారని అర్థము. లవణ దానం చేసేవారు యమునికి భయపడనవసరం లేదు. పత్తిని దానమిచ్చువారు భూతయోనికి భయపడనక్కరలేదు. గోదానం ఆ దాతను త్రివిధ పాపాల నుండి బయటపడేస్తుంది. స్వర్ణదానం వల్ల స్వర్గసుఖాలు లభిస్తాయి. భూమి దానమిచ్చినవాడు రాజు కాగలడు. సప్తధాన్యాలను దానమిచ్చిన వారికి యమదూతలు ప్రసన్నులు కాగలరు. వరాలను కూడా ఇస్తారు.
విష్ణుభగవానుని నామస్మరణ మాత్రాననే ప్రాణికి పరమగతి ప్రాప్తిస్తుంది. తండ్రి ఆదేశం మేరకు దానాలు చేసే తనయుని లోకాలన్నీ ప్రశంసిస్తాయి. మరణాసన్నమైన తండ్రి శరీరాన్ని నేలపై పరుండబెట్టి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని ఆయన చివరి క్షణాల్లో ఆ ద్రవ్యాలను దానం చేసిన కొడుకు తన మొత్తం వంశాన్ను ద్ధరించగలడు. అతడిచ్చిన దానాలు గయలో పెట్టబడే శ్రాద్ధాల కన్న నెక్కువ పుణ్య ప్రదాయకాలు. మరణాసన్న సమయంలో తండ్రి వున్నపుడు ఆయన పేర చేసే దానాలు అన్ని ఆటంకాలనూ అధిగమించి, ఆయన, స్వర్గం చేరుకొనేలా చేయగలవు. ఈ దానమే అంత్యేష్టి అను పేర ప్రసిద్ధి చెందింది. అశ్వమేధయాగాలు పదహారైనా దీనికి సాటిరావు. దీనిని గావించే ధర్మాత్ముడైన పుత్రుని దేవతలు కూడా పూజిస్తారు.
ఇనుమును దానం చేసిన వానికి యమధర్మరాజు యొక్క భయంకర రూపం కనుపించదు. యమధర్మరాజు భయంకరములైన గొడ్డలి, ముసలం, దండం, ఖడ్గం, ఛురిక వంటి ఆయుధాలను ధరించి వుంటాడు. ఇవన్నీ ఇనుముతో చేసినవే. అందుచేత ఇనుమును బ్రాహ్మణునికి దానం చేస్తే ఆయన సంతోషిస్తాడు. తండ్రి కోసమే కాక దీర్ఘరోగులైన బంధువుల కోసం కూడా దానాలను చేయాలి. గరుడా! ఇది ఎంత ముఖ్యమైనదంటే సామర్థ్యముండీ, విషయం తెలిసీ రోగికి ఉత్తమ గతిని కల్పించే దానాలను చేయని పుత్ర, పౌత్ర, బంధుబాంధవ, మిత్ర, సగోత్రికులు బ్రహ్మ హంతకులతో సమానులైన పాపులుగా పరిగణింపబడతారు. ఎందుకంటే రోగి స్వయంగా తాను ఏ పుణ్యకార్యమూ చేయలేడు కదా!
మృతి చెందినవారేమవుతారు అనేది మరొక్కసారి విను. ప్రాణి వెంటనే ఆవాహిక శరీరం గల ప్రేతంగా మారి ఒక యేడాది పూర్తియినాక తన పుణ్యాల లాభాన్ని అనుభవిస్తుంది. ఈ లోకంలో ముఖ్యమైనవి మూడేసి వుంటాయి కదూ! అగ్నులు, లోకాలు, వేదశక్తులు, దేవతలు, కాలాలు, సంధులు, మూలవర్థాలు, ప్రధాన శక్తులు - అన్నీ త్రివిధాలే. అలాగే మనిషిలో నివసించే త్రిమూర్తులు కూడ. కాళ్ళ నుండి కటి దాకా బ్రహ్మ నాభి నుండి గొంతు దాకా శ్రీహరి, గొంతు నుండి పై దాకా వ్యక్తావ్యక్త స్వరూపుడైన శివుడు ఉంటారు.
గరుడా! నేనే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్జ శరీరాల్లో ప్రాణరూపుడనై నివసిస్తున్నాను. ధర్మ - అధర్మ సుఖ - దుఃఖ, కృత - అకృత ద్వంద్వాలలో ప్రవర్తించే బుద్ధిని నేనే. ఆ బుద్ధిలో నేను కూర్చుని వాటి పూర్వ కర్మానుసారంగా వాటికీ ఫలాన్ని తెప్పించే పనులను చేస్తుంటాను. నా వల్లనే ప్రాణి స్వర్గానికో, నరకానికో, మోక్షానికో పోవడం జరుగుతున్నది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ బుద్ధ, కల్కి - ఈ పది నామాలనూ రోజూ స్మరించేవారు మనుషులు. వీరు ఈ లోకంలోని స్మరణ వల్ల స్వర్గానికి పోయి అక్కడ కూడా ఈ నామాలను స్మరిస్తూ మరల ఈ మర్త్య లోకంలో పుట్టినప్పుడు ధన ధాన్య సంపన్నులై దయా దాక్షిణ్యాది సద్గుణ పరిపూర్ణులై, పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచి ఆనందంగా నూరేళ్ళూ జీవిస్తారు. రోగం నుండి ఇక విముక్తి లేదని తెలిసినవారు దానాలు చేస్తూ చేయిస్తూ విష్ణు పూజలను జరుపుతూ జరిపిస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని అసువులు బాసేదాకా జపిస్తూ వుంటే మోక్షమునందగలరు. ద్వాదశాక్షర మంత్రాన్ని జపించినా అదే ఫలాన్నందుకోగలరు. సంపూర్ణ జగమే విష్ణుమయం. ఇలా :
విష్ణుర్మాతా పితావిష్ణుర్విష్ణుః స్వజన బాంధవాః ।
యత్ర విష్ణుం న పశ్యామి తత్ర వాసేన కిం మమ ॥
జలే విష్ణుః స్థలే విష్ణుర్విష్ణుః పర్వత మస్తకే ।
జ్వాలా మాలాకులే విష్ణుః సర్వం విష్ణుమయం జగత్ ॥ 30.4ఽ
బ్రాహ్మణులు, జలం, భూమి మున్నగు పదార్థాలన్నిటిలోనూ నేనున్నాను కాబట్టి ఓ గరుడా! మనిషి దేనిద్వారా తరింపదలచినా అది నా ద్వారానే జరుగుతుంది. జీవికి తరుణోపాయం నేనే.
మనిషి మరణించిన పిమ్మట వైతరణిని దాటవలసి వుంటుంది. నిజానికిది మంచివారికి హితకారిణి ఎక్కువ పుణ్యాలను చేసిన వారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకొని శుద్ధులై విష్ణులోకానికి పోతారు.
గోదానాన్ని మించిన పుణ్యమే లేదు. కపిల గోవును దానమిస్తూ పరమాత్మనిలా ప్రార్థించాలి:
గావో మమాగ్రతః సంతుపృష్ఠతః పార్వతస్తథా ।
గావో మే హృదయే సంతు గవాం మధ్యేవసామ్యహం ॥
యా లక్ష్మీః సర్వభూతానాం యాచ దేవే వ్యవస్థితా ।
ధేను రూపేణ సాదేవీ మమ పాపం వ్యపోహతు ॥ 30.53
