2 - గరుడ పురాణము - ప్రేత కాండము
8 - అపరకర్మలకు అధికారి - జీవిత శ్రాద్ధ సంక్షిప్త విధి
క్షీరసాగరంపై శయనించే జ్ఞానసాగరుని ఆకాశంలో వాహనమై విహరింపజేసే గరుడుడు మరింత జ్ఞానం కోసం ఇలా ప్రార్థించాడు.
‘ప్రభూ! ఈ ఔర్ధ్వ్వదైహిక కార్యాన్ని సంపూర్ణంగా సంపన్నం చేసే అధికారం ఎవరికి వుంటుంది? ఈ క్రియ ఎన్ని ప్రకారాలుగా వుంది?’ ‘ఓ ఖగేశా! మరణించిన వ్యక్తికి నీ వడిగిన కార్యాన్ని చేసే అధికారం క్రమంగా పుత్రులకు, పౌత్రులకు, అన్నదమ్ములకు, వారి పుత్రులకు, సపిండులకు, స్వజాతీయులకు వుంటుంది. మృతునికి పిండం పెట్టడానికి మాతృ పితృ వంశాలలో పురుషులెవరూ మిగలక పోతే స్త్రీలు ఈ కార్యాన్ని చెయ్యవచ్చు. తనవారిందరితో తెగతెంపులు చేసుకొని పోయిన వానికి ఈ కార్యాన్ని రాజు చేయాలి.
పూర్వ, మధ్యమ, ఉత్తర క్రియలని ఇది మూడు రకాలుగా వుంది. ఈ క్రియను ప్రతి సంవత్సరం ఏకోద్దిష్ట విధానంలో చేయాలి. (దీనిని ‘తద్దినం’ అంటారు). ఈ శ్రాద్ధ క్రియను చేస్తే ఎటువంటి సత్ఫలితాలుంటాయో విను.
బ్రహ్మ ఇంద్రుడు, రుద్రుడు, అశ్వినీ పుత్రులు, సూర్యుడు, అగ్ని, వస్తువులు, మరుద్గణాలు, విశ్వేదేవులు, పితృగణాలు, పక్షులు, మనుష్యులు, పశువులు, సరీసృపాలు, ఇతరేతర ప్రాణులు - వీటన్నిటినీ, వీరందరినీ శ్రద్ధా పూర్వకంగా చేసే శ్రాద్ధక్రియ ద్వారా, మనిషి, తనకు ప్రసన్నులనుగా చేసుకొనవచ్చును. ఈ తద్దినం వల్ల సంపూర్ణ జగత్తే సంతుష్టమవుతుంది. తమను సంతోషపెట్టిన శ్రాద్ధ కర్తను, ముఖ్యంగా పితృదేవతలు, పుత్ర, స్త్రీ, ధనాదికముల ద్వారా సంతోషపెడతారు.
ఎవరిమట్టుకు వారు తమ జీవిత కాలంలోనే తమకు తామే శ్రాద్ధం పెట్టుకొనే వెసులుబాటు కూడా వుంది. దీనిని జీవిత శ్రాద్ధమంటారు. స్నానం చేసి ఉపవాసముండి శ్రీ కృష్ణభగవానుని పైనే మనసు లగ్నం చేసి, అంటే ఆయన లీలలనే అలోచిస్తూ, ఏ మనిషైనా సరే, తనకు తానే ఈ క్రియను మొదలు పెట్టవచ్చును. ముందుగా ఏకాగ్రచిత్తంతో అన్నిటికీ కర్తా, భోక్తాయైన సర్వేశ్వరుడు విష్ణు దేవుని పూజించి తన పితృగణాల పేరిట తిలలనూ, దక్షిణతో బాటు మూడు జలధేనువులనూ (అనగా కృత్రిమ ధేనువులను) ఓం పితృభ్యఃస్వధా అంటూ కుల పురోహితునికి నివేదించాలి. ఆ సమయంలోనే ఓం అగ్నయే కవ్య వాహనాయ స్వధా నమః, ఓం సోమాయ త్వా పితృమతే స్వధానమః అనే మంత్రాలను చదవాలి. చదువుతూనే దక్షిణం వైపు తిరిగి ఇందాక నివేదించిన వాటిని దానమిచ్చి మూడవ ధేనువును దానమిస్తున్నపుడు యమాయాంగీరసే స్వధానమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు స్మరించాలి. విష్ణు భగవానుని పూజ (యజ్ఞం) జలధేను దానాల మధ్య కాలంలోనే బ్రాహ్మణుల నావాహన చేసి వారికి భోజనాలు పెట్టాలి.
మొదటి జలధేనువు నుత్తరదిశలోనూ, రెండవ దానిని దక్షిణంలోనూ పెట్టాలి. ఆ రెంటి మధ్యా, మూడవ జలధేనువు నుంచి ఆవాహనాది శ్రాద్ధ సంబంధింత కార్యాలను చేయాలి. అన్నింటికన్నా ముందు విశ్వేదేవుల ప్రతినిధి బ్రాహ్మణులను బాగా పూజించి ఇలా వారిని ఆవాహన చేయాలి:
వసుభ్యస్త్వా మహం విప్ర రుద్రేభ్య స్త్వామహంతతః ।
సూర్యేభ్య స్త్వా మహం విప్ర భోజయామీతి తాన్వదేత్ 8.17
తరువాతి ఆవాహనాదిక శేషకార్యాలను పిత్స శేషకార్యంలో చేసినట్లే చేయాలి. తరువాత వసువులనుద్దేశించి ఒక బ్రాహ్మణునికి మంచి ఆవును దానం చేయాలి. ఆగ్నేయంలో రుద్ర దేవునికీ దక్షిణ దిశలో సూర్య భగవానునికీ ప్రతినిథులుగా కూర్చో పెట్టబడిన బ్రాహ్మణులకూ చెరియొక గోవునూ దానమివ్వాలి. విశ్వేదేవుల నిమిత్తం తిలపూర్ణ పాత్రనివ్వాలి. బ్రాహ్మణుల కపుడు అక్షయోదక దానాన్నిస్తే వారు ‘ఓం స్వస్తి’ అనే ప్రతి వచనం ద్వారా ఈ శ్రాద్ధ కృత్య సంపూర్ణత సంపన్నం కావాలని దీవిస్తారు. అపుడు అష్టాక్షర మంత్రంతో విష్ణుభగవానుని స్మరిస్తూ దేవతలందరినీ (బ్రాహ్మణులను వినయపూర్వకంగా వీడ్కోల్పాలి.
తరువాత మనస్సును అదుపులో పెట్టుకొని తన కులదేవతనూ, పార్వతీదేవినీ, శివకేశవులనూ స్మరించుకోవాలి. తరువాత ఆ పక్షంలో వచ్చే చతుర్దశినాడు దగ్గరలో నున్న శ్రేష్ఠనదీ తీరానికి పోయి స్నానం చేసి వస్త్రాలనూ ఇనుప కడ్డీలనూ దానం చేయాలి. పిమ్మట దక్షిణం వైపు కూర్చొని ‘ఓం జీతంతే’ అనే మంత్రాన్ని జపిస్తూ అగ్నిని ప్రజ్వరిల్లజేయాలి. తరువాత యాభై కుశలతో ఒక బొమ్మను తనకు ప్రతీకగా (దీనినే బ్రాహ్మీప్రకృతి అంటారు) తయారు చేసి దానినగ్ని కాహుతి చేయాలి. తరువాత శ్మశానంలో చేయవలసిన హోమాన్ని ఇక్కడే చేసి పూర్ణాహుతి నిచ్చివేయాలి. నిరగ్ని భూమినీ, యమునీ, రుద్రునీ స్మరిస్తూ హవనం చేసి ప్రధానస్థానంలో యమరుద్రుల నావాహన చేయాలి. తదనంతరం ఆ అగ్నిలో పెసల తోడి చరు (అనగా హవిష్యాన్నము)నూ, తిలతండుల మిశ్రిత చరునూ వండాలి.
ఓం పృథివ్యై నమస్తుభ్యం... అనే మంత్రంతో మొదటి చరునీ ఓం యమా యనమశ్చ... అనే మంత్రంతో రెండవ చరునీ నివేదించాలి. ఓం నమశ్చాథ రుద్రాయ శ్మశాన పతయే నమః అనే మంత్రంతో రుద్రదేవునికి దేనినైనా నివేదించాలి. తరువాత శ్రాద్ధకర్త సప్తనామయుతుడైన ధర్మరాజుకి నిమ్నమంత్రాలతో ఏడుజలాంజలు లివ్వాలి.
ఓం యమాయ స్వధాత స్మైనమః ।
ఓం ధర్మరాజాయ స్వధా తస్మై నమః ।
ఓం మృత్యవే స్వధా తస్మై నమః ।
ఓం అంతకాయ స్వధా తస్మైనమః ।
ఓం వైవస్వతాయ స్వధా తస్మై నమః ।
ఓం కాలాయ స్వధా తస్మై నమః ।
ఓం సర్వప్రాణ హరాయ స్వధా తస్మై నమః ॥
తరువాత శ్రాద్ధకర్త పది పిండాలను గోత్రనామాలతో సహా దానం చేసి అర్ఘ్యమునూ పుష్పాలనూ వాటిపై వేయాలి. తరువాత వాటికి ధూప, దీప, బలి, గంధ, అక్షయ జల ప్రదానాలను గావించాలి. అలా పది పిండాలను దానమిచ్చాక (అయిదు నిముషాల పాటు) కనులు మూసుకొని విష్ణుభగవానుని సుందర, సుభగవదనాన్ని ధ్యానించాలి.
ఈ కృత్యాన్ని నెరవేర్చిన తరువాత ప్రతి మాసమూ, మాసిక శ్రాద్ధమునూ సపిండీకరణనూ చేస్తూనే వుండాలి. శక్తి, ఆరోగ్యం, ధనం, ఆయువు - ఈ నాలుగూ అస్థిరాలు. ఈ జ్ఞానాన్ని కలిగి వుండి శ్రాద్ధకర్మను చేయువాడు సర్వత్ర సుఖపడతాడు’ అని ఆగాడు విష్ణువు.
