2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

4  - ఆసన్నమృత్యు ప్రాయశ్చిత్తాలు -దశ విధ దానాలు - మృత్యు అనంతరకర్మలు – ఆరు పిండ దానాలు - దహన సంస్కారం ముందూవెనకా - అస్థిసంచయనం -అనంతరం గృహంలో కర్మలు - దుర్ మృత్యుగతి - నారాయణ బలి - పుత్తల దాహ విధి  - పంచక మృత్యుకృత్యాలు

గరుత్మంతా! మనిషి తనకు తెలిసిగానీ తెలియక గానీ చేసే పాపాల నుండి శుద్ధి నొందడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులు ముందుగానే పవిత్ర భస్మాది పది స్నానాలనూ చేసి శాస్త్రోక్త విధిననుసరించి కృచ్ఛ్రాది వ్రతాలనూ, వాటికి ప్రాతినిథ్యం వహించే గోదానాది క్రియలను ఏవి కుదురితే అవి చేస్తారు. కొంతమంది పూర్తి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేనివారు తమ గుర్వాజ్ఞ మేరకు అందులో సగాన్ని గాని పావును గానీ శ్రద్దగా చేసిననూ శుద్ధి కలుగుతుంది. ప్రాయశ్చిత్తం మాత్రం తప్పనిసరి. ఆ తరువాత దశ దానాలనిచ్చి పునీతులు కావచ్చు. ఇవి కూడా శక్తి కలిగినంత మేరకివ్వవచ్చు.

గోభూమి తిలహిరణ్యాజ్య వాసోధాన్య గుడాస్తథా ।

రజతం లవణంచైవ దానాని దశపై విదుః ॥ 4

యమద్వారంవైపు వెళ్లే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్తమాంసాలతో, చీము వంటి అసహ్యకర ద్రవ్యాలతో నిండి వుంటుంది. ఆ మార్గంలో నున్న వైతరణిని సులువుగా దాటాలంటే వైతరణి అను వర్గానికి చెందిన గోవునివ్వాలి. ఈ గోవు యొక్క అంగాలన్నీ పొదుగుతో సహా నల్లగా వుంటాయి.

నదీవైతరణీతర్తుం

దద్యాద్వైతరణీం చగాం ।

కృష్ణస్తనీ సకృష్ణాంగీ

సావై వైతరణీ స్మృతా ॥ 6

నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు - ఇవి తొలిదానికంటె మలి దానంగా అదే క్రమంలో పరమ పవిత్రమైనవి. వీటిని మహా దానాలంటారు. వీటినందుకొనుటకు ఉత్తమ ప్రకృతి గల విప్రులే అర్హులు.

తిలాలోహం హిరణ్యంచ కర్పాసం లవణం తథా ।

సప్తధాన్యం క్షితిర్గావా ఏకైకం పావనం స్మృతం ॥

ఏతాన్య ష్టౌ మహాదానాన్యుత్తమాయ ద్విజాతయే । 8

గొడుగు, చెప్పులు, బట్టలు, ఉంగరం, కమండలువు, ఆసనం, పాత్ర, తినుబడె పదార్థం – వీటి దానాన్ని అష్ట పద దానమంటారు.

ఛత్రోపానహ వస్త్రాణి ముద్రికా చ కమండలుః ।

ఆసనం భాజనం భోజ్యం పదం చాష్టవిధం స్మృతం ॥ 9

ఇవేకాక పాత్రలను వాటిలో నుంచు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా దానమీయ వచ్చును. గానీ అశ్వాలనూ రథాలనూ బ్రాహ్మణులకే ఇవ్వాలి.

ప్రాయశ్చిత్తం, దానం సర్వవిధాలా చేసినవానికి ఇక ఏ పాపమూ చేయకుండా శేష జీవితాన్ని లోకకల్యాణం కోసమే గడిపితే మోక్షమే.

ప్రాయశ్చిత్తం కృతం యేన దశదానాన్యపిక్షితౌ ॥ 1ఽ

దానం గోర్వైతరణ్యాశ్చ దానన్యష్టౌ తథాపి వా ।

తిలపాత్రం సర్పిః పాత్రం శయ్యాదానం తథైవ చ ॥ 13

పద దానం చ విధివన్నా సౌ నిరయ గర్భగః । 14

పండితులు ఏ ప్రాయశ్చిత్తంతోనూ పని లేకుండా స్వతంత్రంగా కూడా లవణ దానం చేస్తుంటారు. ఎందుకంటే అది విష్ణువు శరీరం నుండి పుట్టింది. ముఖ్యంగా మరణాసన్న వ్యక్తి చేత లవణదానం గాని లవణ రస దానంగాని (అతని లేదా ఆమె) చేతి మీదుగా చేయిస్తే వారికి స్వర్గద్వారాలు తెఱచుకుంటాయి. ఏ మనిషి ఎప్పుడే దానం చేసినా అది ఆ మనిషితో బాటే పరలోకానికి పోతుంది. అతని లేదా ఆమెకంటే ముందే పోయి యమధర్మరాజు వద్ద నిలబడుతుంది. ప్రాయశ్చిత్తం, దానం చేసే మేలు ఊహాతీతం.

ఓయి వైనతేయా! ఆవు పాలు అమృతమే! అందువల్ల పాలిచ్చే అవును దానం చేసే వారికీ అమృతత్త్వం ప్రాప్తిస్తుంది. తిలాదిక అష్టదానాన్ని చేసినవారికి గంధర్వలోక నివాసం కలుగుతుంది. యమలోక మార్గం అత్యధిక భీషణతాపయుక్తం. ఛత్ర దానం చేసినవారిని ఆ పుణ్యం అక్కడ రక్షిస్తుంది. చెప్పులను దానమిచ్చిన వాడొకవేళ అసిపత్రవనంలో పడినా వానికోసం అక్కడ గుఱ్ఱం సిద్ధంగా వుండి తనపై నెక్కించుకొని ఆ వనమును దాటిస్తుంది. ఇలాగే భోజన, అసన, జలపూర్ణ కమండలు దానాలు నరకంలో అక్కరకు రావచ్చును.

యమదూతలు క్రోధాగ్నులను వెలిగ్రక్కుతూ మహాభయంకరంగా వుంటారు. కొందరు నల్లగా కొందరు పచ్చగా వుంటారు. వారు కనబడగానే సగం ప్రాణాలు పోతాయి. అయితే, ఉదారంగా వస్త్ర, ఆభూషణాదులను విరివిగా దానం చేసినవారు ఏవో కొన్ని పాపాలు చేసిననూ యమదూతలు వారికి పెద్దగా కష్టాన్ని కలిగించరు.

తిలలతో నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసినవారి మనోవాణి కాయాలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఘృతపాత్రను దానం చేసినవారు దేహాంతంలో రుద్రలోకాన్ని చేరుకుంటారు. సర్వసాధనయుక్తమైన శయ్యను బ్రాహ్మణునికి దానం చేసినవారు స్వర్గలోకంలో అప్సరసలతో అమరావతి నగరంలో అరవై వేల సంవత్సరాల పాటు వివిధ సుఖాలనిచ్చు విమానాలలో విహరిస్తూ సుఖంగా నివసిస్తారు. తరువాత భూమిపై మహారాజుగా జన్మిస్తారు. చక్కని, నిర్దుష్టమూ, మిక్కిలి బలిష్టమూనగు గుఱ్ఱాన్ని బ్రాహ్మణునికి దానం చేసిన వారికి స్వర్గలోకప్రాప్తి వుంటుంది. ఆ గుఱ్ఱానికెన్ని రోమాలుంటాయో అన్నేళ్ళపాటు ఆ దాత స్వర్గంలో నివసిస్తాడు. నాలుగు గుఱ్ఱాలు పూన్చిన రథాన్ని మొత్తంగా బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి రాజసూయ యజ్ఞం చేసిన పుణ్యం దక్కుతుంది. బ్రాహ్మణునికి సర్వభోజన సామగ్రితో కూడిన ఇంటిని దానం చేసిన వాని వంశం ఎన్ని వేల యేళ్ళైనా నిలబడే వుంటుంది అదీ ఐశ్వర్యాది సుఖాలతో. మృత్యువు ఆసన్నమైనపుడు యథావిధిగా సన్యాసమును స్వీకరించిన వానికి పునర్జన్మవుండదు. మృత్యువాసన్నమైన వానిని వాని కుటుంబ సభ్యులేదైనా పవిత్ర తీర్థానికో పుణ్యక్షేత్రానికో తీసుకు వెళ్ళగలిగితే వాని ప్రాణమక్కడ పోతే వానికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ మార్గ మధ్యంలోనే అతడు (ఆమె) మరణించినా ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలో ఎన్ని చోట్ల ఆగుతారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది.

ఆసన్నమరణో మర్త్యశ్చే తీర్థం ప్రతినీయతే ।

తీర్థప్రాప్తౌ భవేన్ముక్తిర్ మ్రియత్ యది మార్గగః ॥ 37

పదే పదే క్రతు సమంభవేత్తస్య న సంశయః । 38

మృత్యువాసన్నమైనవాడు యథావిధిగా ఉపవాసం చేసినా మరుజన్మ వుండదు. ఇక మృత్యువుకీ దహనానికీ మధ్య మనుష్య కర్తవ్యాలను విను.

వ్యక్తి మరణించినట్లు తెలియగానే వాని (ఆమె) పుత్రులూ బంధువులూ ఆ మృత దేహానికి శుద్ధ జలధితో స్నానం చేయించి కొత్త బట్టని కట్టాలి. తరువాత దానికి చందనాది సుగంధిత పదార్థాలను పూయాలి. అనంతరం ఆ వ్యక్తి మృతి చెందిన చోటనే ఏకోద్దిష్ట శ్రాద్ధాన్ని పెట్టాలి. ఇందులో ఆసన, ప్రోక్షణ క్రియలనే చేయాలి గాని ఆవాహన, అర్చన, పాత్రాలంభన, అవగాహన క్రియలను చేయరాదు. పిండదానం తప్పని సరిగా చేసి అన్నదానానికి సంకల్పం చెప్పుకోవాలి. అక్షయ్యోదక దానాన్నివ్వాలి. స్వధావాచన, అశీర్వాద, తిలక క్రియలను చేయరాదు. చిక్కుడు గింజలతో నింపిన పాత్రను, ఇనుప వస్తువును బ్రాహ్మణునికి దానమివ్వాలి. పిండాన్ని అప్పుడు కదపాలి. ఆచ్ఛాదన, విసర్జన, స్వస్తి వాచన ఇప్పుడు చేయకూడదు. మరణస్థానం, ద్వారం, అరుగు, విశ్రామ స్థానం, కాష్ఠచయనం, అస్థిసంచయన స్థానం - ఈ ఆరూ పిండ దానానికి పనికివచ్చు స్థానాలు.

ప్రాణి మరణించిన చోట ఇచ్చే పిండాన్ని శవ పిండమంటారు. దీనివల్ల భూదేవి తృప్తినొందుతుంది. మిగిలిన స్థానాల్లో ఇలా:

·      ద్వారం - పాంథపిండం – వాస్తు దేవత తృప్తి

·      అరుగు – ఖేచర పిండం - భూతాలు, దేవగణాలు (ఆకాశ) తృప్తి

·      విశ్రామ స్థానం – భూత పిండం - పది దిక్కులు తృప్తి

·      కాష్ఠచయనం - సాధక పిండం – రుద్రుడు తృప్తి

·      అస్థి సంచయం – ప్రేత పిండం - ప్రేతాలు తృప్తి

 

శవయాత్రా సమయంలో పుత్రాది బంధువులు తిలలు, కుశలు, ఘృతం, ఇంధనం తీసుకెళుతూ ‘యమగాథ’లను గాని వేదంలోని యమసూక్తాన్ని గాని గానం చేస్తూ శ్మశానం వైపు కదలాలి.

అహరహర్నీయమానో గామక్షం పురుషం వృషం ।

వైవస్వతో నతృప్యేత సురయాత్వివ దుర్మతిః ॥ 53

ఇలాంటివే యమగాథలంటే

ఓం అపేతేతి... ఇత్యాదిగా యజుర్వేదం అ-35-లో నున్న మంత్రాలను యమసూక్తమంటారు. శవాన్ని తీసికెళుతూ మార్గంలో ఇందాక చెప్పినలాటివే రెండు శ్రాద్ధాలు పెట్టాలి. శ్మశాన భూమిని చేరగానే శవాన్ని మెల్లగా నేలపై దించుతున్నప్పుడే దాని తల దక్షిణం వైపుండేలా చూసి దించాలి. ఆ తరువాత చితాభూమిలో మరొక మారు ఇందాకటి శ్రాద్ధాన్నే పెట్టాలి. శవదహనానికి మృతుల బంధువులే స్వయంగా గడ్డి, కఱ్ఱ, నువ్వులు, నెయ్యి పట్టుకొని వెళ్ళాలి. లోపల చేయు అన్ని పనులనూ దక్షిణం వైపే తిరిగి, జందెమునపసవ్యం చేసుకొని చేయాలి. శాస్త్రసమ్మతంగా అక్కడొక వేదిని నిర్మించి ప్రేతవస్త్రాన్ని రెండు భాగాలుగా, చించి సగాన్ని దానిపై కప్పి రెండవ సగాన్ని శ్మశాన జీవుల కోసం అక్కడే భూమిపై వదిలేయాలి. తరువాత శవం చేతిలో పిండదానం చేసి మొత్తం శవానికి నేతిని పూయాలి.

పిండదాన విధిని విను. మృత స్థానాదులో పెట్టబడిన అయిదు పిండాల వల్లా శవానికి అగ్ని దాహయోగ్యత లభిస్తుంది. ఇది చేయకపోతే ఆ మృతులను రాక్షసులు తినేస్తారు. కాబట్టి రుద్ర భూమిలోనే స్వచ్ఛమైన భూమిలో వేదిని నిల్పి దానిని మార్జన, ఉపలేపనాల ద్వారా శుద్ధి చేసి అప్పుడందులో యథావిధిగా అగ్నిని స్థాపించాలి. పుష్ప, అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి (పాపాత్ముని ఇంటినుండి అగ్నిని తేరాదు. ఈ క్రింది మంత్రంతో ఆయనను ప్రార్థించాలి.

త్వం భూత కృజ్జగద్యోనిస్త్వం లోకపరిపాలకః ॥ 64

ఉపసంహార తస్మాత్త్వమేనం స్వర్గం నయామృతం । 65

ఇలా క్రవ్యాది దేవుని శాస్త్రోక్తంగా పూజించి శవాన్ని చితిలో కాల్చడం మొదలు పెట్టాలి. శవంలో సగభాగం అగ్నికి ఆహుతి అయినాక కర్మ చేయువాడు ఈ క్రింది మంత్రాన్నుచ్చరించాలి:

అస్మాత్త్వమధిజాతోఽసి త్వదయం జాయతాం పునః

అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ...*

గమనిక ఈ శ్లోకార్థంలో తొలి పంక్తి గరుడపురాణం ధర్మకాండలో వుంది. మలి పంక్తి పూర్తిగా యజుర్వేదంలో వుంది.

అంటూ తిల, నేయిలతో ఒక ఆహుతిని శవంపై నున్న అగ్నికి ఇవ్వాలి. తరువాత మాత్రమే రోదించాలి. అంతవఱకు రోదన ధ్వనులను అదుముకోవాలి.

దహనానంతరం అస్థి సంచయన క్రియ వుంటుంది. దాహశాంతికై ప్రేత - పిండ ప్రదానం కూడా వుంటుంది. తరువాత అక్కడికి వెళ్ళిన వారంతా చితికి ప్రదక్షిణ చేసి సూక్తం చదువుతూ జలాశయానికి వెళ్ళాలి. అక్కడ తమ వస్త్రాలను జాడించి, పిడిచి, తమ స్నానానంతరం వాటినే మరల కట్టుకొని చనిపోయిన వ్యక్తిని ధ్యానించి జల దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ వ్యక్తి తేజో రూపంలో (ఇక్కడ ప్రేత రూపమే) వచ్చి ఆజ్ఞ ఇవ్వడం జరిగిందని భావించుకొని మరల జలాశయానికి మౌనంగా ఏకవస్త్రులై, జందెమునపసవ్యం చేసి, పిలక ముడిని విప్పి స్నానం చేయాలి. బంధువులంతా దక్షిణం వైపు తిరిగి ‘అపనః శోపచదధం అనే యజుర్వేద (35/6) మంత్రాన్నుచ్చరిస్తూ ఈ స్నానాన్ని చేయాలి. పిలకను ముడి వేసుకొని, సామాన్య కుశను దక్షిణాగ్రంగా పెట్టి చేత బట్టుకొని దోసిట్లో తిలయుక్త జలాన్ని పితృతీర్దానికి దక్షిణ దిశలో నొక మారు, మూడు లేదా పదిమార్లు నేలపైగాని రాతి పైగాని దోసిళ్ళతో పోయాలి. ఈ తిలాంజలులిస్తున్నపుడిలా అనాలి:

అద్యోహాముక గోత్రాముక ప్రేత చితారాహ జనిత తాపతృషోపశమాయ ।

ఏష తిలకుశతో యాంజలిర్మదత్త స్తవోపతిష్ఠతాం ॥

బయటికి వచ్చి పొడిబట్టలు కట్టుకొని స్నానం చేసిన వస్త్రాన్ని తడిపి పిడిచి పవిత్రమైన నేలపై ఆరవేయాలి. తాము కూడా పవిత్ర భూమిపై కూర్చోవాలి. పోయినవారిని తలచుకొనవచ్చును గాని కంట తడిపెట్టరాదు. ఇప్పుడు ఏడ్చినా ముక్కు చీదినా అవి మృతి చెందిన వారి నోటిలోకి పోతాయి. వారిలో, అనగా ఆ శ్మశానానికి వచ్చినవారిలో కెల్ల వృద్ధుడుగాని, పురాణజ్ఞుడుగాని మిగతావారికి ఇలా చెప్పి ఓదార్చాలి - ‘అసలీ మానవశరీరమే అంత. అరటిచెట్టులా ఎంత ఏపుగా పెరిగినా కూలిపోక తప్పదు. బుడగలాగా ఒక క్షణం వుంటుంది, మరుక్షణమే చితికిపోతుంది. ఇందులో శాశ్వతత్వాన్నీ, జీవసారాన్నీ వెదకడం, దొరికాయని భ్రమించడం మహామూర్ఖులు చేసే పని. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే ఈ పంచతత్త్వాలచే నిర్మింపబడిన ఈ శరీరం తన కర్మానుసారం జీవించి మరల అవే తత్త్వాలలో కలసిపోతుంది. దానికోసం కన్నీరెందుకు కార్చాలి? రోదన లేల ధ్వనించాలి? నేల, సముద్రం, దేవలోకాలవంటి మహా విషయాలే మిగలవు. వాటి కాలం రాగానే అవీ భస్మమైపోతాయి. అలాటిది నీటి మీది నురగలాంటి మనమనగా ఎంత, మన బతుకనగా ఎంత?’ ఈ మాటలు విని తాత్కాలికంగా ఊరట చెంది అంతా ఇళ్ళకు మళ్ళాలి. తమ ఇంటిద్వారం వద్ద వేపాకులను నమలి ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్లావాలు, దూర్వా, పగడము, ఎద్దు మున్నగు మాంగలిక వస్తువులను చేతితోనూ, జాతిని కాలితోనూ స్పృశించి మెల్లగా ఇంటిలోనికి వెళ్ళాలి.

విద్వాంసులైన వారు తమ అగ్నిహోత్రులైన పరిజనులు మరణిస్తే వారి దహన సంస్కారాన్ని శ్రౌతాగ్నితోనే యథావిధిగా చేయాలి. రెండేళ్ళ లోపు వయసున్న పిల్లలు మృతి చెందితే, వారిని శ్మశాన భూమిలోనే గొయ్యి తవ్వి పాతిపెట్టాలి. ఇంకేమి వినగోరెదవు వైనతేయా?”

‘హే జగదాధార! అసహజ, ఆకస్మిక మృతుల విషయంలో అపరకర్మనెలా చేయాలి? ఎముకలే దొరకని వారికి సంస్కారమెలా కుదురుతుంది?

“నారాయణ బలి అను పేరు గల సంస్కారం ద్వారా కుదురుతుంది. ఇదొక శుద్దికర్మ. గరుడా! దీనిని చేస్తే అప్పుడు ఆ ప్రేతానికి అపరకర్మలకు అర్హత కలుగుతుంది. నారాయణ బలి అనెడి శుద్ధీకరణను తీర్థాలలో చేయాలి. బ్రాహ్మణుల ద్వారా శ్రీ కృష్ణదేవుని సమక్షంలో ఇది జరగాలి. పురాణ, వేదజ్ఞాతయైన బ్రాహ్మణుని చేత తొలి తర్పణాన్నిప్పించాలి. అన్ని ప్రకారాల ఔషధాలనూ, అక్షతలనూ నీటిలో కలిపి పురుష సూక్తాన్నిగాని వైష్ణవ సూక్తాన్ని గాని ఉచ్ఛరిస్తూ విష్ణువు నుద్దేశించి ఆ నీటితో తర్పణాలివ్వాలి. తరువాత దక్షిణంవైపు తిరిగి విష్ణువునీ ప్రేతాన్నీ ఇలా స్మరించాలి :

అనాదినిధనో దేవః శంఖ చక్రగదాధరః ॥ 118

అక్షయః పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదోభవ । 119

వారసులు మనస్సు నదుపులో వుంచుకొని శుచిష్మంతులై అక్కడే భక్తి పూర్వకంగా పదకొండు శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత మిక్కిలి జాగరూకతతో రెండు రకాల దానాలివ్వాలి. మొదటి రకం నీరు, అక్షతలు, యవలు, గోధుములు, కంకణము కాగా రెండవది శుభకరమైన హవిష్యాన్నం, అందముగా తయారు చేయించబడిన బంగారు ఉంగరం, గొడుగు, పాగా. తరువాత పాలు, తేనెలను కలిపిన అన్ని రకాల అన్నాలనూ పెట్టాలి. మంచివారై, అర్హత గలిగినవారికి వస్త్ర, పాదుకాది ఎనిమిది రకాల పద దానాలను చేయాలి. పిండదానం చేశాకనే మంత్రోచ్చార సహితంగా గంధ, పుష్ప, అక్షతాదులతో బ్రాహ్మణులను పూజించి వారికి ఈ దానాలనివ్వాలి. శంఖం, తామ్రపత్రాలతో వేరు వేరుగా తర్పణాలివ్వాలి. తరువాత మోకాళ్ళపై నిలబడి ధ్యాన - ధారణ సంయుక్తంగా ఉద్దేశించబడిన దేవతలకు వేరువేరుగా అర్ఘ్య ప్రదానం చేయాలి. పంచరత్నయుక్తాలైన అయిదు కుండలలో బ్రహ్మ విష్ణు, రుద్ర, యమ, ప్రేత - ఈ అయిదు దైవీశక్తులను కుండ కొకటిగా స్థాపించి వుంచాలి. వీటినే కాక వస్త్రాన్నీ, జందెమునూ, పెసలనూ, పదదానాన్నీ వేర్వేరుగా స్థాపించాలి. బ్రహ్మాది అయిదుగురు దేవతలకు శ్రాద్ధ పూజలను యధావిధిగా చేసి, శంఖం లేదా రాగిపాత్ర లేదా మట్టికుండలో అన్ని ఓషధులతో యుక్తమైన తిలోదకాన్ని తీసుకొని ప్రపిండంపై జలధారలనివ్వాలి. తిలలు నింపిన తామ్రపాత్రను దక్షిణతో బంగారంతో పదదానంతో ముఖ్య బ్రాహ్మణులకిచ్చి వేయాలి. యముని కొఱకై దక్షిణాసహిత తిల, లోహదానాన్ని వేరొక బ్రాహ్మణునికివ్వాలి. విష్ణుదేవునుద్దేశించి ఈ విధంగా, యథాశక్తి, విధిపూర్వకంగా దానమివ్వడం వల్ల బలి ఇవ్వడం వల్ల మృతవ్యక్తి స్వర్గానికి చేరుకోవచ్చును.

తరువాత పరమాత్మ గరుడుని ప్రార్థనపై కృచ్ఛ్ర, తప్త కృచ్ఛ్ర, సాంతపనములను ప్రాయశ్చిత్త వ్రత లక్షణాలను ఇలా ఉపదేశించాడు :

త్ర్యహంపాత్రస్ త్ర్యహం సాయం

త్ర్యహ మద్యాదయా చితం ।

ఉపవాసస్ త్ర్య హం చైవ

ఏషకృచ్ఛ్ర ఉదాహృతః ॥ 163

మూడు రోజులు ప్రాతఃకాలంలోనూ, మూడు రోజులు సాయంకాలాల్లోనూ, మూడు రోజులు అయాచిత హవిష్యానాన్నీ మాత్రమే తిని, మూడు రోజులు పూర్తిగా ఉపవాసము క్రమంగా ఏ వ్రతం చేయబడుతుందో దానిని కృచ్ఛ్రవ్రతమంటారు.

తప్త క్షీరఘృతాంబూనా మేకైకం ప్రత్యహం పిబేత్ ।

ఏకరాత్రో పవాసశ్చ తప్తకృచ్ఛ్ర ఉదాహృతః ॥ 164

క్రమంగా ఒకరోజు వేడిపాలు, మరునాడు వేడి నేయి, మూడవరోజు వేడి నీరు మాత్రమే స్వీకరించి నాలుగవ రోజు రాత్రంతా ఉపవాసం చేస్తే అది తప్త కృచ్ఛ్రవ్రతమవుతుంది.

గోమూత్రం గోమయం క్షీరం దధిసర్పిః కుశోదకం ।

జగ్ధ్వాపరేఽ హ్న్యుపవసే త్కృచ్ఛ్రం సాంతపనం చరన్ ॥ 165

గోమూత్ర, గోమయ, గోదధి, గోదుగ్ధ, కుశోదకాలను క్రమంగా రోజుకొకటిగా అది మాత్రమే స్వీకరించి ఉండిపోయి ఆరవ రోజు నుండి కృచ్ఛ్రవ్రతాన్ని చేయడాన్ని సాంతపనవ్రతమంటారు.

ధనిష్ఠా పంచకాలలో మృతి చెందినవారికి ఎలా దహన సంస్కారం చేయాలో చెప్తాను విను. ధనిష్ట నుండి రేవతి దాకా గల అయిదు నక్షత్రాల కాలాన్ని పంచక కాలమంటారు. ఇది దోషపూర్ణమైన, అశుభకాలంగా భావింపబడుతుంది. ఈ కాలంలో మరణించినవారిని అలాగే వుంచేసి ఈ కాలం దాటిన తరువాతనే దహనం చేయాలి. మృతుల సద్గతికై శిల, గో, సువర్ణ, ఘృత దానాలు చేయాలి. బ్రాహ్మణులకు అదనంగా భోజనాలను పెట్టి వస్త్రపాదుకా, ఛత్ర, స్వర్ణముద్రలను దానం చేయాలి. దక్షిణలను కూడా ఇవ్వాలి. వారు మనఃపూర్వకంగా కర్మకాండను చేయిస్తే ఈ చెడు కాలంలో పోయిన వారి పాపాలు నశించి ఉత్తమ గతులు లభించే అవకాశముంటుంది.