2 - గరుడ పురాణము - ప్రేత కాండము
10 - శ్రాద్ధాన్నమును పితరులకు చేర్చుట - సీతాదేవి ప్రసక్తి - మృత్యువనంతరం మరో దేహం - సత్కర్మ మహిమ - పిండదానంతో శరీర నిర్మాణం
‘హే ప్రభో! సపిండీకరణ, వార్షిక శ్రాద్ధాల తరువాత మృతవ్యక్తికి తన స్వకర్మాను సారం దేవత్వమో, మనుష్యత్వమో ఇతరేరతత్వమో ప్రాప్తిస్తుంది కదా, ఆహారపు అలవాట్లు అందరివీ ఒకలాగుండవు కదా మరి బ్రాహ్మణ భోజనాల వల్ల గాని శ్రాద్ధ హోమాల వల్లగాని అందరూ తృప్తిపడడమెలా సాధ్యం? ప్రేత రూపంలో నున్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారినెలా కడుపు నింపి అనందింప జేయగలదు? శ్రాద్ధాలను అమావాస్యనాడే పెట్టాలంటారు నిజమేనా? దయచేసి నా యీ విషయక అజ్ఞానాన్ని దూరం చేయండి’ అని విష్ణుదేవుని ప్రార్థించాడు వినతాసుతుడు.
‘గరుత్మంతా! మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్దాన్నం (ఇక్కడ మనం పెట్టే అన్నం) అమృతంగా మారి వాని చేతికందుతుంది. అదే అన్నం గంధర్వయోనిలో పడ్డవానికీ భోగరూపంలోనూ పశుయోనిలో పడినవానికీ గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ, పక్షికి ఫలంగానూ, రాక్షసునికి మాంసం గానూ, ప్రేతానికి రక్తంగానూ, మనుష్యునికి అన్న పానాదులుగాను అందుతుంది’ అని చెప్పాడు విష్ణువు ఇలా :
దేవోయదపి జాతోఽయం
మనుష్య కర్మ యోగతః ॥
తస్యాన్నమమృతం భూత్వా దేవత్యేఽప్యనుయాతిచ ।
గాంధర్వే భోగరూపేణ పశుత్వే చ తృణం భవేత్ ॥
శ్రాద్ధం వాయు రూపేణ నాగత్వేఽప్యనుగఛ్ఛతి ।
ఫలం భవతి పక్షిత్వే రాక్షసేషు తథామిషం ॥
దానవత్వే తథా మాంసం ప్రేతత్వే రుధిరంతథా ।
మనుష్యత్వేఽన్న పానాది బాల్యే భోగరసోభవేత్ ॥ 10.7
‘పరంధామా! ఈ లోకంలో (అంటే మృత్యు లోకమైన భూలోకమనే ఉద్దేశ్యం) మనుష్యుల ద్వారా ఈయబడిన హవ్య - కవ్య పదార్థాలుపై లోకాలకెలా వెళతాయి? వాటిని పొందేదెవరు? ఈ శ్రాద్ధాలు మృతుల కడుపు నింపడమంటే, ఆగిపోయిన దీపంలో తైలం పోస్తే వెలుగులు విరజిమ్ముతాయన్నట్లుంది. చనిపోయినవాడు, పోవలసిన చోటికి, వాని కర్మఫలాన్ని బట్టిపోనే పోతాడు కదా, వాని పుత్రుని ద్వారా ఈయబడ్డ పుణ్యకార్యఫలాన్నెలా అందుకుంటాడు?’ అడిగాడు గరుడుడు.
చెరగని చిరునవ్వు ద్వారా వాత్సల్యాన్ని కురిపిస్తూ ఇలా అన్నాడు భగవానుడు, ‘వత్సా! ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే. కాని దానికన్న గొప్ప ప్రమాణం, బలమైనది శ్రుతి వాక్యం. దాని నుండి వచ్చిన జ్ఞానం అమృతాదులతో సమానం. శ్రాద్ధకర్మలో ఉచ్చరింపడిన గోత్రనామాలే ఆయా పితరాదులకు హవ్య - కవ్యాలనందించే ప్రాపకాలు. ఓ సుపర్ణా! ఈ మంత్రాలు అచేతనాలని అనుకోకు. వాటికున్న చైతన్యం మరి వేటికీ ఉండదు. సంశయము వలదు. అగ్నిష్వాత్తాది పితృగణాలు ఆ పితరుల రాజ పదవులలో నియమింప బడతారు. వారి వద్దకు ఈ పితృపాత్రలలో, విధివత్తుగా ప్రతిపాదింపబడిన అన్నాది అభీష్ట పదార్థాలు చేరతాయి. ఆ జీవులెక్కడుంటే అక్కడికి ఈ అగ్నిష్వాత్తాది పితృదేవతలే అన్నాదులను తీసుకొని వెళతారు. గోత్ర నామాలూ, మంత్రాలే ఇక్కడి శక్తిప్రదాయకాలు. ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగిపోతుంటుంది. ఎక్కడ మృతులకు నామ గోత్ర మంత్ర సహితంగా శ్రాద్ధం పెట్టబడుతున్నా ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడ ఏ యోనిలో వున్నా ఈ మంత్రం చదవగానే ఆ జీవికి కడుపు నిండి, తృప్తి కలుగుతుంది. సంస్కారం చేస్తున్న వ్యక్తి కుశాచ్చాదీతమైన పృథ్విపై, దంజెమును కుడి భుజంపై పెట్టుకొని, మూడు పిండములను పెట్టి మంత్రం ద్వారా తన పితరులను తృప్తులను చేయగలడు.
‘ఇక్కడ’ ఇతడు అన్నమునే పెట్టవచ్చు కానీ మంత్ర బలం వల్ల ‘అక్కడ’ ఏ యోనిలో నున్న పితరునికి ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది. ఆవులన్నీ ఒకచోటే వున్నా దూడ తన తల్లిని పోల్చుకొని దాని దగ్గరకే పరుగెత్తినట్లు జీవి ఏ యోనిలో వున్నా, ఆ పితరుల నిమిత్తమై బ్రాహ్మణులచే చేయబడిన శ్రాద్ధాన్నం గురి తప్పకుండా ఆ పితరులనే చేరుతుంది.
యదాహారా భవం త్యేతే పితరోయత్ర యోనిషు ।
తాసు తాసు తదాహారః శ్రాద్ధాన్నేనోపతిష్ఠతి ॥
యథా గోషుప్రనష్టాసు వత్సో విందతి మాతరం ।
తథాన్నం నయతే విప్రో జంతుర్యత్రా వతిష్ఠతే ॥ 10.ఽ0
పితృగణాలు విశ్వేదేవులతో కలసి శ్రాదాన్నమును గ్రహిస్తాయి. వసు, రుద్ర, దేవత, పితర, విశ్వేదేవులీ కర్మకి ప్రసన్నులైతే పితృదేవతలు ప్రసన్నులవుతారు.
ఆత్మానం గుర్విణీ గర్భమపి ప్రీణాతి వై యథా ।
దోహదేన తథా దేవాః శ్రాద్ధైః స్వాంచ పితౄన్ నృణాం ॥ 10.ఽ3
మంచి కుటుంబాల నుండి వచ్చిన పితరులు ‘శ్రాద్ధ సమయం వస్తోంది’ అని తెలుసుకో గానే ప్రసన్నులౌతారు. తమలో తాము చర్చించుకొని వాయు మనో వేగాలతో శ్రాద్ధకర్మ జరిగే చోటికి చేరుకొని ఆకాశంలోనే కూర్చుని బ్రాహ్మణుడితో బాటే భోజనం చేయగలరు. (ఇది అంతరిక్షగాములైన పితరులకే సాధ్యం). వారు వాయురూపంలో వచ్చి భోజనం చేసి పరమగతిని పొందుతారు. కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి తమ లోకాలకు వెళతారు:
నియంత్రితాస్తు యే విప్రాః శ్రాద్ధ పూర్వదినేఖగ ।
ప్రవిశ్య పితరస్తేషు భుక్త్వాయాంతి స్వమాలయం ॥ 10.ఽ6
కారణవశాన శ్రాద్ధకర్త శ్రాద్ధకర్మలో ఒక్క బ్రాహ్మణునే కూర్చుండబెడితే, ఆయన ఉదరభాగంలో శ్రాద్ధకర్త తండ్రీ, దక్షిణం వైపు తాతా, వెనుకభాగంలో పిండభక్షక పితరులూ వుంటారు. శ్రాద్ధకాలంలో యమధర్మరాజు తన వద్దనున్న ప్రేతాలనూ, పితరులనూ వదిలేస్తాడు. నరకలోకంలో శిక్షను అనుభవిస్తున్నవారు ఆకలి, దప్పులతో అలమటిస్తూ తమ పుత్రపౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే అకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. శ్రాద్ధకర్తకు తన వారెక్కడున్నారో తెలియదు కాబట్టి అందరూ అందరికీ మధుమిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు’
‘స్వామీ! ఆ లోకం నుండి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా?’
‘ఉన్నారు పక్షిరాజా! సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే.
శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో నొకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్ళాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధకర్మను చేయ సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో బాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు. కుతుప ముహూర్తం (రోజులో ఎనిమిదవది) వచ్చింది. శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగానే ఆమె ‘తద్దినం’ బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టుచాటున తీగల మధ్య నిలబడిపోయింది.
‘సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటీ? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గు పడిందేమో. సరిలే’ అనుకుంటూ రాముడే బ్రాహ్మణుల చేత భోజనాలను చేయించి వారు సెలవు గైకొని వెడలిపోయిన తరువాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వు చాటు ప్రశ్ననర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది. ‘అర్యపుత్రా! నేనిక్కడొక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను. ఆయన నిండకొలువులో నున్నట్లే సర్వాలంకార భూషితులై, దరహాస భాసుర వదనారవిందులై నాకు దర్శనమిచ్చారు. వారితోబాటు మీ పితామహ ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజుగారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టు చాటుకి వెళ్ళిపోయాను. ఆ మహారాజుగారికి, ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతిసామాన్యాహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణుని ఎదుటకెట్లు పోగలను? అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను.’
విష్ణు వింకా ఇలా వినిపించసాగాడు. ‘గరుడా! శ్రీరాముడాశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శనభాగ్యం తన జీవన సహచరికైనా దక్కినందుకు సంతోషించాడు. ఇక శ్రాద్ధ మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను విను. అమావాస్య దినాల్లో పితృగణాలు తమ వారింటి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి వుండి శ్రాద్ధాల నభిలషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారలాగే వుంటారు. సూర్యుడస్తమించినా శ్రాద్ధ భోజనం లభించకపోతే నిరాశాపూర్తి నిశ్వాసాలను బరువుగా వెలారుస్తూ వెడలిపోతారుగాని తమ స్వజనాలను నిందింపరు, దూషించరు, శపించరు. అయినా వారి దీవెనలు లభించి, మనిషికి ఇహపరాలలో పరమసుఖం కావాలంటే ఏదో తద్దినం ఏడాదికొకమారు ముక్తసరిగా పెట్టేసి వూరుకోకుండా ప్రతి అమావాస్య నాడూ పితరులను ఉద్దేశించి శ్రాద్ధం పెట్టాలి. వారి ఆకలి దప్పులను తీర్చాలి. శాస్త్రం చెప్పిన విధంగా, పితృజనులకు, వారి పుత్రులు, బంధుబాంధవులూ కూడా శ్రాద్ధకర్మలను సాంగోపాంగంగా నిర్వర్తించి, గయా తీర్థానికొక మారైనా పోయి పిండప్రదానము చేస్తే పితరులతో బాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానికి అధికారులవుతారు. ‘ఇక్కడ’ గానీ అక్కడ గానీ వారికి ఆకలిదప్పులు తీరకపోవడం వుండదు. విద్వాంసులెన్నడూ ఈ శ్రాద్దాలను విస్మరించరాదు. వారూ చేయాలి ఇతరుల చేతా చేయించాలి. సమయానుసారం శ్రాద్ధకర్మలు జరిగే ఇంటిలోకి ఏ దుఃఖమూ, అశాంతీ ప్రవేశింపజాలవు. పితరులను పూజించటం వల్ల, సంతృప్తి పఱచుట వల్ల మనుష్యులకు ఆయు, పుత్ర, యశ, స్వర, కీర్తి, పుష్టి, బల, శ్రీ, పశు, సుఖ, ధన, ధాన్యాలన్నీ లభిస్తాయి. దేవకార్యానికన్నా పితృకార్యానికే మహత్వమెక్కువ. దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి.
కుర్వీత సమయే శ్రాద్ధం కులేకశ్చిన్న సీదతి ।
ఆయుః పుత్రాన్ యశః స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియం ॥
పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్ను యాత్ పితృపూజనాత్ ।
దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే ॥
దేవతాభ్యః పితౄణాం హి పూర్వమాప్యాయనం శుభం । 10.59
తమ తమ పితృగణాలనూ, దేవగణలనూ, బ్రాహ్మణులనూ, అగ్నినీ పూజించేవారు నన్ను పూజిస్తున్నట్లే. వీటన్నిటిలో నేను పూజలందుకుంటాను. శ్రాద్ధాల ద్వారా పిపీలకం నుండి బ్రహ్మదాకా అన్నిటినీ అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు.
గరుడా! ఈ శ్రాద్ధకర్మ ఎంతమందినెలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే అశ్చర్యమనిపిస్తుంది. మనుష్యుల ద్వారా పెట్టబడిన శ్రాద్ధంలో నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల పిశాచ యోనిలో నున్న పితరుల అకలి తీరుతుంది. శ్రాద్ధస్నానంలో తడిసిన వస్త్రాల నుండి నేలకి జారిన నీటి బిందువులతో వృక్షయోనిలో పడివున్న పితరుల కడుపు నిండుతుంది. ఆ కార్య వేళ నేలపై బడిన గంధ జలాలు దేవత్వ యోని ప్రాప్తినొందిన పితరులను సుఖపెడతాయి. శ్రాద్ధానంతరం బ్రాహ్మణులు చేతులు కడుగుకున్నపుడు నేల వ్రాలిన జలాన్నాలతో కుల బహిష్కృతులై శ్రాద్ధకర్మకు గాని ఏ సంస్కారానికి గాని నోచుకొనక అలమటించు పితరులకు క్షుద్బాధ తరుగుతుంది.
ఈ లోకంలో శ్రాద్ధ నిమిత్తం ఇతరులకీయబడిన అన్నం, ధనం, ఇతరం ఏమైనా సరే, పితరులకి చేరుతుంది. ఆడంబరంతో పని లేదు. సామాన్యమైన ఆకు కూరలు, కూరగాయలు - మున్నగు వాటితో, యథాశక్తి, ఎవరు శ్రాద్ధం పెట్టినా వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. ‘శ్రద్ధ’ నుండే ‘శ్రాద్ధం’ వచ్చింది కదా!
మృత్యువు తరువాత ప్రాణికి మరొక శరీరం రావడానికెంత కాలం పడుతుందో తెలుసుకొనగోరావు కదా! ఇది అంతమందికీ ఒకేలాగుండదు. ధూమరహితమైన దీపం లాగా మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ ఆ మనిషి పోగానే వాయవీయ శరీరాన్ని ధరిస్తారు. ఒక మెట్టు మీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవకాలు పెట్టాక మొదటి మెట్టుని వదిలేసినట్లు శరీరి పూర్వ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్నశ్రయిస్తాడు. ఆ మధ్య కాలంలో అత్మ గాలిలో వుంటుంది కాబట్టి దానినే వాయవీయ శరీరధారణ మంటారు. ఒక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలై పోగానే జీవి ఆ శరీరాన్ని వదిలేస్తాడు. ఆ తరువాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా వదిలెయ్యవలసినదే. అనగా ఏ జీవికీ ఏ శరీరమూ శాశ్వతం కాదు. అమ్మ కడుపులో పడిన జీవి అమె నుండి అన్నాదికములను గ్రహించి బలపడి దానిని వదలి ఒక శరీరాన్ని ధరించి బయటికి వచ్చినపుడు గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే, ఈ శరీరం బలహీనమైనప్పుడు దీనినీ త్యజించి వేస్తాడు. రెండు శరీరాల మధ్య వుండే శరీరాన్ని ఆతివాహిక వాయవీయ శరీరమని విద్వాంసులు వ్యవహరిస్తారు. భూతప్రేతాది శరీరాలు, మనిషి పిండజ శరీరం స్థాయి ఒకటే.
పుత్రాదుల ద్వారా దశగాత్ర పిండదానాలీయబడిన వారి పిండజ శరీరం వాయవీయ శరీరంతో ఏకాకారమై పోతుంది. పిండజశరీరము కలవకపోతే వాయజ శరీరం కష్టాల పాలవుతుంది. (భగవద్గీత భావమే - అనగా శరీరాన్ని వస్త్రంతో పోల్చుట, ఆత్మ నిప్పులో కాలదనుట, నీటిలో తడవదనుట - గరుడపురాణంలో కూడా ఇలా చెప్పబడింది!)
దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతర ప్రాప్తిః పక్షీంద్రేత్యవధారయ ॥
వాసాంసి జీర్ణాని యథావిహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా -
న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥
నైనంచిందంతి శస్త్రాణి నైనందహతి పావకః ।
న చైనం క్లేదయం త్యాయన శోషయతి మారుతః ॥ 10.85
ఇక ఆలస్యంగా శరీరధారణ చేసే జీవాల సంగతి చూడు. కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి సమయం పడుతుంది. మృతి చెందగనే వారు తమ కర్మల వల్ల నరకానికి వెళతారు. చిత్రగుప్తుని మాట మేరకు వారి కాలం అక్కడ గడుస్తుంది. అక్కడి యాతనలను తమ కర్మం కొద్దీ అనుభవించిన తరువాత పశు - పక్షీయోనులలో వారు పుడతారు. శరీరం మీద మోహం మానవులకే ఎక్కువగా వుంటుంది. శుభా శుభకర్మలను ఇతర లోకాలలో భోగించాక అది పోతుంది’.
‘ఓ దేవాధిదేవా! పాపిష్టి పనులను మిక్కిలిగా చేశాక కూడా కొందరు మీ సన్నిధానాన్ని పొందారని విన్నాను. అదెలా సాధ్యం? మనిషికి మరల దుఃఖ సంసర్గం వుండకుండాలంటే ఏం చెయ్యాలో ఆదేశించండి.’
‘పక్షిరాజా! మనిషి తన కర్మలను తాను చేస్తూనే సిద్ధిని పొందగలడు. సిద్ధి పొందిన వాని పాపాలన్నీ శుద్ధి అయిపోతాయి.
స్వేసే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః ।
స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తృచ్ఛృణు ॥ 10.9ఽ
గగుడా! పాపాలను సత్కర్మలచే దగ్ధం చేసుకొని, వాసుదేవ నిరంతర చింతనచే విశుద్ధమైన బుద్ధిని పొందినవారై, ధైర్యంగా నియమాలను పెట్టుకొని స్థిరంగా వాటిని పాటించి, శబ్దాది విషయాలను పరిత్యజించి, రాగద్వేషాలను పూర్తిగా వదులుకొని, దొరికిన దానినే విరక్తభావంతో భుజిస్తూ మనస్సునీ మాటనీ శరీరాన్నీ సంయమితం చేసుకొని, వైరాగ్యధారణతో నిత్యం యోగ, ధ్యాన, ధ్యానయోగ తత్పరులై వుంటూ, ఆరు రకాల వికారాలనూ - అనగా- అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహంలనూ పరిత్యజించి నిర్భయులై శాంతులై చివరి ఊపిరిదాకా ఉండగలిగేవారు బ్రహ్మస్వరూపులే అవుతారు. వారికి చేయదగినదేమీ వుండదు - నాలో వుండడం తప్పు.
కర్మవిభ్రష్ట కాలుష్యో వాసుదేవాను చింతయా ।
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ ॥
శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వారాగ ద్వేషా వ్యుదస్యచ ।
విరక్త సేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః ॥
ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ।
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం ॥
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ।
అతః పరం నృణాన్ కృత్యం నాస్తి కశ్యపనందన ॥ 10.96
