2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

42 – భూమ్యాది దాన మాహాత్మ్యము, బ్రహ్మస్వహరణదోషం

గమనిక 41వ అధ్యాయమైన వృషోత్సర్గ సంక్షిప్త విధి నిడివఱకే విపులంగా చూడడం జరిగింది

గరుడా! ఎలాగైతే తన చుట్టూ వందగోవులున్ననూ దూడ తన తల్లి వద్దకే పోతుందో అలాగే అంతటి సంపూర్ణమైన గురి తప్పని వివేకంతోనూ పూర్వజన్మలో చేయబడిన కర్మలు వాటి కర్తను అనుసరించిపోతాయి.

యథాధేను సహస్రేషు

వత్సో విందతి మాతరం ।

తథా పూర్వ కృతం కర్మ

కర్తార మను గచ్ఛతి ॥ 4ఽ.1

భూమి దానం చేసిన వానిని సూర్య చంద్రులు, వరుణుడు, అగ్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అభినందిస్తారు. ఈ లోకంలో భూదానంతో సమానమైన దానమే లేదు. అలాగే సత్యమంతటి గొప్పధర్మమూ, అసత్యమంత మహా పాపమూ లేవు.

నాస్తిభూమి సమందానం

నాస్తి భూమి సమోనిధిః ।

నాస్తి సత్య సమోధర్మో

నానృతా త్పాతకం పరం ॥

బంగారాన్ని అగ్నిదేవుని పెద్ద కొడుకనీ, ఆవుని సూర్యుని కూతురనీ, భూమిని వైష్ణవీ అనీ అంటారు. కాబట్టి ఈ మూడిటీనీ దానమిచ్చిన వారికి ముల్లోకాలనూ దానమిచ్చిన ప్రతిష్ఠ యేర్పడుతుంది. గోవు, భూమి, విద్య - ఈ మూడిటి దానానికీ అతిదానమని పేరు. జప, పూజన, హోమ సహితంగా చేసే అతిదానం ఆ దాతను నరకం నుండి కాపాడగలదు. చాలా పాపాల నుండి శుద్ధి, విముక్తి భూదానం వల్ల లభిస్తాయి. ప్రాణం కంఠం నుండి వెలువడుతున్నపుడు కూడ నిషిద్ధ కర్మను చేయరాదు. కర్తవ్యము (ధర్మ కర్మ) మానరాదు. ఎవరి జీవికకు భంగం కలిగించినా (కడుపు కొట్టినా) వందల గోవులను చంపినంత పాపం చుట్టుకొంటుంది. అదే ఎవరికైనా జీవనోపాధిని, ధర్మబద్ధంగా, ఏర్పాటు చేస్తే లక్షగోవులను దానమిచ్చిన ఫలం అబ్బుతుంది. గోవును రక్షించడం పరమధర్మం. దానిని మించిన పుణ్యకార్యమే లేదు.

గావాంశతం సైకవృషం

యత్ర తిష్ట వ్యయంత్రితం ।

తత్ క్షేత్రం దశగుణితం

గోచర్మ పరికీర్తితం ॥

గోచర్మ భూమిని దానమిచ్చిన వాని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. ఇక పాపమన్నదే చేయకుండా వుంటే ఉత్తమ గతి లభిస్తుంది. ఎక్కడైతే వెయ్యి గోవులూ పది యెద్దులూ స్వేచ్ఛగా తిరగగలుగుతాయో ఆ భూభాగాన్ని ‘గోచర్మ’మంటారు. ఇక్కడ గోచర్మమంటే ఆవు తోలుకాదు.

గోహంతకుల నుండి ఒక్క గోవును రక్షించినా వందగోవులను దానమిచ్చిన పుణ్యం దక్కుతుంది.

వరమేకా ప్యపహృతా

నతు దత్తం గవాంశతం ।

ఏకాం హృత్వా శతం దత్త్వా

న తేన సమతా భవేత్ ॥

జీవనోపాధి లేని నిర్ధనుడైన బ్రాహ్మణునికి బతుకుతెరువుని కల్పిస్తే అశ్వమేధ యాగాన్నిచేసిన దాని కన్న నెక్కువ పుణ్యం దక్కుతుంది. దుర్బలుడు, ఆపదలో చిక్కుకున్నవాడునగు బ్రాహ్మణుని రక్షిస్తే వచ్చే పుణ్యం వేదాధ్యయనం, ప్రచుర దక్షిణతో యుక్తమైన మహాయజ్ఞం వల్ల వచ్చే పుణ్యానికి కొన్ని రెట్లు ఎక్కువ. బ్రాహ్మణుని ధనాన్ని బలవంతంగా లాగికొనువాని పుణ్యం, ఇతరేతర సర్వసంపదలూ ఇసుకతో కట్టిన వంతెన వలె కూలిపోతాయి. భూమిని దౌర్జన్యంగా అపహరించినవాడు అరవై వేల సంవత్సరాల పాటు పేడ పురుగుగా జన్మించి, పోయి, మరల పేడ పురుగుగానే జన్మించి పోతూ వుంటాడు. బ్రాహ్మణుని నమ్మించి మోసం చేసి వాని ధనాన్నపహరించిన వాడు తనతో బాటు తన ఏడుతరాల వారి పుణ్యాన్ని భస్మం చేసి పారేస్తాడు. బ్రాహ్మణధనాన్ని దొంగిలించిన వాడు ఆచంద్రతారార్కమూ తన, మరియు తన తరాల పుణ్యాలను భస్మం చేసి పారేస్తాడు. ఇనుప రజనునీ రాళ్ళనీ వండుకొని తిని అరిగించుకోగలవాడుంటాడేమో గాని బ్రాహ్మణుని సౌమ్ముని తిని అరిగించుకోగలిగేవాడుండడు.

దైవద్రవ్యాన్ని నాశనం చేసినా, బ్రాహ్మణ ధనాన్నపహరించినా, బ్రాహ్మణుని అవమానపఱచినా ఆదుష్కర్త వంశనాశనం తప్పనిసరి. బ్రాహ్మణుడై యుండీ ఏ విద్యనూ నేర్చుకోకుండానే ఆచార్యత్వాది పదవుల నాశించు వానిని మాత్రం ఆదరించి పదవిని కట్టబెట్టకూడదు. యజ్ఞాన్ని అగ్నితో చేయగలం కానీ బూడిదతో చేయలేం కదా!

సంక్రాంతి కాలంలో దానాలు, హవ్య కవ్యాలూ చేసిన వానికి సూర్యునే దానమిచ్చిన ఫలం దక్కుతుంది. వానికి ఏడు కల్పాల దాకా తిరుగుండదు. ప్రతి గ్రహం (దానం పుచ్చుకొనుట) అధ్యాపనం, యజ్ఞం చేయించుట - ఈ మూడు పనులకూ తగిన వానినే చూసుకోవాలి. ఆ పనులు అప్పుడే పవిత్రాలౌతాయి. యజ్ఞం జపతపాలు గల వాని చేతనే పవిత్రమవుతుంది గాని వేదమాత్రం వల్ల కాదు.

గరుడా! కొందరు నీటికో, నిప్పుకో, మరి దేనికో భయపడి ధర్మమార్గం వీడి పోతుంటారు. వారికా భయాన్ని పోగొట్టి శుద్ధి చేసి మరల మార్గంలోకి తేవాలి. ఇన్నాళ్ళూ ధర్మపథ విచలితులైనందుకు ఆవునూ ఎద్దునూ వారి చేత దానం చేయించి చాంద్రాయణ వ్రతాన్ని కూడా చేయించి శుద్ధులుగా చేయాలి. సన్యాసం స్వీకరించి దాని నుండి చ్యుతులైన వారికి కూడా ఇదే శుద్ధి మార్గము నాలుగు నుండి పన్నెండేళ్ళ మధ్య వయసులోని బాలకుడేదైనా అపరాధం చేస్తే, పాపం చేస్తే వాని తల్లిదండ్రులే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ వయసు వారికి రాజ దండన వుండదు. రజస్వల రోగగ్రస్తమైతే ఆమెను తప్పనిసరి పరిస్థితుల్లో చూడవలసిన వారు వైద్యం చేయవలసినవారు పదిమార్లు స్నాన, జపాలను చేస్తే శుద్ధులవుతారు.