2 - గరుడ పురాణము - ప్రేత కాండము
13-16 - మృత్యువేళ, ఆ తరువాత(తి) కర్మలు, యమదర్శనం, యాతనల స్వరూపం, ఆరుపిండాల ప్రయోజనం, శవదాహవిధి,11 నుండి 13 దాకాకృత్యాలు
గమనిక యమలోకానికి వెళ్ళే దారిలో నున్న పదహారు నగరాలు, ప్రేత విలాపం ఇక్కడ మరల చెప్పబడ్డాయి.
‘హే భగవన్! మృత్యు వాసన్నమైనపుడూ, వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని వుంది. కరుణించండి’ అని ప్రార్థించిన గరుడునితో విష్ణువిలా అన్నాడు :
జీవాత్మ తన కర్మ భోగకారణవశాన తన వర్తమాన శరీరాన్ని వీడిపోతున్నపుడు ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై శిలలనూ కుశాసనాన్నీ పఱచి దానిపై పరుండ బెట్టాలి. నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కనూ శాలగ్రామ శిలనూ తెచ్చిపెట్టాలి. ఆ వ్యక్తి మృత్యువును వీలైనంతవఱకూ ముక్తి దాయకం చేయడానికి ఒక పద్దతిలో సూక్తాలను పఠించాలి. తరువాత చిన్న చిన్న బంగారు రేకులను మరణించిన ప్రాణీ ముఖంపై, ముక్కు ఇరుకన్నాలలో, కన్నులపై, చెవులపై లింగంపై అంటించాలి. రెండు చేతులలోనూ, కంఠభాగంపైనా తులసి దళాల నుంచాలి. శవాన్ని రెండు వస్త్రాలలో చుట్టి కుంకుమతో అక్షతలతో పూజించాలి. తరువాత పూలమాలతో అలంకరించాలి. అప్పుడు పుత్రులు, బంధు బాంధవులు అంతా కలిసి ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకొని మోస్తుండగా పురజనులతో కలసి రెండవ ద్వారం గుండా బయటకు గొని వచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి.
అక్కడ పుత్రులే తూర్పు వైపుగాని ఉత్తరాభిముఖంగా గాని చితిని నిర్మించి అందులో చందన, తులసి, పలాశాది కర్రలను వేయాలి.
మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి, చైతన్యం పోయి, శరీరం జడమైపోతుండగా ప్రాణం (ఆత్మ) యమదూతలతో కలసి వెళ్ళిపోతుంది. అప్పుడు మృతునికి దివ్యదృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడ గలుగుతాడు. దీనికి ముందు ప్రాణం పోవడం అనేది అందరికీ ఒకేలాగ జరుగదు. కొందరికది గొంతుదాకా వచ్చి చిక్కుకుపోయి నానాబాధలూ పెడుతుంది. శరీరం బీభత్సంగా ముఖం వికృతంగా కదులుతాయి. కొందరికి నోటి నుండి నురగ కారుతుంది. వీరంతా పాపాత్ములు. కాబట్టి వీరిని యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడా పాశానికి ప్రాణం తగులుకుంటుంది. పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరుగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే వుంటాడు. ముఖంలో ఒకరకమైన ప్రశాంతతా, వెలుగూ కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల వలెనూ, యమధర్మరాజు విష్ణురూపునిగానూ కనిపిస్తారు. అదే యమధర్మరాజు పాపలకు కాటుక కొండవలె ఎలా కనిపిస్తాడో ఇది వఱకే విన్నావు కదా!
మరణం తరువాత మానవశరీరం అస్పృశ్యమై పోతుంది. వెగటును కూడా కలిగిస్తుంది. పుణ్యాత్ముని శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమై పోతుంది. ఈ అందమైన శరీరంపై ఇతరులకుండే భ్రమలు కూడా తాత్కాలికంగా తొలగిపోతాయి. గరుడా! ఈ అసత్ శరీరం ద్వారా జరిగే విత్త దానం, అదరపూర్వక వాణి, ధర్మం, కీర్తి, పరోపకారం లాటివే అందంగా వుండి లోకానికానందాన్ని కలిగిస్తాయి. మానవ జీవితానికి సారభూతం ఆ పుణ్యమే.
దుష్టులను తోలుకుపోతున్న యమదూతలు వారిని అడుగడుగునా అన్ని విధాల హింసిస్తుంటారు. ఓరి దుష్టాత్మా! పద నిన్ను కుంభీపాకంలో పడేస్తాం. అదెలాగుంటుందో తెలుసా’ అంటూ దానినతి భయంకరంగా వర్ణిస్తారు. గరుడా! పదకొండవ రోజున సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి. ప్రాణం పోయినప్పటి నుండి ఇప్పటిదాకా క్రమంగా ఆరు పిండదానాలు చేయాలి - మృతస్థానం, ద్వారం, నలుబాటల కూడలి, విశ్రామ స్థలం, చితి, అస్థీచయన స్థానం - అనే స్థలాల్లో వాటిని పెట్టాలి.
వీటినెందుకు పెట్టాలంటే, మనిషి పోయిన చోట (ఇంటిలో) పెట్టేదానికి ‘శవ’ పిండమని పేరు. దీనివల్ల ఆ గృహ వాస్తు దేవతలు ప్రసన్నులౌతారు; భూదేవీ, ఆమె కొలువులో నుండు దేవతలూ కూడా ప్రసన్నులౌతారు. రెండవ పిండాన్ని ద్వారంపై పెట్టాలన్నాను కదా! దానికి ‘పాంథ’ అని పేరు. దాని వల్ల ద్వారస్థ గృహదేవతలు ప్రసన్నులవుతారు. కూడలిలో పెట్టబడు ‘ఖేచర నామక పిండం వల్ల భూతాది దేవయోనులు శాంతిస్తాయి. విశ్రామ స్థలంలో చేయు ‘భూత’ పేరిటి పిండదానం వల్ల పిశాచ, రాక్షస, యక్షాది గణాలూ, అన్య దిగ్వాసి దేవతలూ దహనంలో సహకరిస్తాయి. చితాస్థలంపై ఆ పేరుతోనే చేసే పిండదానం, ప్రేతత్వాన్నుత్పత్తి చేస్తుంది. దీని తరువాత ప్రేత’ నామంతో చేసే పిండదానం వల్ల శవం అగ్నికి ఆహుతయ్యే యోగ్యతను పొందుతుంది.
మరొక మూడు పిండదానాలను - ప్రాణం పోయినచోట, శ్మశానానికి సగం దూరం లోనూ, చిత(చితి) మీదా చెయ్యాలి. వీటి వల్ల క్రమంగా విధాతా, గరుడధ్వజుడూ, యమదూతలూ ప్రసన్నులవుతారు. మూడవ పిండ దానం ముగుస్తుండగానే మృతవ్యక్తి శారీరక దోషాల నుండి ముక్తుడవుతాడు.
తరువాత చితను ప్రజ్వలింపజేయడానికి ఒక వేదిని నిర్మించి దానికీ ఉల్లేఖన, ఉద్ధరణ, అభ్యుక్షణాదులను చేసి విధి పూర్వకంగా అగ్నిని స్థాపించి పుష్ప, అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి ఇలా ప్రార్థించాలి.
త్వం భూత కృజ్జగద్యోనే త్వం లోక పరిపాలకః ।
ఉపసంహారకస్త స్మాదేనం స్వర్గం ఘృతం నయ ॥ 15.45
ఇలా అగ్నిని పూజించి శవానికి నిప్పంటించాలి. మృతుని శరీరం సగం కాలాక నేతిని ఆహుతి చేయాలి. లోమభ్యః స్వాహా... అనే మంత్రంతో యథావిధి హోమం చేయాలి. యమ, అంతక, మృత్యు, బ్రహ్మా, జాత వేద నామాలతో ఆహుతులిచ్చి ఒక అహుతిని ప్రేత ముఖంపై ఇవ్వాలి. ముందుగా అగ్నిని పై భాగంలో జ్వలింపజేసి, దానిని తెచ్చి చితియొక్క తూర్పుభాగాన్ని మండించాలి. క్రింది మంత్రాలచే నభిమంత్రితమైన తిలమిశ్రిత అజ్యాహుతులను చితిపై వేస్తునే వుండాలి.
అస్మాత్త్వ మధిజాతోఽసి త్వదయం జాయతాః పునః ।
అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా జ్వలిత పావకః ॥ 15.49
ఈ విధంగా తిల మిశ్రిత సమంత్రక ఆజ్యాహుతి నిచ్చి మృతకుని పుత్రుడే శవదహనం చేయాలి. ఈ సమయంలో మాత్రమే అతడులోని దుఃఖమంతా పోయేలాగ వెక్కి వెక్కి యేడవాలి. ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది. శవం పూర్తిగా కాలి పోయాక ఆ స్థలంలోనే అస్థి - సంచయనం చేయాలి. తరువాత ప్రేతానికి దాహజన్య క్లేశశాంతికై పిండదానమివ్వాలి.
దహన సంస్కారానంతరం పుత్రులు వస్త్రసహితంగా స్నానం (సచేల స్నానం) చేసి నామ గోత్రోచ్చార సహితంగా తిలోదకాలివ్వాలి. అంతట అక్కడున్న ఆ గ్రామ ప్రజలందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ విష్ణునామ సంకీర్తనాన్ని కొంత తడవుగావించి తరువాత మృతకుని గుణగణాలను చర్చించుకుంటూ అతని (ఆమె) ఇంటికి వచ్చి ద్వారపు దక్షిణ భాగంలో గోమయాన్నీ తెల్లావాలనూ ఉంచాలి. మనస్సులో వరుణ దేవుని ధ్యానించుకుంటూ వేపాకులను నమలి నేతి చుక్కను నోట్లో వేసుకొని ఎవరింటికీ వారు పోవాలి..
సూర్యాస్తమయమైనాక మృతుని పుత్రుడు ఇంటి బయటగాని, ఏకాంత ప్రదేశంలో గాని, మృతుడు రోజూ చూసిన నాలుగు దారుల కూడలిలోగాని మట్టిపాత్రలతో పాలు, నీరు పెట్టాలి. ఇలా మూడు రోజులు చేయాలి. కొన్ని మూఢ హృదయ జీవాత్మలు ఆ మూడు చోట్లా తిరుగుతుంటాయి. పదవరోజు దాకా ప్రతిరోజూ ప్రేతానికి పిండదానాన్నీ, జలాంజలినీ ఇస్తూనే వుండాలి. పదవ రోజు దాకా రోజుకి కొంతగా పెంచుతుండాలి.
ఈ ఔర్ధ్వదైహిక సంస్కారాన్ని పుత్రుడు చెయ్యాలి; లేని పక్షంలో భార్య (భర్త) చెయ్యాలి? లేకుంటే శిష్యుడు కాకుంటే సోదరుడు చెయ్యాలి. పిండదానాన్ని శ్మశానంలో గాని అన్య తీర్ధంలో గాని చేయవచ్చు. పిండప్రదానంలో కూర, ఉప్మా తీపిముద్ద- అన్నంతో బాటు ఏదైనా పెట్టవచ్చు గాని తొలిరోజు పెట్టిన పదార్థాలనే పదవరోజు దాకా రోజూ పెట్టాలి.
ఈ పిండం నాల్గు భాగాలుగా విడిపోతుంది. రెండు భాగాలు మృతుడి శరీరం నిర్మాణానికీ ఒక భాగం యమదూతలకీ పోగా మిగిలినదే మృతుని నోటికందుతుంది. తొమ్మిది పగళ్ళూ రాత్రులు గడిచేసరికి మృతుడికొక శరీరం ఏర్పడుతుంది. అది పదవరోజు మహాకలితో ఆవురావురుమంటుంటుంది.
పదవరోజు పార్వణాది శ్రాద్ధాలలో నిర్దేశింపబడిన పిండ విధి, మంత్ర, స్వధా, ఆవాహన ఆశీర్వాద ప్రయోగాలేవీ వుండవు. ఆనాటి కర్మ కేవలం మృతుని నామ గోత్రోచ్చారపూర్వకంగా చేయబడుతుంది. ఇంతవఱకు పెట్టిన పిండాల వల్ల రోజుకొక అంగంగా, క్రమంగా, తల, మెడ, భుజాలు, గుండె, వీపు, నాభి, కటి, గుహ్యం, తొడలు, కాళ్ళు ఏర్పడతాయి. పదవరోజు చేసే పిండదానం పెద్ద యెత్తున వుండాలి. ఆ రోజు మృతకునికి ఆకలి అతని అలవి మీరినదై వుంటుంది. అతడు బతికున్నపుడిష్టంగా తిన్న పదార్థాలన్నిటిని వండించాలి, పెట్టాలి.
ప్రేతాలు బాగా భోజనం చేసేది పదకొండవ పన్నెండవ రోజులలోనే. ఆ రోజులలో ప్రేత శబ్దాన్ని స్త్రీ పురుషులిద్దరికీ వాడాలి. ఇక నామ గోత్రాలకీ బదులుగా మంత్రాలతో బాటు ప్రేత శబ్దాన్నే వాడుతుండాలి.
దీపమన్నం జలం వస్త్రం యత్కించి ద్వస్తుదీయతే ।
ప్రేతశబ్ధేన తద్దేయం మృతస్యానంద దాయకం ॥
పదమూడవ రోజు ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది. అది ఎవరికెలా జరుగుతుందో, ఎన్ని నగరాలను ఎలా విలపింపజేస్తూ దాటిస్తుందో వినియున్నావు కదా!”
