2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

21 - ప్రేతాలకు ముందే వచ్చే స్వప్నాలు ప్రేత - స్వప్న నివారణ - నారాయణ బలి

ప్రేతాల నుండి విడుదల వుంది. దానికి ముందది ఎలాటి ప్రేతమో, ఇదెలాటి తాపమో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసుల సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తుంటాయి. తీర్థయాత్రలకి వెళ్ళాలనీ, నదీస్నానాలు చెయ్యాలనీ, ధర్మకార్యాలను అనుష్ఠించాలని గట్టిగా నిశ్చయించుకుని ముహూర్తం కూడా చూసుకున్నాక, ఎందుకో అత్యంత నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కడికీ వెళ్ళబుద్దెయ్యదు. చెడ్డ పనులవైపు మనసు పోతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి ఆ జ్యోతిర్విద్వాంసుల నాశ్రయించినవాడు బాగుపడతాడు. వారిని సంప్రదించవలసి నవసరము లేకుండా దానాలు చేసినా ప్రేతబాధలు వదిలిపోతాయి. కలలో కనిపించిన ప్రేతాన్నుద్దేశించి మంత్రసహితంగా దానం చేయడం వల్ల ఆ ప్రేతానికీ ఈ మనిషికీ కూడా తృప్తి కలుగుతుంది. ప్రేతాలు వాటిలో అవి కూడబలుక్కొని దానమిచ్చిన వానికి సుఖాలనిస్తాయి. వారి బంధ బాంధవులకు కూడ ధనధాన్యాల నిస్తాయి.

నభవేత్ తేన ముక్తాస్తు దత్తం శ్రేయస్కరం పరం ।

స్వయం తృప్యతి భోః పక్షిన్ యస్యోద్దేశ్యన ధీయతే ॥

శ్రుణు/ సత్యమిదం తార్క్ష్య యద్దదాతి భునక్తి సః ।

ఆత్మానం శ్రేయసా యుంజ్యాత్ ప్రేతస్తృప్తిం చిరం ప్రజేత్ ॥

తే తృప్తాః శుభమిచ్ఛంతి నిజబంధుషు సర్వదా ।

అజ్ఞాతయస్తుయే దుష్టాః పీడయంతి స్వవంశజాన్ ॥

నివారయంతి తృప్తాస్తే జాయ మానాను కంపకాః ।

పశ్చాత్ తే ముక్తి మాయాంతి కాలేప్రాప్తే స్వపుత్రతః ॥ ఽ1.15

స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన పిమ్మట కూడా, వాటి మాటలు, చేష్టలు, పీడలను చూసి కూడా శ్రాద్ధాదుల ద్వారా వాటి నుండి ముక్తికై ప్రయత్నించనివారు ఆ ప్రేతాలు పెట్టే శాపాలకు లోనై దుఃఖ సాగరంలోనే మునిగి వుంటారు. ఇక తేలరు. కొంతమంది మరుజన్మలో కూడా నిస్సంతులు, పశుహీనులు, దరిద్రులు, రోగులుగానే వుండిపోతారు.

కొన్ని సందర్భాల్లో ప్రేతాల నామ గోత్రాలు స్వప్నాల వల్ల తెలుస్తాయి. కొందరిని, కలలు రాకున్నా, ప్రేతాలు పట్టి పీడిస్తాయి. అలాటి సందర్భాలలో కుల పురోహితుని మాటనే పూర్తిగా విశ్వసించి ఆయన ఆదేశం మేరకు భక్తిభావ పూర్వకంగా పితృభక్తినిష్టులై పురశ్చరణ పూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి జప, హోమ, దానముల ద్వారా దేహశోధనను చేసుకోగానే సమస్త విఘ్నాలూ సమసిపోతాయి. ఇవన్నీ చేయగానే, అంతవఱకూ భూత ప్రేత పిశాచాదులచే పీడింపబడుతున్న ప్రాణి బాధలన్నీ దూదిపింజల వలె ఎగిరిపోతాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో కశ్యప నందనా! పితృభక్తి ఉండాలి. లేకుంటే సుఖం లేదు. అన్ని ప్రయత్నాలలోనూ విజయం కావాలంటే తండ్రిపోయిన తొమ్మిదవ లేదా పదవ సంవత్సరంలో పదివేల గాయత్రి జపం చేసి, దశాంశ హోమం కూడా చేసి ‘ఇది మా పితరుల నిమిత్తం’ అని చెప్పుకోవాలి. దీని ఫలితంగా ఉపద్రవాలింక దరిచేరవు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు.

పితృమాతృ సమం లోకేనాస్త్య న్య ద్ధైవతం పరం ।

తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ పితరౌ సదా ॥

హీతానాము పదేష్టా హి ప్రత్యక్షం దైవతం పితా ।

అన్యాయా దేవతాలోకే న దేహ ప్రభవో హి తాః ॥ ఽ1.ఽ9

ప్రాణులకు స్వర్గానికిగానీ మోక్షానికి గానీ ఏకమాత్ర సాధనం శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో, దానికన్న పూజ్యమేది? కాబట్టి దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది.

పుత్రుడు పుట్టుటయే భాగ్యము. వాడు మంచివాడై అన్ని పితృకార్యములను చేయుటయే గొప్ప పుణ్యఫలము. వాడు పుట్టగానే తండ్రికీ ‘పుత్’ అనే నరకబాధ తప్పిపోతుంది.

పున్నామ నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః ।

తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త ఇహచాపి పరత్ర చ ॥ ఽ1.3ఽ

ఓయి ఖగరాజా! ఎవరికైనా మాతా పితరులిరువురూ అకాల మృత్యువు పాలైతే వారొక యేడాదిపాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలోనే వుండాలి. ఆ యేడు వ్రతాలనూ, తీర్థయాత్రలనూ, వివాహాది మంగళ కార్యాలనూ తలపెట్టరాదు.