2 - గరుడ పురాణము - ప్రేత కాండము
17 - బ్రహ్మపుత్ర శ్రవణ దేవుల స్వరూపం
‘జ్ఞానసాగరా! మహావిష్ణూ! యమలోకంలో శ్రవణులనే వారుంటారని విన్నాను. వారు సర్వజ్ఞులని కూడా విన్నాను. వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను’.
‘గరుత్మాన్! ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినప్పుడు నేను దాని నాత్మ లీనం చేసుకొని పాల సముద్రంలో శయనించాను. అపుడు నా నాభికమలం నుండి బ్రహ్మపుట్టి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిమంతుడై ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణులను నాలుగు ప్రకారాలుగా విడగొట్టాడు. తరువాత బ్రహ్మగావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను. తరువాత సంహారమూర్తి రుద్రుడుదయించాడు. అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమై ప్రవహించే వాయువూ, అత్యంత తేజస్వి సూర్యదేవుడూ, చిత్రగుప్త సహితుడై యమధర్మరాజూ ప్రకటితులైనారు.
మరల బ్రహ్మ తపస్సు చేశాడు. కొన్ని వందలేళ్ళు ఆయన అలాగే నాభి కమలంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు. సృష్టిని మాత్రం ఇలాగే కొనసాగించాలని లోపలి నుండే ఆదేశించాడు. అప్పుడు బ్రహ్మతో విష్ణు రుద్రాదులు తమకు లోక వ్యవహారమెలా నడుస్తోందో ఎవరే పాప పుణ్యాలు చేస్తున్నారో తెలియదనీ దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మయే చేయాలని విన్నవించారు.
తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో సర్వశక్తులను కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని బ్రహ్మ వారందరికీ కలిగించాడు. వారంతా అలా చాలాకాలం పాటు చేసిన తరువాత బ్రహ్మ తన పుత్రులుగా పన్నెండుగురు అమిత తేజస్వులూ, విశాల నేత్రులునగు దేవతలను సృష్టించాడు. వారికి ఈ లోకంలో ఎక్కడేది జరిగినా, ఎవరేమన్నా, ఎవరేమి చేసినా వినే శక్తినిచ్చాడు. ఈ విశేషజ్ఞానం వల్ల ఈ బ్రహ్మపుత్రులను శ్రవణు లన్నారు. వీరి నివాసం ఆకాశం. అక్కడి నుండే అందరినీ చూస్తూ వింటూ అవసరమైనపుడు యమధర్మరాజు, లేదా చిత్రగుప్తుల వద్దకు వచ్చి ఆయనకు కావలసిన వివరాలనందిస్తారు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించిన సర్వకర్మల సారమూ వివేచన సహితంగా ధర్మరాజుకీ సమర్పింపబడుతుంది. ఓ వైనతేయా! సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు నాలుగే. అవే ధర్మార్థ కామ మోక్షాలు. ఉత్తమ ప్రకృతి గల ప్రాణి ధర్మ మార్గంలో వెళతాడు. ధనధాన్యాలను సంపాదించినా దానానికే వినియోగించినవారు విమానంలో పరలోకాలకు పోతారు. మోక్షాకాంక్షతోనే జీవితంలో ప్రతి పనినీ చేసిన వారు తమ దేహాంతంలో హంసల విమానం పైనెక్కి పరలోకానికి వెళతారు. ఉన్నదానితోనే బతుకుతూ అప్పుడప్పుడైనా యాచకులను సంతోషపెట్టినవారిని దేవదూతలు గుట్టలపై గొనిపోతారు. ఏ పుణ్యమూ ధర్మమూ చేయకుండానే బతికేసిన వారిని, ఇది వఱకు నువ్వు విన్నట్టుగా, యమదూతలు నడిపించుకుంటూ ఏ అసిపత్రవనానికో గొనిపోతారు. శ్రవణులను భక్తి మీరగా పక్వాన్నం, వర్ధని, జలపాత్రల ద్వారా పూజించినవారికి నేను స్వయంగా ప్రసన్నుడనై ఏ దేవతల ఇవ్వలేనన్ని వరాలను కురిపిస్తాను.
