2 - గరుడ పురాణము - ప్రేత కాండము
5 - అశౌచం, దశగాత్రవిధి, ప్రథమ షోడశి ఇతర షోడశుల విధానాలు, నవశ్రాద్ధాలు, వారికకృత్యం, జీవుని యమమార్గ నిదానం, షోడశ నగరాల్లో యాతన, పాపులకూ పుణ్యులకూస్థాయిని బట్టి యమదర్శనం
గరుత్మంతా! మృత వ్యక్తికి దహనసంస్కారం చేసిన తరువాత స్నానాలనూ శిలోదకాలనూ గావించి ముందుగా స్త్రీలు, వారి వెనుకగా పురుషులు మెల్లగా నడుస్తూ ఇల్లు చేరుకోవాలి. ద్వారం దగ్గరకొచ్చాక వేపాకు నమలి, ఒక రాతిపై నిలబడి ఆచమనం చెయ్యాలి. ఇప్పుడిక పొంగుకు వచ్చే దుఃఖాన్నాపనవసరము లేదు.
ఇప్పటి నుండి పుత్రులకూ పౌత్రులకూ సగోత్రులకూ పదిరాత్రుల దాకా అశౌచముంటుంది. దానికి సంబంధించిన కర్మలన్నిటినీ అందరూ చేయాలి. ఈ కాలంలో భోజన పదార్థాలను బయటి నుండి తెచ్చుకొని తినాలి. భార్యా భర్తలు రాత్రులందు వేర్వేరు గదుల్లో శయనించాలి. చప్పిడి కూడే తినాలి. బ్రహ్మచర్య వ్రతం, కేవల శాకభక్షణం, పృథ్వీశయనం తప్పనిసరి. శరీరస్పర్శ కూడా తప్పే. దానాలకూ, అధ్యయన కర్మలకూ దూరంగా వుండాలి. అంగమర్దనమూ, తలంట కూడదు. ఈ అశౌచ అవిధి కాలంగా చెప్పబడుతున్న కాలంలో మట్టిపాత్రలలో భోజనం చేయాలి. శక్తిని బట్టి మూడు రోజులు ఉపవసించాలి.”
గరుడడిగిన మీదట అశౌచ సమయాన్నీ, లక్షణాదులనూ ఇలా చెప్పాడు స్వామి.
“ఈ అశౌచం శీఘ్రమే ముగియాలి. ఎందుకంటే ఈ కాలంలో మానవులు దాన, అధ్యయనాది పుణ్యకార్యాలకు దూరమై పోతారు.
సపిండులలో మరణ శాచం పది దినాల పాటు వుంటుంది. పుత్రాదిక జన్మవేళల్లో కూడా ఇన్నాళ్ళ అశౌచమే వుంటుంది. మిగతా వివరాలన్నీ ఇదే పురాణంలో ఆచారకాండ 106, 107వ అధ్యాయాలలో చెప్పబడ్డాయి.
ప్రేతజన్య అశౌచమున్నన్నాళ్ళూ మృతవ్యక్తికిచ్చు జలదానపు దోసిళ్ళను రోజు రోజుకూ పెంచుకుంటూ పోవాలి. మూడు రోజుల అశౌచంలో పది జలాంజలు లివ్వాలి. తొలిరోజు మూడు, మలిరోజు నాలుగు, తుది రోజు మూడు ఇవ్వాలి. శతాంజలి జల దానక్రియ కూడా లేకపోలేదు. ఆ పద్ధతిలో ముప్పది, నలువది, ముప్పది ఇస్తారు.
పితృక్రియలన్నిటికీ ముఖ్యఅధికారి పుత్రుడే. ఈ ప్రేతశ్రాద్ధంలో పాలను గాని నీళ్ళనుగాని పిండంపై చిలకరించుట, పుష్పధూపాదుతో దానిని పూజించుటయను పనులను మంత్రాలు లేకుండానే చేయాలి. పదవరోజు కేశ, శ్మశ్రు, నఖ, వస్త్రాలను పరిత్యజించి ఊరి వెలుపల స్నానం చేయాలి. వర్ణాల వారీగా క్రమంగా జలం, వాహనం, కొరడా, కర్రలను స్పృశించి పవిత్రులు కావాలి. మృతునికన్నా చిన్నవారు, సపిండులు శిరోముండనం చేయించుకోవాలి.
గమనిక అంత్య కర్మ దీపిక గ్రంథం మృతులకన్న చిన్నవారే తల గొరిగించుకోవాలని చెప్పబడింది. కాని భారతదేశంలో పలు గ్రామాలలో మరణంవల్ల దుఃఖితులైన పురుషులందరూ, వృద్దులతో సహా, శిరోముండనం చేయించుకొనే సంప్రదాయముంది.
ఆరు, ఆపై పిండ దానాలు చేసి షోడశీ కర్మను ముగించాలి. దీనిని మలిన షోడశీ కర్మ అంటారు. దీనిని మృతి పిమ్మటి పది దినాలలోనే ముగించాలి. పుత్రాదులు ఈ పది రోజులగా ఇచ్చే పిండదానాలను నాలుగేసి భాగాలుగా విభజించి తొలి రెండు భాగాలనూ ఆతివాహిక శరీరానికీ, మూడవదానిని యమదూతలకూ, నాల్గవ భాగాన్ని మృతకునికీ ఇచ్చి వారిని తృప్తి పఱచాలి.
తొమ్మిది దినాలూ తొమ్మిది రాత్రులు గడిచేసరికి మృతిచెందిన వ్యక్తికి అన్ని అంగాలూ మరల ఏర్పడి ఆకలి దప్పులు కలుగుతాయి. ఇలా :
అహోరాత్రైస్తు నవభిర్దేహో నిష్పత్తి మాప్న్యుతాత్ ।
శిరస్త్యాద్యేన పిండేన ప్రేతస్య క్రియతే తథా ॥ 33
ద్వితీయేనతు కర్ణాక్షి నాసికం తు సమాసతః ।
గలాం సభుజ వక్షశ్చ తృతీయేన తథా క్రమాత్ ॥ 34
చతుర్థేన చ పిండేన నాభి లింగగుదం తథా ।
జానుజంఘం తథా పాదౌ పంచమేనతు సర్వదా ॥ 35
సర్వమర్మాణి షష్ఠేన సప్తమేన తునాడయః ।
దంతలో మాన్యష్టమేన వీర్యంతు నవమేన చ ॥ 36
దశమేన తు పూర్ణత్వం తృప్తతా క్షుద్విపర్యయః ॥ 37
కశ్యపాత్మజా! ఇక మధ్యమ షోడశీ విధిని వర్ణిస్తాను, విను. విష్ణువును దృష్టిలో పెట్టుకొని పదకొండు శ్రాద్ధాలనూ, అయిదు దేవశ్రాద్ధాలనూ పెట్టాలి. వీటికే మధ్యమషోడశియని పేరు. ప్రేత మంగళం కోసం నారాయణ బలి చేసిన సందర్భంలోనే పదకొండవరోజు షోడశినిచ్చి వృషోత్సర్గము చేయాలి. వృషోత్సర్గం (దూడను గాని ఎద్దును గాని దానమిచ్చుట లేదా వదలివేయుట) ఏ జీవి కొఱకై చేయబడదో ఆ జీవికీ ప్రేతత్వం నుండి ముక్తి లభింపదు. తరువాత ఏం చేసినా లాభం లేదు.
ఏకాదశాహే ప్రేతస్య యస్యోత్సృజ్యతే నో వృషః ।
ప్రేతత్వం సుస్థిరం తస్య దత్తైః శ్రాద్ధ శతైరపి ॥
అకృత్వాయద్ వృషోత్సర్గం కృతం వై పిండ పాతనం ।
నిష్ఫలం సకలం విద్యాత్ర్పమీతాయ న తద్భవేత్ ॥ 4ఽ
ఏ సందర్భంలోనైనా ఈ పృథ్విపై ప్రేతకల్యాణ సామర్థ్యం వృషోత్సర్గానికున్నంత ఇక దేనికీ లేదు. కాబట్టి మృతుల తరపున ఎవరో ఒకరు ఈ పనిని చేయాలి. పదకొండవ రోజు మృతులు జీవించి యుండిన కాలంలో నెక్కువగా ఇష్టపడిన పదార్థాలను చేసి శ్రాద్ధకర్మను చేయడం మంచిది. అలాగే మృతులనుద్దేశించి శయ్యనూ గోవునీ దానం చెయ్యాలి. బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి మంచి నీళ్ళిస్తే మృతునికి ఆకలీ దాహమూ దూరమౌతాయి.
ఇక తృతీయ లేదా ఉత్తమ షోడశి శ్రాద్ధాలను పన్నెండు మాసాలలో పన్నెండు పిండాలుగా, ఊనమాసిక, త్రిపాక్షిక, ఊనషాణ్మంసిక, ఊనాబ్దిక సమయాలలో పెట్టాలి.
పన్నెండవ రోజు, మూడు పక్షాలు, ఆరు నెలలు లేదా సంవత్సరాంతము నాడు మృతులనుద్దేశించి సపిండీకరణ చేయాలి. మృతులకు పదకొండవ లేదా పన్నెండవ తిథినాడు అద్యశ్రాద్ధమును పెట్టాలి. ప్రతి మాసమున శ్రాద్ధము ఆ మాసపు మృత తిథిలో పెట్టాలి. మాస, ఆరవ మాస, సాంవత్సరికాలను రెండు మూడు రోజుల ముందే పెట్టాలి. (అవే ఊన, షాణ్, ఆబ్దికాలు) సపిండీకరణాన్ని ఏడాది పూర్తయినాక లేదా ఆరునెలలైనాక చేయాలి. వివాహాది మంగళకార్యాలు ఆయా తిథుల్లో పడితే సపిండీకరణాన్ని త్రిపక్షం రోజులు అనగా నలుబదియైదు రోజులకుగాని పన్నెండు రోజులకు గాని చేయవచ్చును. అన్నిటికన్న పన్నెండురోజుల నాడు చేయడమే ఉత్తమం.
సపిండీకరణ శ్రాద్ధాన్ని ఏకోద్దిష్ట విధానాన్ననుసరించి చేయాలి. నాలుగు కుండలను తీసుకొని తిలలు, గంధము, నీరు (అన్నిటిలో) పోసి నింపి, ఒక పాత్రను ప్రేతానికీ, మూడిటిని పితృగణాలకీ కేటాయించాలి. ప్రేతపాత్రలోని జలాన్ని పితృపాత్రలపై చిలకరించాలి. నాలుగు పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలికి అని అంకితం చేసి దానిని మూడు భాగాలుగా చేసి వాటిని పితృపిండాలు మూడింటితో కలిపేయాలి. అప్పటి నుండి ఆ ప్రేతం, పితృగణ రూపాన్నిధరించి పితరులలో కలిసి పోతుంది. ఇక పితృకార్యాలన్నిటికీ పితృ పితామహులతో సహా ఈ మృతవ్యక్తిని కూడా పూజించాలి. ఆలుమగలోకేరోజు మరణిస్తే ఆ స్త్రీకి సపిండీకరణమవసరము లేదు. ఇతర శ్రాద్ధకార్యాలను మాత్రం చేయాలి.
ఇక నవశ్రాద్ధాలెప్పుడెప్పుడు పెట్టాలంటే మృత్యుదినం నాడు మృతస్థానంలో మొదటి శ్రాద్ధాన్ని పెట్టాలి. శ్మశానానికి తీసుకెళ్తూ దారిలో నొకచోట ఆగుట, శవాన్ని దింపుట జరుగుతాయి కదా అచ్చోట రెండవశ్రాద్ధాన్ని పెట్టాలి. మూడవదాన్ని అస్థి సంచయన స్థానంలో పెట్టాలి. తరువాత అయిదవ, ఏడవ నుండి వరుసగా పదకొండవరోజుల్లో శ్రాద్ధాలు పెట్టాలి. ఇవి మొత్తం తొమ్మిది కాబట్టి వీటిని నవశ్రాద్ధాలంటారు. వీటినే తృతీయాషోడశీ అని కూడా అంటారు. వీటిని ఏకోద్దిష్ట శ్రాద్ధ పద్ధతిలోనే పెట్టాలి. నిజానికి బేసిరోజుల్లో మొదటి నుండి పదకొండవ రోజుదాకా పెట్టే ఆరు శ్రాద్ధాలనే నవ శ్రాద్ధాలంటారు. పదహారు సంఖ్య, నవ సంఖ్య వాటిలో అదనంగా చేయు కర్మల వల్ల సాధింపబడుతుంది. ఈ విషయంలో ఋషులలో మత భేదాలున్నాయి. ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించాలి. మొదటి, రెండవ శ్రాద్ధాలకు ఒకే పవిత్రకాన్నివ్వాలి. బ్రాహ్మణులు భోజనం చేసిన తరువాత పిండదానాన్నివ్వడం, ఉచితం. ఇది సపాక్షిక శ్రాద్ధ విధిలో కనుపిస్తుంది. యజమానుడు బ్రాహ్మణుని మీరు ‘ప్రసన్నులైనారు కదా’ అని అడగాలి. అయన మనఃపూర్వకంగా మేము నీ సేవలపట్ల ప్రసన్నులైనాము. మీ మృత స్వజనులకు అక్షయ లోకాలు ప్రాప్తించాలి’ అని వక్కాణిస్తేనే శ్రాద్ధం సఫలమైనట్లు అనుకోవాలి.
ఇక ఏడాది పర్యంతం జరగవలసిన ఏకోద్దిష్ట శ్రాద్ధాలెలా వుండాలో విను. సపిండీకరణం తరువాత జరుగు పదహారు శ్రాద్ధాలనూ ఏకోద్దిష్ట విధానంలోనే పెట్టాలి. అయితే, పార్వణ శ్రాద్ధంలో ఆ నియమం మారుతుంది. ప్రత్యబ్ద (సాంవత్సరిక) శ్రాద్ధాలెలా చేస్తారో ఆ పదహారిటీనీ కూడా అలాగే చేయాలి. పదకొండవ, పన్నెండవ దినాల్లో పెట్టే శ్రాద్ధాలకు ప్రేతమే స్వయంగా వచ్చి భోంచేయడం జరుగుతుంది. కాబట్టి మృతవ్యక్తి పేరునుచ్చరిస్తూ ‘ఇది వారికే’ అంటూ పిండం పెడతారు. సపిండీకరణ తరువాత ప్రేతశబ్ద ప్రయోగముండదు. అంతవఱకిచ్చు ధూప దీప అన్న వస్త్ర జలాదులకు ఇతర వస్తు దానాలకూ ప్రేత శబ్దాన్ని వాడతారు.
ఓయి అరుణానుజా! ఇపుడు జీవులు యమరాజును చేరు మార్గవర్ణనను విను. పదమూడవ నాటి శ్రాద్ధ కృత్యం, (గరుడ) పురాణ శ్రవణం తరువాత జీవుడు యమదూతల వెంట ఒంటరిగా విచారంగా బయల్దేరతాడు. తరువాత వాయు ప్రేరితుడై రెండవ శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ శరీరం అపరకర్మను అంతవఱకూ చేసిన వాని శ్రద్దను బట్టీ జీవి చేసిన కర్మను బట్టీ వుంటుంది. మర్త్యలోకం నుండి యమలోకం ఎనుబదియారువేల యోజనాల దూరంలో వుంది. జీవి రోజుకి రెండు వందల నలుబది యేడు యోజనాలు, (అర్ధ కోసు) దూరం ప్రయాణించాలి. ఇలా ఈ యాత్ర మూడువందల నలభై ఎనిమిది రోజులపాటు సాగుతుంది. ఈ యాత్ర అందరు జీవులకీ ఒకేలా జరగదు. జీవితమంతా పాపాలే చేస్తూ బతికేసిన వారి యాత్ర ఎలా వుంటుందో చూడు :
మృత్యువు కబళించిన పదమూడవ రోజు జీవుడు (ముఖ్యంగా పాపి) యమదూతల కఠోర పాశములచే కట్టబడతాడు. వారు అతనిని అంకుశం చేత బట్టి పరమక్రోధులై కొట్టుకుంటూ గొనిపోతారు. దక్షిణ దిశలో నున్న తమ లోకంవైపు ఈడ్చుకుంటూ పోతారు. దారిలో పిచ్చి మొక్కలు, తీగెలు, ముళ్లు, వెదుళ్ళు, మేకులు, గూటాలు (వీటి మొదలు భూమిపైకి వచ్చేలా పాతబడి వుంటాయి.) సూదిగా మొనదేలియున్న రాళ్ళు అడుగు కొక్కటిగా కాళ్ళకు కన్నాలు పెడుతుంటాయి. అక్కడక్కడ ఆ దారిలో అగ్ని జ్వలిస్తుంటుంది. అక్కడక్కడ నేల పెనుబీటలతో దాట శక్యం కాకుండా వుంటుంది. యమదూతలనివేవీ బాధించవు. అందుచేత వారు ఈ పాపిని వీటన్నిటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతునే వుంటారు. సూర్యుడు కిరణాలకు బదులు వీరిపై చండ్రనిప్పులు కురిపిస్తున్నట్లు మండుతుంటాడు. ఇంత వేడిలో కూడా ఈగలంతేసి దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కుడుతుంటాయి. అతడు (ఆమె) నక్క ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ వారి చేత నీడ్వబడుతూ బీభత్సంగా అరుస్తూ పోతుండాలి. ఒక పక్క శరీరం కాలి బొబ్బలెక్కిపోతుంటే, మరొక వంక వెదుళ్ళ బారినపడి ఒళ్ళు చీరుకుపోతుంటే, వేరొకవైపు కాళ్ళ (అరికాళ్ళ)లో దిగిన ముళ్ళూ మేకులూ, గునపాలూ తొడల దాకా దూసుకుపోతుంటే కనీసం ఆగి, తన శరీరానికే మేరకు నష్టం వాటిల్లిందో చూసుకొనే ‘వార’ కూడా ఈయకుండా యమదూత లీడ్చుకుపోతుంటే ఆ పాపి గోల అక్షరాలా అరణ్యరోదనే అవుతుంది. ఘోరమైన పాపాలను చేసిన వాని శరీరాన్ని తోడేళ్ళు అక్కడక్కడ రుచి చూస్తుంటాయి. అయినా శరీరం తగ్గదు. తెలివి తప్పదు, ప్రాణమెలాగూ పోదు.
యమలోకానికెళ్ళే దారిలో పదహారు పురాలుంటాయి. వాటి పేళ్ళు యామ్య, సౌరిపురి, నగేంద్రభవన, గంధర్వపుర, శైలాగమ, క్రౌంచ, క్రూరపుర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రందపుర, సుతప్తభవన, రౌద్ర, పయోవర్షణ, శీతాఢ్య, బహుభీతి. ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా వుంటాయి.
యామ్యపురమార్గంలో జీవీ ‘నా పుత్రా, నాయనా, నన్ను రక్షించు’ అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలచుకొని అంగలారుస్తూ పదునెనిమిదవ రోజున యమరాజ యామ్యపురిని చేరుకుంటాడు. అక్కడ అందమైన మఱ్ఱిచెట్లుంటాయి. జీవికి వాటి క్రింద కూర్చోవాలనుంటుంది. కాని యమదూతలంగీకరించరు. ఒక్క అవకాశం మాత్రం ఇస్తారు. ప్రాణికి పుత్రుల ద్వారానో అన్యుల ద్వారానో కృపా పూర్వకంగానో స్నేహ పూర్వకంగానో పృథ్విపై చేయబడిన పిండదానాలు అంది వుంటే వాటిని తిననిస్తారు. తరువాత సౌరిపురి వైపు వెళ్ళాలి. అక్కడికి చేరేదాకా పాపిని యమదూతలు ముద్గరాలతో కొడుతూనే వుంటారు. ఆ దెబ్బలు తింటూ పాపీ ఇలా విలపిస్తాడు:
జలాశయోనైవ కృతో మయా తదా
మనుష్య తృప్త్యై పశుపక్షి తృప్తయే ।
గోతృప్తి హేతోర్నచ గోచరః కృతః
శరీర హే నిస్తర యత్ త్వయా కృతం ॥ 100
అయ్యో! మనుష్యులను గాని కనీసం జంతువులను గాని ఏనాడూ తృప్తి పఱచనైతిని. అధమపక్షం ఒక జలాశయాన్ని తవ్వించి కొందరి దాహార్తిని తీర్చినా నాకీ బాధ వుండేది కాదు. గోవుల ఆకలి తీర్చే గోచర భూమి నేర్పాటు చేసినా ఈ బాధ తప్పేది కదా! అవకాశముండీ ఈ పుణ్యకార్యాలు చేయని ఓ నా శరీరమా! చేసుకున్నవారికి చేసుకున్నంత అనుభవించు - అని భావం
ఆ సౌరిపుర రాజు కామరూపుడు, ఇచ్ఛానుసారం ఉండేవాడు, గతిశీలుడు. అతనిని చూస్తేనే జీవికి భయంతో ఒళ్ళంతా వణకుతుంది. అయినా ఎలాగో గుండె చిక్కబట్టుకొని పృధ్వి నుండి వచ్చిన పిండాన్ని తిని జలాన్ని తాగి బయల్దేరతారు పాపులు. అక్కడి నుండి వెళ్ళే దారి పొడవునా యమదూతలు వారిని కత్తులతో కొంచెంగా నరుకుతూ, లోతుగాకుండా పొడుస్తూ హింసిస్తూంటారు. అప్పటి జీవి ఆక్రోశమిలా వుంటుంది:
న నిత్యదానం న గవాహ్నికం కృతం
పుస్తంచ దత్తం న హివేదశాస్త్రయోః ।
పురాణ దృష్టోన హి సేవితోఽధ్వా
శరీర హే నిస్తర యత్ త్వయా కృతం ॥ 103
ఓ శరీరమా! నేనెప్పుడూ ఎవరికీ కనీసం నీటిచుక్కైనా దానం చేశానుగాను. ఆవుకి గడ్డినైనా మేపాను గాను. పోనీ వేద శాస్త్ర సంబంధి పుస్తకాలైనా దానం చేశానా అంటే అదీ లేదు. పురాణాలలో చెప్పబడిన తీర్థయాత్రాది సత్కర్మలను చేయలేదు. కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాను అని భావము.
తరువాతి మజిలీ నగేంద్రనగరం. అక్కడ జీవికి తన బంధుబాంధవులు రెండవ మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది. మరల బయలు దేరిన పాపులను యమదూతలు కత్తిపిడులతో పొడుస్తూ తోలుకు పోతుంటారు. ఆ సమయంలో జీవి ఇలా ఆక్రందిస్తాడు:
పరాధీన మభూత్ సర్వం మమ మూర్ఖ శిరోమణేః ।
మహతా పుణ్యయోగేన మానుష్యం లబ్ధవానహం ॥
ఎన్నో జన్మల ఎన్నో పుణ్యాల ఫలం మానవజన్మ. ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసినా కనీసం పాపాలు చేయకున్నా నా యమ మార్గ యాత్ర ఇంత దారుణంగా వుండేది కాదు కదా - అని భావం.
ఇలా విలపిస్తూ జీవి మూడవ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు. అక్కడ తన వారు పెట్టిన మూడవ మాసిక పిండాన్ని తిని మరల బయల్దేరతాడు. మార్గంలో యమ దూతలీ పాపులను కత్తి మొనలతో పొడుస్తూ తోలుకెళతారు. క్రింద ముళ్ళూ, రాళ్ళూ, మధ్యలో కత్తి మొనా, పై నుండి ప్రచండ భానుని పెనువేడి కిరణాల సూదులు గుచ్చుకుంటూ వుంటే చేసిన పాపాలు గుర్తుకొస్తుంటే, చేయని పుణ్యాలను తలచుకుంటూ పాపులిలా ఎలుగెత్తి రోదిస్తారు.
మయాన దత్తం న హుతం హుతాశనే
తపో న తప్తం హిమశైల గహ్వరే ।
న సేవితం గాంగమహో మహాజలం
శరీర హే నిస్తర యత్ త్వయా కృతం ॥ 108
ఓ శరీరమా! మనకీ బాధలెందుకు తప్పడం లేదు, కనీసం తగ్గడం లేదూ? అంటే నేనేనాడూ ఎవరికీ ఏ దానమూ చేయలేదు. పోనీ అగ్నిలో పూజలో భాగంగా ఆహుతులైనా వ్రేల్చలేదు. ఏ హిమాలయ గుహలలోకో పోయి తపస్సైనా చేసేనా అంటే అదీ లేదు. కనీసం గంగాజల సేవనమైనా చేయలేదు. ఇంకెన్ని పన్నములున్నవో యేమో?
మృతి చెందాక అయిదవ మాసానికి కొద్ది రోజుల ముందు ప్రాణి (ఆత్మ) క్రౌంచపురం చేరుకొని అక్కడ తన పుత్రాదులచే భూలోకంలో పెట్టబడిన ఊనషాణ్మాసిక శ్రాద్ధపిండాన్ని తిని నీటిని త్రాగి విశ్రమిస్తుంది.
గరుడా! పాపీ అరవమాసంలో క్రూరపురి వైపు తీసుకుపోబడతాడు. ఈ మార్గంలో పాత బాధలలాగే వుండగా యమదూతలు పట్టిసాలతో కొట్టి తోలుతుంటే ఇలా అరుస్తాడు:
హా మాతర్హా పితర్ భ్రాతః
సుతా హా హా మమస్త్రియః ॥ 1ఽ3
యుష్మాభిర్నో పదిష్టేఽహ -
మవస్థాం ప్రాప్త ఈ దృశీం । 1ఽ4
‘ఓ మాతా పితలారా! బంధు బాంధవులారా! మీరు నాకెందుకు చెప్పలేదు, మంచి పనులే చేయాలని? మీరు చెప్పినా, నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలను చేయించినా నాకిప్పుడీ దురవస్థ తప్పేది కదా!” అని భావం.
అపుడు యమదూతలిలా అంటారు, ‘ఓ మూర్ఖజీవుడా! ఇంకెక్కడి తల్లి? ఎవరా తండ్రి? ఏరా పుత్ర మిత్ర బాంధవ స్త్రీలు! నీవొక్కడివే నీవు చేసిన పాపాల ఫలాన్ననుభవిస్తూ వస్తున్నావు. ఏ శక్తీ ఈ మార్గంలో వస్తున్నవారిని కాపాడలేదు. ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్వడం దండగ. పరలోకంలో జీవించేవారికి పరాశ్రయమంటూ వుండదు. నీ స్వకర్మార్జిత పాపపుణ్యాలే నిన్నిక్కడ నడిపిస్తాయి. ఇక్కడ నీ అధికారం పనిచేయదు, క్రయ విక్రయాలు గాని పలుకుబడులు గాని ఇక్కడ సుఖ సాధకాలు కావు’ ఇలా అదిలిస్తూ, శూలాలతో పొడుస్తూ ‘విచిత్ర నగరం’ వైపు గొని పోబడుతున్నపుడు జీవి ఇలా గోలెడతాడు :
కుత్రయామి నహిగామి జీవితం
హా మృతస్య మరణం పునర్నవై ।
అయ్యో! ఈ నా బాధలు భరించలేకున్నాను. చచ్చాననుకున్నాను గాని బతికే వుంటాననీ ఈ బతుక్కి చావే లేదని ఇపుడు తెలుస్తోంది.
ఇలా విలపిస్తూనే వారు విచిత్రనగరంలోకి వెళతారు. అక్కడ విచిత్రుడను పేరు గల రాజుంటాడు. జీవులు షణ్మాసిక పిండాల నారగించి మరో నగరి వైపు లాక్కుపోబడతారు. దారిలో యమదూతల చేతి దెబ్బలను తింటూ, విపరీతంగా భయపడి పోయి అతి కష్టం మీద ముందుకీ పోతూ ఇలా విలపిస్తారు :
మాతాభ్రాతా పితాపుత్రః కోఽపి మేవర్తతే నవా ।
యో మాముద్ధరతే పాపం పంతం దుఃఖసాగరే ॥
“అమ్మ నాన్న లారా, అన్నదమ్ములారా, పుత్రులారా నన్నీ దుఃఖ సాగరం నుండి ఎవరూ ఉద్దరించలేరా’ అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతునే వుంటుంది. ఇక్కడ ‘వైతరణి’ అనుపేరు గల ఒక నది తగులుతుంది. దాని వెడల్పు నూరు యోజనాలు. అది చీముతో రక్తంతో నిండి వుంటుంది. వీరక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతియైన నావికుడు ప్రతి జీవినీ ‘నీవు వైతరణీ నామక గోవును దానం చేశావా? అలాగైతే వచ్చి కూర్చో. నావలో ఆసీనుడవై సుఖంగా ఈ నదిని దాటి పోదువుగాని’ అని అడిగి, చెప్పి, ఎక్కించుకుంటాడు. ఆ దానం చేయనివారిని పడవెక్కనివ్వడు. అలాగని తీరానా వుండనివ్వడు. వారి చేతులను పట్టుకొని తాను నావలో నుండే ఈడ్చుకుపోతాడు. ఆ నదిలో నీడ్వబడుతున్న వారిని సూది ముక్కులున్న, పరమ బలిష్టములైన కాకులూ, కొంగలూ అందిన చోటల్లా పొడుచుకుంటూంటాయి. గుడ్లగూబలు కూడా అందిన కాడికి నములుతుంటాయి. అన్ని బాధలు నడుమా ఆ జీవి పాపిష్ఠి ప్రయాణం అలా కొనసాగుతునే వుంటుంది. ఇక వైతరణి గోవును దానం చేసి తత్ఫలితంగా పడవనెక్కిన వారికి నరకానికెళ్ళే బాధ తప్పుతుంది. విష్ణు దూతలు నావలోకే వచ్చి వారిని విమానమెక్కించి తమ లోకానికి గొనిపోతారు.
మనుజానాం హితం దానమంతే వైతరణీ ఖగ ।
దత్తా పాపం దహేత్ సర్వం మమలోకం తు సా నయేత్ ॥ 1ఽ7
ఏడవమాసం వచ్చేసరికి జీవి ‘బహ్వాపద’ అనే పురంలో ప్రవేశిస్తాడు. భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్నీ నీటినీ సేవించి మరల బయలుదేరతాడు. యమదూతలు పెద్ద పెద్ద పరిఘలను పెట్టి కొడుతూ తోలుకుపోతుంటే ఇలా అంగలారుస్తాడు.
న దత్తం న హుతం తప్తం నస్నాతం నకుతం హితం ।
యాదృశం చరితం కర్మమూఢాత్మన్ భుంక్ష్వేతాదృశం ॥ 1ఽ9
ఓ శరీరమా! నేనేనాడూ దాన, ఆహుతి, తప, తీర్థస్నాన, పరోపకారాది సత్కార్యాలలో నొకటీ చేయలేదు. మూర్ఖుని వలె బతికేశాను. ఇప్పుడనుభవిస్తున్నాను.
గరుడా! తదనంతరం ఆ జీవి ఎనిమిదివ మాసంలో ‘దుఃఖదపురాన్ని’ చేరుకుంటాడు. ఇక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండజలాలను పుచ్చుకొని ‘నానక్రందము’ అనే పురానికి యమదూతల ముసలాఘాతాల పాలబడి ఇలా విలపిస్తాడు.
క్వజాయాచటులైశ్చాటు పటు భిర్వచ నైర్మమ ॥
భోజనం వల్ల భల్లభల్లీ భిర్ముసలైశ్చ క్వమారణం ।
హా హతవిధీ! ఒకప్పుడూ కదిలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని. ఇప్పుడు యమదూతలు కటువైన మాట్లాడుతూ పెట్టే బల్లెపు పోటులను తింటున్నాను. ముసలాల దెబ్బలనూ తింటున్నాను. అయ్యో! అని భావం.
ఇలా విలపిస్తూనే జీవి తొమ్మిదవ నెలలో ‘నానాక్రందపురము’ చేరుకుంటాడు. తరువాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని నానావిధాల ఆక్రందనలనూ వినిపిస్తూనే ‘సుప్తభవనము’ అనే చోటికి పదవమాసంలో చేరుకుంటాడు. అక్కడి దెబ్బలకు ఇలా విలపిస్తాడు :
క్వ సూను పేశలకరైః పాద సంవాహనం మమ ॥
క్వ దూత వజ్రప్రతిమ కరైర్మత్పద కర్షణం ।
అకటా! పుత్రులు తమ చేతులతో మృదువుగా నా కాళ్ళు పడుతుంటే అలసటను మఱచి నిద్రలోకి జారుకొనేవాడను. ఇక్కడ వజ్రకఠినములైన చేతులతో నన్ను లాక్కుపోతుంటే ఈడ్వబడుతున్నాను. ఆ బతుకేడ? ఈ చావేడ?
పదవ నెలలో అక్కడే పిండజలాలను సేవించి ప్రయాణిస్తూ పదకొండవనెలలో జీవి ‘రౌద్రపురము’ చేరుకుంటాడు. యమదూతలు విసుగూ విరామం లేకుండా వీపుపై బాదుతునే వుంటారు. అప్పుడిలా ఏడుస్తూ పెడబొబ్బలు పెడతాడు :
క్వాహం సతూలీశయనే పరివర్తన్ క్షణే క్షణే ।
భటహస్త భ్రష్ట యష్టి కృష్ణపృష్ఠః క్వవాపునః ॥
ఒకనాడు పట్టు పరుపులు పరుపబడిన అత్యంత కోమలమైన గద్దెపై ఒత్తిగిలుతూ, దిశ మారుస్తూ ఆనందించేవాడిని. ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగిలవలసి వస్తోంది. అయ్యో ఆ బతుకేడ? ఈ చావేడ? .
పక్షీంద్రా! తరువాత జీవిని మరల పిండోదకాలు పుచ్చుకోనిచ్చి యమదూతలు ‘పయెవర్షణము’ అను నగరి వైపు ఈడ్చుకుపోతారు. దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డళ్ళతో నెత్తిపై మోదుతుంటారు. అపుడు జీవీ తన పాత సుఖజీవనంతో ఈ బాధామయ జీవనాన్ని మరొకసారి పోల్చుకొని ఇలా దురపిల్లుతాడు :
క్వ భృత్య కోమల కరైర్గంధ తైలావసేచనం ॥
క్వ కీనాశానుగైః క్రోధాత్కుఠారై శిరసి వ్యథా । 140
అయ్యో నా ఖర్మమా! ఒకప్పుడీ తలపై తీయని తలపుల ఊగించే చిరునవ్వులు జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారికలు సుగంధాలను వెదజల్లే తైలాలతో మర్దన చేసేవారు. అటువంటి తలపై నేడీ కఠోర మనస్కులైన యమదూతలు వికటాట్టహాసాలు చేస్తూ గొడ్డళ్ళతో మోదుతున్నారు. ఆ బతుకెక్కడ? ఈ చావెక్కడ?
ఈ పయోవర్షకాన్నుండి, ఊనాబ్దిక శ్రాద్దాన్ని తిన్నాక, ఏడాది గడుస్తున్నదనగా మృతులు ‘శీతాఢ్య నామక నగరి’ వైపు ఈడ్చుకుపోబడతారు. దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతుంటారు. అప్పుడా పాపి ఇలా గోలపెడతాడు.
ప్రియాలాపైః క్వచ రసమధురత్వస్య వర్ణనం ।
ఉక్తమాత్రేఽసి పత్రాది జిహ్వాఛ్ఛేదః క్వ చైవహి ॥ 14ఽ
అయ్యయ్యో! ఒకనాడు నా చక్కని, చల్లని కబుర్లు విని ఈ నాలుక రసాభ్యుచిత బంధమని లోకులు ప్రశంసించేవారు. నేడదే షడ్రసాలను రుచులను మాటతేటలను అనుభవించిన నాలుక నీ ముష్కరులు తెగగోస్తున్నారు కదా! అట్టి బతుకేడ? ఇట్టి చావేడ? ఒకటి మాత్రం నిజం. ఆ బతుకక్కడ. ఈ చావిక్కడ.
అనంతరం అదే నగరంలో ఆ మృతకులు వార్షిక పిండోదకాలనూ శ్రాద్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలనూ సేవించి తమ శరీరాలు మారి పిండజ శరీరంలో ప్రవేశించి
‘బహుభీతి’ అనే నగరాన్ని చేరుకుంటారు. ఆ మార్గంలో పాపి తన పాపాలన్నీ గుర్తుకు రాగా తనను తానే నిందించుకుంటాడు. కొద్దికాలంలోనే యమపురిని చేరుకుంటాడు.
ఈ యమలోక విస్తృతి నలుబది నాలుగు యోజనాలు. అక్కడ ‘శ్రవణ’ నామకులైన పదముగ్గురు ప్రతీహారులుంటారు. వీరికి శ్రవణ కర్మ అంటే ఇష్టం. దానిని చేస్తే సంతోషిస్తారు. చేయకపోతే క్రుధ్ధులైపోతారు. ఆ లోకంలోకి చేరుకున్న (లోనికి పోయిన) పాపులు మృత్యుకాలం, అంతకుల మధ్య, కొండంత ఆకారంతో, అలవిమాలిన క్రోధం వల్ల ఎఱ్ఱబడ్డ కన్నులతో భయంకరంగా నున్న యమరాజును దర్శిస్తారు. ఆయన ముఖమండలం విశాలదంతయుక్తమై మరింత భయం గొలుపుతూ వుంటుంది. ఆయన ముడివడిన దట్టమైన కనుబొమలింకా జడిపిస్తాయి. అయనను నలువైపులా పరివేష్టించి సేవిస్తూ వికృత ముఖాకృతులతో రూపు కట్టిన వేలాది వ్యాధులుంటాయి. యమధర్మరాజు ఒక చేత దండాన్నీ మరొక చేత భైరవ పాశాన్నీ ధరించి వుంటాడు
యముని వద్ద శ్రవణులనే వారుంటారు. వీరు బ్రహ్మపుత్రులు. త్రిలోకాలలో ఎక్కడైనా ఏ ఆటంకమూ లేకుండా సంచరించగలరు, దూరశ్రవణ, దూరదర్శనాది విద్యలున్నవారు. వారి భార్యలూ అలాటి వారే. వారిని శ్రవణీలాంటారు. వారీ ముల్లోకాలలో గల స్త్రీల చేష్టలను గ్రహించగలరు. ఈ శ్రవణీ శ్రవణులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరే పాపాలు చేశారో చిత్రగుప్తునికి చెప్తారు.
యమలోకానికి చేరుకున్న ప్రతి జీవీ యముని ద్వారా ఆదేశింపబడిన శుభాశుభగతులలోకి పోవలసి వుంటుంది. పాపాత్ముల గతులనిదివఱకే విన్నావు కదా! వారు యముని న్యాయమైన తీర్పు వెలువడగానే అక్కడి నుండి తొలగింపబడతారు. వెంటనే యముని ఆకృతి మారిపోతుంది. అక్కడ మిగిలిన పుణ్యాత్ములకు, ఛత్ర, పాదుకా, గృహాదీ దానాలు చేసినవారికి (వీరు మరో దారిలో పూల బాటలపై వచ్చి అక్కడ చేరతారు) సౌమ్యస్వరూపుడై, కర్ణకుండలాలతో స్వర్ణ కిరీటంతో ఇతరేతర దేవోచితాలంకారాలతో చిరునవ్వునూ కనులలో కరుణనూ కనబరుస్తూ యమధర్మరాజు దర్శనమిస్తాడు. శోభాసంపన్నుడై వారితో మాట్లాడతాడు. వారి వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో, ఇంకా ఉత్తమ జన్మలకో పంపిస్తాడు. కాబట్టి గరుడా! పాపకర్మలనే చేయని వాడు, పుణ్యకర్మాల వూసే పట్టనివాడు, (ఆడవారు కూడా) పుణ్యం చేసినా దానికి కొన్ని రెట్లు పాపం చేసినవాడు సుఖపడరు. వత్సా! ఇంకేమి వినగోరెదవు?
