2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

11 - జీవుని ఊర్థ్వ అధోగతుల వర్ణన

‘పరాత్పరా! మనిషిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్నాశ్రయించి మరణించేదెవరు? ఇంద్రియాలు కాదు కదా! మరి అవి ఏమైపోతాయి? మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు? ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడెలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికెలా వెళ్తాడు? యమలోకానికీ విష్ణులోకానికీ ఏయే మార్గాల్లో వెళతాడు? ప్రభో! నా పట్ల ప్రసన్నులై దయ చేశారు కాబట్టి నా ఆత్రాన్ని మన్నించి నా అజ్ఞానాన్ని దూరం చేయండి’ అడిగాడు గరుడుడు.

‘ఓయి వినతానందనా! పరస్త్రీనిగానీ, బ్రాహ్మణుని ధనాన్నిగానీ అపహరించినవాడు నిర్జనప్రదేశంలోగానీ మహారణ్యంలోగానీ బ్రహ్మ రాక్షసిగా పుడతాడు. రత్నాల దొంగ నీచయోనిలో పడతాడు. కొన్ని జన్మలు ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న అశలకూ, కోరికలకూ అనుగుణంగా కూడా వస్తాయి. నవరంధ్రముల కాయం మానవ శరీరమను మాట విని యున్నావు కదా! సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం నాభి నుండి పైవఱకూ గల ఊర్ధ్వ ఛిద్రాల నుండి బయటకు పోతుంది. శరీరం ద్వారా చేసే పనులను శరీరంతోనే అనుభవించాలి. ఒక్కటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి. అనాసక్త భావంతో అన్నీ సత్కర్మలే చేసేవాడు అన్ని చోట్లా సుఖాన్నే అనుభవిస్తాడు. అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు. మాయ వలలో పడి వికర్మలనే చేసేవాడు పాశబద్ధుడై కష్టాల పాలవుతాడు.