2 - గరుడ పురాణము - ప్రేత కాండము
19 – జీవుడు యమ పురిలో ప్రవేశించుట, శుభాశుభ కర్మ ఫలభోగం - కర్మానుసారం అన్యదేహప్రాప్తి ధర్మాచరణమే మనిషి ముఖ్య కర్తవ్యం
ఇదివఱకే చెప్పబడిన పదహారు పురాలనూ దాటి యమునికి దగ్గరగా నున్న బహుభీతికర నామక పురంలో అంతవఱకు హస్తం పరిమాణంలో వున్న శరీరం చిటికెన వేలంత అయిపోగా, జీవుడు గాలిలో ఎగురుతూ అక్కడక్కడ శమీపత్రాలపై కూర్చుంటూ యముని వద్దకూ ఆ తరువాత ఆయనతో కలసి చిత్రగుప్తపురీ చేరుకుంటాడు.
ఈ చిత్రగుప్త పురి ఇరవై యోజనాలలో పఱచుకొని వుంటుంది. ఇక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు అన్ని రకాల ప్రాణుల పాప-పుణ్యాలనూ పూర్తిగా గ్రహించి వుంటారు. ఇదివఱకు నేను నుడివినట్లుగానే యమధర్మరాజు పాపులకొకలా కనిపిస్తే పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానములు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు.
ప్రాప్తం సుకృతినందృష్ట్వా స్థానాచ్చలతి సూర్యజః ।
ఏషమే మండలం భిత్త్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ॥ 19.9
పుణ్యాత్ములాయన మండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెళతారు. దానం వల్ల ధర్మం లభిస్తుంది. ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖావహమవుతుంది. ఈ మార్గంలో పాపులు పడే కష్టాలనిదివఱకే చెప్పడం జరిగింది. పాపులే కాకుండా సరిగ్గా అపరకర్మలు జరపనివారూ, జరగనివారూ కూడా పాపులే కాబట్టి అన్ని కష్టాలూ పడతారు. కాబట్టి దానం చెయ్యాలి. అలా చెయ్యని వానిని ఆ యమదూతలు పశువు మెడలో తాడుకట్టి లాగి నట్లు ఈ నిర్ధానులను లాగుతారు. ధర్మాన్ని పాలించినవారు అమరత్వం చెందుతారు. ఇలా :
యథా యథా కృతం కర్మ తాంతాం యోనిం వ్రజేన్నరః ।
తత్తథైవ చ భుంజానో విచరేత్ సర్వలోకగః ॥
అశాశ్వతం పరిజ్ఞాయ సర్వలోకోత్తరం సుఖం ।
యదాభవతి మానుష్యం తదాధర్మం సమాచరేత్ ॥
కృమయో భస్మ విష్టావా దేహానం ప్రకృతిః సదా ।
అంధ కూపే మహారౌద్రే దీపహస్తః పతేత్తు వై ॥
మహాపుణ్య ప్రభావేణ మానుష్యం జన్మలభ్యతే ।
యస్తత్ ప్రాప్య చరేద్ధర్మం సగచ్ఛేత్ పరమాంగతిం ॥
అపిజానన్ వృథాధర్మం దుఃఖ మాయాతి యాతిచ ।
జాతీశతేన లభతే కిల మానుషత్వం ॥
తత్రాపి దుర్లభతరంఖగ భోద్విజత్వం ।
యస్తత్ర పాలయతి లాలయతి వ్రతాని
తస్యామృతం భవతి హస్తగతం ప్రసాదాత్ ॥ 19.ఽ1
