2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

25 - సత్పుత్ర మహిమ - విలక్షణ, పుత్రకృత అన్త్యేష్ఠిఫలం

గరుడా! మాతాపితలకు సర్వసుఖాలనూ ఏర్పాటు చేసే కొడుకే సత్పుత్రుడు. అతడే వారి ప్రేమాభివర్ధకుడు. ఒకే అకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు నేలపై పెట్టబడిన నీటి కుండలలో భిన్నానేకాకారాలతో కనిపించినట్లే ఒకే తండ్రి యొక్క అత్మ అయన పుత్రులందరిలోనూ కదులుతుంటుంది. ఒక కొడుకు తండ్రిలాగే ఉండవచ్చు. ఇంకొకడు తల్లిని పోలవచ్చు, మరొకడు మేనమామ పోలిక కావచ్చు, వేరొకడు వీరందరికీ భిన్నంగా ఉండవచ్చు. అయినా ఆ తండ్రి సంస్కారమే చిన్నతనంలో అందరికీ అలవడుతుంది. కొందరు పుత్రులు తండ్రుల కన్న అత్యధిక రూపవంతులు, గుణవంతులు, దాన పరాయణులు కావచ్చు కొందరు దీనికి విపరీతమూ కావచ్చు. ఒక్కటి మాత్రం నిజం - గుడ్డివాడికి గుడ్డివాడే పుట్టాలని లేదు. మూగవానికీ అంతే. ఏ వైకల్యమూ, తండ్రిది కొడుక్కి, పుట్టుకతోనే రావాలని లేదు. పండితపుత్రుడు పండితుడైనా కావచ్చు, పరమశుంఠ కూడా కావచ్చు. ఎక్కడా అనురూపతా ఏకరూపతా లేనిదే భగవత్ సృష్టి.

‘ప్రభో! పరంధామా! ఔరస, క్షేత్రాది పదిరకాల పుత్రులుంటారు కదా! వీరిలో సంగృహీత (ఎక్కడి నుండో తెచ్చిన) పుత్రుని వల్లా, దాసీపుత్రుని వల్ల కలిగే ధార్మిక ప్రయోజనము ఏముంటుంది?

‘గరుడా! అప్పుడే పుట్టిన కొడుకు ముఖం చూడగానే ఎవరికైనా పితౄణం నుండి ముక్తి లభిస్తుంది. మనుమని (పౌత్రుని) ముఖం చూడగానే త్రి (దేవ, పితృ, ఋషి) ఋణాలూ తీరిపోతాయి. ప్రపౌత్రుని ముఖం చూసినారికి అనంత, స్వర్గలోకాల ప్రాప్తి వుంటుంది. (దశవిధ పుత్రులకూ ఇది వర్తిస్తుంది)

క్షేత్రజ పుత్రుడు తన తండ్రికి లౌకిక సుఖాన్ని మాత్రమే కలిగించగలడు. ఔరస పుత్రుడే తన తండ్రికి విద్యుక్తంగా పార్వశ్రాద్ధాన్ని పెట్టాలి. మిగతా పుత్రులంతా ఏకోద్దిష్ట శ్రాద్దాన్నే పెట్టడాని కధికారులౌతారు కాని పార్వణానికి కాదు. బ్రహ్మ వివాహ నియమాల ప్రకారం పండిన దాంపత్యంలో పుట్టిన కొడుకు తండ్రిని స్వర్గానికి పంపించగలడు. సంగృహీత, దాసీ పుత్రులు తీర్థాలలో తమ తండ్రికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. తండ్రి పేర బ్రాహ్మణులకు దానాలీయవచ్చును.