2 - గరుడ పురాణము - ప్రేత కాండము
37 - ఔర్ధ్వ దైహిక కర్మలో ఉదకుంభదాన మాహాత్మ్యము
గరుడా! అన్నంతో జలంతో నింపిన కుండలను ప్రేతాన్నుద్దేశించి దానం చెయ్యాలి. ఇది విశేషించి ప్రేతానికి ముక్తిదాయకం. పన్నెండవ రోజు, ఆరవ నెల, త్రిపక్ష, వార్షిక శ్రాద్ధ దినాల్లో, ముఖ్యంగా, జీవియొక్క యమమార్గ యానంలో సుఖాన్ని ప్రదానం చేయడానికి ఉపకుంభాన్నివ్వాలి. పేడతో బాగా అలికిన భూమి మీద ప్రతిరోజూ తిలలతో లేదా పక్వాన్నంతో, నీటితో నిండిన కుండల నుంచి దానం చెయ్యాలి. అదే స్థానంలో ప్రేతానికుద్దేశించిన పాత్రను కూడా పెట్టి దానం చెయ్యాలి. దీని వల్ల ప్రేతానికి ముక్తి కలిగి యమలోకానికి పోతుంది.
పన్నెండవ రోజు ప్రేతానికి సంస్కారం చేసేటపుడు గావించు జలకుంభదానం విశిష్టమైనది. యజమాని ఆ రోజు సంకల్ప పూర్వకంగా పన్నెండు నీటికుండలను దానం చెయ్యాలి. అదే రోజు పక్వాన్నం, ఫలాలతో నింపిన ‘వర్ధని’ అను ప్రత్యేక జలపాత్రను విష్ణు భగవానునికని సంకల్పించి సుయోగ్యుడు సచ్చరిత్రుడునగు బ్రాహ్మణునికి దానమి వ్వాలి. తరువాత మరొక వర్ధనినీ, పక్వానాన్నీ యమధర్మరాజుకి నివేదించాలి. ఆయన సంతుష్టుడై ప్రేతానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అదే వేళలో చిత్రగుప్తునికి కూడా ఒక వర్ధనిని దానమివ్వాలి.
యజమాని తన తండ్రి పరలోక సుఖాన్ని కాంక్షిస్తూ చిక్కుడు గింజలతో నీటితో నింపిన పదహారు కుండలను దానం చెయ్యాలి. దీని విధానమేంటంటే ఉత్క్రాంతి శ్రాద్ధం నుండి షోడశి దాకా పదహారుగురు బ్రాహ్మణులకు ఒక్కొక్కరికొక్కటి చొప్పున ఇవ్వాలి. మరొక ఉత్తమ ఘటాదానం కూడా వుంది. జలపూర్ణ పాత్రనూ పక్వాన్న పూర్ణమైన పెద్ద కుండనూ నిత్యం దానం చేస్తూ వాటి ప్రక్కనే ఒక కలశను పెట్టి దానిపై వెదురు పాత్రలో మృష్టాన్నము నుంచి పితృదేవతలను ఆహ్వానించి ఆ వర్ధనిని అగరు కుంకుమాదులతో పూజించాలి. తరువాత దానిపై తెల్లటి వస్త్రమును కప్పి మొత్తం వర్ధనిని విధ్యుక్తంగా వైదిక ధర్మాచరణపరుడైన పరమపుణ్యశీలియైన బ్రాహ్మణునికి రోజుకొకటిగా ఇవ్వాలి. ఆయన ఈ దాన ప్రభావం వల్ల తానూ ఉద్ధరింపబడతాడు. యజమానినీ ఉద్దరింపగలడు.”
