2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

34 - శయ్యాదాన మహిమ

గరుడా! సత్యయుగంలో తపస్సూ, త్రేతాయుగంలో జ్ఞానార్జన, ద్వాపరంలో యజ్ఞాలూ, కలియుగంలో దానాలూ, జీవులకు తరుణోపాయాలని వినియున్నావు కదా! శ్రాద్ధకర్మకు సంబంధించి అన్ని దానాలపై నీకవగాహన వుంది. ఇపుడు శయ్యాదాన మహిమను వినిపిస్తాను.

శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వదా శయ్యా దానాన్ని ప్రశంసిస్తుంటారు. ఈ జీవితం అనిత్యం. మృత్యువు కబళించిన అనంతరం జీవనాన్ని గాని మరి దేనిని గాని ఎవరిస్తారు? మనిషి మరణించగానే వాని బంధుమిత్రాదులు బలవంతం మీద మనసును మళ్ళించుకుని వానికి అన్ని విధాల దూరమై పోతారు. కాబట్టి ఆత్మ ఒక్కటే మనిషికి నిత్యబంధువు. ఎందుకంటే ఒక జన్మలోని బంధువుల బంధాలన్నీ ఆ జన్మతోనే సరి. ఆత్మబంధం అలా కాదు కదా! కాబట్టి ఈ ఆత్మ సుఖపడాలంటే మనిషి తాను బతికుండగానే వీలైనంతమందికి చేయగలిగినన్ని దానాలు చెయ్యాలి. వాటిలో ముఖ్యమైనది శయ్యాదానము. మంచిదైన గట్టిదైన కర్రతో నొక సుందరమైన మంచాన్ని నిర్మించి స్తోమతు వుంటే ఏనుగుదంతాలతో బంగారు గొలుసులతో లేకుంటే ఇనుముతో దానినలంకరించి దానిపై లక్ష్మీసహితుడైన శ్రీ మహావిష్ణువు స్వర్ణప్రతిమను స్థాపించాలి. తరువాత ఆ శయ్యకు దగ్గరగా నేతితో నింపిన కలశనుంచాలి. ఆ కలశ మృతవ్యక్తినీ పుత్రునీ సుఖపెడుతుంది. విద్వాంసులు దీనినే ‘నిద్రా కలశ’ అన్నారు. తాంబూలం, కేసరి, కుంకుమ, కర్పూరం, అగరు, చందనం, దీపం, పాదుకలు గొడుగు, చామరం, ఆసనం, పాత్రలు, సప్తధాన్యాలు - వీటిని శయ్యకు దగ్గరలో నుంచాలి. వెండి లేదా బంగారపు కొమ్ము చెంబునూ, కమండలువునూ, అద్దాన్నీ, పంచరంగుల చాందనినీ శయ్యకు జతపఱచి బ్రాహ్మణునికీ దానమివ్వాలి. ముందుగా ఆ బ్రాహ్మణ దంపతులను పూజించి, మంచి ఇంటిని వస్తువులతో సహా ఇచ్చి అప్పుడు శయ్యాదానం గావించాలి. చివరగా పంచరత్న, ఫల, అక్షత సమన్వితమైన అర్ఘ్యాన్ని ఆ బ్రాహ్మణుని కర్పించి ఇలా ప్రార్థించాలి :  

యథాన కృష్ణశయనం శూన్యం సాగర కన్యయా ।

శయ్యా మహాప్యశూన్యాస్తు తథాజన్మని జన్మని ॥ 34.81

తరువాత క్షమాపణ వేడుకొని ఆ బ్రాహ్మణ దంపతులను సాదరంగా వీడ్కోల్పాలి. ఇది ఏకాదశాహ సంస్కారంలో ముఖ్యమైన శయ్యాదానవిధి. గరుడా! బంధువు మృతి చెందినపుడు అతని శయ్యని కూడా దానం చేసి వేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనిని మృతశయ్య అంటారు. దానిపై విష్ణుదేవుని స్వర్ణ ప్రతిమనూ మృత వ్యక్తి మిక్కిలి ఇష్టంతో వాడుకున్న అన్ని వస్తువులనూ పెట్టి పైన చెప్పిన విధంగా ఇతర ద్రవ్యాలతో సహా విద్వాంసుడైన బ్రాహ్మణునికి దానం చెయ్యాలి.

ఈ శయ్యాదానం వల్ల కలిగే సుఖం యమరాజు, దేవేంద్రుల గృహాలకు ఆ మృతవ్యక్తి సాదరంగా ఆహ్వానింపబడినపుడు తెలుస్తుంది. యమదూతలుగాని యమధర్మరాజుగాని ఆ వ్యక్తికి భయంకరంగా కనిపించరు. పుణ్యపాపాలను లెక్కవేసినప్పుడు ఈ శయ్యాదానం పరిగణనలోకి తీసుకొనబడుతుంది. పేదవాడు వెండి బంగారాల ప్రసక్తే లేకుండా వాని తండ్రి శయనించిన నులక మంచాన్ని దానం చేసినా సంపూర్ణ శయ్యాదాన ఫలం తండ్రీ కొడుకులిద్దరికీ దక్కుతుంది.

స్త్రీ మృతి చెందినప్పుడు శయ్యపై స్వర్ణ ప్రేత (ఆ స్త్రీ పోలికలతో) ప్రతిమనుంచాలి. అమె ధరించిన ఆభరణాలన్నింటిని దానిపై ఉంచాలి. వస్త్రాలను, ఆమె ఇష్టపడి వాడిన వస్తువులను కూడా ఉంచి, లోకపాలురను, ఇంద్రాది దేవగణాలనూ, సూర్యాది గ్రహాలను, గౌరీ దేవినీ, గణేశునీ పూజించాలి. తరువాత తెల్లబట్టలను కట్టుకొని గృహస్థుడైన ఆచార్య దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్ర శ్లోకాన్నుచ్చరించాలి :

ప్రేతస్య ప్రతిమాహ్యేషా సర్వోపకరణైర్యుతా ।

సర్వరత్న సమాయుక్తా తవ విప్ర నివేదితా ॥

ఆత్మాశంభుః శివాగౌరీ శక్రః సురగణైః సహ ।

తస్మాచ్ఛయ్యా ప్రదానేన సైష ఆత్మా ప్రసీదతు ॥ 34.97

బ్రాహ్మణుడా దానాన్ని గ్రహిస్తూ కోఽదాత... అనే మంత్రాన్ని చదవాలి. తరువాత దాత ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరించి సాదరంగా వీడ్కోల్పాలి.

గరుడా! ఒక శయ్యను ఒక బ్రాహ్మణునికే దానం చేయాలి. గోవు, శయ్య, గృహం, స్త్రీ - ఒకదాని నొక్కరికే దానం చేయాలి. అనేకులకు దానమీయడం పాపం.

శయ్యాదానం వల్ల గొప్ప ఫలితాలుంటాయి. దాతకి నూరు దివ్య వత్సరాల స్వర్గనివాస ప్రాప్తి లభిస్తుంది. వ్యతిపాత యోగ, కార్తిక పూర్ణిమ తిథులలో గాని, మకర, కర్కాటక సంక్రాంతి నాడుగాని, సూర్యచంద్ర గ్రహణాలందుగాని చేసే దానానికి మరింత అధిక ఫలముంటుంది. అలాగే ద్వారక, ప్రయాగ, గంగ, యమున, సింధు నదీ సాగర సంగమ స్థలాలు, కురుక్షేత్ర, నైమిషారణ్య, అర్బుద పర్వతం వంటి పుణ్యస్థలాలలో చేసే దానాలకూ అద్భుత ఫలాలుంటాయి. స్వర్గలోక నివాసానంతరం పుడమిపై పుట్టినపుడా దాత తాను మృతి చెందిన చోటనే సుందరస్వరూపుడు, మహాధనికుడు, ధర్మజుడు, సర్వశాస్త్రజ్ఞాతయునై జన్మిస్తాడు. ఈ జన్మాంతమున నాతనికి వైకుంఠ నివాసప్రాప్తి వుంటుంది. ఆ తరువాత పితృలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు.