2 - గరుడ పురాణము - ప్రేత కాండము
3 - నరకస్వ రూపం, అక్కడ వివిధ యాతనలు, అందులో పడే జీవుల గతి
నరకాలు చాలానే వున్నాయి గానీ కొన్నిటిని మాత్రం వర్ణిస్తాను.
రౌరవము అనే పేరు గల నరకం ప్రధానమైనది. అబద్దాలు చెప్పి, అబద్ధ సాక్ష్యాలిచ్చి ప్రజల హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు. దీని వైశాల్యం రెండు వేల యోజనాలు. దీని చుట్టూ దుస్తరమై తొడల దాకా వచ్చు కందకముంది. అది అగ్నిమయం.
గమనిక మధ్య మధ్యలో పాపులను అందులో పడేసి మరల తీస్తుంటారు. నరకానికి రాగానే ప్రతి ఆత్మకూ ఒక శరీరాన్నిస్తారు. అది కాలుతుంది, చురుకుతుంది, తీవ్రమైన బాధ తెలుస్తూనే వుంటుంది. కాని ఆ శరీరం భస్మం కాదు. మృతి చెందదు. అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటూ ఇటూ పరుగెడతారు. కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి. వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత ఉంటుంది. అలా ఒక వేయి యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి అత్మ మరో నరకంలోకి త్రోసివేయబడుతుంది.
ఇక మహా రౌరవ నరకముంది. ఈ నరకం అయిదువేల యోజనాల విస్తీర్ణంలో పఱచుకొని వుంది. అక్కడ నేల రాగిరేకు వలె వుంటుంది. దాని క్రింద అగ్ని నిత్యం రగులుతుంటుంది. ఆ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతులీనుతుంటుంది. అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది. యమదూతలు పాపుల కాలుసేతులను గట్టిగా కట్టి వైచి ఆ నేలపై దొర్లిస్తారు. పాపి అలా దొర్లుతూనే వుండగా మార్గంలో కాకులు, కొంగలు, తోడేళ్ళు, గుడ్లగూబలు, మొసళ్ళు, తేళ్ళు వచ్చి పొడుస్తూ, చీల్చుతూ, కరుస్తూ, కుడుతూ అందినంతమేరకు నమిలి తింటూ వుంటాయి. పాపి కనుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతుంటుంది. పాపులు అరుస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు, అయినా దొర్లించబడుతూనే వుంటారు. వారి శిక్షా కాలం పూర్తి అయ్యేదాకా తినబడడానికే అన్నట్టు ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే వుంటుంది. పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం వుంటుంది. అది పూర్తికాగానే తెలివి తప్పుతుంది. తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో, మరో యోనిలోనో.... ఎక్కడో.
గరుడా! అతి శీతము అను పేరు గల మరో నరకముంది. ఇక్కడ అత్యంత శీతలం బాధపెడుతుంది. దీని పొడవు వెడల్పులు మహా రౌరవంతో సమానంగానే వుంటాయి. చీకటితో అంతటా నిండి వుంటుంది. సహింపరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కూపంలాటి లోకంలోకి విసిరేస్తారు. పాపులకు దిక్కు తోచదు. గుడ్డితనం వచ్చేసిందేమోనని భయమేస్తుంది. తట్టుకోలేనంత వణకుతో శరీరం తల్లడిల్లిపోతుంటుంది. పళ్ళు టపటపా కొట్టుకొని విరిగిపోతుంటాయి. ఇతర పాపులు తగులుతుంటారు. ఆలింగనం చేసుకుంటారు. కాని, వారు తమ లాటి వారో పిశాచాలో రక్కసులో తెలియదుగా! పీక్కు తింటారేమో అనే భయంతో విడివడిపోతుంటారు. అక్కడ దాహం, ఆకలీ చాలా ఎక్కువగా వుంటాయి. ఎంత తడిమినా తినడానికీ తాగడానికీ ఏమీ తగలవు. ఇంతేకాక మంచుగడ్డల్ని మరింత గడ్డ కట్టించేటంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తుంటాయి. ఆ గాలుల తాకిడికి ఎముకలు పుటుక్కున విరిగిపోతుంటాయి. శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావృత నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చిపడుతుంది. ఖగరాజా! అసంఖ్యాకంగా పాపాలు చేసినవారు ఇందాక అనుకున్నట్లు వెలుగులో పడరు.
నికృంతనము అను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. నిజానికవి దర్జీ చక్రాలు. వాటి క్రిందని సూదులుంటాయి. చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి శిరస్సు దాకా ప్రయాణిస్తాయి. యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు. అవి అలా తిరుగుతూనే వుంటాయి. పాపి శరీరం అరికాలి నుండి శిరస్సు దాకా పోయి తాలువులోంచి పైకి వచ్చి మరల అదే అరికాలిలో మరొక కన్నం చేసుకొని ప్రవేశించే పొడవాటి సూదులతో కుట్టబడుతూనే వుంటుంది.
అరుణాసుజా! అప్రతిష్ఠము అను పేరు గల ఇంకో నరకముంది. అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలను అనుభవిస్తారు. వీరు దారుణ దుఃఖం పాలగుటకు కారణం ఇక్కడి చక్రం, దాని పైనుండు గిలక. పాపులను ఈ చక్రంపై కట్టి పడేస్తారు. ఆ చక్రం తిరిగినప్పుడల్లా పై నుండి బల్లెములు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ వుంటాయి. ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతుంటుంది. పాపుల అన్ని రంధ్రాల నుండీ రక్తం కారుతూనే వుంటుంది.
ఖగేంద్రా! అసిపత్రవనము అనే పేరు గల వేరొక నరకాన్ని వర్ణిస్తాను. ఇదొక వేయి యోజనాల మేరపఱుచుకొని వుంటుంది. ఇక్కడి నేల నిరంతరం అగ్నిజ్వాలల్లో మండుతూ వుంటుంది. ఈ భయంకర నరకంలో పదునాల్గుగు సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తుంటారు. అక్కడి పాపులు నిత్యం హాహాకారాలు చేస్తూ తగలబడుతుంటారు. కాని శరీరాలూ అలాగే వుంటాయి. ఒంటిమంటలూ అలాగే ఉంటాయి. ఈ నరకంలోనే నాలుగవ భాగంలో శీతస్నిగ్ధపత్రము అను వనమున్నది. ఇక్కడ పండ్లూ ఆకులూ నేలపై కుప్పలుగా పడివుంటాయి కాని అక్కడే ఘోర మాంసాహారులూ పులులు కన్న శక్తిమంతాలనగు వేటకుక్కలు కూడా వుంటాయి. వాటి వదనాలు మరీ పెద్దవిగానూ వాటిలోనూ దంతాలు పరమ బలిష్టంగానూ పారల వలె పైకీ గునపాల వలె క్రిందికీ వుంటాయి. చల్లగా నీడలు పఱచుకొని వున్న ఆ వనాన్ని చూసి ఆకలీ దాహమూ తీర్చుకుందామనే ఆత్రంతో ప్రాణులటువైపు వెళతారుగానీ అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటాయి. ఇవి ఇలా వుండగా అగ్గిలో పడి బొబ్బలెక్కిన వారి కాయాలపై పైనుండి ఆకులు రాలి పడతాయి. అవి మామూలు ఆకులు కావు చురకత్తులు. అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేటకుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలు ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు.
తప్తకుంభము అను మరొక నరకముంది. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బానలుంటాయి. వీటిలో నూనె, ఇనుపరజనూ వుండి వీటి కింద పెద్ద పొయ్యిలలో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. ఒక్కొక్క బానలో పది మంది మనుషులు సులువుగా పట్టే వీలుంటుంది. యమభటులు పాపులను అందులో పడవేస్తారు. పదునునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొడుస్తూ వేయిస్తుంటారు. ఈ లోగా క్రూరమై గునపాలంతేసి ముక్కులున్న గ్రద్దలు ఈ బానలలోకి ముక్కులను పెట్టి పాపుల మాంసమును ముక్కుతో పట్టి లాగుతుంటాయి. యమదూతలు వేపుడు కూరను మార్చి పారేసినట్లు ఈ పాపులను ఆ బానల్లో అలా వేయిస్తూనే వుంటారు. ఇదీ తప్తకుంభ నరకం. ఇప్పటిదాకా వర్ణింపబడిన ఏడూ ప్రధాన నరకాలు. ఇంకా కొన్ని నరకాలున్నాయి. వాటి పేర్లను పాపాలతో కలిపి వచిస్తాను.
|
పాప కర్మ |
నరకము |
|
గోహత్య, భ్రూణహత్య, ఇంటికి నిప్పు |
రోధ |
|
బ్రహ్మఘాతం, మద్యపానం, స్వర్ణచౌర్యం |
సూకర |
|
క్షత్రియునిగాని వైశ్యునిగాని హత్య |
తాల |
|
బ్రహ్మహత్య, గురుపత్నీ లేదా సోదరీగమనం |
తప్తకుంభము |
|
రాజపురుషుడై వుండి అబద్ధమాడుట |
తప్తకుంభము |
|
నిషిద్ధ పదార్థ విక్రయం, మదిరతోడి వ్యాపారం, స్వామి భక్తులను త్యజించుట |
తప్తతాహ |
|
వేదనింద, వేద విక్రయం, కన్యతో సంభోగం, పుత్ర వధువుతో చీకటి తప్పు |
మహాజ్వాల |
|
స్త్రీతో అగమ్యగమనం, గురువును అవమానించుట, వాగ్బాణాలతో హింసించుట |
శబల |
|
వీరుడై శౌర్య ప్రదర్శనలో అమర్యాద ప్రవర్తన |
విమోహన |
|
అందరికీ అనిష్టమే చేయుట |
కృమిభక్ష |
|
దేవబ్రాహ్మణ ద్వేషము (లోన, బైట) |
లాలాభక్ష |
|
తోటలను తగలెట్టుట, ఇతరుల ఇళ్ళలో అధికారమును ఆక్రమించుట |
విషంజన |
|
నక్షత్రాలతో జీవికోపార్జన, అసత్ పాత్రకు దానం, అయాజ్య యాజకం, అర్హత లేకున్నా పోయి దానం స్వీకరించుట |
అధఃశిర |
|
మద్య మాంసాది పదార్థాల విక్రయం; కోడి, పిల్లి, పక్షి, పంది, లేడి, తోడేళ్ళను బంధించిడము |
పూయవహ |
|
గృహ దహనం, విషమిచ్చుట, కుండాశం, సోమ విక్రయం, మద్యమాంస వినియోగం , సేవనం, పశువులను చంపుట |
రుధిరాంధ |
|
సహపంక్తిలోనున్న వానికి విషం పెట్టుట |
వింభుజ |
|
తేనెను తీయుట, తేనెను తీసి అమ్ముట |
వైతరణి |
|
క్రోధం, మంచి సుఖాన్ని కోపించి చెడగొట్టుట |
మూత్రసంజ్ఞక |
|
అపవిత్రత, క్రోధం |
అసిపత్రవనం |
|
మృగాలను చంపుట, తినుట |
అగ్నిజ్వాల |
|
దీక్షను పొంది నియమాలను పాటించకుండుట |
సందంశ |
|
సన్యాసి, బ్రహ్మచారి స్వప్న స్ఖలనం |
ఆభోజన |
ఇంకా చాలా పాపాలెలాగైతే వున్నాయో నరకాలూ చాలానే వున్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం, పిండి పిండి చెయ్యడం, కషాయం వలె ముద్ద చెయ్యడం, గాలితో శిక్షించడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడి ఒక్కరోజే నూరు రోజుల బాధలను అనుభవంలోకి తెస్తుంది.
ఎక్కడో, ఎంతో పుణ్యం చేసుకొన్న మానవులకు తప్ప, సామాన్యంగా ఏ మనిషీ పోయిన వెంటనే నరకానికీ, స్వర్గానికీ వెళ్ళి వచ్చి వెంటనే మనిషిగా పుట్టెయ్యడం జరుగదు. మహాపాపులు నరకం నుండి వచ్చి మొక్కగానో, చెట్టుగానో పుడతారు. తరువాత క్రిమి, కీటక, దీపక షట్పది జన్మలూ, తరువాత గాడిద వంటి జంతువుల నుండి అడవి ఏనుగు దాకా తన పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. పిమ్మట ఇంకా చాలా పాప ఫలాలు మిగిలివారు గూని, మరుగుజ్జు, వామన, చండాల, పుల్కశ మున్నగు మానవజన్మలెత్తి, అప్పుడు సంపూర్ణ మానవ జన్మను పొందవచ్చును. అందుకే అంటారు పెద్దలు ‘నరజన్మ బహు దుర్లభ’మని. ఈ మానవులలోనే కొందరు బహు పుణ్యప్రదులు దేవతలు కావచ్చు, ఇంద్రులూ కావచ్చు.
పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే. అయన అనుమతిని పొందిన పుణ్యాత్ములను దేవదూతలు వచ్చి సుందరనూపురాది నానాభరాలనూ పెట్టి, సుమధుర గీతాలను పాడుతూ వాటికి తగిన అందమైన నృత్యాలను చేస్తూ, చందనాది దివ్య సుగంధాలను పూసి, మరింత హృద్య సుగంధాలను వెదజల్లే పూలమాలలతో అలంకరించి దివ్యకాంతులు వెదజల్లు విమానాలలో కూర్చుండ బెట్టి స్వర్గానికి గొనిపోతారు. పుణ్య సమాప్తి తరువాత వారు మరల పుడమిపై పుట్టవలసి వచ్చినపుడు సుక్షత్రియులుగానో మహాత్ములుగానో - అట్టి వారింటనే పుట్టి పెరిగి - పరిఢవిల్లుతారు. వీరికి ఈ జన్మలో బ్రహ్మాండమైన భోగభాగ్యాలబ్బుతాయి. వాటిని వదలి భగవంతుని పనినే చేస్తూ జన్మను చాలించి మోక్షాన్ని పొందే అవకాశమూ వుంటుంది.
భూలోకంలో జన్మించినపుడు మరణం తప్పదు. ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృధ్విలోనూ, జలతత్త్వం నీటిలోనూ, తేజ తత్త్వం తేజంలోనూ, వాయు తత్త్వం గాలిలోనూ, ఆకాశ తత్త్వం నింగిలోనూ సర్వవ్యాపియైన మనస్సు చంద్రునిలోనూ విలీనమైపోతాయి. గరుత్మంతా! శరీరంలో గల పంచేంద్రియాల కోరికలూ, కామక్రోధాదులూ చోరులతో పోల్పబడినవి.
కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః ।
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత్త॥
· శంకరాచార్యులు
వాటి బారి నుండి జ్ఞానరత్నాన్ని కాపాడు కోవాలి. ఇంకా కామక్రోధాహంకార నామక వికారాలు కూడా వుంటాయి. వాటికి నాయకత్వం వహించేది మనస్సు. ఈ శరీరానికీ సంహార పత్రాన్ని రాసేది కాలం. ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోకి వెళ్ళినట్లు ఒక శరీరంలో నుండి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది.
ఓ తార్క్ష్య! మానవశరీరం నాడులతో నవద్వారయుక్తమై వుంటుంది. ఈ సాంసారిక విషయ వాసనలచే ప్రభావితములైన కామక్రోధాది వికార సమత్వమై వుంటుంది. రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి వుంటుంది. లోభమనెడి వలలో మోహమనెడి బట్ట ముసుగులో వుంటుంది. మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి వుంటుంది. అన్ని శరీరాలూ ఇంతే. అయినా కొందరు అదే శరీరంలో వుండే ఆత్మను తెలుసుకొని దాని ద్వారా జప తపాది ఆయుధాలతో మాయను సంహరించి పరమాత్మను చేరుకోగలరు. ఆత్మజ్ఞానం లేనివారు పశు సమానులై జీవించి అలాగే పోతారు.
ఈ సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల యోనులున్నాయి.
1. ఉద్భిజ - నేలలో మొలుచునవి
2. స్వేదజ - చెమట నుండి పుట్టునవి
3. అండజ – గ్రుడ్డు నుండి పట్టునవి
4. జరాయుజ (మనిషి మొదలగునవి)
అవి ఈ నాలుగు విధములతో విభక్తములై యున్నవి.
