2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

18 - దానాది కర్మాల ఫలాలు ప్రేతాల కందుట- పదదాన మాహాత్మ్యము, అనంతర దేహప్రాప్తి

పక్షీంద్రా! ఈ శ్రవణులు చెప్పినదంతా విన్న తరువాత చిత్రగుప్తుడు కొన్ని క్షణాలపాటు ధ్యానమగ్నుడై మగిడి వచ్చి ఆ మనిషి రాత్రింబవళ్ళు గావించిన పాపపుణ్యాల ఫలాన్ని యమధర్మరాజుకి విన్నవిస్తాడు.

గరుడా! మనిషి మాట, తనువు, మనసులతో చేసే ప్రతి కర్మకీ ఫలాన్ని అనుభవించ వలసినదే. నీవు విన్న దానిని రేపు ప్రపంచమంతా వింటుంది. అన్నదానం, దీప దానం, తెలిసి చేసేవారు కూడా ‘మహామార్గం’లో (ప్రేత మార్గములో)  సుఖపూర్వకంగా పయనించగలరు.

కార్తిక కృష్ణ చతుర్దశినాడు రాత్రి చేయు దీపాదానం సర్వసుఖకారి, ఇప్పుడొక్కసారి సంక్షిప్తంగా దాన ఫలాలను చెప్తాను. వృషోత్సర్గ పుణ్యం వల్ల మనిషి పితృలోకానికి వెళతాడు. జల పూర్ణ ఘట దానం వల్ల యమదూతలు సంతోషిస్తారు. పదకొండవ రోజున శయ్యాదానం చేయడం వల్ల మనిషి విమానమెక్కి స్వర్గలోకానికి చేరతాడు. విశేషించి, పన్నెండవరోజు అన్ని ప్రకారాల దానాలనూ చేయాలి. పదమూడు పద దానాలనూ చేసినవారు (పితరులూ, పుత్రులు కూడా) వాటి సాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలరు. ఎవని భాగ్యమెలా వున్నదో వాని మార్గసుఖమును బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినపుడెలాగూ చేస్తాడుగా అనుకోకుండా తానే తన జీవిత కాలంలోనే స్వస్థచిత్తుడై అన్ని రకాల దానాలనూ చేసినవాడు సర్వత్ర సుఖపడతాడు’.

‘భగవాన్! పదమూడు పద దానాలంటే ఏమిటి?’

‘ఛత్రం, పాదుక, వస్త్రం, ముద్రిక, కమండలువు, అసనం, భోజన పాత్ర, మరొక ఆసనం, జలపాత్ర, అన్నం, భోజన సామగ్రి, నెయ్యి, యజ్ఞోపవీతం - ఈ పదమూటినీ పదదానాలన్నారు. ఇవన్నీ మృతుని నారకీయ మార్గంలో ఉపయోగపడి ప్రేతానికీ సుఖాన్నిస్తాయి. అంతేకాకుండా దానమిచ్చిన వానికి కూడా గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తాయి.

గృహ్ణాతి వరుణో దానం మమహస్తే ప్రయచ్ఛతి ।

అహంచ భాస్కరే దేవో భాస్కరాత్ సోఽశ్నుతే సుఖం॥ 18.ఽ7

మృతుని బంధువు అతని ఇంటి వద్ద చేసిన దానాన్ని వరుణుడు స్వీకరించి విష్ణువు చేతిలో పెట్టగా దానిని భాస్కరుడు సేకరించి ప్రేతం సుఖించేలా చూస్తాడు.