2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

9 - బభ్రువాహన మహారాజు కథ - ఔర్ధ్వ దైహిక క్రియ - వృషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ

భగవాన్ ! ఈ క్రియలను ‘తన వారితో తెగతెంపులు చేసుకొని వచ్చేసిన వానికి’, ఎవరూ లేని వారికి రాజే చేయాలని ఆదేశించారు కదా, అలా చేసిన రాజెవరైనా కలరా?’ అని గరుడు అడడుగగా స్వామి ఇలా ప్రవచించాడు.

‘సుపర్నా! లేకేం? కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడు అని ఒక రాజుండేవాడు. అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలనను చేస్తుండేవాడు. ఆయన తన జీవనకాలంలో భూమి నంతటినీ భోగించి రక్షించాడు. ఓటమి పాలు తానూ కాలేదు; ఆపదల పాలు రాజ్యాన్నీ చేయలేదు. అతని ప్రజలేనాడూ చోర భయాన్నిగాని దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని గాని రుచి చూడలేదు. అతని రాజ్యంలో పాపులు లేరు. రోగాలు లేవు, రోగ భయాలూ లేవు, ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తిశ్రద్ధలే కాక అనురక్తి కూడా వుండేది. (ఆదర్శ రాజ్యంలో ప్రతి పౌరుడూ తన వృత్తిని ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు. ఈ మూడు లక్షణాలూ పౌరులలో లేనపుడు వారికి తగిన రాజే తయారౌతాడు. వారికి తగ్గ రాజ్యమే వస్తుంది) తేజస్సులో సూర్యునీ, స్థిరమనస్కత, స్థితప్రజ్ఞత్వాలలో పర్వతాన్నీ, సహిష్ణుతలో పృథ్వినీ తలపించే ఆ బభ్రువాహన మహారాజు ఒక వందమంది అశ్వారూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచకల్యాణిపై వేటకు బయలు దేరారు. వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. యోధుల సింహనాదాలతో, శంఖధ్వనులతో, దుందుభుల చప్పుళ్ళతో అడివంతా మార్మోగసాగింది. సైనికులకు అవి నలువైపుల నుండీ తమ రాజు కీర్తిని గానం చేస్తున్నట్లు వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకి పోసాగారు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరు గానీ అన్ని రకాల చెట్లూ, చేమలూ, లతలూ, దుబ్బులూ, అలాగే అన్ని రకాల హింస్రక, సాధు జంతు సమూహాలూ అందులో వున్నాయి. అన్ని రకాల జంతువులనూ వేటాడుతూ, వేటుకొక జంతువును కూల్చివేస్తూ ఆ నరశార్దూలడొక లేడిపై బాణం వేశాడు.ఆ లేడి దెబ్బతిని కూడా, దైవవశాన, శరవేగంతో పరుగిడసాగింది.

రాజు అన్నీ మఱచి వేట తమకంలో పడి దానిని వెంటాడుతూ వాయు వేగంతో పయనించాడు. పరివారానికి దూరమైపోయాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోరాటవిలో ప్రవేశించాడు. లేడి చిక్కాక గానీ ఆయనకి పరివారమూ, ఆకలి దప్పులూ గుర్తు రాలేదు. పరివారం బాధ పెద్దగా ఆ అసహాయ శూరుడికి లేదుగానీ, అలవి మీరిన ఆకలి, తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కుటంగా బాధించసాగాయి. నీటి కోసం వేటాడడం మొదలైంది. భగవంతుని దయ వల్ల ఆయనకు అచిరకాలంలోనే హంసల, సారస పక్షుల సవ్వడి వినిపించింది. చురుకైనవాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీల కమలాల, ఎఱ్ఱ కలువల పుప్పొడులతో సుగంధితమై, సురుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో బాటు ఆకలి కూడా మాయమైపోయింది. ఇక ఏ దారీ పట్టకుండా అక్కడే వున్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు. గుఱ్ఱం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనుకనే నిలబడి పచ్చిక మేయసాగింది. రాజుగారు ఆస్తరణాన్ని పలచుకొని డాలుని తలక్రింద నిడుకొని విశ్రమించారు.

రాజుగారి కనులింకా పూర్తిగా మూతబడకముందే వందప్రేతాలతో కలసి అడవిని కలయదిరుగుతున్న ప్రేతవాహనుడను పేరు గల ప్రేతమొకడక్కడికి వచ్చాడు. వారంతా నడుస్తున్న ఎముకల ప్రోగుల్లాగా వున్నారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్టు చర్మమే వుంది. మాంసం లేదు. వారు వచ్చిన అలికిడికి రాజు కనులు తెఱచి చూసి ఇంతవఱకెన్నడూ తాను చూసి యెఱగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివ్వున లేచి ధనుర్బాణములందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేత వాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు. అయినా ఆయనకి వారిని చంపే ఉద్దేశ్యం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు : ‘ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఈ వికృత శరీరాలైలా ప్రాప్తించాయి?’

‘ప్రభో! మీ దర్శన, సాంగత్యమాత్రము చేత నాలో ప్రేతభావం నశించింది. ఇపుడు నాకు పరమగతి ప్రాప్తించబోతోంది. ధన్యుడనైతిని మహాబాహో! నాకంటే ధన్యులిక లేరు’ అంటున్న ప్రేత నాయకుని విని, శాంతించి విల్లమ్ములను దించి ఇలా అన్నాడు బభ్రువాహనుడు.

‘ప్రేతమా! నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వనం చూస్తే చాలా భయంకరంగా వుంది. ఇక్కడేదో దీవ్య సరోవరం లాగ కనిపించి ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల, పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి. మెరుపులు కనిపిస్తున్నాయి. నానా ప్రకారాల హింస్రక, సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తున్నాయి. కాని ఒక్కటీ కనబడడం లేదు. ఇదంతా మీ ప్రభావం కావచ్చు. ఇంతకీ మీకీ అవస్థ ఎలా దాపురించింది?’

‘మహారాజా! ప్రేతాలన్నీ ఒకప్పటి నరులే. మేము చేసుకున్న పాపం వల్లే మాకీ దురవస్థ ప్రాప్తించింది. ఏ ప్రాణులకైతే (నరులనే అనుకోవాలి) అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, షట్టిండాలూ, దశగాత్రాలూ, సపిండీకరణమూ జరగవో అవీ (వారు) ప్రేతాలై తిరగవలసిందే. అంతేకాక, వీరే కాక విశ్వాసఘాతకులూ, తాగుబోతులూ, బంగారం దొంగలూ, అపమృత్యు వాతపడినవారూ, ఈర్ష్యాశువులూ, పాపాలకు తెలిసి తెలిసీ ప్రాయశ్చిత్తం చేసుకోనివారూ, గురుపత్నీ గమనులు - ఇలాటి పరమ పాపాత్ములంతా ప్రేత రూపాలను ధరించి ఇక్కడ నివసిస్తున్నారు(ము).

మాకు తిండీ, నీరూ బహు దుర్లభం. అత్యధిక పీడితులీ విశ్వంలో ఎవరయ్య అంటే మేమే. అందుకే ఓ మహారాజా! నేనెలాగూ బతికిపోయాను గానీ మీరు వీరందరికీ ఔర్ధ్వదైహిక సంస్కారాలు గావించండి. ఎవరూ లేనివారు పోయినపుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్ర సమ్మతం. దీని వల్ల గొప్ప పుణ్యం వస్తుంది. మీకూ పరలోకంలో సుఖస్థానమేర్పడుతుంది. ఈ ప్రేతాలకూ ప్రస్తుత దుఃఖ వినాశనమవుతుంది. రాజుకి ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి.

మహారాజా! ఈ లోకంలో ఎందరో వున్నారనుకుంటాం కానీ ఎవరికి యెవరు? చివరికి ఎవరు? పుత్రులు, భార్య - ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరినంతకాలమే మనం గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడ్కొలిచ్చేస్తుంది. బంధువులు శ్మశానం వద్ద వీడ్కొలుపుతారు, శరీరం కాష్ఠంలో వీడ్కోలు సలుపుతుంది. వీడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి పాపపుణ్యాలే.”

గృహేష్వర్థా ని వర్తంతే శ్మశానే చైవ బాంధవాః ॥ 9.36

శరీరం కాష్ఠ మాదత్తే పాపం పుణ్యం సహవ్రజేత్ । 9.37

మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ప్రేతనాయకుని ఆత్మ కథనడుగగా అతడిలా చెప్పసాగాడు.

‘నృపశ్రేష్ఠా! ప్రేతాన్ని కాక ముందు నేనొక సంపన్న వైశ్యుడిని. నా పేరు దేవగుప్తుడు. మాది సర్వసంపదలకూ, సుఖాలకూ, ధర్మాలకూ కూడా నెలవైన విదిశా నగరం. నేను ధర్మకార్యాలన్నిటినీ మిక్కిలి శ్రద్దగా సంపన్నం చేస్తుండేవాడిని. నాచే నొసగబడిన ‘హవ్యాల’తో దేవతలూ, ‘కవ్యా’లతో పితరులూ సంతుష్టినొందారు. నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరచాను. నా ఆహార - విహారాలు చక్కని క్రమశిక్షణతో సునిశ్చితంగా వుండేవి. దీన, హీన, అనాథ బృందాలకూ సత్పాత్రులకూ అనేక ప్రకారాల సహాయాన్నందించాను. కాని, దైవయోగమున అవన్నీ ఇప్పటి దాకా నిష్ఫలములైనాయి. నాకు సంతానంగానీ బంధుబాంధవులు గానీ, మంచి మిత్రులుగానీ లేకపోయారు. కాబట్టి నాకు ఔర్ధ్వ దైహిక కర్మలు జరగలేదు. అందువల్లనే ఇలా ప్రేతరూపినై ఉండిపోయాను. 

మహారాజా! ఏకాదశాహాలూ, త్రిపాక్షికాలూ, షాణ్మాసికాలూ, మాసిక శ్రాద్ధాలూ, వార్షికమూ ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య పదహారు. ఏ మృతకునికైతే ఇవి చేయబడవో అతడు (ఆమె) మిగిలిన కార్యక్రమాలూ శ్రాద్ధాలూ ఎన్ని చేసినా ప్రేతరూపంలోనే ఉండి పోవలసి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మా ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికీ బంధువౌతాడని శాస్త్రాలు చెప్తుండడం చేత మీరు శ్రాద్ధాల ద్వారా మమ్ముద్ధరించగలరు.’

ఇంతవఱకు చెప్పి ప్రేతవాహనుడొక గొప్ప మణిని తీసి రాజు కీవ్వబోతూ ‘ఓ రాజా! ఇది బహుమూల్యము గల మణి రత్నము. మీరు నాపై దయతో దీనిని గ్రహించి...’ అంటుండగానే రాజు అతనినాపి:

‘మహాశయా! నేను క్షత్రియుడను, మహారాజును. నా చేయి క్రింద వుండరాదు. దానమును గ్రహించను. అయినా నీ పని చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు’ అన్నాడు.

అప్పుడు ప్రేతవాహనుడు, ‘మహారాజా! నాకు శ్రాద్ధకర్మలు జరగలేదు. నా పేర వృషోత్సర్గం కూడా జరగలేదు’ అన్నాడు.

‘అవన్నీ నేను చేస్తాను గానీ, నాకిది చెప్పు. మా వాళ్ళలో ఎవరైనా ప్రేతదశలోనే వుండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి?’

‘క్షత్రియకులావతంసా! ప్రేతాలుగా అష్టకష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులను గానీ కనీసం వంశనామాంకిత ప్రతిష్టనుగాని అనుభవిస్తున్న వారికీ సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చిపడతాయి. బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తుంటాయి. శాస్త్రోక్తంగా బతుకాలంలో సంభోగించినా సంతానం కలుగదు. స్త్రీలలో నెల పొడవునా ఋతుక్రమబాధలు కనిపిస్తుంటాయి. నడివయస్సులోనే బంధువులూ, యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతుంటారు. అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ఠ మసకబారుతుంది. ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలూ, మిథ్యాపవాదాలూ, రాజయక్ష్మం వంటి రోగాలూ నిండుగా కొలువు తీరతాయి. వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ వున్నా లాభాలు కనబడవు. వర్షాలు సకాలంలోనే పడినా పంటలు పండవు. ఉన్నట్టుండి సహధర్మచారిణి తిరగ బడుతుంది. ఇలాటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును. వెంటనే వృద్దులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి వృషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో మార్పు కనబడుతుంది.’

‘సరే! ఇప్పుడు నేనేం చేయాలి?’

‘రాజేంద్రా! మీకెలాగూ అధికారముంది కాబట్టి మీరే మాకందరికీ శ్రాద్ధాలను, ఔర్ధ్వ దైహిక క్రియలను చేయవచ్చు. లేదా కొంతమందికీ అయ్యధికారాన్ని ధారాదత్తం చేసి చేయించవచ్చు. చివర్లో వృషోత్సర్గం చేయగానే మా ప్రేతరూపాలు నశించి మాకుత్తమ గతులు ప్రాప్తిస్తాయి. నా సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా అశ్వయుజ శుధ్యం, రేవతీ నక్షత్రయుక్త తిథులలో చేయండి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులనాహ్వానించి విధ్యుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేదమంత్రాలతో యథావిధానంగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణు లనాహ్వానించి వారికి భోజనాలను పెట్టాలి. మహారాజా! దీనికయ్యే ఖర్చుని నీ ప్రజలపై గాని, నీపై గాని రుద్దడం ధర్మసమ్మతం కాదు. పైగా నాకీ రత్నంతో ఇక ఏ అవసరమూ వుండదు’ అంటూ రాజుగారి పాదాలకు తలను ఆన్చి నమస్కరించి ఆ మణి రత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే వుంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు.

వైనతేయా! రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ అపరకార్యాలను నిర్వర్తించాడు. ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణ దేహ సుశోభితులై రాజుకి దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలసి నిష్క్రమించాయి. గరుడా! ఇదీ వృషోత్సర్గ మాహాత్మ్యం’