వరాహ మహా పురాణము
అధ్యాయము - 129
సూతుడు:
సూతుడు:
ఇట్లు భూదేవి దీక్షను నారాయణుని ముఖము నుండి విని పవిత్రమైన మనస్సు కలదియై మరల విష్ణువుతో నిట్లు పలికెను.
ధరణి:
ధరణి:
దీక్ష మహిమ ఎంత గొప్పది! దాని సమృద్ధి ఎంత మేలైనది! దీనిని విన్న మేము పవిత్రుల మైతిమి.
ఆహా! లోకముల ప్రభువగు ఈ దేవుని మాహాత్మ్యము ఎంత గొప్పది! ఆ మహిమ నాలుగు వర్ణముల వారికి సుఖము కలిగించెడి దీక్షను నిర్మించినది.
ఇట్లే, పరమేశా! నీ హృదయమున నేదేని పరమ రహస్య మున్న యెడల నీ భక్తుల సుఖము కొరకు దానిని నాకు చెప్ప వలయును.
దేవా! నీవు మునుపు ముప్పది రెండు దోషములను గూర్చి చెప్పి యుంటివి. బుద్ధి తక్కువ మనుజులు ఈ అపరాధములు చేసి ఏ పనితో పరిశుద్ధు లగుదురు? నా యందలి ప్రీతితో దానిని నాకు దయతో చెప్పుము.
అంత గొప్ప కీర్తి గల శ్రీ మన్నారాయణుడు మిక్కిలి శ్రేష్ఠమగు ధ్యానమును తాల్చి భూమి కిట్లు బదులు పలికెను.
శ్రీవరాహ దేవుడు:
శ్రీవరాహ దేవుడు:
ఏ దోషములు నెరుగని నా భక్తులు, నా పూజల యందు ఆసక్తి కలవారు, లోభము చేతనో, భయము వలననో లేక ఆపదలు వచ్చినపుడో రాజుల అన్నము తిన్నచో పదివేల యేండ్లు నరకమున మ్రగ్గి పోవుదురు.
భగవంతుని ఆ మాట విని వసుంధర వణకి పోయెను పదునేడు దినములు ఆమెకు తీవ్రమైన భయము కలిగెను.
ఆమె దిగులొందిన మనస్సుతో అన్ని లోకములకు సుఖము కలిగించు తీయని పలు కిట్లు పలికెను.
ధరణి:
ధరణి:
దేవా! నా హృదయమున నున్న దానిని వినుము. రాజుల తప్పేమి? దీనిని నాకు నీవు తెలుపదగును.
అంత భూదేవి పలుకు విని సర్వ ధర్మముల నెరిగిన వారిలో మిన్నయగు నారాయణుడు ధర్మమును విన గోరుచున్న భూదేవితో ఇట్లు పలికెను.
శ్రీవరాహ దేవుడు:
శ్రీవరాహ దేవుడు:
సుందరీ! శ్రద్ధతో వినుము. ఇది రహస్యము. దోషములు లేని భాగవతులు ఎన్నిటికిని రాజుల కూడు తినరాదు.
రాజు లోకమున నా అంశముతో మెలగు వాడే అయినను రజస్సు, తమస్సు అను గుణములతో మిక్కిలి దారుణమగు కర్మములు చేయు వాడగును.
అందు వలన ఓ వరారోహా! రాజాన్నములు నింద్యములగు చున్నవి. సంశయము లేదు. ధర్మము నిలుపు విషయమున అది నాకు రుచింపదు.
వసుంధరా! రాజుల అన్నము పవిత్రులగు భాగవతులు తిన దగినదియు కలదు. దానిని గురించి వివరించి చెప్పెదను వినుము.
విధి చూపిన కర్మముతో నన్ను నెలకొల్పి భగవద్భక్తులైన రాజులు ధన ధాన్యములతో సమృద్ధములైన పదార్థముల నొసగినచో సిద్ధులైన భాగవతులు నాకు నివేదింపగా మిగిలిన ఆ అన్నమును తిన్నను వారికి పాపము అంటదు.
మేలైన వ్రతములు గల భూదేవి విష్ణువు వచనము విని ఆ వరాహ రూప దేవునితో మరల ఇట్లు పలికెను.
ధరణి:
ధరణి:
శుద్ధుడగు భాగవతుడు రాజు అన్నమును తిని ఏ కర్మముతో పరిశుద్ధు డగునో, జనార్దనా! అది నాకు చెప్పుము.
శ్రీవరాహ దేవుడు:
శ్రీవరాహ దేవుడు:
దేవీ! భీరూ! రాజు నన్నమును తిన్నవారు ఎట్లు తరింతురో అని నీవడుగు చున్న దానికి సమాధానము చెప్పెదను. వినుము.
ఒక చాంద్రాయణము, ఒక నిండైన తప్తకృచ్ఛ్రము, ఒక సాంతపనము అను వానిని చేసినచో ఆ పాపము నుండి వెనువెంటనే ముక్తు లగుదురు. (చాంద్రాయణము = చంద్రుని క్షీణతను బట్టి కృష్ణ పక్షమున ఒక్కొక్క ముద్దను తగ్గించును, శుక్లపక్షమున ఒక్కొక్క ముద్దను పెంచుచు ఆహారము తినుచు చేసెడి వ్రతము. తప్తకృచ్ఛ్రము, వేడినీరు, పాలు, నెయ్యి మూడు రోజులు నియమముతో పుచ్చు కొనుట, వేడి గాలి పీల్చుట అను వ్రతము. సాంతపనము, మూడు దినములు పళ్ళు మాత్రమే తినుట, మూడు దినములు రాత్రు లందే భుజించుట, తరువాత మూడు దినములు అడుగు కొనకుండ లభించిన దానిని మాత్రమే ఆహారముగా కొనుట, అటుపై మూడు దినము లుపవాస ముండుటగా చేయు వ్రతము.)
ఒకవేళ రాజుల అన్నమును తిన్నను ఈ కర్మమును ఆచరింప వలయును. అట్టి వాని అపరాధమును నేను పరిగణింపను. ఇదిగో ఇది నా మాట.
నాకు ప్రియ మాచరింప గోరువాడును, పరమ గతిని కోరు వాడును, ఎన్నటకిని రాజు నన్నమును తినరాదు.