వరాహ మహా పురాణము
అధ్యాయము - 116
శ్రీవరాహ దేవుడు:
శ్రీవరాహ దేవుడు:
వసుంధరా! మరియొక గొప్ప వింతను వినుము. ఇది ఆహార విధికి సంబంధించిన నిశ్చయము. ఏది ఆహారము, ఏది కాదు అను విషయమును గూర్చి వినుము.
మాధవీ! నా యోగము కొరకు మిక్కిలిగా భుజించుచు, సాటి లేని కర్మము చేసియు నరుడు ధర్మము నాశ్రయించిన వాడే యగును.
కర్మ విధానము తెలిసిన వారు, కర్మములకు కట్టుబడి యుండు వారును అగు నరులు ధాన్యములకు సంబంధించిన ఆహారమును నిత్యము తీసికొను చుందురు.
నా విషయములో కర్మములకు విరుద్ధములైన భోజనములను గూర్చి చెప్పెదను. దారి తప్పిన అట్టి ఆహారము చేత గొప్ప శక్తి కల వానికిని అపరాధము కలుగును.
మొదటగా, ప్రియా, అపరాధములు నాకు రుచింపవు. నరుడు అదియే పనిగా ఇతరుల అన్నమును వృత్తిగా పెట్టుకొని తినుట మొదటి అపరాధము. అది ధర్మమునకు విఘ్నమును కలిగించును.
పలు దోము పుల్లలను ఉపయోగింపక (పండ్లు తోము కొనక) నా కడకు చేరుట రెండవ అపరాధము. అది కర్మ విఘ్నము కొరకు ప్రవర్తించుట యగును.
వసుంధరా! స్త్రీ సంగమము చేసి వెను వెంటనే నన్ను తాకు నరుడు మూడవ అపరాధము చేసిన వాడని నేను భావింతును.
ముట్టుతను చూచి మా కడకు వచ్చుట నాల్గవ అపరాధము. దానిని నేను క్షమింపను.
చచ్చిన వానిని చూచి ఆచమనము చేయక నన్ను తాకుట అయిదవ తప్పు. వసుంధరా! నేను దానిని సహింపను.
సంస్కారము పొందని శవమును తాకి నన్ను అర్చించుట అను నీ ఆరవ తప్పును నేను క్షమింపను.
నన్ను పూజించు కాలమున మల విసర్జమున కరుగుట అను దానిని ఏడవ దోషముగా నేను సంభావింతును.
నల్లని వస్త్రమును చుట్టుకొని నన్ను పూజించుట ఎనిమిదవ తప్పుగా నేను పరిగణింతును.
నా పూజా కాలము నందు అబద్ధము పలుకుట తొమ్మిదవ అపరాధము. అది నాకు రుచింపదు.
విధానమునకు విరుధ్దముగా నన్ను తాకి అర్చన చేయుట నాకు అప్రియమునకు కారణమగు పదియవ దోషము.
కోపముతో చిరచిర లాడుచు నా పూజా కార్యములను చేయుట పదునొకండవ తప్పుగా నేను లెక్కింతును.
దైవ కార్యములకు పనికి రాని పూవులను నా కర్పించుట పండ్రెండవ దోషముగా నేను పరిగణింతును.
కుసుమ పూవు వంటి ఎర్రని వన్నె గల వస్త్రము తాల్చి నా కడ కరు దెంచుట పదమూడవ తప్పు.
ఎన్నడు గాని చీకటిలో నన్ను తాకుట పదు నాల్గవ దోషముగా నేను లెక్కింతును.
నల్లని బట్ట కట్టి నా పూజా కార్యములను చేయుట పదు నైదవ దోషముగా నేను పరిగణింతును.
బట్టలు దులుపుచు నా కడ కరుదెంచుట దోషములలో పదునారవదిగా నేను సంభావింతును.
జ్ఞానము లేని వానికి పిలిచి అన్నము పెట్టుటను, మాధవీ! పదునేడవ తప్పుగా నేను లెక్కింతును.
చేపలు, మాంసములు మెక్కి నా పూజ కరుదెంచుట పదునెనిమిదవ దోషముగా నేను భావింతును.
సుందరీ! బాతు మాంసము తిని నన్ను దరి జేరుటను పందొమ్మిదవ తప్పుగా నేను భావింతును.
దీపమును తాకి ఆచమనము చేయక నన్ను తాకుట, మాధవీ! ఇరువదియవ దోషము.
వల్లకాటి కరిగి నా కడ కరుదెంచుట ఇరువది యొకటవ తప్పు.
పిండి తిని నన్నర్చింప వచ్చుట యిరువది రెండవ తప్పుగా నేను సంభావింతును.
పంది మాంసములను నాకు నైవేద్యముగా తెచ్చుటను ఇరువది మూడవ అపరాధముగా పరిగణింతును.
నరు డెన్నడైనను మద్యము త్రావి నన్నర్చింప వచ్చినచో దానిని ఇరువది నాల్గవ దోషముగా నేను పరిగణింతును.
కుసుమల కూరను తిని నన్ను పూజించుటకు పూనుకొనుట ఇరువది యైదవ దోషము.
ఇతరుల వస్త్రములను తాల్చి నన్ను పూజింప నరుదెంచుట ఇరువది ఆరవ దోషము.
పితృ దేవతలకు పెట్టక క్రొత్త అన్నమును కుడుచుట ఇరువది యేడవ దోషము.
చెప్పులతో పాటు కూర్చుండి నా పూజకు ఉపక్రమించుట ఇరువది యెనిమిదవ తప్పు.
శరీరమును మర్దన చేసికొని నా కడకు వచ్చుట ఇరువది తొమ్మిదవ తప్పు. అది చేసిన వాడు స్వర్గమును పొందడు.
అజీర్ణము పైకొనగా నన్ను సమీపించుట ముప్పదియవ దోషముగా నేను భావింతును.
అభిమానవతీ! గంధము, పూవులు సమర్పింపక ధూపము నిచ్చుట ముప్పది యొకటవ దోషముగా నేను లెక్కింతును.
భేరి మొదలగు వాని నాదము లేకుండ నా వాకిలి తలుపు తెరచుట పెద్ద తప్పు. అది ముప్పది రెండవ దోషము.
మిక్కిలి శ్రేష్ఠ మైనది, చాల గట్టిది అగు మరియొక దానిని గూర్చి చెప్పెదను వినుము. పుష్కలమైన ఆ కర్మము నాచరించిన వాడు నా లోకమున కరుగును.
నిత్యము నా యందు లగ్నమైన భావము కలవాడు, నా అర్చనల యందు మిక్కిలి శ్రద్ధ కలవాడు, అహింస పరమ ధర్మమని నమ్మిన వాడు, అన్ని భూతముల యందును దయ కలవాడు, సమాన దృష్టి కలవాడు, పరిశుద్దుడు, నా మార్గమును ఎన్నడును తప్పని వాడు, ఇంద్రియములపై అదుపు కలిగి సర్వాపరాధములను వదలిన వాడును నా లోకమున కరుగును
ఉదారుడు, ధర్మ ప్రవర్తన కలవాడు, ధర్మపత్ని యందు చెదరని బుద్ధి కలవాడు, శాస్త్రముల రహస్యముల నెరిగిన వాడు, పనుల యందు నేర్పరి, నా అర్చనల యందు నిష్ఠ కలవాడు, నా లోకమున కరుగును.
ఈ చక్కని మార్గమున నిలుకడతో నుండు నాలుగు వర్ణముల వారును, నా మాట అబద్ధము కానే కాదు, నా లోకమున కరుగుదురు.
పవిత్రయు, సమర్థయు, నా అర్చనల యందు నిలుకడ కలదియు ఆచార్యుల యందు, దైవముల యందు భక్తి కలదియు, భర్త యందు పుత్ర ప్రేమ కలదియు అగు ఇల్లాలు సంసారము నందు వర్తించు చున్నదై ముందుగా మరణించినచో నా లోకమున ఉత్తమ స్థానమున నిలిచి భర్త కొరకు ఎదురు చూచు చుండును.
నా భక్తుడగు పురుషుడు, ముందు భార్యను వదలి మరణించినచో భర్త యందు పరమాను రాగము గల ఆమె కొరకు ఎదురు చూచుచు నా లోకమున నిలిచి యుండును.
మఱియొక విషయమును కూడ నీకు వక్కాణింతును. ఇది కర్మముల కెల్ల ఉత్తమ మైనది. నా మార్గమున చెదరని బుద్ధితో నిలిచిన ఋషులు కూడ, శుచియగు భాగవతుడు నన్ను చూచినట్లు, చూడ జాలరు.
నా పనుల యందు అధిక శ్రద్ధ కలవారై నా పనులు ఈ విధానముతో చేయువారు శ్వేత ద్వీపమును దర్శింతురు.
నా లోకము లందున్న ఋషులు కూడ ఇతరులకు భక్తితో కనుగొన దగినవారు. నా పూజ లందాసక్తి కల మనుష్యుల సంగతి చెప్పనేల?
మాధవీ! మూఢులు, పాప బుద్ధి కలవారునై ఇతర దేవతల యందు భక్తి చూపువారు, నా మాయ క్రమ్మిన బుద్ది కలవారై ఎన్నటికిని నన్ను పొంద జాలరు.
మోక్షమును కాంక్షించి నన్నే శరణు పొందు నిశ్చల భావము కలవారిని నా పురమునకు నేను చేర్తును.
నీకు నా యందు పరమ భక్తి కలదు, నిన్ను నేను ప్రీతితో ధరించితిని. కావున పరమ రహస్యమైన ఈ ధర్మమును నీకు చెప్పితిని
ఓ మాధవీ! లోభికి, మూర్ఖునకు, దీక్ష లేని వానికి, పని గట్టుకొని దరిజేరని వానికి దీని నొసగరాదు.
నా పూజా కార్యముల యందు పరమ శ్రద్ధకల భాగవతుని తప్పించి, గురూపదేశము పొందని వాడు, మొండి వాడు నగు పురుషునకు దీని నొసగరాదు.
దేవీ! గొప్ప శక్తి గల నా ధర్మమును నీకు చెప్పితిని. సర్వ లోకముల మేలు కొరకు మరల ఏమి అడుగుదువో అడుగుము.